(26.12.2010 మహా నటి సావిత్రి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
15.9.1931 నాడు, స్వర్గీయ H.M.Reddy Banner క్రింద తొలి తెలుగు టాకీ సినిమా విడుదల ఐంది! నాటి నుండి నేటి వరకు ఎందరో మహా నటులు నటీమణులు తమ ప్రతిభ తో తెలుగువారినే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు.నాటి నుండి నేటి వరకు ఎందరో ప్రవేశించి, వెళ్లి పోయినా, తెలుగు నటీమణుల పేర్లు తలచుకోగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు...సావిత్రి!
మాటలతో అవసరం లేకుండా మనసులోని భావాలను ప్రేక్షకుల మనసులలోకి సూటిగా నాటిన మహా నటీమణిగా,కేవలం తన కనుబొమల కదలికలతో,కనులలోని మెరుపుతో,పెదవి విరుపుతో, కదలికలలో నాట్యంతో ,కట్టిపడేసే లాస్యంతో, అనన్య సాధ్యమైన ఆంగిక అభినయానికి , సుమధురమైన సుస్పష్టమైన వాచికానికి, ఆహార్యంతో నిమిత్తం లేని నటనకు భాష్యంగా, అభినయ విద్యకు ' బడి 'గా,కాలపు పరదాల మాటున మరుగుపడని పాత్రల పలుకుబడిగా,తెలుగు సినిమా నిలిచి ఉన్నంత కాలమూ అభిమానుల గుండెలు గుడిగా నిలిచిపోయే అరుదైన నటీమణి సావిత్రి!
బాటసారులులో భగ్న ప్రేమికురాలిగా, దేవదాసును మౌనంగా గుండెలో ఆరాధించిన దాసిగా పార్వతిగా,మాయా బజారులో శశిరేఖగా,మాయా శశిరేఖగా,పాండవ వనవాసం, నర్తన శాల లో ద్రౌపదిగా, మిస్సమ్మ లో మిస్ మేరీగా,గుండమ్మ కథ లో సవతి తల్లి ఆరళ్ళను సహనంతో భరించి ఆమెను మార్చిన సవతి కూతురిగా, మూగ మనసులు లో కట్టుబాట్ల, సంప్రదాయాల చట్రం కింద నలిగిపోయి సంఘర్షణ ను అనుభవించిన మూగ ప్రేమికురాలిగా, డాక్టర్ చక్రవర్తిలో అనుమానపు భర్తకు, తన కళను ఆరాధించే అభిమానికి మధ్యన నలిగిపోయిన సున్నితమైన స్త్రీ మూర్తిగా, కేవలం తనకు మాత్రమే సాధ్యమైన నవ్వుల కెరటాల తాకిడికి తనే నలిగిపోయిన లోతులు తెలియని గంభీరమైన సముద్రంవంటి మధురవాణి గా కన్యా శుల్కంలోను, ఇలా ఎన్ని పాత్రలలో ఆవిడ ఎంతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందో చెప్పడానికి ఎన్ని గ్రంధాలైనా సరిపోవు! ఆమె నిజ జీవితంకుడా మధురవాణి జీవితంలాగా ఆమెకూ, మనకు కూడా అర్థం కాని 'రిడిల్' గా నిలిచిపోయింది!!
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావులపాలెంలో నిస్సంకర రావు గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు డిసెంబర్ 6,1937 న జన్మించిన సావిత్రి శాస్త్రీయ నృత్యాన్ని,శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకొని విజయవాడ వంటి పట్టణాలలో నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు! వెండి తెర మీదనే కాక రంగస్థలం మీద కూడా నటిగా N.T.Rama rao గారి National Art Theatre తరపున, తను స్థాపించిన నవోదయ కళామండలి తరపునా అనేక ప్రదర్శనలు ఇచ్చి బుచ్చిబాబు గారి ఆత్మవంచన లో నాయకురాలిగా ఆనాటి రంగస్థల ప్రేక్షకులను ఉర్రూతలు వూగించారట! తెలుగు సిని పరిశ్రమలో కథా నాయకులతో పాటు సమానమైన ప్రఖ్యాతిని పొందిన తొలి, బహుశా, చివరి నటీమణి ఆమె! తెలుగు,తమిళం,కన్నడ,హిందీ భాషలలో మొత్తం 318 సినిమాలలో నటించిన సావిత్రి నిర్మాతగా, దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటారు! వెండితెర జీవితంలో ఎంత విజయం సాధించిందో నిజ జీవితంలో అంతగా అపజయం పొందింది ఆమె! ఎందరు వద్దని సలహాలిచ్చినా వినకుండా జెమిని గణేషన్ ను వివాహం చేసుకొని , విఫలమై ,ఆ బాధతోనే త్రాగుడికి,మత్తు పదార్ధాలకి బానిసై కేవలం 44 సంవత్సరాలకే 26.12.1981 నాడు మరణించింది.
తార జువ్వలా 'తారా' పథానికి దూసుకుని పోయి అలాగే నేలకు వ్రాలి పోయిన ఆ మహా నటీమణి తన బాధలను , అసంతృప్తిని నిరంతరం ఎదిరిస్తూనే ఎందరో విద్యార్థినీ విద్యార్థులు చదువుకోనడానికి ఎన్నో లక్షల రూపాయలను దానం చేశారు! ఒకసారి ఆ నాటి ప్రధాన మంత్రి లాల్ బహాదుర్ శాస్త్రి గారి వద్దకు లక్షల రూపాయల విలువైన తన బంగారు ఆభరణాలన్నీ ధరించి వెళ్లి , ఆయనతో కొంతసేపు మాట్లాడి వచ్చేముందు తన భరణాలన్నీ వొలిచి , ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు! క్రికెట్ క్రీడ ను విపరీతంగా అభిమానించిన సావిత్రి ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్ గ్యారీ సోబెర్స్ నీ ఎంతగానో ఆరాధించేవారు! స్వయంగా తాను కూడా ఎన్నో చారిటి మ్యాచ్ లలో క్రికెట్ ఆడారట ఆమె! చదరంగం కూడా చక్కగా ఆడేదట ఆవిడ, కాని, జీవిత చదరంగంలో మాత్రం విఫలమైనా, వొళ్ళు చూపించని వొద్దికైన నటీమణిగా శాశ్వతంగా తెలుగువారి , కాదు, సమస్త అభిమానుల గుండెలలో నిలిచి వుంటుంది ఆమె!