పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Wednesday, January 12, 2011

వివేక జ్యోతి

(జనవరి 12 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

అనాదిగా భారత దేశం ప్రపంచానికి తన జ్ఞాన జ్యోతులను మహానుభావులైన ఋషులు,యోగులు,జ్ఞానుల  ద్వారాప్రసారంచేస్తున్నది!వేదవ్యాసుడు,ఆదిశంకరాచార్యుడు,రామానుజాచార్యుడు,మధ్వాచార్యుడు,రామకృష్ణపరమహంసస్వామి వివేకానంద ఇలా ఎందరో భారత భూమిని తమ పీఠంగా చేసుకొని జ్ఞాన మార్గ నిర్దేశనం చేశారు.వీరందరిబోధనల సారాంశాన్నిబట్టి మూడు మార్గాలలో భగవంతుడిని చేరుకోనవచ్చును అని సంక్షిప్త సారాంశంగా మనం తెలుసుకొనవచ్చును.భక్తిజ్ఞాన,వైరాగ్యములనే మూడుమార్గాల ప్రతీకలుగా వేదవ్యాసులవారిని జ్ఞానమార్గానికి,ఆదిశంకరా చార్యుల వారిని భక్తి మార్గానికి పథ నిర్దేశకులుగా భావించాలి.వారిరువురి మార్గాలను స్పృశిస్తూ సాగే వైరాగ్య పథ నిర్దేశకునిగా స్వామి వివేకానందను భావించాలి!నిజానికి భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాలు మూడు కూడ ఒకదానితో మిగిలిన రెండూ అంతర్భాగాలుగా కలిశే వుంటై కాని, ఏది ప్రధాన లక్షణం గా వుంటుందో అది మార్గం అవుతుంది.అంటే, జ్ఞాన మార్గం భక్తి వైరాగ్యములను కలిగివుంటుంది కాని,జ్ఞాన ప్రధానంగా వుంటుంది.భక్తి మార్గం జ్ఞాన వైరాగ్యములను కలిగి వుంటుంది కాని,భక్తి ప్రధానంగా వుంటుంది.వైరాగ్య మార్గం భక్తి,జ్ఞానములను కలిగి వుంటుంది కాని, వైరాగ్య ప్రధానం గా వుంటుంది.భక్తి,జ్ఞానములను కలిగిన వైరాగ్య మార్గంలోనే పథ నిర్దేశం చేస్తూనే,సన్యాసము అంటే కేవలం తన వ్యక్తిగత మోక్షమే కాదని, భక్తి,జ్ఞానములను కలిగిన విరాగి తన తనువును, మనసును,జ్ఞానాన్ని ఇతర మానవులప్రాణుల ఉద్ధరణ కోసం వెచ్చించాలని చెప్పి  మోక్ష ఇచ్చలో కూడ స్వార్ధం కూడదని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద!సమస్త ప్రాణులలో వెలుగొందే చైతన్యం ఒకటేనని చెప్పి, సర్వ మానవ సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ఆదర్శ మూర్తిస్వామి వివేకానంద!శతాబ్దాలుగా హైందవ వైదిక జీవనంలో పేరుకొని పోయిన చాందస భావాలను నిర్మొహమాటంగా విమర్శించిన మత సంస్కర్త,మానవ సంస్కర్త స్వామి వివేకానంద!నిష్ఠ, తపస్సుల పేరుతో గిరిగీసుకొని కూర్చోనడం  వల్ల ప్రపంచాన్ని చూడలేని గ్రుడ్డి వాళ్ళుగా మనం తయారుఅవుతున్నామని చెప్పి, ప్రపంచాన్ని తెలుసుకొనవలసిన అవసరాన్ని, మన మంచిని పంచి ఇతరులలోని మంచిని గ్రహించి మనను మనం సంస్కరించుకొనవలసిన అవసరాన్ని నొక్కి చెప్పి,భారతీయుల ఆధ్యాత్మిక జీవన విజయాలను, పాశ్చాత్యుల భౌతిక జీవన విజయాలను సమ్మిళితం చేసి ఆదర్శ జీవన విధానాన్ని అవలంబించాలని, బలహీనత యే మరణమని, బలమే జీవితమని చాటి,ఆత్మ విశ్వాసమే ఆస్తికత్వమని,ఆత్మ విశ్వాసం లేక పోవడమే నాస్తికత్వమని చెప్పిన అభినవ భాష్యకారుడు స్వామి వివేకానంద.తమమీద తమకు నమ్మకం వున్న కొంతమంది జీవితాలే ప్రపంచ చరిత్ర అని,లేవండి,మేల్కొనండి, గమ్యాన్ని చేరేవరకు ఆగవద్దని ప్రబోధించి ,భగవద్గీత  లాగ, సర్వ కాల సర్వ అవస్థలలోను, సర్వ మానవులకు జీవితాలు తరించిపోయే శాశ్వత సత్యాలను తన పలుకులలో అందించిన మహా ప్రబోధకుడు ఆయన!వేదములను,పురాణములను,రామాయణభారతాది ఇతిహాసములను, మరే ఇతర ఆధ్యాత్మిక గ్రంధాలను తెలిసికొనక పోయినా 'ఫరవా లేదు,' స్వామి వివేకానంద బోధనలను తెలిసికొంటే చాలు,సమస్త ఆధ్యాత్మిక జ్ఞానము కరతలామలకం అవుతుంది, మానవ జీవితం సార్ధకం అవుతుంది!గోవుల వలె సాత్విక జీవనం జీవించడం వల్లనీకు నువ్వు పనికిరాకుండా బలహీనుడవై పోవడంకంటే ,అవసరం  అయితే, సింహం వలె  పౌరుషంతో బ్రతికి శత్రువుల గుండెలలో నిదురించమని చెప్పిన ధీర ప్రేమికుడు స్వామి వివేకానంద! మహానుభావులలో శ్రీకృష్ణునితో, మహా గ్రంథాలలో భగవద్గీతతో పోల్చదగిన మహానుభావుడు స్వామి వివేకానంద!నా ప్రజలకోసం,నా దరిద్ర   నారాయణ సోదరులకోసం అవసరం అయితే పది వేల సార్లు  జన్మించడానికి  లేదా నరకానికి పోవడానికి కుడా నేను సిద్ధమే అని చెప్పిన సమస్త మానవప్రేమికుడు, కారణ జన్ముడు స్వామి వివేకానంద!వివేకానందను తెలిసికొనడమంటే రాక్షసత్వాన్ని చంపి, మానవత్వాన్ని దాటి మాధవత్వాన్ని చేరుకొనే మార్గంలో ప్రయాణించడమే..అందుకే .. " వివేకభాసా కమనీయ కాంతిం వివేకినం తం సతతం నమామి!!. " అంటూ ఆయన మార్గంలో నడవ వలసిన  అవసరం ఈవాల్టి ప్రపంచంలో ఎక్కువగా వున్నది! సమస్త ధర్మాలను తన ధర్మం తో సమానంగా తెలిసికొని, ప్రేమించి, అవసరం అయితే తన ధర్మాన్నికూడా  సమీక్షించి విమర్శించి ఆచరించిన ఆదర్శవాది, అసామాన్య ప్రజ్ఞా శాలి, ధైర్య శీలి స్వామి వివేకానంద!సమాజంలో కాలే కడుపుతో, సరిగా దుస్తులు లేకచెట్ల కింద నడి వీధులలో కటిక దరిద్రంలో బ్రతికే నా భారతీయ సోదరులు, సోదరిమణులు ఉన్నంత కాలము నా ఆత్మకు శాంతి లభించదు , సాటి మానవుడిని ప్రేమించలేని వాడు భగవంతుడిని ఎంత తీవ్రంగా, విశ్వాసంగా ఆరాధించినా ఫలితం బండి సున్నా అని చెప్పిన స్వామి వివేకానందను మించిన ఆదర్శ మానవుడు,విప్లవకారుడు ఎవరూ లేరు, దేశంలో, కాలంలో, వ్యవస్థలో కూడా, కాని ఒకే ఒక భేదం ఏమిటంటే ఆయన తాను చెప్పినవన్నీ ఆచరణలో చూపించాడు అందుకే అమరుడైనాడు!