పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Wednesday, January 4, 2012

మనీషా పంచకం


జగద్గురువు ఆది శంకరాచార్యులవారు కాశీ పట్టణం లో బస చేసిన రోజులలో ఒకనాడు గంగా నదిలో స్నానం చేసి శిష్యులు ముందునడుస్తుండగా రేవునుండి వస్తున్నప్పుడు ఒక చండాలుడు నాలుగు వేట కుక్కలతో వీరికి ఎదురుగా వచ్చాడు. శంకరాచార్యులవారి శిష్యులు ఆ చండాలుడిని ప్రక్కకు తప్పుకొని దారి ఇమ్మని అన్నారు,వెనుకగా వస్తున్న తమ గురువు గారికి అతను అడ్డుగా వస్తాడేమోనని.అప్పుడా ఛండాలుడు ఒక ప్రశ్న వేశాడు. ఎవరినయ్యా తప్పుకోమంటున్నారు?అని..(అంటే నన్నా.నన్నే అయితే శరీరంచేత ఎవడూ నీచుడూ కాదు..ఉన్నతుడూ కాడు కదా..పైకి కనిపించే నేను నిత్యం కాడు..లోపలి నేనే నిత్య్డు, శాశ్వతుడు కదా. మీలోనూ నాలోనూ వున్న ఆ 'నేను' అనేదానికి ఏ మాలిన్యమూ లేదుకదా మరి ఎందుకు ప్రక్కకు తప్పుకొమ్మంటున్నారు? .లోపలి 'నేనే'ఈ విశ్వమంతటా నిండి వున్నాడు కదా..అనే లోతైన భావంతో వేసిన ప్రశ్నగా ఆ ప్రశ్నను భావించిన)ఆది శంకరాచార్యులవారు అంత 
లోతైన ప్రశ్నను వేసిన ఆ చండాలుడిని సాక్షాత్తూ శివునితో సమానుడిగా..ఆ నాలుగు కుక్కలను 
నాలుగు వేదములుగా భావించి, సాష్టాంగ నమస్కారం చేసి,ఐదు శ్లోకాలలో వెలువరించిన స్తోత్రమే 
మనీషా పంచకం. ఐదు శ్లోకాలు వున్నాయి కనుక పంచకం. ప్రతి శ్లోకమూ 'మనీషా మమ'
(అంటే నాదృష్టిలో మహానుభావుడు అని అర్థం) అనే మకుటం తో అంతం ఔతుంది కనుక 
మనీషా పంచకం అని పేరు వచ్చింది ఈ స్తోత్రానికి.

భారతీయ వేదాంత తత్త్వాన్ని సంక్షిప్తంగా చెప్తే ఆది మనీషా పంచకమౌతుంది.భారతీయ ఆధ్యాత్మిక సర్వస్వాన్నిసంక్షిప్తంగా చెప్తే ఆది మనీషా పంచకమౌతుంది. సమస్త వేదాల,ఇతిహాసాల,పురాణాల 
సారం మొత్తం సంక్షిప్తంగా ఒకచోట చేరిస్తే ఆది మనీషా పంచకమౌతుంది.

మరొక అద్భుతమైన రహస్యం ఏమిటంటే ఉపనిషత్తులలో 'శుక రహస్యోపనిషత్' అనే గొప్ప ఉపనిషత్ 
ఒకటి ఉన్నది. వేదనిలయుడైన దక్షిణామూర్తి అవతారమైన ఆది శంకరుడు శుకరహస్యోపనిషత్ కు
సాక్షాత్తూ అనువాద రూపకంగా మనీషా పంచకాన్ని చెప్పారు, ఆశువుగా! మనీషా పంచక స్తోత్రమును తెలుసుకొనడానికి ముందు కొంత వేదాంత చర్చ పరిశీలన అవసరం.వేదాంత ప్రపంచంలోఅంటే 
ఉపనిషత్తులలో గొప్ప సూక్తులవంటివి చిన్న చిన్న వాక్యాల రూపంలోవున్నాయి,వీటినే మహా
వాక్యాలు అంటారు. అంటే పరమోన్నత సత్యాలను సూక్ష్మ రూపంలోచిన్న చిన్న వాక్యాల రూపంలో చెప్పినవన్నమాట..గణితం లో సూత్రాలవలె.ఈ వాక్యాలను వివరంగా,విపులంగా విశదీకరించి విమర్శ 
చేస్తే లోతైన సత్యాలు సాక్షాత్కరిస్తాయి. మహా వాక్యాలు అనేకం వున్నాయి,వాటిలో 108ముఖ్యమైనవి 
అని చెప్తారు. వాటిలో కూడా 27 ఇంకా ముఖ్యమైనవి.వాటినే మహావాక్య నక్షత్ర మాలిక అంటారు.27 నక్షత్రములవంటివి ఈ 27 మహావాక్యాలు అనే ఉద్దేశంతో. వీటిలో కూడా 4 మహావాక్యాలు
మహోన్నతమైనవి.వాటినే మహావాక్య చతుష్టయం అంటారు. అవి (1)ప్రజ్ఞానం బ్రహ్మ (ఋగ్వేదంలోని 
ఐతరేయ ఉపనిషత్ లోనిది).(2) అహం బ్రహ్మాస్మి (శుక్ల యజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్ 
లోనిది). (3)తత్త్వమసి (సామవేదం లోని ఛాందోగ్య ఉపనిషత్ లోనిది) (4) అయమాత్మా బ్రహ్మ 
(అధర్వణవేదం లోని మాండూక్య ఉపనిషత్ లోనిది).వేద వ్యాసులవారి కుమారుడు, మహా జ్ఞాని, 
పుట్టుకతోనే విరాగి, యోగీ,ముక్తుడు ఐన శుక మహర్షికి ఉపనయనానికి యుక్తమైన వయసు
వచ్చినది అని భావించిన వ్యాసులవారు తన కుమారుడిని, శుకమహర్షిని తీసుకొని కైలాసానికి 
పరమ శివుని సన్నిధికి వెళ్ళాడు. శివునకు నమస్కరించి తన కుమారుడైన శుకమహర్షికి ఉపనయనం 
చేసి,బ్రహ్మోపదేశాన్ని, అంటే, గాయత్రీ మంత్ర ఉపదేశాన్ని చేయమని, అందుకు తగినవాడు 
పరమశివుడేనని భావించి అక్కడికి వచ్చినట్లుగా వ్యాసులవారు తెలియజేశారు. పరమశివుడు 
చిరునవ్వు నవ్వి '' నేనొక యోగిని..విరాగిని..నా చేత బ్రహ్మోపదేశం తీసుకుంటే నీ కుమారుడు కూడా 
సర్వ సంగ పరిత్యాగి అయి విరక్తుడై నిన్నూ వదిలి వెళ్ళిపోతాడేమో,తర్వాత నన్ను నిందించవద్దు సుమా'' 
అన్నాడు. వ్యాసులవారు ఏదేమైనా సరే, నా కుమారుడికి బ్రహ్మోపదేశాన్ని చేయడానికి మీరే సమర్ధులు 
స్వామీ..మీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని జరిపించండి అని పట్టుబడితే, సరే నని పరమ శివుడు కైలాసంలో, తన చేతులమీదుగా శుక మహర్షికి ఉపనయనం చేసి, తాను గురువై శుక మహర్షికి 
బ్రహ్మోపదేశం చేశాడు. అనంతరం శుక మహర్షి పరమ శివునకు సాష్టాంగ దండ ప్రణామం చేసి,తనకు 
మహావాక్య చతుష్టయాన్ని ఉపాసనా రూపకంగా ఉపదేశించమని కోరాడు. పరమ శివుడు శుకమహర్షికి 
పైన చెప్పుకున్ననాలుగు మహావాక్యాలను సాంగోపాంగములుగా,బీజాక్షరములతో,ధ్యానమంత్ర శ్లోకాలతో, అంగన్యాస కరన్యాసాలతో ఉపాసనా మార్గానికి అనువుగా ఉపదేశించాడు.ఆ ఉపదేశాన్ని స్వీకరించిన శుక 
మహర్షి ఆ వేదాంత జ్ఞాన సార మాధుర్యాన్ని మనసారా అనుభవించి,బ్రహ్మానంద సాగరంలో ఈదులాడుతున్నవానివలె అక్కడినుండి వెళ్ళిపోయాడు అని శుకరహస్యోపనిషత్ చెప్తుంది. మనీషా 
పంచకంలోని మొదటి నాలుగు శ్లోకాలను నాలుగు మహా వాక్యాలకు అనువాదరూపకంగా,ఐదవ శ్లోకాన్ని ఫలశ్రుతిగా ఆదిశంకరాచార్యులవారు మనకు అనుగ్రహించారు. శుకరహస్యోపనిషత్తునూ మనీషా పంచక 
స్తోత్రాన్నీపరిశీలిస్తే మనీషా పంచక స్తోత్రం శుక రహస్యోపనిషత్ కు తాత్పర్య రూపకంగా కనిపిస్తుంది! 
అద్భుతమైన ఈ రహస్యాన్ని అర్థం చేసుకొనడానికి చేసిన చిన్ని ప్రయత్నమే ఈ వ్యాసం.

(1)జాగృత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదు జ్జ్రుమ్భతే
యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ
సైవాహం నచ దృశ్య వస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తిచేత్ 
చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ 

తొణికిసలాడే 'కళ ' మెలకువలో,
కలలో, కదలని గాఢ నిద్రలో,
ఇమ్మనుజులలో, బ్రహ్మదేవునిలొ,
పిపీలకాదుల శరీరాలలో,
చరాచరమ్ముల శరీరాలలో,
నిన్నా,నేడూ,రేపూ నిలిచే 
అంతరంగమున, బహిరంగములో,
సాక్షిగ అక్షరమై వెలుగొందే
వెలుతురు నే నీ మేను కాననే
జ్ఞప్తిని కలిగిన వాడెవడైనా
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మరి యాతడె పో, నా గురుదేవుడు!

(మెలకువతో ఉన్నప్పుడు, కలగంటున్నప్పుడు,గాఢ నిద్రలో వున్నప్పుడు..ఈ మూడు దశలలోనూ ఏ సంవిత్కళ,అంటే ఏ దివ్యమైన కళ, ఏ చైతన్యము, ఏ వెలుగు కొనసాగుతున్నదో, ఏది బ్రహ్మనుండి 
చీమవరకు సకల ప్రాణుల శరీరములలోనూ ఓత ప్రోతమై (అంటే దూదిలో దారం వలె) ఉన్నదో,అదే నేను, 
ఆ కళనే నేను,అంతే కాని కాంతికి కనిపించే ఈ శరీరం నేను కాను అనే దృఢమైన దివ్య జ్ఞానము ఎవరిలో ఉన్నదో..అతను జన్మచేత చండాలుడైనా, బ్రాహ్మణుడైనా అతనే నా గురుదేవుడు.అంటే,సమస్త కాలాలలో, 
సమస్త ప్రాణులలోవెలుగొందుతున్న దివ్యచైతన్యం ఒకటే, ఆ చైతన్యమే నాలోనూవెలుగొందుతున్నది, 
కనుక నేనుఎవరికీ భిన్నుడను కాను, అందరిలోఒకడిని, ఒకడిలో అందరిని, ఎవరికన్నా తక్కువా కాదు, 
ఎక్కువా కాదు,పైకి కనిపించే ఈ శరీరము నేను కాను, ఎందుకంటే ఈ శరీరం ఒకనాటికి లేకుండా 
పోయేదే, దానికి సంబంధించిన మెరుగులు, తళుకులు,గొప్పలు ఏవీ శాశ్వతం కావు, అవి కూడా 
నశించి పోయేవే, కానీ, శరీరంలోపలి దివ్య చైతన్యము సర్వ వ్యాప్తమైనది,అనంతమైనది,శాశ్వతమైనది,
అదే నేను, నా శరీరానికి లేకుండా పోవడం వున్నది కానీ, లోపలి దివ్య చైతన్యము నశించిపోనిది,అనే 
జ్ఞానం ఉన్న వారెవరైనా..వారే నా గురుదేవులు!

మనీషా పంచకంలోని ఈ ప్రథమ శ్లోకం ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తు లోని '' ప్రజ్ఞానం బ్రహ్మ '' అనే
వేదాంత మహావాక్యానికి ఎంత దగ్గిరగావుందో చూద్దాం.శుకరహస్యోపనిషత్ లో పరమశివుడు శుకమహర్షికి 
వేదాంత వాక్యాన్ని ఉపదేశించినప్పుడు రెండు శ్లోకాలను చెప్పాడు. ప్రజ్ఞానం అంటే ఏమిటి అనేది వివరిస్తూ..''ఏనేక్షతే శ్రుణోతీదం జిఘ్రతి వ్యాకరోతిచ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్ర జ్ఞాన ముదీరితం''అన్నాడు 
పరమశివుడు!అంటే, దేనిద్వారా(బ్రహ్మమును, శాశ్వతమైన సత్యమును)చూడడం,వినడం,వాసనచూడడం 
అంటే గ్రహించడం,వ్యాప్తి చేయడం అంటే విపులీకరించడం అంటే విశదంగా తెలిసికొనడం జరుగుతుందో అదే 
ప్రజ్ఞానం అంటే విశిష్టమైన జ్ఞానం.ప్రజ్ఞానం బ్రహ్మ ను వివరిస్తూ, ''చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ 
గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి''...అన్నాడు పరమశివుడు!

అంటే చతుర్ముఖుడైన బ్రహ్మ మొదలైన దేవతలలోనూ,మనుషులలోనూ,అశ్వములలోనూ,గోవులలోనూ వున్నబ్రహ్మ చైతన్యం ఒక్కటే అనేదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇదే భావాన్ని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు '' విద్యా 
వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని,శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః'' అని వెల్లడించాడు,అంటే విద్య,వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిలోనూ,గోవులోనూ, ఏనుగులోనూ,కుక్కలోనూ,కుక్క మాంసం 
తినే చండాలుడిలోనూ పండితుడు సమదృష్టి కలిగి ఉంటాడు. అసలు పండితుడు అంటే ఎవరు అనేది కూడా ఆయనే చెప్పాడు, అదే గీతలో..వేరొక చోట!''యస్య సర్వే సమారమ్భాః కామ సంకల్ప వర్జితాః, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు: పండితం బుధాః ''అని, అంటే ఎవరి కర్మలు కామములతో అంటే ఏవో కోరికలను తీర్చుకొనడానికి చేసినవి కావో,జ్ఞానమనే అగ్నిలోదహింపబడినవో, వానిని పండితుడు అని విద్వాంసులు పలికెదరు అని! దీనినే అన్నమాచార్యుడు '' నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే,అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే, చండాలుడుండేటి సరిభూమి యొకటే''కడగి ఏనుగుపైన కాయు ఎందయునోకటే, పుడమి శునకముపైన బొలయు ఎండొకటే ''.''కందువగు హీనాధికము 
లిందు లేవు..అందరికీ శ్రీహరే అంతరాత్మ!!'' అని ఆనంద తందనాలాడాడు! త్యాగరాజ స్వామీ వారు ఇదే 
భావాన్ని శ్రీ రామునిపరంగా..'' చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదులలో ప్రేమమీర చెలగుచుండే బిరుదు 
వహించిన సీతారామ నన్ను బ్రోవ రావేమొకో??'' అని ఆర్తిగా ప్రశ్నించి వెల్లడించారు! బమ్మెర పోతన 
మహానుభావుడు కొన్ని వందల పద్యాలలో ఇదే భావాన్ని వెల్లడించాడు తన ఆంధ్రమహాభాగవతంలో! ఇదే భావాన్ని స్వామి వేవేకానంద ప్రతి మానవునిలో దివ్య చైతన్యం వున్నది..చేయ వలసినది ఆ దివ్యత్వమును అభివ్యక్తీకరించడమే..అని పలికారు! ఒకరని కాదు,యిదీ భారతీయుల సమదృష్టి! యిదీ భారతీయ జ్ఞానదృష్టి! 
సకల ప్రాణులూ, కేవలం సమస్త మానవాళి కాదు,భగవత్స్వరూపాలే భారతీయుల దృష్టిలో!అందుకే రెండుకాళ్ళమానవులకే కాదు..నాలుగు కాళ్ళ జంతువులకు కూడా శుభం, సుఖం,శాంతి కలగాలని వేదం ఆశీర్వదించింది 'శంనో అస్తు ద్విపదే..శం చతుష్పదే..ఓం శాంతి: శాంతి: శాంతి:' అని!


(2)బ్రహ్మైవాహ మిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం
సర్వం చైత దవిద్యయా త్రిగుణయాశేషం మయా కల్పితం 
ఇత్థం యస్య దృఢమతిస్సుఖతరే నిత్యే పరే నిర్మలే 
చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ

బ్రహ్మ మయమిదే ప్రపంచమంతా,
చిన్మయ రూపం ఈ జగమంతా,
'త'న్మయమై అలరారినదంతా! 
తప్పుగ తలచితినేను ఒకింత..
అవిద్యచే, త్రిగుణమ్ముల చేత , 
ప్రపంచమంతా శాశ్వతంబని!
కలయికలన్నీ వీడిపోవును, 
కనపడు సర్వము కదిలి పోవును, 
వినపడు స్వరములు అణగి పోవును! 
బ్రహ్మము చిన్మయమొకటి శాశ్వతం, 
మిగిలిన సర్వము, జగము నశ్వరం!
అని ధృఢముగ తెలిసిన సుఖుడెవరో 
సన్మతి.స్థిరమతి,నిర్మలుడెవరో
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు
మరియాతడె పో.. నా గురుదేవుడు! 


నాలో బ్రహ్మపదార్దమే నిండి వుంది..కంటికి కనిపించే ఈ ప్రపంచమంతా అదే బ్రహ్మ పదార్ధముచేత 
అదే చిన్మాత్ర చేత నిండివుంది..అంటే నేను నశించి పోయినా, కంటికి కనిపించే ఈ ప్రపంచం నశించి 
పోయినా..ఆ అంతర్గర్భితమైన బ్రహ్మ పదార్ధము నశించి పోదు..అది శాశ్వతము! అంటే అది మాత్రమే 
శాశ్వతము! అవిద్యచేత అంటే అజ్ఞానము చేత, సత్త్వ,రజో, తమో గుణములచేత ప్రభావితుడనై
నాతో సహా ఇదంతా అశేషమైనది అని, అనంతమైనది అనీ అంటే అంతం లేనిది, శాశ్వతమైనది అని 
కల్పించుకొన బడినది..అంటే వాస్తవంగా అది నిజం కాదు..అనే దృఢమైన నమ్మకంతో..శాశ్వతమైన, 
సత్యమైన,నిత్యమైన,నిర్మలమైన సుఖాన్ని ఎవరు పొందగలరో వారు జన్మచేత చండాలుడైనా, 
బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే,అతనే నా గురుదేవుడు! 

శుక్ల యజుర్వేదం లోని బృహదారణ్యక ఉపనిషత్తు లోని 'అహం బ్రహ్మాస్మి'అనే మహా వాక్యానికి నిర్వచన 
రూపకంగా ఈ రెండవ శ్లోకాన్ని చెప్పారు ఆదిశంకరాచార్యులవారు తమ మనీషాపంచకంలో. బ్రహ్మైవాహం 
అనే ఎత్తుగడతోనే అహం బ్రహ్మాస్మి..అనే మహా వాక్యాన్ని స్పృశించారు. కైలాసంలో పరమశివుడు శుక 
మహర్షికి ఈ మహావాక్యాన్ని ఉపదేశిస్తూ..'' పరిపూర్ణః పరాత్మాస్మిన్దేహే విద్యాధికారిణీ|బుద్దేస్సాక్షితయా 
స్థిత్వాస్ఫురన్నహ మితీర్యతే ''..అన్నాడు.అంటే..పరిపూర్ణుడూ,పరాత్ముడూ ఐన అంటే జీవాత్మకు పరుడు 
ఐన పరమాత్ముడు ఈ దేహంలో వున్నవాడు,విద్యకు అంటే జ్ఞానానికి అధికారిగా బుద్ధిరూపకుడిగా సాక్షిగా వున్నవాడు ఎవరైతే ఉన్నాడో వానినే 'అహం' అని అంటారు అన్నాడు. పరిపూర్ణుడు పరమాత్ముడొక్కడే,ఆ పరిపూర్ణుడే నాలోనూ, ఈ విశ్వమంతటా వున్నాడు..పరిపూర్ణం కాని విశ్వం,నేనూ లేకపోయినా ఈ 
పరిపూర్ణ పరమాత్ముడు మిగిలి ఉంటాడు,కొనసాగుతుంటాడు.'' స్వతః పూర్ణః పరాత్మాత్ర బ్రహ్మ శబ్దేన 
వర్ణితః అస్మీత్యైక్య పరామర్శః తేన బ్రహ్మ భవామ్యహం ''.. సహజంగానే పరిపూర్ణుడు,విద్యాధికారిగా అంటే 
జ్ఞానానికి అధికారిగా, బుద్దిరూపకుడై సాక్షిగా ఈ దేహంలో వున్న ఆబ్రహ్మఅనే శబ్దం ద్వారా వర్ణింపబడిన 
వాడనే నేను అయి వున్నాను అని భావించడం ద్వారా ఆ బ్రహ్మమును అనుభవించడం ద్వారా నేనే 
బ్రహ్మమును అవుతాను,శాశ్వతుడను అవుతాను,అంటే నేను పైకి కనిపించే నేను కాదు,అంతర్గతంగా
వెలుగొందుతున్న ఆ పరమాత్ముడిని,పరిపూర్ణుడైన ఆ పరమాత్ముడి అంశనే నేను,కనుక ఈ శరీరంతో 
వచ్చిన హెచ్చు తగ్గులు,మంచి చెడులు,ఇవి ఈ శరీరంతోనే పోతాయి కానీ లోపలి ఆ పరిపూర్ణ తత్త్వం 
నిలిచి వుంటుంది కనుక నాకు అనగా నా ఆత్మకు నాశనం లేదు, నా దేహానికి మాత్రమే..అనే జ్ఞానం 
కలిగిన వారు జన్మచేతచండాలుడైనా, బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే, వారే నా గురుదేవుడు!


(3)శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో:
నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజ శాంతాత్మనా
భూతం భావిచ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే 
ప్రారబ్దాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ


నశించి పోవును ప్రపంచమంతా 
వశించి వుండే వస్తువొక్కటే 
సత్యమైనదిది సద్గురువాక్యం 
నిశ్చయమిదియని నిరంతరంగా
హృదంతరాళములో తలపోస్తూ 
నిరంతరానందము చవి జూస్తూ 
స్వచ్చమైన ఘన జ్ఞాన వహ్నిలో
భూత భవిష్యద్వర్త మానముల 
కర్మఫలములను దహించి వేస్తూ
నిష్కాముకుడై కర్మలుజేస్తూ
నిత్య ముక్తుడౌ నరుడెవడైనా
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మారి యాతడె పో, నా గురుదేవుడు! 

కంటికి కనిపించే ఈ విశ్వమంతా నశించిపోయేదే, విశ్వములోఅంతర్గర్భితంగా వున్న బ్రహ్మతత్త్వమొక్కటే నశించనిది, సత్యమైనది, శాశ్వతమైనది అనే గురు వాక్యములను నిరంతరం మననం జేసుకుంటూ, 
ఏ కారణం లేకుండా శాంతుడై, భూత, భవిష్యద్వర్తమానకాలములకు చెందిన కర్మఫలితములను 
గురువాక్య ప్రబోధంద్వారా కలిగిన జ్ఞానమనే అగ్నిలో దహించివేసి,ప్రారబ్ధ,సంచిత,ఆగామి కర్మఫలితములను 
తాను పొందకుండా నిస్సంగుడై చరించే మానవుడు జన్మచేత చండాలుడైనా,బ్రాహ్మణుడైనా, ఎవరైనా సరే, 
అతనే నా గురుదేవుడు!మనీషా పంచకంలోని ఈ మూడవ శ్లోకంలో '..వాచా గురో..' అనడం ద్వారా 
'గురుదేవుని వాక్యములు అంటే గురుదేవుని ఉపదేశం' అనడంతో పాటు 'మహా వాక్యములు అంటే గురువాక్యములు కనుక మహావాక్య చతుష్టయాన్ని' సూచించారు ఆది శంకరాచార్యులవారు! మహావాక్య
చతుష్టయంలోని మూడవది ఐన 'తత్త్వమసి'కి మనీషా పంచకంలోని ఈ మూడవ శ్లోకం వ్యాఖ్యాన 
పూర్వకంగా వెలయించినది అనడం లో సందేహం అవసరం లేదు. 'తత్త్వమసి' అనే మహావాక్యం సామవేదం 
లోని ఛాందోగ్య ఉపనిషత్తు లోనిది. దీనిని శుకమహర్షికి ఉపదేశిస్తూ,శుకరహస్యోపనిషత్ లో,పరమశివుడు,
'' ఏకమేవాద్వితీయం సన్నామ రూప వివర్జితం| సృష్టే: పురాధునాప్యస్య తాదృక్త్వం తదితీర్యతే '' అన్నాడు. అంటే..తాను మాత్రమే ఒకటిగా వున్నది, రెండవదంటూ ఏదీ లేనిది, తను తప్ప రెండవది ఏదీ లేనిది,
నామ రూపములనే భేదములు లేనిది, నామ రూపములు అంటూ తెలియరానిది, సృష్టికి పూర్వమూ 
ఇప్పుడు కూడా వున్నది, అంటే ఎప్పటికీ వుండేది, నాశనం లేనిది, విమర్శ చేయడం ద్వారా ఇప్పటికీ 
తెలియదగినదీ ఏది కలదో దానినే 'తత్' అంటారు అని అర్థం! అంటే విశ్వములో, అన్నింటా వుండినదీ, వుంటున్నదీ, వుండేదీ ఐన ;బ్రహ్మ తత్త్వం' నాశము లేనిది, కానీ విశ్వమూ,విశ్వములోని సమస్తమూ 
నశించి పోయేవే! ఆది ఒక పేరుతో, ఒక రూపముతో తెలిసికొన గలిగినది కాదు,కనుకనే కేవలం గుర్తుగా 
'అది' అంటే, 'తత్' అని అనబడేది! (యదా నద్యః స్యన్దమానాః సముద్రేస్తం గచ్చంతి నామ రూపే విహాయ|
తథా విద్వాన్ నామ రూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం..ఏ విధంగా రకరకాల పేర్లతో, 
రూపాలతో ప్రవహించే నదులు సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఏ పేరూ, ఏ రూపమూ లేకుండా 
పోతాయో, ఆ విధంగా పండితులు నామ రూపముల భేదములు లేకుండా పరమాత్ముడనే సాగరమును
చేరుకుంటారు అని మరొక ఉపనిషత్ చెప్పింది! ఈ పేర్లూ,రూపాలూ,విధానాలూ కేవలం గుర్తుకోసం మనం కల్పించుకున్నవే..ఏ పేరుతో పిలువబడే నది ఐనా దాహం తీర్చడం, తన జలధారల ద్వారా పండిన 
పంటలచేత ఆకలిని తీర్చడమే చేసేది, ఆధ్యాత్మిక జ్ఞానం ఏ పేరుతో, ఏ మార్గంలో పొందినా ఐహిక 
ప్రపంచపుబాధలు అనే దాహాన్ని,ఆకలిని తీర్చడానికే,యిదీ భారతీయవేదాంత సమన్వయదృష్టి,జ్ఞానవృష్టి!

'తత్త్వమసి' ని బోధిస్తూ, శుక రహస్యోపనిషత్ లో, రెండవ శ్లోకంలో పరమశివుడు..'' శ్రోతుర్దే హేన్ద్రియాతీతం 
వస్త్వత్ర త్వం పదేరితం ఏకదా గ్రాహ్యతేసీతి తదైక్య మనుభూయతాం '' అని'తత్త్వమసి 'మహావాక్యాన్ని
వివరించి ఉపదేశించాడు! అంటే..నామము ద్వారా పలకడానికీ, రూపంద్వారా చూడడానికీ సాధ్యం కానిది 
అని చెప్పబడిన 'తత్' అనబడిన 'అది' శ్రోత్రము ద్వారా అంటే వినికిడి ద్వారా కూడాతెలియబడనిది,
ఇంతవరకూ మూడు ఇంద్రియముల ద్వారా తెలియబడనిది  (మూడు అంటే సమస్తం అని న్యాయశాస్త్రం 
కనుకనే ఎన్నిసారులు ఆచమించాలి అంటే మూడుసార్లు అంటే అనేక మార్లు, ఎన్ని ప్రదక్షిణలు అంటే 
మూడు,ఎన్ని నమస్సులు అంటే మూడుసార్లు నమస్కారాలు..అని నిర్దేశించింది!) అంటే సకల ఇంద్రియములద్వారా తెలియబడనిది..పంచ కర్మేంద్రియముల ద్వారా,పంచ జ్ఞానేంద్రియముల ద్వారా
కూడా సంపూర్ణంగా తెలియబడనిది,వస్తుతః 'త్వం' పదముచేత తెలియదగినది..త్వం అంటే నీవు కనుక 
ఆ పైన వివరించిన లక్షణములను కలిగిన 'బ్రహ్మ పదార్దమే' నీవు కనుక,ఎందుకంటే 'చతుర్ముఖ బ్రహ్మ
ఇతర దేవతలు మొదలుకొని సమస్త జీవరాశులలోనూ నిండి వున్నది అదే కనుక'(ప్రజ్ఞానం బ్రహ్మ,అహం బ్రహ్మాస్మి ప్రకారం)ఆ పదార్దమే 'త్వం' అంటే నీవు కనుక అదే నీవు..ఆ బ్రహ్మపదార్దమే నీవు..నీవు 
దేవుడవే.. నీవు అమరుడవే..అమృత పుత్రుడవే..అనే భావాన్ని 'అసి', అంటే, అయి వున్నాను అని 
అర్థం కనుక,అదే నీవు అయి వున్నావు అనే సత్యాన్ని విమర్శించి,తెలిసికొని,ఆ బ్రహ్మైక్య భావాన్ని 
పొందవలెను! దేహము, విశ్వము నశించి పోయేవే కానీ,దేహములోని, విశ్వములోని దైవం నశించిపోనిది  
కనుక, దేహము ద్వారా చేసే కర్మలద్వారా వచ్చే ఫలితములను అంటకుండా, అంటే ఆ ఫలితములను ఆశించకుండా,ఏ కారణమూలేకుండా,అంటే చేసేదీ నీవు కానప్పుడు,చేయించేదీ నీవు కానప్పుడు, ఆ ఫలితములూ నీవి కానప్పుడు ఇక ఏ కారణం వుంటుంది కనుక?

(వేదాంత ప్రపంచంలో తత్త్వమసి అనే మహావాక్యాన్ని ఉపదేశ వాక్యం అన్నారు..ఈ భావాన్నే ఉపదేశ 
రూపకంగా శ్రీకృష్ణుడు అర్జునునితో..'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ: 
మాతే సంగోస్త్వ కర్మణి ' కర్మములు చేయుటయందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితములందు 
లేదు, నీవు కర్మ ఫలితములకు కారణము కారాదు..అట్లని కర్మలు చేయుట మాన రాదుఅని ' 
ఉపదేశించాడు!) కనుక..ఈ జ్ఞానము ద్వారా సంక్రమించిన జ్ఞానమనే అగ్నిలో ప్రారబ్ధ,సంచిత,ఆగామి 
కర్మ ఫలితములను నిరంతరం గురువాక్యములద్వారా సంప్రాప్తించిన జ్ఞానమనే అగ్నిలో దహించి, ఏదీ 
నీది కాదనే, ఏదీ నిలిచిపోదనే, ఏదీ వెంట రాదనే సత్యం 'అనుభవంలోకి వచ్చిన తర్వాత' మిగిలేది ఏ 
కదలికలూ, కల్లోలాలూ లేని ప్రశాంతతే కనుక, ఆ అనుభవం పొందిన,శాంతాత్ముడై వుండే మహానుభావుడు జన్మచేత చండాలుడైనా,బ్రాహ్మణుడైనా, ఎవరైనా సరే..ఆయనే నా గురుదేవుడు!..అన్నాడు 
ఆదిశంకర గురుదేవుడు!

(4)యా తిర్యన్నర దేవతాభి రహమిత్యంత స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్ష దేహ విషయాభాంతి స్వతో చేతనా
తాం భాస్యై: పిహితార్క మండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్
యోగీ నిర్వృత మానసోహి గురురిత్యేషా మనీషా మమ 


ఏ కళ వెలుగై కదలు వాటిలో
వృక్ష జాలముల, జంతు కోటిలో
మానవులందు, దేవతలందు
దృశ్యమానమై వెలుగుచున్నదో
హృదయ కుహరమున వెలిగేనేకళ
ప్రాణి కోటికిల ప్రాణమైన కళ 
తన వెలుగునుగొని జీవులు కళకళ
లాడుచుండునో సాగుచుండునో
ఆ వెలుగారిన ఆగుచుండునో
ఆ వెలుగుల గని వెలిగించునది
వెలుగు వానిలో కనిపించునది
జీవకోటికా వెలుతురొక్కటే
జీవులన్నిటా వెలుగునొక్కడే 
అని తెలిసిన మానవుడెవరైనా
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మరి యాతడె పో, నా గురుదేవుడు! 

కదిలే వానిలో(తిర్యక్కులలో),మానవులలో,దేవతలలో..అందరిలో అన్నింటాస్ఫుటంగా స్పష్టముగా 
కనిపించునది, గ్రహింపబడునది,ఏ కళ హృదయకుహరములో వెలుగొందడం వలన స్వతహాగా కళ,చైతన్యం,కదలిక లేనివి కళ, చైతన్యం,కదలిక వున్నవానిలాగా కనిపిస్తాయో, ఏ వెలుగు 
అంతర్గతంగా వెలుగొందుతుండడం వలన పైకి కనిపించే శరీరాలు, జీవులు ఆ వెలుగును ఆ కళను (ప్రాణకళ,జీవకళ)ను కలిగిఉన్నట్లుగా కనిపిస్తాయో ఆ కళను,ఆ వెలుగును,ఆ చైతన్యము సత్యము, 
నిత్యము, శాశ్వతము అని తెలిసికొన్న మహానుభావుడు,నిరంతరమూ ఆ స్ఫూర్తిని,ఆ సత్యమును,
నిత్యమును, శాశ్వతమును మననం చేసే మహానుభావుడు జన్మచేత చండాలుడైనా, బ్రాహ్మణుడైనా 
ఎవరైనా సరే, ఆయనే నా గురుదేవుడు, నా దృష్టిలో మహానుభావుడు!మనీషాపంచకం లోని ఈ
నాలుగవ శ్లోకం అధర్వణ వేదంలోని మాండూక్య ఉపనిషతు లోని 'అయమాత్మా బ్రహ్మ' అనే 
మహావాక్యానికి వ్యాఖ్యాన పూర్వకమైనది!పరమశివుడు శుకమహర్షికి ఈ మహావాక్యాన్ని ఉపదేశిస్తూ..

'' స్వప్రకాశాపరోక్షత్వం ఆయమిత్యుక్తితోమతం| అహంకారాది దేహాంతం ప్రత్యగాత్మేతి గీయతే 'అన్నాడు, 
అంటే స్వప్రకాశమైనది,తనే తనంతగా వెలిగేది,ఎక్కడినుండో తెచ్చుకున్నవెలుగుతో వెలిగేది కానిది,తనే 
వెలుగుతూ వెలిగించేది..అపరోక్షం అంటే పరోక్షంకానిది.. అంటే ప్రత్యక్షమైనది..'అయం''ఇది' అనబడేది 
'అహంకారం' మొదలైన వాటికీ భిన్నమైనది..ఆది ప్రత్యగాత్మ అనబడుతుంది..పరమశివుడు ఇంకా..
'దృశ్యమానస్య సర్వస్య జగతత్తత్త్వ మీర్యతే|బ్రహ్మ శబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకం'..అన్నాడు..
అంటే కంటికి కనిపించే సర్వజగమూ ఆ బ్రహ్మ పదార్ధముచేత, అంటే ఆ ప్రత్యగాత్మ చేత నిండి వున్నది. 
ఆ బ్రహ్మ పదార్ధము, ఆ ప్రత్యగాత్మ స్వప్రకాశమైనది,అంటే అదే నిజమైన వెలుగు,ఆ వెలుగే మిగిలినవన్నీ వెలిగేటట్లుగా చేస్తుంది, వాటిలో అంతర్గతంగా తాను వెలగడం ద్వారా..ఈ వెలుగు ఉన్నంత కాలమే అవి
వెలుగుతున్నట్లుగా కనిపిస్తాయి..సూర్యుని వెలుగును చంద్రుడు,నక్షత్ర గ్రహ గణాలు గ్రహించి వెలుగుతున్నట్లుగా,విద్యుత్తు గ్రహించి విద్యుద్దీపాలు వెలుగుతున్నట్లుగా,కనుక ఆ శాశ్వతమైన వెలుగును గుర్తించి,గుర్తుంచుకుంటూ,నిరంతరం మననం చేసే మహానుభావుడు ఎవరైనా సరే అతనే నా గురుదేవుడు!
ప్రాణుల శరీరాలలో ఆ వెలుగు ప్రాణ శక్తిగా ఉన్నంత వరకే ప్రాణులు కళ కళ లాడుతూ వుంటాయి,ఆ కళ
తప్పితే కట్టెలవుతాయి. కనుక శరీరాలూ,శరీరుధారులూ శాశ్వతులు కారు..ఆ శరీరాలలోసమానంగా 
వెలుగొందే ప్రత్యగాత్మఐన బ్రహ్మపదార్ధమే శాశ్వతం,కనుక శరీరానికి కాదు,శరీరికి,అంటే లోపలి వెలుగుకి ప్రాధాన్యత నిచ్చేవాడూ, ఆ లోపలి వెలుగు అందరిలోనూ,అన్నింటిలోనూ సమానంగా వున్నది కనుక,
అందరూ, అన్నీ సమానమే అని భావించేవాడు, శాశ్వతమైన దాన్నిగుర్తించి నిరంతరం స్మరించే వాడూ 
ఎవరో అతనే నా గురుదేవుడు!

(5)యత్సౌ ఖ్యామ్బుధి లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వ్రుతా
యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్వ్రుత
యస్మిన్ నిత్య సుఖామ్బుధౌ కలిత ధీర్బ్ర హ్మైవ న బ్రహ్మవిత్
యః కశ్చిత్ ససురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ 


ఏ సుఖ సాగర చిరు బిందువుగా
దేవేంద్రాదులు సంతసింతురో
చిత్తమునందే లేశమైన సుఖ
భావము పొందిన మునులానందింతురొ
ఆనందమిది అనుభవమిది యని 
ఎరుగక అద్వైతానుభావమున
ఆనందమె తామై తాముందురొ 
ఆ బ్రహ్మానందాంబుధి మునిగిన
బ్రహ్మానందమె తానై మిగిలిన 
అద్వైతామృత విందులందిన 
నరుడే సుర,ముని,బుధ వందితుడు, 
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మరి యాతడె పో, నా గురుదేవుడు! 

ఏ ఆనంద సాగరపు లేశమైనా పొందినందుకు దేవేంద్రాదులు కూడా తరించి పోతారో,కేవలం దేనిని 
మాత్రమే మనసులో పొందినందుకు మహా మునులు కూడా తరించిపోతారోయే నిత్యమైన శాశ్వతమైన 
ఆనంద సాగర అనుభవం చేత అనుభవించేవాడూ, ఆ అనుభవమూ ఏకమైపోతారో,అంటే అనుభవించేవాడు 
తనే ఆ అనుభవమై పోతాడో..అటువంటి ఆ అద్వైతానుభవ ఆనంద సాగరమును చవిజుసిన వాడూ.. దేవేంద్రాదులచేత కూడా నమస్కరింప బడిన పాదపద్మములు గల ఆ మహానుభావుడే నా గురుదేవుడు! 
ఆది శంకరాచార్యులవారు ఇంతవరకూ శుక రహస్యోపనిషత్తుకు వ్యాఖ్యాన పూర్వకంగా చెప్పిన మనీషా పంచకంలోని చివరి ఐదవ శ్లోకం ఇది. ఈ స్తోత్ర ఫల శ్రుతిగా, శుక రహస్యోపనిషత్తుకు ఫలశ్రుతిగా, ఈ 
రెండింటిని తెలిసికొని,ఆచరించి, అనుభవించిన ఆనందానికి ఫల శ్రుతిగా ఈ చివరి శ్లోకాన్ని చెప్పారు!శుక రహస్యోపనిషత్తు చివరిలో, పరమ శివుడు తనకు నాలుగు మహావాక్యములను ఉపాసనా మార్గంలో 
ఉపదేశించిన తర్వాత, ఆ మహావాక్య అనుభవ సారమనే ఆనంద సాగరంలోఈదులాడుతున్న వానివలె, పరమేశ్వరునకు నమస్కరించి అక్కడినుండి స్వేచ్చగా వెళ్ళిపోయాడు అని శుకరహస్యోపనిషత్తు 
ముగింపు జరుగుతుంది..ఇక్కడ అదే భావాన్ని వ్యక్తం చేసిన ఆది శంకరాచార్యులవారు మహావాక్య 
చతుష్టయాన్ని, వాటిని ఉపదేశించిన శుకరహస్యోపనిషత్తునూ,ఆ ఉపనిషత్తుకు వ్యాఖ్యానపూర్వకంగా 
చెప్పిన మనీషా పంచక స్తోత్రమునూ పఠించిన, అవగతం చేసుకున్న,అనుభవించిన ఫలితము ఏమిటో
ఫలశ్రుతిగా ఈ చివరి శ్లోకంలో చెప్పారు!మనీషా పంచకమును ఎందరో మహానుభావులు,జగద్గురువులు,
గురుతుల్యులు, పండితులు,పూర్వం వ్యాఖ్యానించి వున్నారు. వారి ప్రజ్ఞలో ఆవగింజలో అరవయ్యవ 
వంతు కూడా లేని అల్పుడిని అజ్ఞానిని ఐన నేను నా అదృష్టకారణంగా, ఆదిశంకరుల మీద నాకున్న 
కేవల భక్తి భావ విశేషం చేత,ఆ గురుదేవుని కృపచేత,శుకరహస్యోపనిషత్తుకు అనువాదపుర్వకమా
అన్నంత సారూప్యాన్ని, సామీప్యాన్నిమనీషా పంచకం కలిగివుందని తెలిసికొన్న కారణంగా, ఆ 
సారూప్యాన్ని, పోలికలను బయటకుతెచ్చేఉద్దేశంతో, ఆదిశంకరుని పలుకులు ఉపనిషత్తుల మందాకినీ
కులుకులు అని మరొక దృష్టాంతం పాఠకుల దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ చిన్ని ప్రయత్నమును 
చేయడం జరిగింది.


మనీషా పంచాకములోని ఐదు శ్లోకాలకూ ఈ వ్యాసంలో ఇచ్చిన అనువాద గేయాలు నేను రచించినవి. 
కారణం.. మనీషాపంచకం మీది ప్రేమ,సంస్కృతం లోని ఆ శ్లోకాలను తెలుగులో సరళంగా సులభంగా 
అర్థం చేసుకోవడానికి సహకారంగా వుంటాయి అని. ఈ దీర్ఘ వ్యాసంలో ఏవైనా దోషాలుంటే పాఠకులు మన్నింతురుగాక! తన స్తోత్ర ఫలముగా గురుదేవుడు ప్రవచించిన మానసిక ప్రశాంతత నాకూ..నాలాంటి 
ఎందరో సామాన్య జనులకు లభించునుగాక! ఆదిశంకర దివ్య వాణి అనంతకాలములందు అవనిలో ప్రతిధ్వనించును గాక!


ఓం తత్ సత్!!! ఓం శాంతి:శాంతి:శాంతి:

No comments:

Post a Comment