
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
భగవత్ గీతామృతం
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనా
పార్ధో వత్సః సుధీ: భోక్తాః దుగ్ధం గీతామృతం మహత్
ఉపనిషత్తులు అంటే వేదముల శిరస్సులు.అంటే వేదములలో అత్యంత
వున్నతములైన,విలువైన భాగములు. వేదములలో జ్ఞాన విభాగములు.
అటువంటి ఉపనిషత్తులను గోవుగాచేసుకొని, గోపాలుడైన శ్రీ కృష్ణుడు ఆ
గోవును పిదికే వాడై, పార్దుడినిదూడగా చేసుకున్నాడు.దూడ కోసం ఆవు
చేపుతుంది, పాల ధారలనుకురిపిస్తుంది.దూడను చూపించి అంటే దూడను
వంకగా చూపించిగడసరి గొల్లవాడు చేపిన ఆవు పాలను పిదికి, బుద్ధిమంతులకు
ఆ పాలను అమ్మినట్లుగా, భగవత్ గీతామృతం అనే పాలను బుద్ధిమంతులకు
అందించాడు.
అర్జునుడు నరుడు.శ్రీ కృష్ణుడు నారాయణుడు.నర నారాయణులు
ఇద్దరూ ధర్ముడు,దాక్షాయణి అనే ఋషి దంపతులకు శ్రీ మహావిష్ణువు
అంశతో జన్మించిన వారు. వారే మరలా ఈ జన్మలో అర్జునునిగా, శ్రీ కృష్ణునిగా
జన్మించారు.మామూలు దూడలు మొత్తం పాలు తాగితే వాటికే నష్టం.
అరిగించుకోలేవు.తీవ్రమైన అనారోగ్యం పాలౌతాయి. అందుకని కొన్ని
పాలను మాత్రమే తాగనిస్తారు వాటిని, గొల్లవారు.ఇక్కడ అర్జునుడు
గీత మొత్తాన్ని గ్రహించుకొని తట్టుకోలేడు అని కాదు భావం.మొత్తం
కొత్తగా తెలిసికొనవలసిన దశలో ఆయన లేడు.సమస్త వేద,వేదాంగ
శాస్త్ర పారంగతుడు అర్జునుడు.ఐనా ఆ క్షణంలో నిర్వీర్యుడు ఐపోయాడు,
మోహావేశం చేత! ఆ స్థితి నుండి ఆయనను బయట పడేస్తే చాలు,
ఇక యుద్ధరంగం లో లక్ష్య సాధన కొరకు విజ్రుంభిస్తాడు .
కనుక ఆ రకంగా కూడా ఆర్జునుడిని దూడగా చేసికొనడం సమంజసమే!
తను తాగడం కోసం అయితే ఎవడైనా ఒక అవును లేదా రెండు ఆవులను
పెంచుకుంటాడు. ప్రపంచంలో వాళ్లకు పాలు అమ్మడం కోసం అయితే ఎన్నో ఆవులు
అవసరం. కనుక ఒకటో రెండో ఉపనిషత్తులు కాకుండా సర్వ ఉపనిషత్తులను
ఒక అవుగా చేశాడు శ్రీ కృష్ణుడు. అన్ని పాలు గావాలి మరి. నిజానికి ఆ పాలు
మనపాలు గావాలి మరి, అందుకే అర్జునుడు ఒక 'మిష' మాత్రమే.పాలవాడు
ఒకరోజు రెండురోజులు ఆలస్యం ఐనా బుద్ధిగా తప్పకుండా డబ్బులు ఇచ్చే
వాడికే పాల అమ్మకం చేస్తాడు. శ్రీకృష్ణుడు కూడా బుద్దిమంతులైన వాళ్ళ
కోసమే ఈ పాలను పిదికింది.మరి ఈ గొల్లవాడికి చెల్లించాల్సింది ఎంతోకొంత
శక్తి మేరకు, భక్తి,విశ్వాసము,ఆచరణ..ఆయన బోధనల పట్ల!
భగవద్గీత ఎంత గొప్పదో చెప్పడం కోసం ఇలా చెప్పారు కానీ వేదాల కన్న ఇది
గొప్పదేమీ కాదు అని ఎవరైనా భావిస్తే ఆది పొరపాటు.పదార్ధం కన్నా పదార్ధ
సారం తక్కువది కాదు, ఆ మాటకొస్తే ఇంకా గొప్పది! చెరుకుగడ గొప్పదే..కానీ
చెరుకు రసం ఇంకా గొప్పది, రసంకోసమే చెరుకు గడను ఇష్ట పడతాం కానీ
చెరుకు గడ కోసం రసాన్ని ఇష్టపడం కదా! రసం లేని చెరుకుగడను,లేదా రసం
పిండగా మిగిలిన పిప్పిని పక్కన పడేస్తాం. సమస్త ఉపనిషత్తుల సారం కనుకనే
భగవద్గీత భారతీయ వేదాంత,ఆధ్యాత్మిక జ్ఞాన సారాంశం! కనుకనే గీతామృతం
అనే పాలు అంతటి మహత్యాన్ని కలిగి వున్నాయి.కనుకనే భగవద్గీత
భారతీయుల ప్రామాణిక గ్రంధం!వేదములలోని రెండు భాగాలు ఐన కర్మ కాండను,
జ్ఞాన కాండను, రెండింటినీ భగవద్గీత బోధించింది!కనుకనే వేద సారం ఇది!
పార్థాయ ప్రతి బోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణ మునినామద్యే మహా భారతం
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం
అమ్బత్వామనుసంధదామి భగవద్గీతే భవ ద్వేషిణీం
భగవంతుడైన వాసుదేవుడు పార్థునకు స్వయంగా ఉపదేశించినది, వ్యాసమహర్షి
చేత గ్రంథస్థం చేయబడినది, 18 అధ్యాయములను కలిగినది, భవము పట్ల అంటే
భవ బంధముల పట్ల విరక్తిని పెంపొందించేది ఈ భగవద్గీత. అహంకార,మమకారము
లనే ద్వంద్వముల పట్ల విరక్తిని కలిగించి మానవుడిని ఈ రెండింటి వలన కలిగే
బంధాలనుండి విముక్తుడిని చేసేది భగవద్గీత! ''మన ఏవ మనుష్యాణాం కారణం
బంధ మోక్షయో..'' అన్నది ఒక ఉపనిషత్. అంటే బంధానికీ, మోక్షానికీ కారణం
మనసే. ఆ మనసును అదుపులో పెట్టుకుంటే ఆది మోక్షానికి దారి జూపుతుంది.
మోక్షం అంటే బంధాలనుండి విముక్తియే. కనుకనే జీవన్ముక్తుడు అంటే ఈ జన్మ
లోనే అన్ని బంధాలనుండి ముక్తుడు ఐన వాడు అని అర్థం.ఆ మనసు మననే తన
అదుపులో పెట్టుకుంటే ఆది బంధాలకు దారి తీస్తుంది. '' ద్వే శబ్దే బంధ మోక్షాయ
మమేతి న మమేతిచ, మమేతి బాధ్యతే జంతు: న మమేతి విముచ్యతే '' అని
చెప్పింది మరొక ఉపనిషత్తు. నాది, నాది కాదు ..ఈ రెండు మాటలే బంధానికి,
మోక్షానికీ కారణాలు.నాది అనుకుంటే బంధం, నాది కాదు అనుకుంటే మోక్షం.
'' అసంశయం మహా బాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ
వైరాగ్యేనచ గుహ్యతే '' మహా బాహువులు కలిగిన అర్జునా, మనస్సును
నిగ్రహించుకొనడం ఎవరికైనా కష్టమే..కానీ..అభ్యాస వైరాగ్యములచేత
దానిని నిగ్రహించడం సాధ్యము ఔతుంది..'' అని శ్రీ కృష్ణుడు చెప్పినది అందుకే!
మనసుకు వశుడై, అహంకార మమకారములచేత వివశుడైన పార్థునకు
కనులు తెరిపించిన ఔషధం భగవద్గీత.
మహామహులకు మహానుభావులకు భగవద్గీతను సమగ్రంగా తెలిసికొనడం
సాధ్యం కాదు, తెలియజెప్పడం వేరే సంగతి! ఈ చిన్ని వ్యాసంలో కేవలం
పరిచయ వాక్యాలు మాత్రమే వున్నాయి, నా అల్ప బుద్ధికి అందినంత మేరకు!
అర్జునుడు జీవుడు.శ్రీ కృష్ణుడు దేవుడు.అంటే వారిద్దరూ జీవాత్మ పరమాత్మలు.
జీవుడికి ప్రతి క్షణం యుద్ధమే ప్రపంచంలో.ఎంతో కష్టపడి ఒక లక్ష్యానికి
చేరువైనప్పుడు బలహీనతలు క్రమ్మి వేస్తాయి,అంతకు ముందుకన్నా ఎక్కువగా!
ఆ బలహీనతలు అంతవరకూ నిర్మించుకొని అధిగమిస్తూ వస్తున్న సోపానాల
మీదినుండి నిర్దాక్షిణ్యం గా క్రిందికి త్రోసి వేస్తాయి.అటువంటి క్లిష్ట పరిస్థితిలో
పడ్డ అర్జునుడికి శ్రీ కృష్ణుడు గురువై బోధ చేసి ఆ స్థితిని అధిగమించే జ్ఞానాన్ని
ప్రసాదించాడు.
'' ఆత్మానగుం రథినం విద్ధి శరీరం రథమేవతు
బుద్ధింతు సారదిం విద్ధి మనః ప్రగ్రహమేవచ
ఇన్ద్రియాణి హయాన్యాహుహ్: తేషాం విషయ గోచరాన్
అత్మెంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః ''.. అని చెప్పిందొక ఉపనిషత్.
ఆత్మ, అంటే జీవాత్మ అంటే జీవుడు రథికుడు.శరీరమే రథము.పరమాత్మకు
ప్రతినిధి ఐన బుద్ధి సారధి.మనసు కళ్ళాలు.ఇంద్రియాలు గుర్రాలు.గుర్రాలు దారివెంట
వెళ్తూ వుంటే అవీ ఇవీ చూసి మొరాయిస్తాయి, కదలవు, మొండికేస్తాయి అని వాటి
కళ్ళకు గంతలు కట్టి, వాటిని కళ్లాలతో అదుపు చేస్తూ బండిని సారథి నడిపించి బండిలో
ఎక్కిన ప్రయాణికుడిని గమ్యం చేరుస్తాడు. శరీరం అనే రథాన్ని ఎక్కిన జీవుడు అనే
ప్రయాణీకుడు బుద్ధి అనే సారధి (పరమాత్మ)కు బాధ్యతను అప్ప జెపితే, అంటే బుద్ధిని
ఆశ్రయించి మనసు అనే కళ్లాల ద్వారా ఇంద్రియాలు అనే గుర్రాలను అదుపుజేసి,
వాటిని సక్రమం గా బతుకు బాటల వెంట నడిపిస్తే గమ్యాన్ని చేరుకొంటాడు.
ఆత్మ,అంటే జీవాత్మ,మనసు,ఇంద్రియాలను కలిపి భోక్త అంటారు పెద్దలు, ఇక్కడ,
చాలా జాగ్రత్తగా గమనించాలి తత్త్వాన్ని.నీవు కర్తవూ కావు, భోక్తవూ కావు, నీవొక
మాధ్యమానివి మాత్రమే అనుకుని 'బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతియః
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భాసః ..చేసే పనితో సంపర్కాన్ని వదలుకొని,
అంటే ప్రతి ఫల ఆపేక్ష లేకుండా కర్తవ్యం నిర్వర్తించి ఫలితాన్ని బ్రహ్మమునకు
వదిలి వేసి నిస్సంగుడవై..అహంకార మమకారములు లేకుండా యుద్ధం అనే నీ
క్షత్రియ వీరోచిత కర్తవ్యాన్ని నిర్వర్తించి..తామరాకు మీది నీటిబొట్టువలె దోషమును
అంటకుండా కర్తవ్య పాలన చెయ్యమని చెప్పిన సంగతి గుర్తుంచుకోవాలి.
మనసును కాకుండా బుద్ధిని ఆశ్రయించి,కొనసాగితే,జీవుడు,బుద
వేటి పని అవి చేసుకుంటూ పోతే, కర్తృత్వము,భోక్త్రుత్వము లేకుండా వుంటే దోషము
అంటదు.ధర్మ రక్షణం,దుష్ట శిక్షణం క్షత్రియుడికి కర్తవ్యాలు.తన హక్కుగా తన
ఇచ్చ మేరకు చేస్తున్నా అనుకుంటే తను కర్త ఔతాడు.అర్జునునకు ఒక క్షత్రియ వీరుడిగా,
ధర్మ రక్షణ దుష్ట శిక్షణ కోసం ఆ యుద్ధం కర్తవ్యం మాత్రమే అనుకుంటే ఏ దోషం లేదు,
పైగా ఆది బాధ్యత కూడా! ధర్మ ప్రతినిధిగా తను యుద్ధం చెయ్యాలి.ప్రభుత్వం వారు
వురి శిక్ష విధించిన ఖైదీ కి వురి శిక్షను అమలు జేసె తలారి ఒకడుంటాడు. ఆ తలారికి
హత్యా దోషం ఉన్నదా?లేదు కదా! యుద్ధ రంగంలో శత్రు సైనికుడిని సంహరించే సిపాయికి
దోషం ఉంటుందా? తన స్వార్ధం కోసం చేస్తే దోషం! అందులో ఏదైనా స్వార్ధ కారణంగా
ఆనందం కలిగితే భోక్త్రుత్వం ఉంటుంది.వురి తీసిన తలారికీ, సైనికుడికీ వ్యక్తి గతమైన
ఆనందం వుండదు..కనుక వారు దోష రహితులు ఎలాగో, ఇక్కడ అర్జునుడు కూడా
దోష రహితుడే! కర్తృత్వ భోక్త్రుత్వాలంటే ఫలితం పై అనురక్తి, ఆసక్తి !అవి లేకుండానే
నిజాయితీగా కర్తవ్య పాలనం జేయడమే మానవుడికి విధి!
విద్యార్ధికి చదవడం,సాధ్యమైనంతగా పరిశ్రమ జేసి నిజాయితీగా పరిక్షలు వ్రాయడం
కర్తవ్యం.శాంతి భద్రతలను కాపాడే వృత్తి లో వున్న వారికి సమాజ శత్రువులతో
తలపడడం అవసరం అయితే వారిని వధించడం కర్తవ్యం. ఫలితం పై ఉద్విగ్నత వుంటే,
విద్యార్థి అయినా, రక్షక భటుడు ఐనా తడబడటానికో,తప్పులు జేయడానికో ఆస్కారం
వుంటుంది,తద్వారా శ్రమ చివరికి వృధా అవుతుంది, తప్పులు ఏదో ఒకనాడు బయట
పడక మానవు కనుక, తప్పుడు మార్గాలలో విజయాలు శాశ్వతాలు కావు కనుక!
మానవ జీవితంలో ఏదో ఒకచోట, ఆ మాటకొస్తే ప్రతిచోట..ఘర్షణ సంఘర్షణ తప్పవు.
బహిర్గతంగా, అంటే ఇతరులతో అయితే ఘర్షణ, తనలో తను..తనతో తను అయితే
సంఘర్షణ.ఈ రెండు సందర్భాలలో మానవుడు అశక్తుడు ఔతాడు. బంధాలు,
బంధుత్వాలు,అహంకార,మమకారాలు ప్రభావం చూపడం చేత..నేను..నాది..
నాది మాత్రమే..నాకు మాత్రమే అనే బంధాల ఉచ్చులో చిక్కుకుని తనను
తను మర్చిపోతాడు.ఇతరులను వంచిస్తాడు, దోచుకుంటాడు..ఇలా ఒక ప్రమాదమైతే,
తనది అనుకున్నది కోల్పోతే నిర్వీర్యుడు ఔతాడు. ఇది ఇంకొక ప్రమాదం.అన్నీ తనవే
అందరూ తనవాళ్ళే అనే 'ప్రేమ' తో పాటు ఏవీ చివరికి తనవి కావు, చివరికి ఎవరూ
తన వాళ్ళు కారు,తను చివరికి ఎవరి వాడూ కాదు అనే వైరాగ్యం కూడా అవసరం.అప్పుడు
కేవలం బాధ్యత, కర్తవ్యం వుంటాయి. విజయాలకు విర్రవీగడం వుండదు, అపజయాలకు
కుంగడం వుండదు, ఎందుకంటే ఈ రెండూ తాత్కాలికాలే అనే జ్ఞానం వుంటుంది కనుక!
తాత్కాలికంగా ఈ జ్ఞానాన్ని కోల్పోయిన జీవుడిని దేవుడు కర్తవ్యోన్ముఖుని జేయడం కోసం
పారించిన అమృత ప్రవాహమే భగవద్గీత! సమస్త ధర్మాలకు, సమస్త శాస్త్రాలకు,సమస్త
జ్ఞానానికి, సమస్త శక్తికి ఏకైక స్థానం భగవద్గీత! హేతువాదులకు, నాస్తికులకు,ఆస్తికులకు,
శాస్త్రవేత్తలకు,తత్త్వవేత్తలకు
వృద్ధులకు,క్రీడాకారులకు,కళాకార
సమస్త సమస్యలకు పరిష్కారం భగవద్గీత చూపగలదు!
No comments:
Post a Comment