అన్నమాచార్య తత్త్వం
సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తన ద్వయం
ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం
సంగీతం సాహిత్యం ఈ రెండూ జగజ్జనని సరస్వతీ దేవికి , అమ్మకు రెండు
స్తనాలు. ఒకదాని నుండి సంగీతం అనే క్షీరం, ఇంకొక దానినుండి సాహిత్యం
అనే క్షీరం ధారలుగా కురిపించి ఆ అమ్మ మనలను కరుణిస్తుంది..ఇది
భారతీయుల అందమైన భావన. సంగీతం ఆపాతమధురం, చెవులలో
పడీ పడగానే ఆనందాన్ని కలిగిస్తుంది. అర్థం కావలసిన పని లేదు.ఈ
ఆనందాన్ని సకల జీవరాశులు అనుభవించ గలుగుతాయి.
''శిశుర్వేత్తి పశుర్వేత్తి ..వేత్తి గానరసం ఫణి:'' అన్నారు అందుకే, సంగీత
''శిశుర్వేత్తి పశుర్వేత్తి ..వేత్తి గానరసం ఫణి:'' అన్నారు అందుకే, సంగీత
మాధుర్యాన్ని శిశువులు,పశువులు,పాములు కూడా అస్వాదిస్తాయి.
అమ్మ పాటలోని మాదుర్యానికే నెలల పిల్లలు కూడా ఆనందంగా
నిదురిస్తారు ఏ భాషా తెలియని వయసులోనే! నందగోకులంలో,బృందావనంలో
పశువులు,వృక్షాలు..ప్రకృతి మొత్తం కూడా శ్రీ కృష్ణ గానామృతం లో మైమరిచి
పోయింది అందుకే. మొక్కలకు మంద్ర స్థాయిలో ప్రశాంతమైన సంగీతాన్ని
వినిపిస్తే చక్కగా ఎదుగుతాయి అని శాస్త్రజ్ఞులు నిరూపించారు!
సాహిత్యం ఆలోచింప జేస్తుంది, తద్వారా ఆనందాన్నిస్తుంది. మహానుభావుడైన
అన్నమాచార్యుడు తన కీర్తనలలో సంగీత సాహిత్యాలను రెండింటినీ అద్భుతంగా
మేళవించి ఆనందాన్నీ ఆలోచననూ తద్వారా బ్రహ్మానంద రసానుభూతిని
పంచాడు! సాహిత్య పరంగా అన్నమయ్యను ఇంకా తెలిసికొన వలసినది ఎంతో
వుంది! అన్నమయ్య కీర్తనలన్నీ వేదాంత, జ్యోతిష,సమస్త శాస్త్రాల రహస్యాల నిధులు!
ఈ చిన్ని వ్యాసం లో అన్నింటినీ పరిశీలించడం సాధ్యం కాదు కనుక మచ్చుకు
ఒక ప్రసిద్ధ అన్నమయ్య కీర్తనను పరిశీలించడం ఈ వ్యాస లక్ష్యం.
ముద్దు గారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్ద రాని మహిమల దేవకీ సుతుడు...
అంతలింతల గొల్లెతల అర చేతి మానికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు...
కాళీయుని పడగల పైన కప్పిన పుష్య రాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్ర నీలము
పాల జలనిధిలోన బాయని దివ్య రత్నము
బాలునివలె తిరిగేటి పద్మనాభుడు...
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతి యై మమ్ము గాచు కమలాక్షుడు...
ఈ కీర్తనలో అన్నమయ్య జ్యోతిష శాస్త్ర, వేదాంత రహస్యాల నిధులు రాశులు పోశాడు!
యశోద ముంగిట ముద్దులు గారుతున్నాడుట.కారడం రస లక్షణం. రసోవై సః అని
చెప్పబడిన రస రమ్య తత్త్వం కనుక, ఆయన ఆనంద రస నిలయుడు, మూర్తీభవించిన
ఆనంద రసం..కాదు..బ్రహ్మానందరసం కనుక ఆ ప్రయోగం.పనిలో పనిగా ఇక్కడ ఇంకొక
అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం!నందుడు వేద విజ్ఞానపు పరమానంద
అవతారము.యశోద వేద విజ్ఞానపు ముక్తి కాంత. దేవకి దేవి వేదములచే కీర్తింపబడు
బ్రహ్మ గారి పుత్రిక.వేదములు సాక్షాత్తూ వాసుదేవుడు.శ్రీకృష్ణుడు వేదములచే
స్తుతింపబడు పరబ్రహ్మ స్వరూపము. వేద రుక్కులు గోపికలు,గోవులు .ఆ గోవులను
కట్టుకొయ్య బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణుని వేణువు రుద్రుడు. ఇదంతా అధర్వణ వేదాంతర్గత
మైన కృష్ణోపనిషత్ లోని రహస్యం! శ్రీ రామ అవతారం లో రావణ వధానంతరం
కపులకు,ఋషులకు,మునులకు తన స్పర్శ ను కోరినవారికి,రాబోయే అవతారం
లో మీ కోరిక తీరగలదని వర మిచ్చిన పరమాత్మ ఇలా అందరినీ శ్రీ కృష్ణావతారం
లో కనికరించాడని ఆ ఉపనిషత్తు చెపుతున్నది.కనుక బ్రహ్మానందమంతా
శ్రీ కృష్ణావతారంలో నందవ్రజంలో,బృందావనంలో,మధురలో,ద్వారకలో ప్రవహించింది.
యశోద ముంగిట పారాడుతున్న ముత్యం అనడం లో ముత్యం చంద్రునికి చెందిన
రత్నం. తల్లి ప్రేమకు, భావఉద్విగ్నతకు, ముత్యం సంకేతం. కారణం ఔతుంది కనుక
ముత్యం తో పోలిక!యశోదై ఇళం సింగం..అన్న గోదా దేవి పలుకులను ఇక్కడ
ధ్వనించాడు తను కూడా!తల్లి ప్రేమను సూచించాడు కనుకనే పెంపుడు తల్లి యశోదతో
ఆగి పోకుండా, కన్నతల్లి దేవకీ దేవిని కూడా ప్రస్తావించాడు!
సూర్యుని రత్నం ఐన మాణిక్యం పవిత్రమైన శృంగార భావానికి,ఆకర్షణకు, నాయకత్వానికి
చిహ్నం, కారణం! ప్రధాన గోపికలు ఎనిమిది మంది అష్ట ప్రక్రుతులు, మధ్యలో శ్రీ కృష్ణుడు
తొమ్మిదవ వాడు..ఈ నవగ్రహాలకు నాయకుడు శ్రీ కృష్ణ సూర్యుడు! సూర్య మండ
లాంతర్వర్తి ఐన సూర్య నారాయణుడే కేయురవాన్ మకర కుండలవాన్ కిరీటీ..అని
ఆరాధింప బడే శ్రీమన్నారాయణుడు! సత్త్వంలోని తమో ప్రకృతి సూర్య స్వరూపం.
శుద్ధ సత్త్వ స్ఫూర్తి ఐన శ్రీ రాముడు ఈ తమోగుణ ఉద్దీపనం కోరకే ఆదిత్య హృదయం
పఠించి ఆ శక్తి తో రావణుడిని సంహరించాడు. గోపికల ప్రేమకు,వారి అష్ట ప్రకృతుల
స్వరూపాలకు నాధుడు శ్రీ కృష్ణుడు కనుక గొల్లెతల అరచేతి మాణికము, అరచేతి ఉసిరి
పండు లాగా వారికి ఎప్పుడూ చేరువలో తాను తన చేరువలో వారూ ఉండేట్లు
నియమించుకొనే వాడు, మిగిలిన గ్రహాలను సూర్యుని వలె..కనుక ఈ పద ప్రయోగం!
వజ్రము ఇంద్రుని ఆయుధం. వజ్రం శుక్రగ్రహ రత్నం. శుక్రుడు రాక్షసుల గురువు,
దేవతలకు గుండె బరువు.ముల్లును ముల్లుతోనే తీయాలి.వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.
రాక్షసుల నాయకుడైన కాలనేమి కంసుడిగా జన్మించాడు, వాడికీ శ్రీ కృష్ణుడికి వున్నది
జన్మ జన్మల వైరానుబంధం, కనుక వజ్రంలాగా కఠినం గా మేన మామను కూడా
సంహరించాడు కనుక వజ్రంతో పోలిక!
పచ్చ బుధుడి రత్నం.బుధుడు వాయు తత్త్వం.బుధుడు విద్వాంసులకు పండితులకు
చిహ్నం..పండితులు విద్వాంసులు కూడా ఉత్తిగానే 'వుబ్బుతారు' పొగడ్తలకు! వాయువు
సమస్త సృష్టిలో నిండి వున్న తత్త్వం. పంచ ప్రాణ వాయువులుగా,పంచ ఉప
వాయువులుగా జీవులను బ్రతికించే తత్త్వం. సమస్త ప్రాణి కోట్ల శరీరాలలో వున్న
తత్త్వమే విష్ణు తత్త్వం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి.''వాసనాత్ వాసుదేవస్య
వాసితం భువన త్రయం..సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే''..అన్ని
భూతములలో తను, తనలో అన్ని భూతములు వసించి వున్న కారణంగా ఆయన
వాసుదేవుడు.మూడు అంటే అనంత సంఖ్యకు సూచకం. ఇది న్యాయ శాస్త్ర
రహస్యం..మూడు సార్లు చేస్తే కొన్ని కోట్ల సార్లు చేసినట్లు..కనుకనే మూడు సార్లు
నమస్కారం చెయ్యడం, మూడు సార్లు ఆచమించడం..మూడు సార్లు
ప్రదక్షిణలు చెయ్యడం..ముమ్మార్లు పలకడం..మూడుసార్లు ప్రమాణాలు చెయ్యడం..
కొందరు ముమ్మార్లు పలికి విడాకులు తీసుకోవడం! కనుక మూడు లోకాలలో..అంటే
సమస్త లోకాలలో వున్న సమస్త ప్రాణి కోట్లలో వున్న వాసుదేవ తత్త్త్వమే విష్ణు తత్త్వం..
మరొక రహస్యం..బుధ గ్రహ అధిదేవత విష్ణువు..విష్ణువు వాహనం గరుడుడు..పచ్చ
రత్నాలలో రక రకాలు..వాటిలో గరుడ పచ్చలు శ్రేష్ట మైనవి. కనుక ఇక్కడ ''కాంతుల
మూడు లోకాల గరుడ పచ్చ పూస '' అన్నాడు అన్నమయ్య! ప్రతి జీవి హృదయ
కుహరం లో వున్న పరమాత్ముడు కనుక చెంతల మాలోనున్న 'చిన్ని' కృష్ణుడు,
అంగుష్ఠమాత్ర దేహుడు! కనక పుష్యరాగము గురు గ్రహానికి చెందిన రత్నం.గురువు
అనుగ్రహం,గురుగ్రహ అనుగ్రహం వుంటే అజ్ఞానం తొలిగి పోతుంది.అహంకారం తొలిగి
పోతే అజ్ఞానం తొలగి పోతుంది, అప్పుడు జ్ఞానోదయం ఔతుంది. చక్కని మార్గం
దొరుకుతుంది. కాళీయుని పడగల పైన తాండవం చేసి అతని అహంకారాన్ని అణిచి,
తను పరమాత్ముడననే జ్ఞానమును కలిగించి,కాళీయునికి సురక్షితమైన మార్గాన్ని
స్థలాన్ని, రమణక ద్వీపానికి దారి చూపించి గురువైన జగద్గురువు కనుక కాళీయుని
పడగల పైన 'పుష్యరాగము' అన్నాడు!
నీలము శనికి సంబంధించిన రత్నం. శని దుష్ప్రభావానికి ఏకైక విరుగుడు వేంకటేశ్వర
అర్చన, ధ్యానం,స్మరణం. నీలాలలో కూడా అనేక రకాలున్నాయి.ఇంద్రనీలం వాటిలో
శ్రేష్ట మైనది. ఆది వెంకటాద్రిలో వున్న ఇంద్రనీలం, వేంకటేశ్వరుడు! ఆయననే ''ఇంద్ర
నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనా''..అని త్యాగయ్య పొగిడాడు! ఏలిన
నాటి శని తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు
సంచరిస్తాడు. జన్మ రాశిలో,దానికి వెనుక, ముందు వున్న రెండు రాశులలో..మొత్తం
మూడు రాశులలో శని సంచరించే ఏడున్నర సంవత్సరాలు ఏలిననాటి శనిదశ.
'ఏలేటి శ్రీ వేంకటాద్రి..' అనడంలో శబ్ద పరంగా ఏలిన నాటి శని ని సూచించాడు. క్షీర
సాగరం లో శయనించి వున్న మహానుభావుడే బాలునిగా మర్రి ఆకు మీద శయనించి
వున్న ప్రౌఢ బాలకుడు, బమ్మెర పోతన గారి భాషలో! ఆయనయే తన బొడ్డులో నుండి
ఉద్భవించిన తామరతూడు ద్వారా బ్రహ్మగారిని ఆవిర్భవింప జేసిన నలువను గన్నయ్య!
పగడము కుజుని రత్నం.కుజుడు శృంగారానికి, క్రీడలకు,శస్త్ర చికిత్సలకు ఇంకా
కొన్నింటికీ కారకుడు. పగడాలు స్త్రీల పెదవులు ఈ రెండూ ఒకే వర్ణంలో వుంటాయి,
ముఖ్యంగా కవుల,రసికుల దృష్టిలో.మరీ ముఖ్యంగా కింది పెదవి. రతికేళి లో స్వామీ
రుక్మిణి దేవికి మోవి పగడము అయినాడు.రంగు అంటే వ్యామోహము అని కూడా
కవిలోక ప్రయోగం. రతి వేళలో రుక్మిణి దేవికి ఈయన పగడపు మోవి మీద
వ్యామోహము అనే ధ్వని, రస ధ్వని, సరస ధ్వని ఇక్కడ!
గోమేధికము రాహువు రత్నం.గోమేధ్యము, గోమేధికము, గోమూత్రం ఇవన్నీ ఒకే
రంగులో వుంటాయి.గోవులు అంటే జ్ఞానులు, సూర్యుని కిరణాలూ, ఆవులు, వేద
వాక్కులు అనే అర్ధాలున్నాయి.గోవర్ధనము జ్ఞానుల శిఖరం, భక్తుల పర్వతం. వారిని
వుద్ధరించడమే గోవర్ధన వుద్ధరణం. ఉద్ధరించడం అంటే పైకి లేపడం, ఉన్నతులను
జేయడం. చిటికెన వేలు జ్ఞానానికి సూచన. అందుకే ధియో యోనః జ్ఞానాత్మనే
కనిష్ఠికాభ్యాం నమః అని కరన్యాస మంత్రం! పెళ్ళిలో నూతన వధూవరులు చిటికెన
వేలు పట్టుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయడంలో అంతర్యం ఇద్దరూ పరస్పర సహకారం
తో సమస్త జ్ఞాన అన్వేషణలో తరిస్తారు అని..కామశాస్త్రంతో సహా! శ్రీ కృష్ణుడు జ్ఞాన
సూచకమైన చిటికెన వేలితో గోవర్ధన గిరిని పైకెత్తాడు. అంటే జ్ఞాన ప్రకాశం చేత
జ్ఞానులను, భక్తులను ఉద్ధరించాడు. రాహుగ్రహ అధిదేవత దుర్గాదేవి, అంటే, శ్రీకృష్ణుని
యోగమాయయే! ఆ మాయావరణం నుండి బయలు పడిన జీవుడు దేవుడే
( శ్రీ కృష్ణుడు! )
వైడూర్యం కేతుగ్రహ రత్నం.కేతువు మోక్ష కారకుడు జ్యోతిష శాస్త్ర పరంగా! కేతు
మహర్దశలో జ్ఞాన,మోక్షములకు సంబంధించిన సాహిత్యము కరతలామలకము
ఔతుంది. ఒక్కసారి కండ్లు మూసుకొని వేంకటేశ్వర రూపాన్ని ఊహించుకుంటే
ఆయన నామాలు, చిబుకం(గడ్డం), అటూ ఇటూ శంఖ చక్రాలూ మధ్యలో నల్లని
కొండ..ఇవే కనిపించేవి మనకు!నలుపు,నీలము మాయా సంకేతాలు.ఇటు శంఖ
నాదపు ఓంకారం, అటు 'సుదర్శన' చక్రపు జ్ఞాన కాంతుల మధ్య, వాటి సహాయంతో,
ఆ మాయను దాట గలిగితే వేంకటేశ్వర తత్త్వం అర్ధమౌ తుంది..అదృష్టవంతులైన
భక్తులకు, సాధకులకు.సమస్త జ్ఞానాన్వేషణ కు చరమ లక్ష్యమైన ఆ జగదీశ్వరుడు
ఆ జ్ఞాన కారకుడైన, మోక్ష కారకుడైన కేతుగ్రహ రత్నమైన వైడూర్యంతో పోల్చబడ్డాడు.
అటూ ఇటూ శంక చక్రాలు వున్నాయి కనుక శంక చక్రాల 'సందులో' ఇరుక్కు
పోయాడని చమత్కారం! ఆయనే మన పతి, మన గతి, ఆయనకే శరణాగతి.
ఆయనయే మనలను రక్షించే వాడు. కమలాక్షుడు అనే చిన్న పదంలో కూడా ఒక
రహస్యం వున్నది. కమలముల వంటి నాజూకైన,అందమైన, విశాలములైన కన్నులు
అనడం మామూలే. సృష్టి పరమాత్ముని చూపునుండి ఉద్భవించిందని వేద రహస్యం.
అందుకే పోతన '' కేళిలోల విలసత్ దృక్జాల సంభూత నానా కంజాత భవాండ
కుంభకున్..'' గురించి చింతించెదన్ అన్నాడు తన ప్రప్రథమ పద్యంలో , ఆంధ్ర
మహాభాగవతం లో! అంటే లీలా మాత్రంగా చూడడం చేత సమస్త భువన భాండాలను
సృష్టించిన వాడు అని అర్థం! దానినే ఇక్కడ ధ్వనింప జేశాడు అన్నమయ్య!
ఈ కీర్తనను భక్తితో పాడినా, విన్నా, మననం చేసుకున్నానవగ్రహాల అనుగ్రహం,
నరకాంతకుని పరమానుగ్రహమూ లభిస్తాయి అనడంలో ఏ సందేహమూ అక్కర్లేదు!
Vara Prasad!