నీ తలపే!!
ఇతరులు నిన్ననుమానిస్తుంటే,
నీపై విశ్వాసము నీకుంటే,
ఐనా నీకితరుల విలువుంటే,
వేచుటలే వేసట కాకుంటే,
ఆరోపణ ప్రత్యారోపణ తో
ద్వేషులపై ద్వేషం గొనకుంటే,
అతి సాధువు జ్ఞానివి కాకుంటే,
కల గని కలలకు బానిస గాక,
యోచించీ యోచన శృతి మించక,
విజయాన్నీ విలయాన్నీ ఒకటిగ
బూటకమని బుద్ధిగ పరికిస్తూ,
నువు పలికే సత్యము వక్రిస్తూ
వంచించే వంచకుల సహిస్తూ,
నీ జీవన శిధిలముల పైన నువు
నీ ఆశల సౌధం నిర్మిస్తే,
నీ విజయాలను నీవు హసిస్తూ,
ఖేలగ లీలగ పణంగ పెట్టి,
వోడిననూ పని ప్రారంభిస్తే,
వోటమి యని పలుకుట వదిలేస్తే,
గుండె, కండలు, నరాలు, స్వరాలు,
రుధిర వాహినులు, స్వర పేటికలు,
నీ ఆధీనంలో మస్తిష్కం, దేహం సర్వం ఐనా శుష్కం
వజ్ర కల్పమైతే సంకల్పం మానవ శక్తికి లేదు వికల్పం!
సమూహములలో సద్భాషణతో, సత్ప్రవర్తన, సద్భావనతో
సామ్రాట్టులతో, సామాన్యులతో సమముగ నువు సంచారము చేస్తే
శత్రులు, మిత్రులు సమానులైతే, జ్వలించకుంటే, చలించకుంటే
అందరికీ విలువను నీవిస్తూ, అతి సర్వత్రా నువు వర్జిస్తూ
క్షమించుట విశ్రమించు టెరుగని క్షణ లక్షణమౌకఠిన కాలమును
లిప్తలనూ లుప్తం కాకుండా, సార్ధకంగ , వ్యర్ధం కాకుండ,
తృప్తిగ, పూర్తిగ,స్ఫూర్తిగ చూస్తే, మాటలు చేతలుగా మారిస్తే,
ధరణి నీకు దాస్యం చేస్తుందోయ్!'మది'మనిషిని మాధవు చేస్తుందోయ్!
(ఇది 'రడ్యార్డ్ కిప్లింగ్' మహానుభావుడు రచించిన ఒక కవితకు స్వేచ్ఛానువాదం)
Vara Prasad!
No comments:
Post a Comment