పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Thursday, May 29, 2014

వేదాంత కేసరి

                      శ్రీ గణేశాయ నమః దినేశాయ నమః వహ్నయే నమః ఓం నమః శివాయః 
                                         శ్రీ మాత్రే నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః 


వేదాంత కేసరి - నాటకం 

(1)

(విశ్వనాథ దత్తుని ఇల్లు. విశ్వనాథ దత్తుడు ఒక జ్యోతిష పండితునితో కూర్చుని వున్నాడు. ఇద్దరూ దేనికోసమో ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు మధ్య మధ్యలో లోపలి ద్వారం వైపు చూస్తూ, నిరీక్షిస్తూ వున్నారు. విశ్వనాథుడు మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ పచార్లు చేస్తూ ద్వారం వద్దకు వెళ్లి లోపలి తొంగిచూస్తూ మరలా వెనుకకు వచ్చి అసహనంగా కూర్చుంటున్నాడు. లోపలినుండి శిశువు రోదనం. జ్యోతిష పండితుడు వెంటనే తన పని ప్రారంభించి లెక్కలు గట్టుచుండును. లోననుండి ఒక పరిచారిక వచ్చి..)

పరిచారిక:- (హడావుడిగా సంతోషంగా) ..మగ శిశువు..

విశ్వనాథుడు:- (ఆత్రుతగా) మగ శిశువా? తల్లీ పిల్లవాడు ఇద్దరూ కుశలమే కదా? ( పరిచారిక అవునన్నట్లు తల పంకించి లోపలి వెళ్లిపోవుచుండగా విశ్వనాథుడు తన జేబులోనుండి కొంత పైకమును తీసి కానుకగా ఇచ్చి పంపును.)

జ్యోతిష్యుడు:- విశ్వనాథ దత్తు గారూ అభినందనలు.. చూశారా నా మాట నిజమైంది!..మగశిశువే అని నేను ముందే తెలిపాను కదా..యిక జనన కాల కుండలి..

విశ్వనాథ:- ధన్యవాదాలు..పరమేశ్వరుని ఇచ్చ!..ఆ..జన్మ కుండలి వేశారా..వివరాలు చెప్పండి!

జ్యోతిష్య:-పన్నెండు సంవత్సరముల వయసు వరకూ పూర్తి కుండలి వేయడం, పరిశీలించడం శాస్త్ర సమ్మతం కాదు కనుక జనన కాల దోష పరిశీలన కోసం, ఏవైనా బాలారిష్ట సూచనలున్నాయేమో అని మాత్రమే చూడాలి..

విశ్వనాథ:- సంతోషం! అలాగే చూడండి!

జ్యోతిష్య:-శ్రీ గణేశాయ నమః ఓం నమః శివాయః శ్రీ మహాకాళీ అనుగ్రహ ప్రాప్తిరస్తు! శ్రీరస్తు!
             స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ దుందుభి నామ సంవత్సర పుష్యమాసం బహుళ సప్తమి సోమవారం అనగా  ఆంగ్లసంవత్సరమానంలో 1863వ సంవత్సరం, జనవరి 12వ తేదీ ఉదయం హస్తా నక్షత్ర యుక్త ధనుర్లగ్నము..ఆహా..శుభం..సూర్యోదయాత్పూర్వము ఆరు నిముషములకు..కలకత్తాలో శిశు జననం..విశ్వవిజయోస్తు...యశస్వీ భవ..వీర్యవాన్ భవ..బాలుడు మహా జాతకుడు! అవతార పురుషుల అంశగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను!

విశ్వనాథ:- (చిరునవ్వుతో) అలాగే నమ్ముదాము..వివరాలు చెప్పండి..

జ్యోతిష:- నేను ముఖప్రీతికోసం ప్రయత్నము చేసే వాడిని కాను అని మీకు తెలుసు. ధనుర్లగ్నములో జన్మించాడు. లగ్నాధిపతి గురుడు. ఆ జ్ఞాన ప్రదాత ఐన గురుడు తులారాశిలో, తులాంశలో వున్నాడు, మహా జ్ఞాని, లక్ష్య సాధకుడు, జగద్విజేత అవుతాడు. మోక్ష సాధకుడు అవుతాడు.

విశ్వనాథ:- మోక్ష సాధకుడా?..అంటే..

జ్యోతిష:- మోక్షవిద్యలో, ఆధ్యాత్మిక విద్యలో, ఆధ్యాత్మిక జ్ఞానములో అపర బృహస్పతి అవుతాడు. అంతే కాదు, లగ్నాధిపతి గురుడు ఏకాదశంలోనూ, పంచమాధిపతి కుజుడు మేషంలో స్వస్థలంలోనూ బలవంతులుగా వున్నారు. ఐహిక భోగాలను అసహ్యించుకునే అఖండ వైరాగ్యం కలిగివుంటాడు. 

విశ్వనాథ:- ఆ? విరాగి అవుతాడా? అంటే..మా నాన్న గారిలాగా సన్యసిస్తాడా? 

జ్యోతిష:- అవును. బాలుడు తన తాత దుర్గాచరణ దత్తుల వారిలా సన్యసిస్తాడు. అంతే కాదు. విద్యాకారకుడైన బుధుడు తనకు వాక్కు స్థానమైన మకరంలో సూర్యుడు, శుక్రులతో కలిసివున్నాడు. అద్వితీయమైన వాక్చాతుర్యము కలిగివుంటాడు. విశ్వమును తన వాగ్ధారలతో ముంచెత్తుతాడు. ఒక్క మాట చెప్పమంటారా?

విశ్వనాథ:- (కొంత బాధగా, గంభీరముగా) సన్యాసి అవుతాడు అనే ఆ ఒక్క మాటకన్నా ఇంక బాధపెట్టే మాట ఏమున్నది? చెప్పండి! మా నాన్న గారు దుర్గాచరణ దత్తులు పాతికేళ్ళకే సన్యసించి మమ్మల్ని వదిలివెళ్లారు. ఆ తరువాత ఒకే ఒక్కసారి కంటపడ్డారు. నా బాల్యంలో మాతల్లిగారు నన్ను తీసుకుని కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ స్నానఘట్టం వద్ద కాలుజారి క్రిందపడి స్పృహ తప్పినప్పుడు ఒక సన్యాసి వచ్చి లేవదీసి స్పృహలోకి తెచ్చాడు. ఆయనే మా తండ్రిగారు అని ఆమె గుర్తించింది. ఆయన కూడా ఈవిడను గుర్తించి..నన్ను ఒకసారి నిలువెల్లా చూపులతో తడిమి..'' ఆహా..మహా మాయ! మహా మాయ..'' అంటూ మేమిద్దరమూ తేరుకుని తనను ఆపివేసే లోపు పరుగున వెళ్ళిపోయారు. అంతే! తర్వాత ఆయనను మేము చూడలేదు! సంతానం కోసం నేనూ నా భార్య 
పరితపించి, కాశీ విశ్వనాథునికి మొక్కుబడి చెల్లించిన తర్వాత నా భార్య కడుపుపండి జన్మించిన ప్రథమ సంతానం కుమారుడని కలిగిన నా సంతోషం ఇంతలోనే ఆవిరైంది!

జ్యోతిష:-   మీ సంతోషము ఆవిరి కావడం కాదు! భారత మాత సంతోషంతో గర్వించదగిన బాలుని కన్నందుకు మీ దంపతులు, మీ వంశము భారత దేశము నిలిచి ఉన్నంత కాలమూ నిలిచి వుంటారు. సమస్త ప్రపంచానికీ సంతోష కారకుడు అవుతాడు మీ ప్రథమ కుమారుడు. నా సాధన, నా విద్వత్తుల బలంతో చెప్తున్నా..మీ కుమారుడు సాక్షాత్తూ కైలాసవాసి శంకరుని అవతారమే! ఒక ముక్తపురుషుడు ఇలా మరలా అవతరించాడని జననకాల గ్రహ స్థితి చెప్తున్నది. జగద్గురువు ఆదిశంకరుని అంతటివాడు అవుతాడు. మరొక జగద్గురువు అవుతాడు. ఆది శంకరుడే ఇతను!
 ఇతనికన్నా మహావక్త యీతని తరువాత మరొకరు వుండరు! యింతకన్నా ఇప్పుడేమీ చెప్పను..మరొక్క మాట.. మహా సిద్ధపురుషుని ఆశీస్సులతో జగత్ర్పసిద్ధుడు అవుతాడు..యీతని దృష్టి, మనసు పడిన అంశములలో ఎవరూ ఇతనికి ఎదురునిలువలేరు!     

విశ్వనాథ:-సరే! విధి నిర్ణయం ఎలా వుంటే అలాగే కదా ఏదైనా జరిగేది! కానివ్వండి! ఆ!..ఒక్క నిముషం ఇలా కూర్చోండి! మీ సంభావన తీసుకుని వెడుదురుగాని..(లోపలికి వెళ్లబోతుండగా..)

జ్యోతిష:- ఇంతటి మహర్జాతకుని జన్మ కుండలి చూసే అదృష్టమే నాకు సంభావన. వేరే సంభావనలెందుకు. ఇంకా చాలా సందర్భాలు వున్నాయి కదా..అప్పుడు ఇద్డురుగాని!

విశ్వనాథ:-(ఆగి) అడిగి తీసుకొనడం జ్యోతిష్యుడు చేయకూడదు. అడగలేదని దక్షిణ ఇవ్వకుండా పంపడం జ్యోతిష శాస్త్ర సహాయం పొందిన వారు చేయకూడదు! మీకు తెలియనిదా? సంభావన అంటే శాస్త్రం మీద సద్భావన..అంతే..ఒక్క నిముషం కూర్చోండి 
               (లోపలి వెళ్ళిపోతాడు)

జ్యోతిష:- విశ్వేశ్వరా! అర్ధం కావు నీ లీలలు! బాలుడు అన్నింటా అపర ఆదిశంకరుడు.. ఆయుర్దాయములో కూడా! జగద్గురువు కుండలిని ప్రథమంగా చూసే అదృష్టం కలిగింది ఈ రోజు!

విశ్వనాథ:-(సంభావనతో తిరిగివచ్చి) స్వామీ! పేరు ఏమి పెట్టమంటారో  శెలవీయలేదు!

జ్యోతిష:-ఏమి అదృష్టము నాది! ప్రపంచమంతా యుగాల పర్యంతమూ మారుమ్రోగే పేరును నేను పెట్టడం అంటే 
            నేను పెట్టి పుట్టడం! చెప్తాను..చెప్తాను..( ఒక్క నిముషము అలోచించి) హస్తా నక్షత్రము..పు..ష..ణ..డ..సనాతన ధర్మ కంటకులైన తారకాసురుల పాలిటి షణ్ముఖుడు..కనుక నక్షత్రనామము షణ్ముఖుడు..పుష్యమాసములో జననము..హరనాథుడు పుష్యమాస అధిదేవత ..హైందవ ధర్మసతీ ద్వేషుల పాలిటి అపర వీరభద్రుడు, శివావతారుడు కనుక వీరేశ్వరుడు అని మాస నామము..సమస్త మానవతావాదుల హృదయ సింహాసనంపై వెలిగే ఆదర్శ మానవేంద్రుడు కనుక..నరేంద్రుడు అని వ్యవహార నామములను పెట్టవలసినదిగా..నా సూచన!
 
విశ్వనాథ:-మహానుభావుల సూచనలే మావంటివారికి ఆదేశాలు..ఆచరణ యోగ్యాలు.. అలాగే.. ధన్యవాదాలు..నమస్సులు!
               (జ్యోతిష్యునకు దక్షిణ ఇచ్చి ప్రణామం చేస్తాడు)

జ్యోతిష:-వంశాభివ్రుద్ధిరస్తు! నిజానికి ధన్యవాదాలు నేను తెలియజేయాలి. తండ్రి 'విశ్వనాధుడు'.. తల్లి 'భువనేశ్వరీ దేవి'..కుమారుడు విశ్వవిజేత..నిఖిల భువన ప్రసిద్ధుడు..ఎవరో ఆ మహనీయుడు, ఈతనిని శిష్యునిగా పొందే సిద్ధుడు!


(తెర)       

(2)

( విశ్వనాధ దత్తుని ఇల్లు. నరేంద్రుడు చిక్కకుండా పరుగులు పెడుతూ తల్లి భువనేశ్వరీ దేవిని ముప్పు తిప్పలు పెడుతున్నాడు)

భువనేశ్వరీ:- శివ శివా! ఒక కొడుకును ఇవ్వవయ్యా అంటే నీ భూత గణములలో వాడిని నా పాల పడేశావేమయ్యా?
                  (ఎట్టకేలకు కొడుకును పట్టుకుని..) ఎక్కడికి వెళ్తావు? ఈ రోజు నిన్ను వదిలేది లేదు! నీ కొత్త అంగరఖా జరీ అంచు రుమాలు ఏం చేశావు?

నరేంద్రుడు:- మరే..మరే..చెప్పనా..చెప్పనా..చెప్తే నువ్వు..

భువ:-ఆ..నేను..కొడతానని భయమా..అంత భయం వున్నవాడివి ఎందుకిలా అల్లరితో నన్ను వేదిస్తున్నావు?

నరేంద్రుడు:- భయమా? నాకా?..(నవ్వుతూ) నన్ను కొడతావని భయంతో కాదు..నువ్వు బాధ పడతావని జాలితో ..అయినా చెప్తాను..పాపం..ఒక సన్యాసి వొంటి మీద గుడ్డలు లేకుండా వస్తేనూ..నా అంగరఖా..జరీ రుమాలూ దానం చేశేశా!

భువ:- వాడికి నీ అంగరఖా సరిపోతుందా? నీ రుమాలు పనికొస్తుందా?

నరేంద్ర:- నిజమే! అంత పెద్దగున్నాడు! నా అంగరఖా, రుమాలు ఏం సరిపోతాయి..అందుకే మన ఇంటికొచ్చే పండితులకు కప్పడం కోసం నాన్నగారు తెచ్చిన వాటిలో ఒక మంచి శాలువా కప్పుకొమ్మని ఇచ్చాను..నా అంగరఖా రుమాలు కొత్తవేగా..నేను వాడలేదుగా..వాటిని సంతలో అమ్ముకుని ఆ డబ్బులతో ఏమన్నా కొనుక్కుని తినమని ఇచ్చేశా!

భువ:- అయ్యో నారాయణా! (నుదురు కొట్టుకుంటుంది) 

నరేంద్ర:- (కోపంగా) ఆ సన్యాసి 'అన్నమో నారాయణా ' అని మొత్తుకుంటున్నాడు. (జాలిగా) ఎవరూ పెట్టకుంటే ఎలా బతుకుతాడు పాపం! మూడురోజులనుండీ ఏమీ తినలేదుట! అవునూ..ఇందాక శివ శివా అన్నావు..ఇప్పుడు నారాయణా అంటున్నావు.. (గారంగా) అమ్మా! ఇద్దరూ ఒకటేనా? అమ్మా..చెప్పవూ?

భువ:- (మురిపెంగా దగ్గిరికి తీసుకుని) అల్లరొక్కటి లేకుంటే బంగారుకొండే! అవున్నాన్నా..శివుడు నారాయణుడు ..ఇద్దరూ ఒకటే!

నరేంద్ర:- ఒక్కటే అయితే ఇద్దరు ఎందుకుంటారు? ఒకటెక్కడన్నారెండు అవుతుందా? రెండు ఒకటి అవుతుందా?

భువ:- రెండులో ఒకట్లు రెండు లేవా? ఒకటి ఒకటి కలిస్తే రెండు కావా?

నరేంద్ర:-(కొద్దిగా అలోచించి, వేళ్ళతో చూపిస్తూ) ఒక్కటి అయితే..ఒక్కటే ఉంటుందా..వుంటుంది కదా..సరే..ఒకట్లు రెండు ఒకటైపోతే రెండు అవుతుందా..కాదా?? ఆ..?? అవుతుంది..సరే..అప్పుడు..వుంటే ఒక్కటి అన్నా వుంటుంది..రెండు అన్నా వుంటుంది..అవునా కాదా? అంటే రెండు అయినా రెండు ఒక్కటే వుంటుంది..ఒక్కటి అయితే ఒక్కటే వుంటుంది..నారాయణుడొకడు అనుకో..          శివుడు ఒకడు అనుకో..ఎవరో ఒకళ్ళు అయినా ఒక్కడే ఉంటాడు..ఇద్దరూ ఒకటే అయినా ఒక్కడే ఉంటాడు..అవునా కాదా?

భువ:- (అయోమయంగా ఆలోచిస్తూ) అవునట్టుంది..

నరేంద్ర:-అట్లుంది..ఇట్లుంది..అని దాటెయ్యకూడదు, తెలిసింది అందరికీ చెప్పాలి, తెలియంది తెలుసుకోవాలి అని చెప్పావా మొన్న?

భువ:- చెప్పాను. నేను చాలా చెప్పాను. పెంకిగా అల్లరిచెయ్యొద్దని చెప్పాను. తమ్ముడినీ, చెల్లెళ్ళనూ యేడిపించవద్దని చెప్పాను. ఆటల్లో పాటల్లో తగాదాలకూ గోదావలకూ కాలు దువ్వవద్దు అని కూడా చెప్పాను. అదెందుకు వినవు మరి?

నరేంద్ర:- చిన్నికృష్ణుడు అట్లా అల్లరి చేశాడు, ఇట్లా అల్లరి చేశాడు అని సంతోషంగా దండాలు పెడతారు..చిన్నపిల్లలు అల్లరి చేస్తే దండిస్తారు! యిదేం న్యాయం? సరే..నారాయణుడూ శివుడూ ఇద్దరూ ఒకటే ఐనప్పుడు ఏమని పిలవాలి? ఇదొక్కటి చెప్పు!

భువ:- నీతో వాదించి గెలవడం నాకూ..మీ నాన్న గారితో వాదించి గెలవడం కలకత్తా ప్లీడర్లకూ చేత కాదురా..(ముద్దు పెట్టుకుని) నారాయణుడూ శివుడూ ఇద్దరూ ఒక్కటి అయితే రాముడు అని పిలవాలి..రాముడినే కొలవాలి..నా బంగారుతండ్రి రాముడంతవాడు కావాలి!  
 
నరేంద్ర:- అమ్మా. రాముడంటే ఇష్టమే కానీ ఆంజనేయుడు అంటే మరీ మరీ ఇష్టం నాకు. నేను ఆంజనేయుడిని అవుతానమ్మా!

(అప్పుడే లోపలకు వస్తున్న విశ్వనాథుడు ఇది విని..)

విశ్వ:- ప్రత్యేకంగా అయ్యేదేముంది..నువ్వు ఆంజనేయుడివే..తోక ఒక్కటే తక్కువ! నరేన్! మొన్న బడిలో ఉపాధ్యాయులకు ఎదురు తిరిగావట..నిజమేనా?

నరేంద్ర:- నిజమే నాన్నగారూ..మేష్టారు గారు నేను నిజం చెప్పినా నన్ను చెవులుపిండి..విపరీతంగా కొడుతుంటే ఎదురుతిరిగాను..

భువ:- నిజం చెప్పావని కొట్టారా? అదేమిటి?

నరేంద్ర:- అవునమ్మా! ఆంజనేయుడి కథ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు..వాళ్ళ బిపిన్ లేడూ..వాడిని ఎందుకు నవ్వుతున్నావు పాఠము చెప్తున్నప్పుడు..అని మేష్టారు గారు కొడుతుంటే..వాడితప్పు లేదండీ..నేనే ముందు నవ్వాను..అందరినీ నవ్వించాను అని చెప్పాను..అంతే..నా వెంట బడ్డాడు..  

విశ్వనాథుడు:- తరగతి గదిలో పాఠము వినకుండా కథలు చెప్పుకుంటుంటే చదువు వస్తుందా?

నరేంద్ర:- పాఠము వింటూనే వున్నా..మేష్టారు గారు కూడా ఇదే అడిగారు..ఇదే చెప్పాను..అంతవరకూ చెప్పిన పాఠము అంతా అప్పజేప్పేశా..అయినా..ఈ సారి నవ్వుతావా? అందరినీ నవ్విస్తావా అని..చెవులు పట్టుకుని పైకెత్తి కుదేసి..బెత్తం పట్టుకుని కొడుతుంటే.. ఎదురు తిరిగాను..హెడ్ మాస్టర్ గారు వచ్చి..నన్ను విడిపించి..ఆ సారునే మందలించారు! ఇంకా ఈ బడిలో చదవను అని           వస్తుంటే హెడ్ మాస్టర్ సారే నన్ను ఆపి వెళ్లి తరగతి గదిలో కూర్చోమన్నారు. ఆయన మంచివారని అయన మాట విని వెళ్లి కూర్చున్నా!

విశ్వనాథుడు:- ఘనకార్యం చేశావు! వెళ్ళు..చదువుకో పో..

నరేంద్రుడు:- ఇప్పుడు చదువుకోను..ఆడుకుంటాను..

విశ్వనాథుడు:- నీకు ఆటలు కావాలా? చదువు కావాలా?

నరేంద్రుడు:- (తండ్రి నడుము చుట్టూ చేతులు వేసి) రెండూ కావాలి..ఆడుకునేప్పుడు ఆడుకుంటాను! చదువుకునేప్పుడు చదువుకుంటాను! మొన్న కుస్తీ పోటీలు జరిగినప్పుడు..బహుమతులు ఇస్తూ మీరేమన్నారు..??

విశ్వనాథుడు:-(నవ్వుతూ) ఏమన్నాను? అదీ చెప్పు!

నరేంద్రుడు:- చదువుకుంటే బుద్ది బాగుపడుతుంది..ఆటలవల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పలేదూ?

విశ్వనాథుడు:-అవును! నువ్వు వింటున్నసంగతి గుర్తులేక పొరపాటున చెప్పాను..సరే ఆడుకో పో! చీకటి పడకుండా వచ్చెయ్యి.. 
                    (తండ్రిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు)

భువనేశ్వరి:- వీడిని చూస్తుంటే..సంతోషమూ భయమూ రెండూ కలుగుతున్నాయి! వేగలేకపోతున్నాము!

విశ్వనాథుడు:- కలకత్తా కోర్టులో హేమాహేమీలైన ప్లీడర్లతో వాదించడం..మెజిస్ట్రేటులను వొప్పించడం చాలా తేలిగ్గా వుంది వీడితో వాదించడం, వీడిని మెప్పించడంకంటే!

భువనేశ్వరి:- కానీ నరేన్ ఏమి మాట్లాడినా నిజమే వుంటుంది. 

విశ్వనాథుడు:- నిజమే. వీడి అల్లరికూడా ముద్దుగా వుంటుంది. కానీ ఒకోసారి భయంగా వుంటుంది నిజం చెప్పాలంటే. మొన్న ఒక మిషనరీ ఫాదర్ని ఏడిపించాడుట.

భువనేశ్వరి:- మిషనరీ ఫాదరునా? ఎందుకు?

విశ్వనాథుడు:- అతను విగ్రహారాధనను హేళన చేస్తూ రాముడి విగ్రహాన్ని చూపించి 'దీన్ని నేను నా కర్రతో బడిత పూజ చేస్తే  ఏం  చేస్తుంది?' అన్నాడుట. వీడు అక్కడికెందుకు వెళ్ళాడో..ఎవరూ ఏమీ మాట్లాడకుంటే వీడు మాత్రం 'నేను మీ జీసస్ ని తిడితే ఏంచేస్తాడు అని అడిగాడుట. అతనికి ఆగ్రహం వచ్చి 'నిన్ను నరకంలో తోసేస్తాడు' అన్నాడుట. 'ఆ విగ్రహమూ నిన్ను అదే చేస్తుంది' అన్నాడుట. అందరూ నవ్వి వీడిని మెచ్చుకుంటుంటే ఆ ఫాదరు ఏడుపు మొహం పెట్టాడుట!

భువనేశ్వరి:- నిన్న సాయంత్రము ఆలస్యముగా వచ్చి ఒకటే ఏడుపు..హనుమంతుడు అరటి తోటల్లో ఉంటాడు అని కోవెలలో రామాయణ ప్రవచనంలో చెప్తుంటే విని..మన హరీషుని అరటి తోటలోకి వెళ్లి వెతికి వెతికి మూడు గంటలు గాలించి ఇంటికి వచ్చి ఒకటే ఏడుపు హనుమంతుడు కనపడలేదని. రాములవారి పనిమీద ఎక్కడికో వెళ్లి ఉంటాడు, ఈసారి కనిపిస్తాడులే  అని సర్ది చెప్పే వరకూ భోజనం కూడా చేయలేదు!  

విశ్వనాథుడు:- పసి మనసులు తెల్లకాగితాలు. వాటిమీద ఏవైనా స్పష్టంగా ముద్రపడిపోతాయి. అందునా నరేన్ దేన్నైనా తను స్వయంగా చూసి నిర్ధారించుకుంటే తప్ప నిశ్చింతగా నిద్రకూడా పోడు! పిల్లలందరూ తన తోటలో చెట్లెక్కి కొమ్మలు విరగ గొడుతున్నారు, పండ్లన్నీ పాడు చేస్తున్నారు అని ఈశ్వర చంద్రుడు 'ఆ తోటలో బ్రహ్మరాక్షసుడు వున్నాడు..ఆ చేట్లేక్కిన వాళ్ళ గొంతులు నులిమేస్తాడు' అని చెప్తే మిగిలిన పిల్లలు భయంతో పారిపోయారట! వీడు మాత్రం హేళనగా నవ్వి 'అదే నిజమైతే ఈ పాటికే మా అందరి గొంతులూ నులిమేసేవాడే కదా ఆ బ్రహ్మ రాక్షసుడు' అని అన్నాడుట. నివ్వెర పోవడం ఈశ్వరచంద్రుని వంతు అయ్యింది!

(బయట కలకలం. పిల్లల అరుపులు. ఏమిటా అని చూస్తుండగా నరేంద్రుని ప్రవేశం)

భువనేశ్వరి:- ఏమిటా అరుపులు? ఏమైంది?

నరేన్:- మన తోటలో ఆడుకుంటున్నాము. నేను శివుడిలాగా ధ్యానం చేసుకుంటుంటే..పెద్ద త్రాచు పాము నా ఎదురుగా వచ్చి పడగ విప్పి అలాగే ఉండిపోయిందిట..

భువనేశ్వరి:- (ఆదుర్దాగా దగ్గిరికి తీసుకుని) ఆ? మిగిలిన పిల్లలేమయ్యారు మరి?

నరేన్:- వాళ్ళు అక్కడుంటేగా..పామును చూడగానే పారిపోయారు.

భువనేశ్వరి:- నువ్వెందుకు పారిపోలేదు? త్రాచు పామును చూసికూడా అలాగే కూర్చుంటారా? కాటు వేస్తే ఏంగాను?

నరేన్:- పామును నేనెలా చూస్తాను? నేను శివుడినిగా! ధ్యానంలో వున్నాను! ధ్యానంలో వుంటే పాములూ దోమలూ కనిపిస్తాయా ఎక్కడన్నా?

విశ్వనాథుడు:- ( భార్యను వారిస్తూ) సరే..సరే..ఇక అలాంటి ఆటలు ఆడకు..చివరిసారిగా హెచ్చరిస్తున్నాను! ఇక దండించడం దాకా తెచ్చుకోకు!  (హెచ్చరించి లోపలి వెళ్ళిపోతాడు)

నరేన్:- అమ్మా! శివుడిలా వేషం కడితే శివుడిలానే నిజంగా ధ్యానం చేసుకోవాలికదా..అందులో తప్పేముంది?
 
భువనేశ్వరి:- తప్పుకాదు నాన్నా..అలా విషపు పురుగులసమీపంలో ఆడుకోవడంలో ప్రమాదముంది..సరే..పద..స్నానం చేద్దువుగాని! నరేన్! నీకు నిజంగా పాము కనపడలేదా? వాళ్ళు నిజంగా పామును చూశారా?

నరేన్:- అవునమ్మా! నాకు పాము గీము ఏమీ కనపడలేదు..ఇలా పద్మాసనం వేసుకున్నాను..ఇలా కనులు మూసుకున్నాను..అంతే ఇక్కడ కాంతి వచ్చింది..దాన్నే చూస్తుండిపోయాను..హాయిగా వుంది..వాళ్ళు పామును చూసి దూరంగా పారిపోయి కేకలు పెట్టారుట..అది నా ఎదురుకు ఇంత దగ్గిరికి వచ్చి..ఇంత ఎత్తున పడగ విప్పి..అలానే వుందిట..నేను కదలక పోయేసరికి కొంతసేపటికి పడగ దించి వెళ్లిపోతుంటే..అప్పుడొచ్చి నన్ను కుదిపి కుదిపి..కళ్ళు తెరిపించి ఆ మూల నంది వర్ధనం వద్ద 
చూపించారు..అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అది మళ్ళీ పడగ విప్పి..మేము ఏమన్నా అంటామేమో అని చూసి వెళ్ళిపోయింది..

భువనేశ్వరి:- హే భగవాన్! పగపడుతుందేమో!

నరేన్:- శివుడిమీద ఏ పాము అయినా పగపడుతుందా అమ్మా? మెళ్ళో .. చెవులకు.. దండచేతులకు.. నడుముకు..పాములనే ఆభరణాలుగా ధరిస్తాడు శివుడు అని చెప్పావుగా నువ్వే! నాకేం కాదు..వదిలేయ్..(తల్లిని అనునయిస్తూ) సరే..ఈసారి అలా కానివ్వను..సరేనా? ఆకలి అవుతున్నదమ్మా! 

భువనేశ్వరి:- స్నానం చేసిరా..భోజనం చేద్దువుగాని. వెళ్ళు. దాదీ! దాదీ! నరేన్ కి  స్నానం చేయించు..భోజనం సిద్ధం చేయమని చెప్పు!

                  ( లోపలికి వెళ్ళిపోతారు)  

(తెర) 

(3)

( నరేంద్రుని బస. నరేంద్రుడు మై మరచి గానము జేయుచుండును.)

నేనా గిరిధరు గృహమున కరిగెద
నేనా గిరిధరు గృహమున కరిగెద ||
గిరిధరునికి నే స్నేహితురాలను
మరుజనకుని రూప మోహితురాలను
రేయి బవలునూ ఆతని గూడెద
హాయి మీర గొని యాడెద పాడెద||

ముసి ముసి నగవుల మురిపెము కొసరగ
ముసి ముసి చీకటులిలను ముసరగ
రసిక శిఖామణి గృహమును జేరెద
నిశి విడక మునుపు నిజ గృహము జొరెద||
ఏమిడినా అది తిని నే మనియెద
ఏమనినా అది విని నే చనియెద
యుగ యుగాలు నిలిచే నీబంధము
జగ జగాలు వలచే సుమగంధము||
రమ్మని డాసినా, పొమ్మని తోసినా,
సొమ్ములు దోచి నన్నమ్మి వేసినా,
నమ్మిన నను నట్టేట ముంచినా,
కిమ్మనకనె అన్నీ సమ్మతించిన||
క్షణమైనా విడి మనగ జాలను
తనదిగ నను గను దీనురాలను
రారా! నా దొర గిరిధర గోపాల!
మీరా నీదిర ఏలర మురిపాల||
నేనా గిరిధరు గృహమున కరిగెద
నేనా గిరిధరు గృహమున కరిగెద||

(నరేంద్రుని సహాధ్యాయి గదిలోకి ప్రవేశించి గానము జేయుచున్న నరేంద్రుని జూసి)

సహా:- నరేన్..నరేన్..ఉదయమే లేచినది ఇందుకోసమా? ఈ రోజే కదా పరీక్ష!
          చదువుకోకుండా ఏమిటీ గానా బజానాలు?

నరేన్:- ఉదయ వేళలోనే హృదయం ప్రశాంతం గా వుంటుందోయ్ మిత్రమా! తరగతి పరీక్ష కన్నా 
           పెద్ద పరీక్ష మీదనే నా ధ్యాస!

సహా:- చదువు, పరీక్ష, సమాజంలో మంచి స్థితి..ఇవే కదా ఈ వయసులో ఆలోచించాల్సినవి! 
యింత కష్టపడి ఇంటినుండి యిక్కడికి ఎందుకొచ్చావో మరిచి పోతే ఎలా నరేన్? మీ తల్లి దండ్రులునీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నారో మాకు అందరికీ తెలిసినదే..నీవెంత ప్రతిభా వంతుడవో
అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. 

నరేన్:- ఇంటినుండి ఇక్కడికి ఎందుకొచ్చానో అనే దానికంటే ఈ ప్రపంచం లోకి ఎందుకోచ్చానో అన్నదే నాకు ముఖ్యం మిత్రమా! నా మీద నన్ను గన్నవారికి ఆశ..నిజమే..కానీ..సమస్త ప్రాణికోటినీ కన్నవాడు అన్నవాడి మీదే నా ధ్యాస! ఈ ప్రతిభ, ఈ పాండిత్యం..ఈ పరీక్షలు..ఉత్తీర్ణత ఎవడిక్కావాలి? ఆదిశంకరుడు ఏమన్నాడో తెలుసా?

           'వాగ్లహరీ శబ్ద ఝరీ శాస్త్ర వ్యాఖ్యాన వైఖరీ..వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే న తు ముక్తయే..'..యివన్నీ భుక్తికి పనికివచ్చేవే కానీ ముక్తికి పనికివచ్చేవి కావు! ఈ పరీక్షల చదువు ఎంతసేపటిలో చదవాలి..( చిటికెలు వేస్తూ) ఈ కంటితో ఒకసారి ఆ పేజీని పైనుండి క్రింది వరకూ చూస్తే చాలోయీ..అందులో ఉన్నదంతా యిక్కడ ముద్ర పడిపోతుంది..  

సహా:- ఆహా! అలాగా? ఏదీ..ప్రశ్నించనా?

నరేన్:- నిరభ్యంతరంగా..( తన తరగతి పుస్తకాల బీరువా వైపు చూపిస్తూ) వాటిలో నీ ఇష్టం వచ్చిన దాన్ని తీసుకుని ప్రశ్నించు..ప్రశ్న ఎందుకు? ఆ పేజీ సంఖ్య చెప్పు చాలు..అందులో ఏముందో చెప్తా!

సహా:- అలాగా? చెప్పలేక పోతే..??

నరేన్:- చెప్పగలిగితే..??

సహా:- చెప్పలేకపోతే ఈ రోజునుండి మన పరీక్షలు ముగిసేంత వరకూ నీ గానా బజానాలు కట్టేసి..నాపై వొట్టేసి..ఈ దేవుడూ..వేదాంతమూ..ఆత్మ..పరమాత్మ..అటక మీద పెట్టేసి..మన విశ్వవిద్యాలయంలో నీవే ప్రథముడిగా నిలవాలి!

నరేన్:- చెప్పగలిగితే రేపు నాతో ఒకదగ్గిరికి ఒకరిని కలవడానికి రావాలి..ఆ కలయిక నా బ్రతుకులో ఒక మలుపు కావాలి..నా ప్రశ్నలకు రేపటిరోజైనా ఒక సమాధానం తేవాలి.. 

సహా:- సరే..( బీరువాలోనుండి ఒక పుస్తకాన్ని తీసుకుంటాడు.) కాపిటల్..capital!..హ హ హ..నీకు పూర్తి వ్యతిరేకమైన అంశం! యాభై మూడవ పేజి..ఇందులో ఏముంది చెప్పు చూద్దాం!..

నరేన్:-( ఒక నిముషం కనులు మూసుకుని ..కణతలు రుద్దుకుంటూ..) నాకు వ్యతిరేకమైనదీ, అతిరేకమైనదీ అంటూ తేడా ఏమీ లేదు..అన్నీ మంచివే..అవసరం ఐన మేరకు..అన్నీ చెడ్డవే అనవసరంగా పట్టుకుంటే! యాభై మూడవ పేజి..ఆ పేజిలో మార్క్స్ అండ్ ఎంగెల్స్..రిలేషన్స్ అఫ్ ప్రొడక్షన్ ..గురించి పరిచయం ఉంది! హ హ హ..పేజి లో మాత్రమేనా..ఏ వాక్యంలో ఏముందో కూడా చెప్పాలా?( కవ్వింపుగా)

సహా:- ఆశ్చర్యం!..( నమ్మలేనట్టుగా చూస్తూ) ఏ వాక్యంలో ఏముందో కూడా చెప్తావా?..సరే..
( అనుమానం గా చూస్తూ) ఎనిమిదవ వాక్యం..ఇందులో ఏముందో చెప్పు..

నరేన్:- ( చిరునవ్వుతో..) క్రిందినుండి ఎనిమిదవ వాక్యమా..పైనుండి ఎనిమిదవ వాక్యమా???

సహా:- ఆ సౌకర్యం కూడా వున్నదా..హత విధీ..నేను నిన్ను పరీక్షిస్తున్నానా?..నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా?..వూ..సరే..క్రిందినుండి ఎనిమిదవ వాక్యం..

నరేన్:- మొత్తం ఇరవై ఆరు వాక్యాలున్నాయి ఆ పేజి లో.. క్రిందినుండి ఎనిమిదవ వాక్యంలో ఏమున్నదో చెప్పాలా?..

సహా:- (అయోమయంగా) ఆ?! చెప్తావా?..చెప్పు..ఏమున్నది..???

నరేన్:- మోహముద్గరంలో..ఐదు, ఆరు, ఏడూ శ్లోకాలలో ఏమున్నదో అదే వున్నది..పై పై పదాలను వదిలేస్తే..సారాంశం అదే వున్నది రెండిటిలో..
           
           యావద్విత్తో పార్జన శక్తః 
           తావన్నిజ పరివారో రక్తః
           పశ్చాజ్జీవతి జర్జర దేహే 
           వార్తాం కోహి న ప్రుచ్చతి గేహే!..

           అర్ధమనర్ధం భావయ నిత్యం
           నాస్తి తతః సుఖ లేశః సత్యం 
           పుత్రాదపి ధన భాజాం భీతి:
           సర్వత్రైషా విహితా రీతి:
           
 (బిగ్గరగా నవ్వుతూ..) అర్ధం కాలేదా..భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే..భజ..
 సంపాదించే సత్తువ ఉన్నంత వరకే నీ బంధువులు ప్రేమతో వుంటారు..అ సత్తువ పోయిన తర్వాత..వార్ధక్యం నిన్ను కమ్ముకున్న తర్వాత నిన్ను అడిగేవాడు వుండడు!

 అర్ధం అంటే అనర్ధమే అని అర్ధం అమాయకుడా! డబ్బున్న వాడికి పుత్రుడన్నాభయమే.. దానికోసం ఎక్కడ బ్రతికి ఉండగానే తల కొరివి పెడతాడో అని..హ హ హ..యింకా అర్ధం కాలేదా? ఆ వాక్యంలో.. 

             the social relationship between people or their relation with nature is expressed as a commercial relationship between things..సామాజిక 
సంబంధాలన్నీ వాణిజ్య సంబంధాలే!!

సహా:- కానీ..

నరేన్:-కానీ లేదు..యిదిగో.. కావాలంటే పానీ వుంది..హ హ హ..తాగు..తాగు! ( గ్లాసులో నీరుపోసి అందిస్తూ) నీ అనుమానం అర్ధమయ్యింది..నేను ముందే చెప్పాను..లోతులకు వెళ్తే ఆదిశంకరుడు చెప్పిందే..మార్క్స్ చెప్పాడు..పరిభాష వేరు..లక్ష్యం వేరు..అంతే!

సహా:-నా వోటమిని అంగీకరిస్తున్నాను..కానీ..యిది ఎలా సాధ్యం..యింత ధారణ సాధ్యమా? సరే..నేను వోడిపోతే ఒక దగ్గిరికి ఒకరిని కలవడానికి నీతో రావాలన్నావు..ఎక్కడికి? ఎవరిని కలవడానికి?

నరేన్:- దక్షిణేశ్వరానికి..అక్కడి రామకృష్ణులు అనే ఒక యోగిని కలుసుకోనడానికి!

సహా:- ఆయనా? ఆయనను కలుసుకొమ్మని ఎవరు చెప్పారు?

నరేన్:- చాలామంది చెప్పారు! కళాశాలలో మన ఆంగ్ల ఉపన్యాసకులు శెలవులో ఉన్నప్పుడు మనకు ఆంగ్ల పాఠము బోధించడానికి ప్రిన్సిపాల్ విలియం హేస్టి గారు వచ్చారు..గుర్తుందా..

సహా:-అవును..నిజమే..మరిచేపోయాను..ఆ రోజు విలియం వర్డ్స్ వర్త్ కవిత..అదేమిటీ..

నరేన్:- ఎక్స్కర్షన్..అందులో పారవశ్య స్థితి గురించి చెప్తూ..ఆ అనుభూతి ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే..దక్షిణేశ్వరంలో వుండే రామకృష్ణులు అనే యోగి దగ్గిరికి వెళ్ళండి అని చెప్పలేదూ? ఆ రామకృష్ణులనే కలుసుకొమ్మని మా రామచంద్ర దత్తులు కూడా చెప్పారు..కానీ ఎడ్మండ్ స్పెన్సర్ నీ..ఆదిశంకరుడినీ..రామానుజుడినీ బుద్దుడినీ రుచిచూసిన నన్ను ఈ నిరక్షరాస్యుడైన సామాన్య అర్చకుడు సమాధానపర్చగలడా..అనుకున్నాను..గత వారం సురేంద్ర నాధ మిత్రా వారి యింటిలో సంకీర్తనకు నన్నుపిలిస్తే వెళ్లాను..ఈ రామకృష్ణులు అక్కడ తారసిల్లారు..ఆ రోజు నేను చేసిన సంకీర్తనను ఎంతో శ్రద్ధగా విన్నారు!

సహా:- కలిశావుగా..మరలా ఎందుకు వెళ్ళడం?

నరేన్:-నన్ను ఒకసారి దక్షిణేశ్వరానికి తప్పక రమ్మని మాత్రమే చెప్పారు ఆయన ఆరోజు. నేను కేవలం సంకీర్తన మాత్రమే చేయగలిగాను కానీ ఆయనను ప్రశ్నించే, పరీక్షించే అవకాశం దొరకలేదు!

సహా:- నీకోసం పరీక్షలు ఎదురు చూస్తుంటే..నీ పరీక్షలకు ఎవరు దొరుకుతారా అని నువ్వు ఎదురు చూస్తున్నావు! ఏం ప్రశ్నిస్తావు? అదేనా? భగవంతుడిని చూశాడా అనేనా? ఎంత పిచ్చి ప్రశ్న? ఆ ప్రశ్నను అడగడానికి ఇంత శ్రమా? ఎవడన్నా ఉంటాడా భగవంతుడిని చూసినవాడు? నీ ధాటికి వంగదేశంలో ఉన్న యోగులందరూ వణికిపోతున్నారు! పాపం..ఎందుకయ్యా వారిమీద 
అంత కసి?

నరేన్:-(గంభీరంగా) అదే నాకూ మీ అందరికీ ఉన్న తేడా! మీరు పరీక్ష చేయకుండానే, ప్రశ్నించకుండానే అపనమ్మకాన్ని అయినా నమ్మకాన్ని అయినా చాలా తేలిగ్గా పెంచుకుంటారు..నేను అలా కాదు! నిర్ధారణకు రాకుండా నమ్మకమైనా అపనమ్మకమైనా పెంచుకోను! రేపు మనం దక్షిణేశ్వరం వెళ్తున్నాము!..అక్కడ తేలుతుంది అని ఆశిస్తున్నాను!( వెళ్ళిపోతాడు)

సహా:-( అతను వెళ్ళినవైపే చూస్తూ..) తేలుతుందో..పేలుతుందో కానీ..ఎదో జరగబోతున్నది అనిపిస్తున్నది! రామా..కృష్ణా అని రెండు చెంపలేసుకుని..మూడు గుంజీలు తీసి..నాలుగు రూపాయలు సంపాదించుకునే విషయం చూసుకోకుండా ఈ రామకృష్ణుల ఉన్మాదం ఏమిటయ్యా నరేంద్రా???  (తెర వాలును)
   
4            


    ( దక్షిణేశ్వర కాళీ ఆలయంలోని ఉద్యానవనంలో రామకృష్ణ పరమహంస కుటీరంలో గదిలో శారదా మాత, రామకృష్ణ పరమహంస, ఇతర భక్తులతో  కాళీ ఆరాధనలో వున్నారు )

రామకృష్ణ:- ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలం భుశుండీ౦ శిరః 
                శంఖం సందధతీం కరై: త్రినయనాం సర్వాంగ భూషావృతాం
                యాం హన్తుం మధుకైటభౌ జలజభూస్తుష్టావ సుప్తే హరౌ
                నీలాశ్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం    

అమ్మా..అమ్మా..ఈశ్వరీ! భువనేశ్వరీ! ఒక చల్లని చూపు చూడవూ..తెల్లని వెన్నెల నవ్వు నవ్వవూ..
తిను తల్లీ..తిను..తిను..ఎందాక ఎదురు చూడను తల్లీ? నీ సుపుత్రుడు ఎప్పుడు వచ్చేది? విసుగొస్తున్నది వినోదం కోసమో విఖ్యాతి కోసమో..ఉబుసుపోకనో..ఉదరపోషణ కోసమో నిన్ను తలచే వాళ్ళను..నన్ను కలిసే వాళ్ళను చూసి! నిన్ను నిన్నుగా తెలుసుకునే వాడు తనను తాను తెలుసుకునే వాడు ఎప్పుడొస్తాడో! ( ఏదో వింటున్నట్లుగా ఆలకించి..శారదా మాతతో..)

రామకృష్ణ:- (ఆనందంగా) వస్తాడుట. త్వరలోనే వస్తాడుట. త్వరలో వస్తాడుట. జీవుడు వస్తాట్ట.
దేవుడిని చూస్తాట్ట. ఇంకేముంది? జీవుడూ దేవుడూ కలిస్తే బ్రహ్మానందమే! అమ్మా!       ఆనందమే! (శారదా మాతతో) అమ్మా! ఆనందమే! వివేకమే గెలుస్తుందట! ఎన్నటికీ ఆనందమే నిలుస్తుందట! ఇక వివేకానందమే! వివేకానందమే! (పూజా కుసుమాలను నెత్తిన చల్లుకుని ఆనంద పరవశుడై నృత్యము చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోతాడు. శారదాదేవి విసురుతూ పరిచర్యలు చేస్తూ వుంటుంది. బయట ఎవరో వచ్చిన ధ్వని. కాళీ మాయీకీ జై. సద్గురు మహారాజ్ కీ  జై. శారదా మాయీకీ జై అని నినదిస్తూ ఒకరి ప్రవేశము )

వ్యక్తి:- గురు మహారాజ్! మీ దర్శనం కొరకు ఒక యువకుడు వచ్చాడు.

రామకృష్ణ:- రమ్మను రమ్మను 

(అతను ద్వారం వద్దకు వెళ్లి నరేంద్రుని లోపలి తోడ్కొని వస్తాడు. నరేంద్రుడు పరిశీలనగా చూస్తూ ప్రణామం చేస్తాడు. రామకృష్ణులు అతనినే పరికించి చూసి, ప్రతి నమస్కారము చేసి, కూర్చొనుమని సంజ్ఞ చేస్తాడు. నరేంద్రుడు అందరినీ పరికిస్తూ కూర్చుంటాడు.)

వ్యక్తి:- ఇతను నరేంద్ర దత్తుడు. విశ్వనాథ దత్తులవారి కుమారుడు. చక్కగా సంకీర్తనం చేయగలడు

రామకృష్ణ:- ఓహో అలాగా తండ్రీ ఏదీ ఒక సంకీర్తన చెయ్యి!

( ఇతర శిష్యులు హార్మోనియం, ఇతర వాయిద్యములను తేగా వివేకానందుడు గానము అరంభించును)

నే రామ రతనమును పొందా! రాధే గోవిందా!


నే రామ రతనమును పొందా! రాధే గోవిందా !

శ్యామలాంగు నిటు భామ భాజించుట

ప్రేమ ధాముడౌ గురుడు లభించుట 

రామ నామ మణిమయమగు సంపద

సేమ మరసి కృప జేయ మురిసి ||నే||

ఎన్ని జన్మములు కూడబెట్టినదో 

ఎన్ని మర్మములు మూట గట్టినదో

ఎన్ని పున్నెముల సిరిగ ముట్టినదో

'మీర' ఇన్నిటికి పెట్టి పుట్టినదో ||నే||

అనుభవించినా ఖర్చు కానిది

అన్యులకరువిచ్చి మర్చి పోనిది

తెంపరి దొంగలు దొంగిల లేనిది

ఇంపుగ పెంపగు సొంపగు సంపద ||నే||

పాటించిన నిను సద్గురు నావ

దాటింతువు భవ జలధులు నీవ

కూటరి! యమునాకుంజ విహారి!

నీటరి! వినుతింతు కంస విదారి! ||నే|| 

( అందరూ ఆ గానములో లీనమై ఉందురు.  తదేకముగా నరెంద్రునే చూచుచూ సమాధి అవస్థలోనున్న
రామకృష్ణులు గానము పూర్తికాగానే ఇతరులు భగవన్నామమునకు జయ జయధ్వనులు చేయుచుండగా నరేంద్రుని చేయిపట్టుకుని అతనిని ప్రక్కకు ఏకాంత స్థలములోనికి, ప్రక్క గదిలోనికి  తీసుకునివెళ్ళి)

రామకృష్ణ:-(నరేంద్రుని చేతులు పట్టుకుని, ఆనంద బాష్పాలు రాలుస్తూ)ఓ! ఇంతకాలం నన్ను ఎంత నిర్దయగా నిరీక్షకు గురిచేశావు! ఇంత ఆలస్యంగా వచ్చావేం? లౌకికుల ప్రాపంచిక సంభాషణలతో నా చెవులు తూట్లు పడ్డాయి. ఒక యోగితో నా ఆత్మానందాన్ని పంచుకోడానికి ఎంత పరితపించానో తెలుసా?

(నరేంద్రుడు ఆయన చేతులను విడిపించుకోడానికి మృదువుగా ప్రయత్నిస్తూ పరిశీలనగా ఆయననే చూస్తున్నాడు)    
 
రామకృష్ణ:-(రెండు చేతులు జోడించి) ప్రభూ! సనాతన ఋషి ఐన నరులే తమరు. నారాయణావతారులే తమరు. లోకుల వేదనను దూరం చేయడానికి అవతరించారని నాకు తెలుసు..( త్వరపడుతూ తన గదిలోకి వెళ్ళబోయి మరలా వెనుతిరిగి) ఇక్కడే వుండండి..ఎక్కడికీ వెళ్ళకండి..దయచేసి ఇక్కడే వుండండి 
               (పరుగున వెళ్ళిపోతాడు)

నరేంద్రుడు:- (తనలో) సందేహం లేదు. ఈయన ఒక పిచ్చివాడు. ఏమిటీ ధోరణి!

(రామకృష్ణులు చేతిలో కలకండ, వెన్న మిఠాయిలు తెచ్చి బలవంతముగా తనే స్వయముగా తినిపించబోతాడు. నరేంద్రుడు వారిస్తూ)

నరేంద్ర:- నాకు ఇవ్వండి. నేను తింటాను!

రామకృష్ణుడు:- ఊహూ..నేనే తినిపించుకుంటాను..ప్రభూ స్వీకరించండి..తినండి..

నరేంద్ర:- నా చేతికివ్వండి. నా స్నేహితులతో పంచుకుని తింటాను..వదలండి..

రామకృష్ణుడు:- ఊహూ..వారికీ మరొక రోజు ఇస్తాను..తినండి..తినండి..( బలవంతముగా తనే తినిపించి, తన అంగ వస్త్రము తో నరేంద్రుని మూతి తుడిచి అతని ముఖములోకే చూస్తూ ఆనంద పరవశుడు అవుతుంటే)

నరేంద్ర:- (నమస్కరిస్తూ) బయటకు వెళ్దాము..బయట నా మిత్రులు ఎదురు చూస్తున్నారు 

రామకృష్ణులు:- అయితే మరలా ఒకరోజు ఒంటరిగా వస్తానని వాగ్దానం చేయండి మరి ..చేయరూ..

నరేంద్ర:-( మొహమాటముగా ) అలాగే ..తప్పక వస్తాను ( నమస్కరించి వడిగా మొదటి గదిలోకి వెళ్ళిపోతాడు. రామకృష్ణులు ఆయన వెనుకే వచ్చి కూర్చుని ఆతనినే చూస్తూ ఉండిపోతాడు. మిగిలినవారు ఉత్సుకతతో తననే చూస్తుండగా నరేంద్రుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న కదలికలతో గంభీరముగా ఆలోచిస్తూ మధ్య మధ్య నిశితముగా రామకృష్ణ ను పరిశీలిస్తూ ఉంటాడు.)     

నరేంద్ర:-(తన ఆలోచనల లోనుండి బయటకు వచ్చి, ఒక నిశ్చయమునకు వచ్చినవాడిలా) స్వామీ! మీరు భగవంతుడిని చూశారా? ఎక్కడెక్కడో తిరిగాను. ఎందరెందరినో అడిగాను. ఎవరూ సమాధానం ఇవ్వలేక పోయారు. స్వామీ..మీరు భగవంతుడిని చూశారా?

రామకృష్ణ:- చూశాను. ఇప్పుడు నిన్ను ఇక్కడ చూస్తున్నంత నిజంగా, దగ్గిర చూశాను. చూస్తూనే వున్నాను. మాట్లాడాను కూడా. ( నమ్మకంగా, నమ్మబలుకుతున్నట్లుగా) ఇప్పుడు నీతో ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగానే మాట్లాడాను కూడా. నువ్వూ చూడగలవు. మాట్లాడగలవు. ఆయనతో క్రీడించగలవు. నువ్వే కాదు. ఎవరైనా ఆ పని చెయ్యొచ్చు.

నరేంద్ర:- నిజంగా అది సాధ్యమైందా మీకు? అందరికీ సాధ్యమేనా? నిజమా? భగవత్సాక్షాత్కారం సాధ్యమా?

రామకృష్ణ:- ముమ్మాటికీ నిజం..నిజం..నిజం..అందరికీ సాధ్యమే..కానీ ఆ కోర్కె ఎవరికుంది? భార్యా పిల్లలకోసం, తల్లి దండ్రుల కోసం, ఆస్తిపాస్తులు, కీర్తి ప్రతిష్టల కోసం ఏడ్చే వాళ్ళు వున్నారు కానీ భాగావత్సాక్షాత్కారం కోసం విలపించే వాళ్ళు ఎవరున్నారు? మనస్ఫూర్తిగా ఆయన కోసం విలపిస్తే ఆయన సాక్షాత్కారం ఎవరికైనా దొరుకుతుంది.

నరేంద్ర:- ఇన్ని సంప్రదాయాలు, ఇన్ని ఆరాధనా విధానాలున్నాయి..ఎందుకని? ఏ ఆరాధనా విధానం శ్రేష్థమైనది? ఎందులో సాక్షాత్కారం కలుగుతుంది?

రామకృష్ణ:-నీవిక్కడికి ఎలా వచ్చావు తండ్రీ?అర్ధం కాలేదా? నీ ఇంటి నుండి ఈ దక్షిణేశ్వరందాకా ఎలా వచ్చావు?

నరేంద్రుడు:-బండి కట్టించుకుని..

రామకృష్ణుడు:- ఇతను నడిచి వచ్చాడు. అతను తూర్పు వంగ దేశంనుండి పడవ, రైలుబండి, ట్రాముబండి సాయంతో అంచెలంచెలుగా ప్రయాణం చేసి వచ్చాడు. మీరందరూ ఇక్కడికి రావాలనే కోర్కె వుంది కనుక రకరకాలుగా ప్రయాణించి వచ్చారు. సంప్రదాయాలు, ఆరాధనా విధానాలు కూడా అలాంటి రకరకాల ప్రయాణ మార్గాలే, భగవంతుడు అనే గమ్యాన్ని చేరడానికి. ఎవరికి అందుబాటులో వున్న పద్ధతిలో వారు ప్రయాణం చేస్తారు. ఎవరికి ఏది సాధ్యమో వారికి అదే శ్రేష్ఠమైన విధానం. గమ్యం చేరేవరకూ మధ్యలో విరమించకుండా ప్రయాణించడం ముఖ్యం. అప్పుడు గమ్యం చేరడం జరుగుతుంది.    

(నేపధ్య గీతం. వివిధ ధర్మాల సారమంతా ఒకటే అనే సూచనగా వివిధ ధర్మాల, విశ్వాసాల, ఆరాధనలకు చెందినవారిని రామకృష్ణులు ఆదరిస్తున్న ఆశీర్వదిస్తున్న దృశ్యం. నేపధ్య గానం మినహా మౌన ప్రదర్శన. రామకృష్ణులు, శిష్య బృందం తాండవమాడుతూ ప్రదర్శన )

ఒకటే సత్యం, ఒకటే నిత్యం, ఒకటే సుందరమందరికీ!
అంతా ఒకటను అందమైన నిజమెరుక పడినదది ఎందరికి?
అందరికీ శుభ, మందరికీ శివ, మందరి కౌనది  శంకరము
కొందరికే ఇది బోధ పడినచో భువిపై బతుకు భయంకరము!
సాంబశివా యని రామ! కృష్ణ! యని సాగిల బడుదురు కొందరు
అల్లా యని బిస్మిల్లా యని భువి మోకరిల్లెదరు కొందరు!
కరుణా మయుడని, మేరి తనయుడని స్తుతులు చేతురింకొందరు!
ఇద్ధ చరితుడని బుద్ధ దేవుడని బుద్ధి గణింతురు కొందరు!
అమ్మాయని లలితమ్మాయని,దయ మీరమ్మా ఓ మేరమ్మా యని
అమ్మల గొలుతురు కొందరు, అమ్మ తనయులే అందరూ!
అందరి అమ్మలు అమ్మలే!అనురాగ విరుల కొమ్మలే!
అమ్మవంటిదే ప్రతి మతమూ, అనురాగభరిత మభిమతము!
నీ తల్లి వంటిదే ప్రతి తల్లీ, మతమన మమతల మరు మల్లి!
తల్లి వంటిదీ ధరా తలం, మత మవరాదొక విషానలం!
నీతల్లిని నువు నిజముగ ప్రేమిస్తే, అమ్మ తత్త్వమును అసలుగ జూస్తే
అవని నెందుకీ అల్లరి? అంతా మమతల వల్లరి!
నీరని యన్నా, 'పానీ' యన్నా, 'వాటర్' అన్నా, తాగిన.. అన్నా!
దాహము  తీరుట తథ్యము తత్త్వ చింత'నే'పథ్యము!
దయ కలిగించని దేవుని బాట, దాహం తీర్చని నీరను మాట
పూలు లేని ఒక పూదోట !ఊసర క్షేత్రపు దేవూట?
జాలి వహించని దేజాతైనా , ఇతరుల కొరకను ఏ నీతైనా
నశించి పోవుట తప్పదు!కాలమసత్యము చెప్పదు!
మమతను పెంచని మతమేదైనా, గుణము నశించిన కులమేదైనా
కూలిపోవుటది  అవశ్యము,కర్మఫలితమీ  రహస్యము!
సమతా శాంతుల  బడులు గుడులుగా, మమతల రశీదు మశీదుగా
స్నేహ నేత్రముగ చర్చి చెమర్చి, గురుద్వారాలిక సుఖద్వారాలై
అనంత సత్యము లవిష్కరిద్దాం!! అసలు సమస్యలు పరిష్కరిద్దాం!!
ధరలో శాంతిని పంచుదాం!! భువిని భావికై ఉంచుదాం!!
నేపధ్య గానం ఆగిపోవును. యథాపూర్వం రామకృష్ణులు భక్త శిష్య బృందము)

రామకృష్ణుడు:- ప్రవహించే నదులన్నీ ఏ పేర్లతో ఏ ప్రాంతములలో ప్రవహించినా చివరికి సముద్రుడిని చేరినతర్వాత తమ పేర్లను, ఉనికిని కోల్పోతాయి. అప్పుడు అనంతమైన సాగరమే కనిపిస్తుంది. వివిధ ధర్మాలు నదులవంటివి. పరమాత్మ తత్త్వం అంతుపట్టని సాగరం వంటిది. ఆ పరమాత్మ సాగరాన్ని చేరేవరకే ఈ ధర్మాలనే నదుల పేర్లు. అసలైన జ్ఞానులు తమ తమ ధర్మాలను వివిధ పేర్లు కలిగిన ఆరాధనా విధానాలను కోల్పోయి పరమాత్ముఅనుభవం అనే సాగరంలో కలిసిపోతారు.       

నరేంద్రుడు:- (తల పంకించి) అర్ధమైంది. ధన్యుడిని. 

రామకృష్ణ:- నీవేనా? నేను కూడా ధన్యుదినే నీ వలన. ఓ నారాయణా! నువ్వు నాకోసం ఈ శరీరంలో వచ్చావు. 'అమ్మా! కామినీ కాంచనాలకు లొంగని విశుద్ధ భక్తుని తోడు లేకుండా నేనెలా బ్రతుక గలను?' అని రాత్రి అమ్మను ప్రశ్నించాను. అమ్మ నవ్వింది. ఇంతలోనే నువ్వు..ఇదిగో..అచ్చు ఇలాగే ఇక్కడికి నవ్వుకుంటూ వచ్చావు!

నరేంద్ర:- నేనా? రాత్రి ఇక్కడికి వచ్చానా? అదెలా సాధ్యం? రాత్రి నేను కలకత్తాలో నా ఇంట్లో ఆదమరిచి నిద్ర పోతున్నానే!( రామకృష్ణుడు విననట్లు తనలో తను ఎదో గొణుగుతున్న వానిలా నెమ్మదిగా జరిగి తన కుడి పదమును హఠాత్తుగా ఎత్తి నరేంద్రుని గుండెలమీద ఆనించాడు. మరుక్షణం తన శరీరం తన 
అధీనం తప్పి..) భూమ్యాకాశాలు ఏకం అవుతున్నాయి! సృష్టి అంతా గిర్రున తిరిగిపోతున్నది!
నాకేమీ తెలియడం లేదు! నేను లేను! నాకేమీ లేదు! (మరింత బిగ్గరగా) నన్నేం చేస్తున్నారు మీరు?
అయ్యో! నాకోసం ఇంటిదగ్గిర మా అమ్మా నాన్నలున్నారు!

రామకృష్ణులు:- (నవ్వుతూ, నరేంద్రుని గుండెల మీద చేతితో తడుతూ) అలానా? అయితే ఇప్పటికి ఇది చాలు! నెమ్మదిగా మిగిలినది జరుగుతుంది!

నరేంద్రుడు:- ( తేరుకుని ) ఇక నేను వెళ్లి వస్తాను. నాకు శెలవు ఇప్పించండి. ప్రణామములు.

రామకృష్ణులు:- అలాగే. మరలా వస్తావు కదూ!

నరేంద్రుడు:- తప్పకుండా వస్తాను. (వెళ్ళిపోతాడు)

(తెర)
                                                                   (4)

(రామకృష్ణులు తీవ్ర అనారోగ్యముతో చుట్టూ తన శిష్యులతో పరివేష్టించి వున్నారు. అందరి ముఖములలో వేదన.)

రామకృష్ణ:- తండ్రీ ఇక అమ్మ పిలుపు వచ్చింది. నేను చేయవలసినది ఒక్కటి మిగిలివుంది. ( శిష్యుల ముఖములలోకి చూసి ఆగిపోవును. తమను ఏకాంతములో వదులుమని సంజ్ఞ చేయును. నరేంద్రుడు తప్ప తక్కిన వారు అందరూ వెడలిపోవుదురు. ) నీవలన నేరవేరవలసిన గొప్ప కార్యములు ఎదురుచూస్తున్నాయి. అందుకు నిన్ను సర్వ సన్నద్దుడిని చేసి అమ్మలో లీనమవుతాను. 
( మాట్లాడుటకు శక్తి లేక ఆగిపోవును)

నరేంద్రుడు:- (తనలో) ఈ మహానుభావుడు క్రితం ఎన్నోసార్లు తన అవతార తత్త్వాన్ని ప్రకటించుకున్నారు! ఈ అవసాన దశలోకూడా తను అవతార స్వరూపినని తెల్పగలిగితే ఇక నేను నమ్మవలసినదే! 

రామకృష్ణుడు:- (బలహీనముగా నవ్వుతూ) తండ్రీ ఇంకా నీకు సంశయమేనా? ఎవడు రాముడూ, కృష్ణుడూ ఐనాడో అతడే ఈ శరీరములో రామకృష్ణుడుగా వున్నాడు. 

నరేంద్రుడు:-(పరుగున వెళ్లి అయన పదములమీద శిరసునుంచి) గురుదేవా! గురుదేవా! అవివేకిని..మొండివాడిని..మూర్ఖుడిని..మన్నించండి! మన్నించండి!

రామకృష్ణుడు:- పిచ్చితండ్రీ! బంగారానికైనా కాల్చి పరీక్షచేయడం తప్పదు. సత్య శోధన,  గురుసాధన కూడా అంతే. దేనినైనా ఎవరినైనా తెలుసుకున్న తరువాతనే అనుసరించాలి! ఇది ఋషి మార్గం! (ఆయాసముతో ఆగిపోవును. కొంతసేపటికి తేరుకుని, తనకు ఎదురుగా రమ్మని సంజ్ఞచేసి, ప్రయాసతో లేచి కూర్చుని తన ప్రక్కన మోకరిల్లిన నరేంద్రుని శిరసుమీద తన కుడిచేతినుంచి తదేక దృష్టితో ఆతనినే చూచుచూ ధ్యాన మగ్నుడగును. నరేంద్రుడు ఒక తీవ్ర విద్యుదావేశం పూనినవానివలె కంపించి పోవుచూ క్రమముగా బాహ్య స్మృతి కోల్పోవును. కొంతసేపటికి స్మ్రుతిలోకి వచ్చిన నరేంద్రుడు తన గురుదేవుడు కనులవెంట అశ్రులు రాల్చడం చూసి ఖిన్నుడై )

నరేంద్రుడు:- స్వామీ ఎందుకీ వేదన? ఏమిటీ కన్నీరు?

రామకృష్ణ:-నరేన్! నా సాధనాలోని శక్తులన్నింటినీ నీకు ధర పోసి ఈ రోజు నేను ఆధ్యాత్మిక సంపదను కోల్పోయిన పకీరునైనాను. నువ్వు సాధించవలసిన మహత్తర కార్యాలకు ఈ శక్తి నీకు అవసర పడుతుంది. ( అందరినీ తీసుకురమ్మని సంజ్ఞ చేస్తాడు. శిష్యులందరూ లోన జేరి విలపిస్తుండగా, వారిని ఆశీర్వదిస్తూ అతి కష్టము మీద ) నా తండ్రీ..ఏదీ..ఒక కీర్తన..నేను ఈ దేహముతో చివరిగా వినే నీ కీర్తన..పాడవూ? ( శిష్యులు అందరూ విలపిస్తుండగా శారదా మాత పాదసేవ చేస్తుండగా ఒకనిముషము తనను కూడదీసుకుని..నరేంద్రుడు గానము జేయును)

                  యోగీ పోవలదు పోవలదు వలదు 
               
                  సాగిలి పదములు వదలను కదలను ||
              
                  ప్రేమ భక్తులది పథమిది వింత
 
                   తామనురక్తి తో విశద మొకింత 

                   చేసి పోవలెను దాసురాలికి

                   తోసి పోకు దయ బాసి గాలికి ||

                   చితిలో చందన యుతితో క్రందుగా

                   కాల్చి వేతువా? బూది నౌదునా?

                   నంద నందనా! సుందరాంగుడా!

                   పూసుకొందువా? పులకరింతువా? ||

                   మీరా దేవర వరమిడి బ్రోవర
 
                   రారా! కావర! నగవుల నగధర!

                   జ్యోతిని జ్యోతిలో లీనము జేయరా!

                   కాంతను శాంతితో భ్రాంతను జేయరా! ||

                   యోగీ పోవలదు పోవలదు వలదు

                   సాగిలి పదములు వదలను కదలను|| 

(గానము పూర్తి అవగా ముమ్మారులు కాళీ నామమును స్మరించి రామకృష్ణులు దేహ త్యాగము జేయును శిష్యుల రోదన మిన్నుముట్టుచుండగా తెర వాలును) 

                                                        (5)
     
జయ జయ జయ రామకృష్ణ వీత కామ విషయ తృష్ణ 
జయ పవిత్ర సచ్చరిత్ర కాంచన లతికాలవిత్ర
జయ శారద మాతా భువి వెలిసిన మలిభూజాతా
వీర వివేకానందా జయహే తవ జయహే ..జయ జయ..
జయ జయ జయ రామకృష్ణ తవ జయహే రామకృష్ణ 
తవ జయహో శారదామాతా జయ జయహో 
మీ ప్రేరణతో జనించె వేదాంత నృకేసరి
రాఘవుడు రమణి సీత రామదూతలై సరి.. జయ జయ జయ.. 
శైలశృంగ ప్రాంగణాన కలిగిన ధ్వని కాహళంగ 
కడలి అంచు కడదాకా ప్రతిధ్వనుల ప్రాభవంగ 
భరతఖండమందు భారతీయ అంతరంగమందు  
మ్రోగినదే జయభేరి వేదాంత నృకేసరి  ..జయ జయ జయ...
తన నాదం జనమోదం పరితాపం  జనఖేదం 
కష్టాలు కన్నీళ్లు ఆకళ్ళు ఆరళ్ళు 
తొలిగించినదే మతం మమతే తన అభిమతం
గుండె గుడులలో వెలిగే   వలపేకద  దైవతం .. జయ జయ జయ..
ప్రతి తనువూ దివ్య తత్త్వ దీప్తులు గల కోవెల 
కూడు గూడు గుడ్డ లేని వారి జాలి చావుల
తీర్చలేని మతమెందుకు సానుభూతినా యిల 
సాయమనే నీట,  దప్పి తీర దెండమావుల... జయ జయ జయ ...      
ప్రాగ్దిశలో దక్షిణాన  పశ్చిమాన ఉత్తరాన
మానవతా రాగము మ్రోసెను మమతల మధు వీణ  
హైందవ జన జీవనమున హిందోళముగాగ వింత  
దక్షిణాన కడలి వరకు పాకినదా పులకరింత.. .. జయ జయ జయ..   

( నేపధ్యములో గానము వినపడుచుండగా శ్రీరామకృష్ణమఠస్థాపన, సోదర శిష్య సమేతుడై వివేకానంద భారత యాత్ర, కన్యాకుమారి చేరుకొనుట, కన్యాకుమారిలో సముద్ర మధ్యమున పర్వత శిఖరాగ్రమున ధ్యానావస్థాస్థితిలో ప్రపంచ మతసమ్మేళనముగురించి ఆలోచించుట, శ్రీ రామకృష్ణుల దివ్య ఆదేశం లభించడం,విశ్వమత సమ్మేళనంలో స్వామి ప్రసంగము ప్రారంభము అవడం వరకు మౌన ప్రదర్శన/ షాడో ప్లే  అవకాశమునుబట్టి )    

సర్వమత సమ్మేళన ప్రతినిధి:- యిప్పుడు హిందూ ధర్మ ప్రతినిధి స్వామి వివేకానందను ప్రసంగించ వలసినదిగా ఆహ్వానిస్తున్నాను  

వివేకానంద:- (తనలో )
                  అమలా కమలాధివాసినీ మానసో వైమల్పదాయినీ
                  మనోజ్ఞే సుందరగాత్రీ సుశీలే తవ చరణామ్భోరుహం నమామి సదా!! 
                  అమ్మా, సరస్వతీ నీ శిశువును కరుణించి జిహ్వపై నటిమ్పుము తల్లీ! 

అమెరికన్ సోదర సోదరీమణులారా! (రెండు నిముషములు నిర్విరామముగా కరతాళ ధ్వనులు)

నాకు మీరొసగిన మనః పూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ సమయంలో మీతో ముచ్చటించడం నాకు మహదానంద దాయకం..

ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేరిట మీకు నా అభివాదాలు! ( కరతాళ ధ్వనులు)
సమస్త మతాలకూ సర్వ ధర్మాలకూ తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేరా మీకు నా అభివాదాలు! 
నానా జాతులతో నానా సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేరిట మీకు నా అభివాదాలు!
         
సహనాన్ని సర్వ మతమూలా విశ్వసనీయతను లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని
గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే గాక సర్వ మతాలూ సత్యాలే అని మేము విశ్వసిస్తాము!            

సమస్త మతాలనుండి, సమస్త దేశాలనుండి పీడితులై, శరణార్ధులై వచ్చిన వారికీ శరణ్యమైనది నా 
దేశం అని నేను గర్విస్తున్నాను!

రోమన్ల నిరంకుశత్వానికి గురియై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారత దేశానికి
వచ్చి శరణుపొందిన యూదులను, నిజమైన యూదులు అనదగ్గవారిలో మిగిలినవారిని మా కౌగిట 
చేర్చుకున్నామని తెలపడానికి నేను గర్విస్తున్నాను!

మహా జోరాష్ట్రీయ సంఘంలో మిగిలినవారికి శరణమునిచ్చి నేటికీ వారిని ఆదరిస్తున్న సనాతన ధర్మం 
నా ధర్మమని నేను గర్విస్తున్నాను!

హిందువునైనందుకు, భారతీయుడనైనందుకు నేను గర్విస్తున్నాను. హిమాలయాలు కోటగా,
గంగ యమునా సరస్వతీ నదుల భక్తి, వైరాగ్య జ్ఞాన హారముల ముప్పేటగా, శీలమునకు శౌర్యమునకు 
సంపదకు నిలయమైన సురవాటిగా వెలిగే భారత భూమిలో జన్మించినందుకు నేను గర్విస్తున్నాను!

మిగిలిన ప్రపంచానికి బట్టకట్టుకోడం తెలియక దిసమొలలతో పచ్చిమామ్సాన్ని పీక్కుతినే పశుప్రాయులుగా ఆటవిక జాతులకు నిలయముగా వున్నతరుణంలో బంగారు జలతారు పట్టువస్త్రాలు ధరించి షడ్రసయుత భోజనం, షడ్తత్వ దర్శనం, తత్త్వ వివేచనా కలిగిన రాజర్షులకు మహర్షులకు విద్యకు, వైద్యమునకు, విజ్ఞానమునకు, జ్ఞానమునకు నిలయమైన భారత దేశం నా దేశము అని గర్విస్తున్నాను.

యథా నద్యః స్యన్ద మానాః సముద్రేస్తంగచ్చంతి నామ రూపే విహాయ 
తథా విద్వాన్ నామ రూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం..

అనేక పేర్లను కలిగిన వివిధ నదులు సముద్రునిలో కలిసినట్లు అనేక ఆచరణలు, సంప్రదాయాలు, భావ జాలాలు కలిగిన అనేక ధరములు, మతములు ఒకే భగవంతుని చేరుకుంటాయని ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పిన ప్రపంచపు తొలి జ్ఞాన వెలుగు, ప్రపంచములో ఇంతవరకూ వెలిసిన ధర్మములకు, ఇకపై వేల్లుఅవలై తల ఎత్తే సమస్త భావజాలవీచికలకు బీజములనందించిన విశ్వపు తొలి ధర్మమూ, మతము భావజాలమూ  నా ధర్మం. జ్ఞాన భిక్షను, ధర్మ భిక్షను, నాగరికతాభిక్షను ప్రపంచానికి ప్రేమగా అందించిన అన్నపూర్ణ నా భారత మాత!

చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః..దేవతలలో ఉత్తములైన వారిలోనూ మానవులలోనూ.. పశువులలోనూ..క్రిమికీటకాదుల లోనూ ఒకే పరమాత్మ తత్త్వం వెలుగొందుతున్నది అని ఎలుగెత్తి చాటిన జ్ఞాన భాస్కర సహస్ర కిరణ ప్రభా స్నాత, పునీత, ప్రపంచనేత, విశ్వవిజేత నా భారత మాత!

ఖడ్గంతో సమస్త విశ్వాన్నే గెలువగలిగినా ప్రేమతో, సహనంతో, దయతో, సానుభూతితో మనసులను గెలవడం నిజమైన, శాశ్వతమైన, పవిత్రమైన గెలుపు అని భావించిన శాంతి దూత నా భారత మాత!
 
... ...    ...   ...   ...   ...   ...   ...   ...   ...   ...   ...                 
   
ఈ మహా సభ గౌరవార్ధం నేటి ఉదయం మ్రోగించబడిన గంట సర్వ విధాలైన స్వమత దురభిమానానికీ,
పరమత ద్వేషానికి, కత్తితో గానివ్వండి, కలంతో గానివ్వండి, సాగించబడే నానావిధములైన హింసకు మాత్రమే గాక, ఒకే గమ్యాన్ని చేరుకునే మానవులలో కొందరి నిష్తుర ద్వేష భావాలకు శాంతి పాఠము కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను!

అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ
అసత్యమునుండి సత్యమునకు, అంధకారము నుండి వెలుగునకు, మృత్యువు నుండి అమరత్వమునకు పయనింతుము గాక..ఓం శాంతి: శాంతి: శాంతి:

(కరతాళ ధ్వనులు) 



ప్రణామ్యహం పరాశరాత్మజం జ్ఞాన భాస్కరం  
నమోస్తు ఆదిశంకరం సమస్త లోక శంకరం
జయోస్తు తే వివేకినం విశిష్ట విశ్వ లోకినం
స్మరామి జ్ఞాన,భక్తి,త్యాగ మార్గ తత్త్వ దర్శినం       ||వివేక శంకరం వివేక శంకరం||
వేద  వ్యాస జ్ఞాన మార్గ వాహినీ సరస్వతీ
ఆది శంకరాఖ్య   భక్తి మార్గమౌ పవిత్ర గంగ
వివేక త్యాగ వాహినీ  విశిష్ట యమున సంగమంగ
సోదరా త్రివేణి సోదరీ ఇదేను భరత వాణి              ||వివేక శంకరం వివేక శంకరం||
భారతీయమైన వేద మార్గ ధర్మ మర్మదం
మానవీయమై  పునాది సర్వ కర్మ శర్మదం
మాననీయమై మనేది మమత ధ్యేయమై చనేది
మన ధ్యేయం ఈ వసుధే కుటుంబ  మొకటనేది   ||వివేక శంకరం వివేక శంకరం||
శివంకరం, శుభంకరం, సమానతా లతాంకురం
సుభావిదం, సుఖప్రదం,సురత్త్వ  మార్గ తత్త్వదం,
వందనీయమైన హైందవీయ ధర్మ దర్శనం
అందమైన సర్వ విశ్వ నిత్య  సత్య స్పర్శనం......    ||వివేక శంకరం వివేక శంకరం||

(నేపధ్య గానము సాగుతుండగా సమస్త ధర్మములవారి చేత సమస్త జనులచేత కీర్తింప బడుతూ పూజింపబడుతూ వివేకానందుని జైత్ర యాత్రతో తెర వాలును)  
                       
                                                      
                                                          --శుభం--


నా మాట!


జనవరి, 2013 లో ఖమ్మంలో రామకృష్ణ-వివేకానంద భావప్రచార మహాసభలు జరిగినప్పుడు 
నిర్వాహకులు ఒక కార్యక్రమము ఏదన్నా మీరు చేయండి అంటే, ఎప్పటినుండో నా మనసులో 
మెదులుతున్న, నేను వ్రాయాలనుకున్న వివేకానంద, పోతన, ఆదిశంకరుల జీవితములపై నాటికలు మనసులో మెదిలి 'స్వామి వివేకానంద' నాటకం వ్రాసి ప్రదర్శన చేస్తాము అంటే సమయం తక్కువ ఉన్నదికదా, సాధ్యమేనా, అయినా మీరు మాట అంటే జరుగుతుంది అని తెలుసు, సరే! కానివ్వండి అన్నారు, మిత్రులు, ఆ కార్యక్రమ నిర్వహణా బాధ్యులు శ్రీమాన్ పరాశరం ప్రసాద్ గారు, ఖమ్మం వాస్తవ్యులు, రసాయనిక శాస్త్ర ఉపన్యాసకులుగా కొన్నేళ్ళక్రితం పదవీ విరమణ చేశారు ఆయన. 

మాట అయితే అన్నానుగానీ లోపల్లోపల భయంగా అనిపించింది నాకు. ప్రదర్శన ఇవ్వాల్సింది వ్రాయాల్సింది స్వామి వివేకానంద గురించి. ప్రేక్షకులు అఖిల భారతం నుండీ వచ్చే రామకృష్ణ 
మఠముల స్వామీజీలు, శారదా మాతలు. ఒక్క అంగుళం అటూ యిటూ అయినా నొచ్చుకుంటారు, నిర్వాహకులను ప్రశ్నిస్తారు. యిది ఒక అసౌకర్యం అయితే, వివేకానంద గురించి కనుక తాదాత్మ్యత తేలికగా చెందుతారు వారి గుండెల్లో నెలకొన్న దేవుడి ప్రశస్తి కనుక. నాకు వివేకానందుడు దేవుడు  
మాత్రమే కాదు, వ్యాసులవారు ఆదిశంకరునిగా, ఆ తర్వాత వివేకానందునిగా అవతరించారు అని విశ్వాసం. మరొకసారి ఆయన జీవిత చరిత్రను, ఇతర సంబంధిత గ్రంథాలను మూడు రోజులు, రాత్రులు  
తినడానికి, పడుకోడానికి, కాలకృత్యాలకు తప్ప లేవకుండా కూర్చుని అధ్యయనం చేసి ప్రణాళిక మనసులో వేసుకుని ఒకరాత్రి అంతా కూర్చుని వ్రాశాను. ఆ స్వామి దయ ఎలా ప్రతిబింబించిందో
చూసినవాళ్ళు, చదివినవాళ్ళు చెప్పాల్సిందే.

ఏడు రోజులపాటు ప్రతిరోజూ మధిర నుండి ఖమ్మం కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, రిహార్సల్స్ వేయించి ఏ రోజూ ఒంటిగంట అయ్యేది ఇంటికి వచ్చేప్పటికి. నేను విశ్రాంతి తీసుకోలేదు, ఎన్నుకున్న నటీనటులను విశ్రాంతి తీసుకోనివ్వలేదు. మొదటి రంగంలో జ్యోతిష్యుని పాత్రను నేను వేశాను. విశ్వనాథ దత్తునిగా మా చిన్న మేనత్త కొడుకు నళిన్ కుమార్, బాల వివేకానందునిగా మా అన్నయ్య చిన్న కొడుకు చక్రి, వివేకానందగా మా అన్నయ్య కృష్ణారావు, రామకృష్ణ పరమహంసగా మా కజిన్ వనం అప్పాజీ యితరులు వివిధ పాత్రలలో ప్రదర్శనలో పాల్గొన్నారు. మా వంశ మూల పురుషుడు, భక్త రామదాసు సమకాలికుడు, ఆయన మేనమామలను తానీషాకు పరిచయము చేసినవాడు, శ్రీరామ సాక్షాత్కారం పొందిన మహనీయుడు 'వనం శ్రీకృష్ణరాయ' స్మారక కళాపరిషత్, ఖమ్మం తరపున నాటకం ప్రదర్శించాము. స్వామీజీలు, శారదామాతలు పులకించారు. కొన్ని సన్నివేశాలను ప్రదర్శిస్తున్నప్పుడు వారు భావోద్వేగముతో ఆనందబాష్పాలను రాలుస్తుంటే నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. కానీ రచయితగా, దర్శకునిగా కొన్ని లోపాలు దొర్లిన సంగతి నాకు తెలుసు. అది సమావేశాలకు వేదిక కనుక, తెర 'ఆన్ అండ్ ఆఫ్' సౌకర్యం లేకపోయింది. ఒక పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడు, మరొక కార్యకర్త కర్టెన్ అటూ యిటూ పట్టుకుని, క్రింద ఆర్కేష్ట్రా దగ్గర నేను కూర్చుని లైట్స్ ఆన్-ఆఫ్ చెప్తున్నప్పుడు కర్టెన్ దించడం, ఎత్తడం చేశారు, స్వామి మీద భక్తితో! ఆర్కేష్ట్రా సమయానికి మంచి బృందం దొరకలేదు. నేపథ్య గీతాలను నేనే పాడాల్సివచ్చింది నేను ఉన్న సన్నివేశం పూర్తి ఐన తర్వాత, గాయకులను పెట్టి, వారికీ సాధన చేయించే సమయం లేకపోవడం వలన. దానితో మరింత శ్రమ ఐంది నాకు. ప్రేక్షకులు మాత్రం లీనమై, ఆనందభరితులు అయినారు అనడంలో సందేహం లేదు! ప్రదర్శన ఐపోగానే నన్ను హత్తుకున్న పెద్దలు, కళ్ళలో తడితో నా చుట్టూ మూగిన పిన్నలు, పెద్దలు, యువకులు 'నిన్ను పొగడకూడదయ్యా! మీ నాన్న రామారావు గారు అదృష్టవంతుడు' అన్నారు శ్రీ చేకూరి కాశయ్య, జిల్లా పరిషత్ అధ్యక్షునిగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ముఖ్యులలో ఒకరిగా, హిందీ,
తెలుగు, ఇంగ్లీష్ సాహిత్య ప్రేమికునిగా ఖమ్మం జిల్లాలో సుపరిచితులు, మా నాన్నగారి మిత్రులు 
ఆయన. 

జ్ఞాపికలు అందిస్తున్నప్పుడు హైదరాబాద్ స్వామీజీ, ఇతరులు నా చేతులను అలానే పట్టుకుని నా కండ్లలోకి ప్రశంసగా, ఆనందంగా చూసినప్పుడు 'స్వామికి' మనసులో ధన్యవాదాలు తెలిపాను.

నా స్వల్ప ప్రతిభతో సాధ్యమైనంత వరకు స్వామి వ్యక్తిత్వానికి అడ్డం పట్టడానికి సంభాషణలలో సన్నివేశ రూప కల్పనలో ప్రయత్నం చేశాను. ఇందులో స్వామి పాడిన పాటలు మీరా భజనలకు నేను చేసిన అనువాద కీర్తనలు. దాదాపు పది, పదిహేను రోజులు వివేకానంద ధ్యానానందసాగరంలో మునకలేశాను ఈ నాటకం కారణంగా.  'వివేకభాసా కమనీయ కాంతిం వివేకినం తం సతతం నమామి' అనడం కన్నా నేను చేయగలిగినది ఏముంది!   

No comments:

Post a Comment