పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Wednesday, August 21, 2019

' శ్రావణ శ్రీ ' (ఖండిక)


 
' శ్రావణ శ్రీ ' (ఖండిక)    
వనం వేంకట వరప్రసాదరావు.



శ్రీరస్తు!


శ్రావణమాసం వచ్చిందంటే ప్రకృతికి పులకింత. చిరు చిరు జల్లులతో మేనులకు
గిలిగింత. రైతన్నకు ఆనందపు తుళ్ళింత. స్త్రీలకు, బాలికలకు సామాజిక
కలయికలకు వేదికైన పేరంటాలు, నోములు, వ్రతాలతో కేరింత. ఎక్కడ చూసినా
పచ్చదనమే శ్రావణంలో. బాలికల, తరుణుల, స్త్రీల కాళ్ళకు పేరంటాల పసుపుతో
పసుపు పచ్చ శోభ. పొదలకు, తీవెలకు, చెట్లకు మొలకలెత్తే చివుళ్ళతో తలలెత్తే
మొగ్గలతో ఆకుపచ్చని శోభ. కొత్తకోడలి బుగ్గలకు ఆషాఢమాసపు అడ్డంకులు తొలిగి
మగని దర్శనంతో సిగ్గుల శోభ. జల్లులకు ఝల్లనే చల్లనిగాలికి తట్టుకోలేని వారికి
యిప్పటిదాకా మడతపెట్టి దాచిపెట్టి బయటకు తీసిన రగ్గుల శోభ! శ్రావణ
భాద్రపదాలతో పండుగల ఊపు అందుకుంటుంది.        


1.
శ్రావణ భాద్రపదంబుల 
తావుల విరి కళల ఝరుల దనరెడితరులన్ 
దీవెనలిడు సిరి గణపతి 
దేవుల కొలువగుత భరత దేశమునందున్   (కం)


శ్రావణ భాద్రపద మాసాలలో పొదలలో తీగలలో పూలకళతో, వాగుల, ఏరుల, నదుల
గలగలలతో, పచ్చ పచ్చగా చెట్లు మురిసిపోతాయి. ఆశీస్సులిచ్చే గౌరి, లక్ష్మి, గణపతుల
కొలువు అవుతుంది భారత దేశంలో, విశేషించి తెలుగువారి ఊళ్ళల్లో.  


2.
శ్రావణ శుభ భృగువారము
పావన మరుదెంచె నలరి భార్గవి కరుణన్ 
దీవనల  సువాసినులుగ 
గావగ నోములఁ  శుభములఁ గాంచుడి మహిళల్!     (కం)


శుభప్రదమైన శ్రావణ శుక్రవారం తొలి శుక్రవారం వచ్చేసింది. శ్రీలక్ష్మి కరుణతో
దీవెనలతో మాంగళ్యశోభతో కళకళలాడడంకోసం, నోములతో శుభములను
మహిళలు పొందెదరు గాక.    


3.
శ్రావణ మరుదెంచె నడచు  
పూవనములు  ముదితలు విరబూసిన నగవుల్ 
పోవలె పేరంటము లిక   
తావుల ఘుమ ఘుమల గుములు తరుణుల సభలన్  (కం)


శ్రవణం వచ్చేసింది. స్త్రీలు నడిచే పూలవనాలు, వారి నవ్వులే విరబూసిన పువ్వులు.
యిక పేరంటాలకు పోవడం మొదలు. స్త్రీల సమావేశాలలో, పేరంటాలలో, పొదలలో 
విరుల ఘుమఘుమలు మొదలిక. 


4.
బారులు తీరె నాకమొకొ భవ్యము హైందవ రత్నభూమియో
తీరిన వారు దేవతలొ తీయని పల్కులొ తేనె చిల్కులో
తీరెను సంశయంబు లిక తీయ తెనుంగుల ఆడుబిడ్డలౌ   
వారలు శ్రావణాన చనువార లహో! పదిమైళ్ళ కైదువుల్       (ఉ) 


యిది హైందవ రత్న భూమియా, స్వర్గమా అని, ఆ బారులుతీరినవారు దేవతలా
లేక మానవ కాంతలా అని, ఆ తీయనివి వారి పల్కులా, విరితేనెల చినుకులా అన్న
సందేహం తీరిపోయింది. ఆ బారులు తీరినవారు తీయని తెనుగింటి ఆడపడుచులు.
వారు ఐదువలు అంటే సువాసినులైన సుమంగళ మూర్తులు. పసుపూ కుంకుమకోసం
పదిమైళ్ళు వెళ్ళాలి అనేది పవిత్రమైన తెలుగు సామెత. అలా వెళ్ళాలి అనే
అందమైన కోరికను అణువణువునా నింపుకున్న భారత మాతృమూర్తులు, తెనుగు
తల్లులు వారు! 


5.
పులకల సరసపు పురుషులు 
మొలకల పెసలును శనగలు మోమున తళుకుల్
చిలికెడు తరుణులు మరులును    
సెలలు నదులు మదులు పొదలు సెగ శ్రావణమౌ   (కం)


సరసపు పులకలతో పురుషులు, మొలకలతోపెసలు, శెనగలు, ముఖాలలో తళుకులతో 
తరుణులు, సెలలయ్యే నదులతో, పొదలతో, మరులతో శ్రవణం సెగ పెడుతుంది!


6.
చానల సోకు పైటతెరఁ చాపముఁ చాపను చేడె కన్నులన్
వానలఁ నవ్వులన్ పువులవన్, వరెవా! కురులందు మేఘముల్
లీనము, శ్రావణాం బుదము, లీగతి జేతుమటన్న మన్మథుం
డానన మూపె భేషనుచు డాసెను శ్రావణ మాసమేఘముల్          (ఉ)


స్త్రీల పవిటలమాటున నీ చెరకు వింటిని, నీ జెండా గురుతైన చాపను వారి కనులలో,
మా వానలను వారి నవ్వుల పూలవానలుగా, యిలా చేద్దాము అన్నాయి శ్రావణమేఘాలు
మన్మథునితో. భేష్! అలాగే అని తల పంకించాడు మన్మథుడు. శ్రావణమేఘాలు
వచ్చిపడ్డాయి.


7.
అమ్మ వేలును బట్టి ఆతురంబుగ జను    
పెసలు శనగలకై పిసిని యొకడు    
పోతు  పేరంటమా? పోర పిల్లడ యన్న  
బుంగమూతిగ ముద్దు బుడత యొకడు
వాయినంబుల నివ్వవా యన్న లేదన్న  
వా తెరచి కుమిలి వగచు నొకడు 
అమ్మ నాకెక్కడే అరటి పండ్లని యంచు 
రొమ్ము బాదుకు రొప్పి రోజునొకడు                          (సీ)


8.
దొంగలెవరు నన్ను దోచిరో అక్కటా  
పొందు టెట్లు కోలుపోతి  ధనము  
పసిడి వెలుగు లెచట పసిదనం బెచ్చటా   
విసుగు లిచట నాటి విందు లెచట?                       (ఆ.వె.)


అమ్మవేలును పట్టుకుని ఆత్రంగా వెళ్ళే పెసల శనగల పిసినారి పిల్లడు ఒకడు.
పోతు పేరంటమా? పోరా పిల్లాడా అని ముద్దుగా సరదాగా కసిరితే బుంగమూతి 
పెట్టిన ముద్దు బుడతడు ఒకడు. నాకు పండ్లు, శెనగలు, పెసల వాయినము యివ్వవా 
అంటే, లేదు అనడంతో నోరు తెరిచి పెద్దగా ఏడ్చే, కుమిలేవాడు మరొకడు. అమ్మా!
నాకు అరటిపండ్లు ఇవ్వలేదేంటే అని రొమ్ము బాదుకుని, రొప్పే  రోజేవాడు మరొకడు.
యిది మగపిల్లల హడావిడి శ్రావణంలో, ఒకప్పుడు, మధురమైన కాలం ఉన్నప్పుడు,
కవి చిన్నప్పుడు. అందుకే ఏ దొంగలు నా పసిదనం అనే ధనం దోచుకున్నారో,
ఎలా తిరిగిపొందడం, ఆ బంగారు బాల్యపు వెలుగు లెక్కడ? నా బాల్యం, అమూల్యం,
అదెక్కడ? నాటి విందులు ఎక్కడ? యిప్పుడు విసుగులే యిక్కడ అని బాధ కవికి. 


9.
ఆషాఢము గతియించెను 
యోషా మగనిల్లు జొరుట యొప్పును నిజమౌ 
భూషాదులు గద కోడల!
భాషాదులలో వినయము భద్రము తల్లీ!                   (కం)


ఆషాఢమాసం వెళ్ళిపోయింది. యిక అత్తగారింటి గడప తొక్కొచ్చు! ఓ కొత్త కోడలా!
పలుకు, నడత మొదలైనవాటిలో అణకువ, వినయము యివే నిజమైన ఆభరణాలమ్మా!
జాగ్రత్త తల్లీ, శుభం తల్లీ అని కోత్తకోడలికి జాగ్రత్తలు, ఆశీస్సులు.  


10.
అత్తరు లలదగ నేటికి 
మెత్తని పలుకుల పరిమళ మెత్తిన చాలున్ 
పుత్తడి బొమ్మా అమ్మగ
అత్తను గనుమమ్మ మగని యమ్మయు నమ్మౌ                     (కం)


అత్తరులు పూసుకోవడం ఎందుకు, అక్కర్లేదు. మెత్తని పలుకుల పరిమళం చాలు, అదే 
నిజమైన పరిమళం. ఓ పుత్తడి బొమ్మా! అత్తను కూడా అమ్మను చూసినట్లే చూసుకో.
నీ మొగుడి తల్లి నీకూ తల్లివంటిదే! 


11.
అత్తయు నొకనాడు మరొక 
అత్తకు కోడలు కొమరిత యౌనది ఒకచోఁ 
అత్తగ కోడలిని గనకు 
మెత్తగ కూతురుగ గనుము మేలగునత్తా!                (కం)


అత్తా! ఇప్పుడంటే నువ్వు అత్తవు ఐనావు కానీ, ఒకనాడు నువ్వూ ఒక అత్తకు కోడలివే,
మరిచిపోకు. అప్పుడు కోడలుగా నీకున్న ఆశలు, కోరికలు, సరదాలు, ఆరోగ్యము,
అనారోగ్యము అన్నీ యిప్పుడు నీ కోడలికి కూడా ఉంటాయి. అత్తలాగా కోడలిని 
చూసినట్టు చూడకు, అసలే కొత్త చోటు, కొత్త కొత్త మనుషులు, పిల్ల కంగారు పడుతుంది.
మెత్తగా, నీ కూతురును చూసినట్టే నీ కోడలిని కూడా చూడు, మేలు కలుగుతుంది నీకు,
ఆమెకు, అందరికీ! 


12.
పట్టీ లాషాఢ ములవి 
చిట్టీలవి వీలెపుడని చిరు చిరు కొసరుల్ 
పట్టీలిక శ్రావణమున 
పట్టులనిక గుట్టు మట్టు పరువపు తెట్టుల్                (కం)


అప్పుడు ఆషాఢమాసంలో 'ఆషాఢ పట్టీ' అని కొత్తల్లుడికి చిరుకానుకల హడావిడి.
ఆషాఢ మాసంలో కొత్త దంపతులు దూరంగా వారి వారి పుట్టిళ్ళల్లో ఉండడంతో,
కలుసుకోవాలని, కబుర్లాడుకోవాలని కోరికలతో 'చిట్టీల' గిరాకీ అబ్బాయికీ అమ్మాయికీ 
మధ్య(సెల్ ఫోన్లు, అంతర్జాలం లేనప్పుడు ఇలాంటి సరసపు సరదాలు ఉండేవి,
ఒకప్పుడు) యిప్పుడిక శ్రావణం వచ్చేసింది. యిప్పుడు 'శ్రావణ పట్టీ' పేరుతో
అమ్మాయికి అత్తింటి బహుమానాల, కానుకల  గిరాకీ. ఆషాఢపు అడ్డంకి
తొలిగిపోయింది కనుక, యిద్దరూ ఒక్క దగ్గరికి చేరుకున్నారు కనుక, పరువాల
తెట్టులు, గుట్టుమట్టులు, పట్టుకు చిక్కుతాయి అల్లుడుగారికి! 

13.
విరిసెను సరసులఁ కలువలు
కలువలు గద కలికి కనులు కనులన్ కలలన్ 
చెలియని తలపులు నగవులు 
అలరెడి కళకళలు యింటి యల్లుని కనగన్            (కం)


శ్రావణమాసంలో వర్షాలతో నీరు నిండిన సరసులలో కలువలు విరిశాయి. మగని
దర్శనంతో కలువలవంటి అమ్మాయి కనులు కూడా విరిశాయి. ఆమె కనులలో,
కలలలో కూడా చెలికాని తలపులు, నగవులే! యిక అత్తగారి ఇల్లు కూడా
అల్లుడుగారి దర్శనంతో కళకళలాడిపోయింది.


14.
పొలమున నిండుగా పొంగెడి గంగలో 
రైతు దమ్ములయందు రాజహంస
గగన మధ్యంబనే గాఢ వారాశిలో 
నీదులాడేను తాఁ నెవల రాజ    
హంస; సమము రాత హంసవాహనుడిచ్చె
నేల నొకడు నుండు నింగి నొకడు  
కళ లేని ముఖముతో కళ లెండు ముఖమున  
నేల రాజు యొకడు నింగి రాజు                                (సీ)   


15.
భూమి పుత్రుడొకడు భూమి కంతకు మామ 
ఒకడు భూమిఁ దున్ను నొకడు చుట్టు 
శ్రావణంబు నందు రాజు లిద్దరొకటి     
తడియుటలను సమము తలల రాత                    (ఆ.వె)

శ్రావణమాసంలో రెండు రాజహంసలు కనిపిస్తాయి. సరిగా అదనుకు వర్షాలు కురిస్తే 
పొలంలో పొంగే గంగలో భూమిని దున్ని, విత్తనాలు మొలవడానికి అనువుగా మెత్తగా 
చదునుచేస్తూ 'దమ్ములు' చేస్తూ రైతు అనే ఒక రాజ హంస. నీలిసముద్రం వంటి నీలి 
గగనమధ్యంలో చంద్రుడు అనే మరొక రాజహంస. ఒకడు నేలమీద, ఒకడు ఆకాశంలో,
యిద్దరికీ ఒకే రకంగా తలరాత పెట్టాడు హంసవాహనుడు, బ్రహ్మ. వర్షాలు పడితే
పొలం పనులలో అలిసి కళ తప్పిన ముఖముతోనో, వర్షాలు పడకుంటే నిరాశతో
కళ తప్పిన ముఖముతోనో రైతు ఉంటాడు. శ్రావణమాసంలో వర్షాలు పడితే, పున్నమి
రోజులు అయినా అమావాశ్య  రోజులు అయినా మేఘాల మాటున, వర్షపు పరదాల
చాటున కళ తప్పి మసక మసగ్గా ఉంటాడు చందమామ. ఒకడు భూమిపుత్రుడు,
రైతు. ఒకడు భూమిమీది వారందరికీ మామ. ఒకడు భూమిని దున్నేవాడు, రైతు.
మరొకడు భూమిని ప్రదక్షిణగా చుట్టబెట్టేవాడు, చందమామ. యిద్దరు రాజులూ
ఒకటే, తడిసిపోవడంలో, 
తలల  రాతలో.      


16.
నిలువున పూర్తిగా నిండి కళంకంబు 
కళ్ళకు నల్ల చెంగలువ యొకడు 
గతము నొక్కండు తాఁ కామ పాశంబులో 
చిక్కినాడన్న దౌ చిన్ని మచ్చ   
అరుదగు నిద్రలో అందిన సేద్యంపు  
గాదెల ధాన్యంపు కలల నొకడు
నిండు పున్నమి నాడు నింగిఁ వెలుగు పంట 
గాఁ తను పండించు కళల నొకడు                      (సీ)


17.
కర్షకుండు ఒకడు కామవర్థి యొకడు    
ఒకడు తాపమొందు నొకడు యిచ్చు 
శ్రావణంబు నొకడు సాంద్ర మేఘాలలో 
నీట నొకడు, కంటి నీటిలోన!                          (ఆ.వె.)

శ్రావణమాసంలో నిలువునా బురద అనే కళంకం అంటిన వాడు రైతు. గతంలో 
కామపాశంలో చిక్కుకుని, గురుపత్నితో బంధం పెట్టుకున్నాడన్న కళంకం 
అంటినవాడు ఒకడు, చంద్రుడు. అరుదుగా పట్టే నిద్రలో చేతికి అందిన పంటగురించి,
నిండిపోయిన ధాన్యపు గాదెలగురించి కలలు గనేవాడు ఒకడు, రైతు. నిండు పున్నమి 
రోజున ఆకాశాన్ని వెలుగులపంటగా పండించేవాడు ఒకడు, చంద్రుడు. ఒకడు 
కర్షకుడు, ఒకడు కామవర్ధి(చంద్రుడు). ఒకడు సాంద్రమేఘాలమాటున ఉంటాడు, 
చంద్రుడు. ఒకడు వానలు పడితే పొలంలో వాననీటిలోనో, పడకుంటే నిలువునా
కంటినీటిలోనో మునిగి ఉంటాడు, రైతు!     


18.
ఎగనామము బడికి ఎగురును బుడుగు     
పాడు ఉద్యోగంబు పంతుళ్ళ సణుగు  
లేద కళ్ళా? పంచు లేమనౌ చుట్టు     
ముదనష్టమని ముష్టి మురికిగ తిట్టు
మిడిసిపాటు పునుగు మిర్చీల బండ్లు
తనివి దీరును రైతు తలఁ కడగండ్లు
దవఖానలకు డబ్బు దగ్గులు జబ్బు  
లయ్యకంటికి ఆలి లావణ్య మబ్బు            (మం.ద్వి)

ఏమాత్రం చినుకు పడ్డా, వర్షం పడుతుంటే ఎలా వెళ్ళడం అని బడికి ఎగనామం 
పెట్టి 'బుడుగు'(లు), బడికి వెళ్ళే  సమయం అయిపోగానే అదే వర్షంలో ఎగుర్లు 
పెడతారు. పంతుళ్ళకు మాత్రం వెళ్ళడం తప్పదు, పాడు ఉద్యోగం అని 
సణుగుతారు, లోలోపలే. తెలారగట్ల వర్షం పడ్డదా, కళ్ళాపు చల్లే పని లేదులే అని 
బద్ధకంగా యింకా కొద్దిసేపు పడుకుందామనుకున్న పడతిని, సరసంగా 
చుట్టుకుంటాడు పతి, కళ్ళాపు లేదా? అంటూ. ముదనష్టపు వాన అని ఏ కొట్టు 
అరుగుమీదో, ఏ చెట్టుకిందో కూర్చున్న ముష్టివాడు తిట్టుకుంటాడు, అడుక్కుని 
తినడం యిబ్బంది అవుతుంది అని. నాలుగు జల్లులు పడితే చాలు, పునుగులు 
మిరపకాయబజ్జీలు అమ్మే తోపుడు బండ్లు మిడిసి మిడిసిపడతాయి, గిరాకీతో.
దగ్గులు, జబ్బులు, దవాఖానాలకు డబ్బులు పెరుగుతాయి వర్షాలతో. కదలడానికి  
వీల్లేక యింట్లోనే కూర్చోవడంతో, తీరిగ్గా చూసే అయ్యకంటబడుతుంది ఆలి 
లావణ్యం.     


19.
శ్రావణంబుఁ కథలు రసములు వెతలును              
వనము లందు విందు బర్హి చిందు  
దూర మయిన జంట దుఃఖ మందు కడకు       
గూడు లేక కుములు గుండె మడుగు               (ఆ.వె.)


యిలా శ్రావణమాసపు కథలు రసమయంగా ఉంటాయి, శోకరసమయంగానూ ఉంటాయి.
శ్రావణ నీలిమేఘాలను చూసి, వనములలో నెమళ్ళు చిందుల విందు చేస్తాయి. ఒకరికి 
ఒకరు దూరంగా ఉన్న జంటలు తట్టుకోలేని  విరహ భారంతో శోకంలో ఉంటారు. వారే 
నయము అన్నట్లు కావచ్చు, చివరికి తల దాచుకోడానికి గూడైనా లేని గుండెలు 
మడుగులు అవుతాయి!  


20.
ఒంటి నిండ బురద ఉద్దె రిల్లు బురద  
కంటినిండుగ బారు కలల వరద 
అడుగుఁ వర్ష మెపుడు? ఆశఁ జూచును పైకి
మబ్బు తేలంగ బోఁ మానములును  
అదను మీద పొలము అపుడు వర్షము రాదు 
యిచ్చి చచ్చినవాడు ఇంట నిలుచు 
నల్లపూస గొలుసు నాలి సేటుకు ఋణం    
ఉంది పురుగు మందు ఉంది ఉరికి                 (సీ)


21.
తాడు పుస్తెలున్న తా డచ్చటే ఉంది!  
ఒకటి, తెంపు టన్న  దొదిలె బాధ!
రావె శ్రావణంబ! రావె వర్షంబుగా!  
అన్న రైతు ఉండు, నన్న ముండు!                 (ఆ.వె.)


కాసిని చినుకులు పడితే ఆశగా పొలం పనులు చేసి, ఒంటినిండా బురదతో, 
పెట్టుబడికోసం వడ్డీకి తెచ్చి తెచ్చి ఇల్లు తాకట్లు అనే బురదలోఉంటుంది బక్క రైతుకు.
కన్న కలలు అన్నీ నీరై, కంటి నీరై, వరదలై కనులవెంట కారుతుంది. వర్షం ఎప్పుడు 
పడుతుంది? అని అడుగుతాడు అయ్యగారినో, ఎవరినో. ఆశగా పైకి చూస్తాడు, 
ఆకాశంలోకి. పట్టినట్టే పట్టిన మబ్బు తేలిపోతుంది, దానితోపాటే మానమూ 
తేలిపోతుంది, అప్పు తెచ్చిన దగ్గర మాట పోతుంది, పరువు పోతుంది. అదనుమీద 
పొలం ఉంటుంది. అప్పుడు వర్షం రాదు. అప్పు యిచ్చినవాడు ఇంట నిలిచి అరుస్తాడు 
చచ్చినోడు. పోనీ ఇంకేమన్నా కుదువబెట్టి వాడి బాకీ కొంతైనా తీరుద్దామంటే, చివరికి 
నల్లపూసల గొలుసు, పసుపుతాడు కూడా నాలి సేటుకు ఋణం, అక్కడే ఉంది.
ఇంకేముంది, పురుగు మందు మాత్రం ఉంది, వేళ్ళాడడానికి ఉరికి తాడు ఉంది. 
పుస్తెల తాడు అక్కడే, సేటు దగ్గరే కుదువ ఉంది. అందులో ఒక సౌకర్యం ఉంది, 
పుస్తెలు తెంపడం అన్న బాధ లేదు, పుస్తెలు ఉంటేగా తెంపడానికి!  


ఓ శ్రావణమా! రావే! వర్షంగా రా, నామమాత్రపు శ్రావణంగా కాకుండా, వర్షపు శ్రావణంగా 
రా! వర్షం ఉంటేనే రైతన్న ఉంటాడు. రైతన్న ఉంటేనే అన్నం ఉంటుంది, అని కవి 
శ్రావణ లక్ష్మిని వేడుకుంటున్నాడు!     


22.
అనవిని శ్రావణ మిట్లను
వనముల నరికిరి కిరి కిరి వదలుము వనమా! 
నను నిలుపగ లేదు వనము  
విను! ఋతు పవనంబు రాదు వింత తుఫానుల్!             (కం)


విన్న శ్రావణము యిలా అన్నది. నీ కిరికిరి, గొడవ వదలవయ్యా వనమా! అడవులను 
నరికిపారేశారు, నన్ను, మేఘాలను నిలిపి ఉంచడానికి లేకుండా. విను! ఋతుపవనము
కాదు వచ్చేది, వింత వింత తుఫానులే!   


23.
గుస్సాయని తుడిచె నొకటి     
హిస్సన్నది ఒకటి యొకటి హిట్లరు యని! తే
జస్సన్నది లేకున్నది 
యిస్సీ! భూసురులఁ,  ప్రభులఁ, యింతుల యందున్               (కం)


ఆ తుఫానులకు మళ్ళీ చిత్ర విచిత్రమైన పేర్లు! 'గుస్సా' అని ఒకటి తుడిచిపెట్టింది.
'హిస్సు' అనే తుఫాను ఒకటి, 'హిట్లర్'అనే తుఫాను ఒకటి, ఇవీ పేర్లు అంటున్నది 
శ్రావణ శ్రీ వ్యంగ్యంగా. అయ్యో! ఛీ! బ్రాహ్మణులలో, విద్వాంసులలో, ప్రభువులలో, 
స్త్రీలలో తేజస్సు అన్నది లేకుండా పోయింది, శీలం లేకపోవడంతో. 


24.
భూపతు లొకటికి, యొకటికి  
ఈ పుడమికి సురు, లొకటికి యింతులు బాధ్యుల్
పాపము నెరుగని నడతల 
నాపక మూ డొకనెల కవ ననువగు వానల్                         (కం)
  
ప్రజలను పాలించేవాళ్ళు, స్త్రీలు, బ్రాహ్మణులు(విద్యాధికులు)సత్శీల సంపదను 
కలిగి వుంటే, పాపపు నడతలు లేకుంటే, ఒక్కొక్కరి పుణ్యాన, ఈ ముగ్గురి కారణంగా, 
నెలకు మూడువానలు పడతాయి అన్నది భారతీయ సంప్రదాయం, ఆర్యోక్తి. అలా 
జరగడం లేదు, అది కూడా ఒక కారణమే, కనుక తుఫానులే తప్ప వానలు లేవు 
అంటున్నది శ్రావణ శ్రీ!


25.
సంధ్యవందనమన్న  సంత యన్నది లేదు 
పక్కింటి సంధ్యకై పాట్లు తప్ప 
అగ్నికార్యమనెడి హాస్యమన్నది లేదు 
సిగరెట్టుకై నిప్పు చింత తప్ప 
పారాయణంబుల పాప చింతన లేదు 
చీట్ల పేకాట ప్రసిద్ది తప్ప 
జపతపంబుల అంటుజాడ్యంబులును లేవు 
ధనము తరుణులకై తపన తప్ప                           (సీ) 


26.
అందరట్లు లేరు అధికు లట్లుండగా   
వందలందు ఒకడు వంద్యుడుండు 
కాన ఇంతకైన కారకులు తమరు 
కనులు తెరువరయ్య గనుడు శుభము                   (ఆ.వె.)


సంధ్యావందనము అనే  సంత లేదు, పక్కింటి సంధ్యకోసం పాట్లు తప్ప.
అగ్నికార్యాలు, హోమాలు అనే హాస్యం లేదు, సిగరెట్టుకోసం నిప్పుకోసం చింత తప్ప.
పారాయణలు అనే పాప చింతన లేదు, చీట్ల పారాయణంలో ప్రసిద్ది తప్ప. జప 
తపాలు అనే అంటురోగాలు లేవు,డబ్బుకోసం, స్త్రీలకోసం తపన తప్ప అన్నది 
శ్రావణలక్ష్మి వ్యంగ్యంగా. మళ్ళీ తనే అందుకుని, అందరూ అలా లేరులే, ఎక్కువశాతం 
అలా ఉన్నారు. వందమందిలో ఒకడు నమస్కారానికి అర్హుడు, ఉత్తముడు ఉన్నాడు!
కనుక దీనికి అంతటికీ కారకులు మీరే, మీ  మానవులే. యికనైనా కనులు తెరిస్తే 
శుభములను చూస్తారు అన్నది.

27.
ప్రజల చింతలెపుడు ప్రభుల మనసులను  
ప్రజలనగ సుతులుగ ప్రథమ ప్రజలు 
ప్రజల బాధలెల్ల ప్రభుల బాధౌనుగా 
ప్రజలకొరకు ప్రభులు బ్రతికి యుండ            (ఆ.వె.)


ప్రజలు అంటే సంతానము అని అర్ధం కనుక, ప్రభువులకు, పాలకులకు ఎప్పుడూ తమ 
ప్రజల (సంతానం) గురించే చింత. ప్రజల (పుత్రుల) బాధ వారి బాధే. కనుక వారి
సంతానం కోసమే, వారి ఉన్నతి కోసమే ప్రభువులు, పాలకులు బతుకుతున్నారు.


28.
మా వలెనె నడుపుట మా ప్రజల కెరుక 
మా సుతులుగ ప్రజలు మాకు యనుచు
ప్రజల కెట్లు గలుగు ప్రభలు సభలనుచు  
ప్రభులు దీర్చు టకిది ప్రబలవాంఛ     (ఆ.వె)
      
ప్రజలకు (వారి సంతానానికి) 'ప్రభలు' ఎలా కలుగుతాయో అన్నదే ప్రభువులకు
ఆలోచన, చింత. అందుకోసమే వారు సభలు తీరుస్తారు, వారసులను ప్రకటిస్తారు.
' మాలాగా పాలించడం నా సంతానానికి తెలుసు. నాకైనా మీకైనా ప్రజలు అంటే
మా సంతానమే' అని సిగ్గు లేకుండా ప్రకటిస్తారు.


29.
ఆమె కిద్ద రున్న, అతనికి ముగ్గురు!
సిగ్గు నెగ్గు లేదు, శీలమున్న 
గాదె, మీకు కలుగు కలుములు, శుభములు!
నడత సరిగ నున్న నరుడు గెలుచు!                    (ఆ.వె.)


ఆమెకు యిద్దరు, ఆయనకు ముగ్గురు! సిగ్గు ఎగ్గు లేకుండా యిలా ఉంటున్నారు
చాలామంది స్త్రీ పురుషులు. శీలము ఉంటేనే కదా మీకు శుభములు కలుగుతాయి.
నడత సరిగా వుంటే నరుడు గెలుస్తాడు, ఎప్పుడైనా, ఎక్కడైనా.


30.
నడత దిద్దు కొనుము నరుడ శుభమగును 
సిరులనిచ్చు ధర్మ శీల నిరతి  
విను సుగుణము లున్న వీధిన బడకున్న  
నరుక కున్న చెట్లు నరుడు నిలుచు                (ఆ.వె.)


కనుక, ఓ నరుడా! నీ నడతను దిద్దుకో! శుభముకలుగుతుంది. ధర్మము, శీలములపట్ల 
ప్రేమ సిరులను యిస్తుంది. ఓ నరుడా! విను! సుగుణములు వుంటే, వీధిన పడకుంటే,
చెట్లు నరుకకుంటే నరుడు నిలుస్తాడు, వృద్ధిని పొందుతాడు.


31.
చెట్టు వర్షమిచ్చుఁ , చేరఁగా నీడయూ   
నిచ్చుఁ, పండ్లనిచ్చుఁ,  నిచ్చుఁ శాంతిఁ  
చెట్టుఁ నరుక కండి, చెట్టు చల్లని తల్లి! 
వృద్ధి నిచ్చుఁ ధర్మ వృక్ష రక్ష!                         (ఆ.వె.)


చెట్టు వర్షాన్నియిస్తుంది. దగ్గరికి చేరితే నీడను యిస్తుంది. పండ్లను యిస్తుంది. శాంతిని,
హాయిని యిస్తుంది. చెట్టు చల్లని తల్లి! ధర్మమూ చల్లని తల్లి వంటిదే, కనుక, ధర్మాన్ని, 
వృక్షాన్ని రక్షించడం వృద్ధిని యిస్తుంది. 


32.
అన్నది శ్రావణ శ్రీ తను 
విన్నది విన్నటుల విన్నవించితినయ్యా 
ఎన్నుట లెవరిని గాదిది 
ఉన్నది ఉన్నటుల పలుకుటున్నది గుణమై!        (కం)


అని అన్నది శ్రావణ శ్రీ. నేను విన్నది విన్నట్లే విన్నవించాను, ఎవరివీ తప్పులు
ఎన్నడానికి కాదు. ఉన్నది ఉన్నట్లు అనడం నా లక్షణం, ఉన్నది ఉన్నట్లు అనడం 
ఉత్తమ గుణం అంటున్నాడు కవి. 


33.
వందనమిడి శ్రావణ సతి 
కందరికిని సుగుణములను కలిమియు శుభమున్  
పొందగు వర్షము కర్షకు  
లందగ నిడుమన నగవుల లల నౌ ననియెన్               (కం)


శ్రావణ సతికి వందనములు చేసి, అందరికీ సుగుణములను, సంపదను, శుభములను, 
కర్షకులకు పొందైన వర్షమును యివ్వుమమ్మా అని ప్రార్ధించాడు కవి. నవ్వుతూ అలాగే 
అవుతుంది అన్నది ఆ లలన, శ్రావణ శ్రీ.


34.
శ్రావణమున శుభముల జడి 
రావలె, నీ ధరణి శాంతి రాగపు నెలవై 
పోవలె, సిరి గౌరి కొలువు 
కావలె, భారతియు,  భరతకాంతకు జయమౌ!            (కం)


శ్రావణంలో శుభముల జడివాన రావాలి, శుభప్రదమైన జడివాన రావాలి. ఈ భూమి 
శాంతికి, అనురాగానికి నెలవుగా కావాలి. లక్ష్మి, పార్వతి, సరస్వతీ మాతలు కొలువు 
తీరాలి. భారత మాతకు జయం కలగాలి అని కోరుతున్నాడు కవి.


శ్రావణ పౌర్ణమి - జంధ్యాల పౌర్ణమి


35.
జన్నిదముల పౌర్ణమి దిన
మున్నతి గొన నూత్న యజ్ఞ ఉపవీతములన్
అన్నలు ధారణ జేయుడి  
మన్ననఁ గాయత్రి మనన మాన్యత లొసగున్  (కం)


శ్రావణ పౌర్ణమి వచ్చింది. యిది జంధ్యాల పౌర్ణమి అని ప్రతీతి. అన్నలారా! ఈ రోజున 
కొత్త జంధ్యాలను ధరియించండి! జంధ్యాలు అనేది మామూలు వాడుక, నిజానికి అవి
యజ్ఞోపవీతాలు. మన్ననగా గాయత్రీ మననము మాన్యతను అంటే గౌరవాన్ని
ప్రసాదిస్తుంది. 


36.
బ్రాహ్మీమయమిది యంతయు 
బ్రాహ్మణులకు నిది విధి గద ప్రార్థన గొనగన్
బ్రాహ్మిని సవితను వాణిని 
బ్రాహ్మణులకు మూడు విధులు ప్రాక్తన నిధులున్     (కం)


అంతా బ్రాహ్మీమయమే. అది తెలిసినవాడు ఎవరైనా బ్రాహ్మణుడే, ముందు ముందు
వివరంగా చెప్పబోతున్నాడు కవి. బ్రాహ్మి, సవిత, సరస్వతి అనే మూడు నిధులు,
వారిని సమాజ శ్రేయస్సుకోసం పూజించి  ప్రార్ధించడం అనే పురాతన విధులు
బ్రాహ్మణులకు. 


37.
తొలి సంధ్యన బ్రాహ్మికి నగు
మలి సంధ్యన గద సవితకు మన ప్రణతులగున్
తెలియఁ సరస్వతికి పిదప
వలయు త్రిసంధ్యలను విధిగ వందనమిటులన్    (కం)


ఉదయకాలపు సంధ్యలో బ్రహ్మికి, మధ్యాహ్న సంధ్యలో సవితకు(సావిత్రికి), సాయం
సంధ్యలో సరస్వతికి యిలా త్రిసంధ్యలలో వందనం చేయడం విధి.


38.
తొలి సంధ్యన దేవతలకు
మలి సంధ్యన వందనమన మనకగు ఫలముల్
తెలియఁ జగము కొరకు తుదిది
కలిమి చెలిమి బలిమి కొరకు కదర త్రిసంధ్యల్   (కం)


తొలిసంధ్యలో, అంటే ఉదయకాలంలో చేసినదాని ఫలితం దేవతలకు, మధ్యాహ్నం
చేసినదాని ఫలితం కర్తకు, సాయంత్రం చేసినదాని ఫలితం సమాజానికి అందుతాయి,
అందుకని మూడు సంధ్యలలో చేయడం. యిలా సమాజం కోసం, దేవతలకోసం,
అలా చేయడంకోసం కావలసిన శక్తిని తాము పొందడం కోసం చేసేవాడే బ్రాహ్మణుడు.


39.
బ్రాహ్మణునికి జనియించిన 
బ్రాహ్మణుడవబోడు, పరమ బ్రహ్మమునెరుగన్
బ్రాహ్మణుడనబడును, పుటక 
బ్రాహ్మణు డొక డగును, కర్మ బ్రాహ్మణు డొకడౌ!   (కం)


అసలు బ్రాహ్మణుడు ఎవరు అన్నది చెబుతున్నాడు, తన ఉద్దేశాన్ని, కవి. బ్రాహ్మణుడికి 
జన్మించినంతమాత్రంచేత బ్రాహ్మణుడు కాదు. పుటకతో బ్రాహ్మణుడు ఒకడు, కర్మచేత
నిజమైన బ్రాహ్మణుడు మరొకడు అంటున్నాడు.

No comments:

Post a Comment