పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Monday, December 5, 2011




శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 


భగవత్ గీతామృతం



సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనా
పార్ధో వత్సః సుధీ: భోక్తాః దుగ్ధం గీతామృతం మహత్

ఉపనిషత్తులు అంటే వేదముల శిరస్సులు.అంటే వేదములలో అత్యంత
వున్నతములైన,విలువైన భాగములు. వేదములలో జ్ఞాన విభాగములు.
అటువంటి ఉపనిషత్తులను గోవుగాచేసుకొని, గోపాలుడైన శ్రీ కృష్ణుడు ఆ
గోవును పిదికే వాడై, పార్దుడినిదూడగా చేసుకున్నాడు.దూడ కోసం ఆవు 
చేపుతుంది, పాల ధారలనుకురిపిస్తుంది.దూడను చూపించి అంటే దూడను 
వంకగా చూపించిగడసరి గొల్లవాడు చేపిన ఆవు పాలను పిదికి, బుద్ధిమంతులకు 
ఆ పాలను అమ్మినట్లుగా, భగవత్ గీతామృతం అనే పాలను బుద్ధిమంతులకు
అందించాడు. 

అర్జునుడు నరుడు.శ్రీ కృష్ణుడు నారాయణుడు.నర నారాయణులు
ఇద్దరూ ధర్ముడు,దాక్షాయణి అనే ఋషి దంపతులకు శ్రీ మహావిష్ణువు
అంశతో జన్మించిన వారు. వారే మరలా ఈ జన్మలో అర్జునునిగా, శ్రీ కృష్ణునిగా
జన్మించారు.మామూలు దూడలు మొత్తం పాలు తాగితే వాటికే నష్టం.
అరిగించుకోలేవు.తీవ్రమైన అనారోగ్యం పాలౌతాయి. అందుకని కొన్ని
పాలను మాత్రమే తాగనిస్తారు వాటిని, గొల్లవారు.ఇక్కడ అర్జునుడు 
గీత మొత్తాన్ని గ్రహించుకొని తట్టుకోలేడు అని కాదు భావం.మొత్తం
కొత్తగా తెలిసికొనవలసిన దశలో ఆయన లేడు.సమస్త వేద,వేదాంగ
శాస్త్ర పారంగతుడు అర్జునుడు.ఐనా ఆ క్షణంలో నిర్వీర్యుడు ఐపోయాడు,
మోహావేశం చేత! ఆ స్థితి నుండి ఆయనను బయట పడేస్తే చాలు,
ఇక యుద్ధరంగం లో లక్ష్య సాధన కొరకు విజ్రుంభిస్తాడు .
కనుక ఆ రకంగా కూడా ఆర్జునుడిని దూడగా చేసికొనడం సమంజసమే! 

తను తాగడం కోసం అయితే ఎవడైనా ఒక అవును లేదా రెండు ఆవులను
పెంచుకుంటాడు. ప్రపంచంలో వాళ్లకు పాలు అమ్మడం కోసం అయితే ఎన్నో ఆవులు
అవసరం. కనుక ఒకటో రెండో ఉపనిషత్తులు కాకుండా సర్వ ఉపనిషత్తులను
ఒక అవుగా చేశాడు శ్రీ కృష్ణుడు. అన్ని పాలు గావాలి మరి. నిజానికి ఆ పాలు
మనపాలు గావాలి మరి, అందుకే అర్జునుడు ఒక 'మిష' మాత్రమే.పాలవాడు
ఒకరోజు రెండురోజులు ఆలస్యం ఐనా బుద్ధిగా తప్పకుండా డబ్బులు ఇచ్చే
వాడికే పాల అమ్మకం చేస్తాడు. శ్రీకృష్ణుడు కూడా బుద్దిమంతులైన వాళ్ళ 
కోసమే ఈ పాలను పిదికింది.మరి ఈ గొల్లవాడికి చెల్లించాల్సింది ఎంతోకొంత
శక్తి మేరకు, భక్తి,విశ్వాసము,ఆచరణ..ఆయన బోధనల పట్ల!

భగవద్గీత ఎంత గొప్పదో చెప్పడం కోసం ఇలా చెప్పారు కానీ వేదాల కన్న ఇది
గొప్పదేమీ కాదు అని ఎవరైనా భావిస్తే ఆది పొరపాటు.పదార్ధం కన్నా పదార్ధ
సారం తక్కువది కాదు, ఆ మాటకొస్తే ఇంకా గొప్పది! చెరుకుగడ గొప్పదే..కానీ
చెరుకు రసం ఇంకా గొప్పది, రసంకోసమే చెరుకు గడను ఇష్ట పడతాం కానీ 
చెరుకు గడ కోసం రసాన్ని ఇష్టపడం కదా! రసం లేని చెరుకుగడను,లేదా రసం
పిండగా మిగిలిన పిప్పిని పక్కన పడేస్తాం. సమస్త ఉపనిషత్తుల సారం కనుకనే 
భగవద్గీత భారతీయ వేదాంత,ఆధ్యాత్మిక జ్ఞాన సారాంశం! కనుకనే గీతామృతం 
అనే పాలు అంతటి మహత్యాన్ని కలిగి వున్నాయి.కనుకనే భగవద్గీత 
భారతీయుల ప్రామాణిక గ్రంధం!వేదములలోని రెండు భాగాలు ఐన కర్మ కాండను,
జ్ఞాన కాండను, రెండింటినీ భగవద్గీత బోధించింది!కనుకనే వేద సారం ఇది! 

పార్థాయ ప్రతి బోధితాం భగవతా నారాయణేన స్వయం 
వ్యాసేన గ్రథితాం పురాణ మునినామద్యే మహా భారతం 
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం 
అమ్బత్వామనుసంధదామి భగవద్గీతే భవ ద్వేషిణీం 

భగవంతుడైన వాసుదేవుడు పార్థునకు స్వయంగా ఉపదేశించినది, వ్యాసమహర్షి 
చేత గ్రంథస్థం చేయబడినది, 18 అధ్యాయములను కలిగినది, భవము పట్ల అంటే 
భవ బంధముల పట్ల విరక్తిని పెంపొందించేది ఈ భగవద్గీత. అహంకార,మమకారము
లనే ద్వంద్వముల పట్ల విరక్తిని కలిగించి మానవుడిని ఈ రెండింటి వలన కలిగే
బంధాలనుండి విముక్తుడిని చేసేది భగవద్గీత! ''మన ఏవ మనుష్యాణాం కారణం 
బంధ మోక్షయో..'' అన్నది ఒక ఉపనిషత్. అంటే బంధానికీ, మోక్షానికీ కారణం
మనసే. ఆ మనసును అదుపులో పెట్టుకుంటే ఆది మోక్షానికి దారి జూపుతుంది.
మోక్షం అంటే బంధాలనుండి విముక్తియే. కనుకనే జీవన్ముక్తుడు అంటే ఈ జన్మ
లోనే అన్ని బంధాలనుండి ముక్తుడు ఐన వాడు అని అర్థం.ఆ మనసు మననే తన
అదుపులో పెట్టుకుంటే ఆది బంధాలకు దారి తీస్తుంది. '' ద్వే శబ్దే బంధ మోక్షాయ
మమేతి న మమేతిచ, మమేతి బాధ్యతే జంతు: న మమేతి విముచ్యతే '' అని 
చెప్పింది మరొక ఉపనిషత్తు. నాది, నాది కాదు ..ఈ రెండు మాటలే బంధానికి,
మోక్షానికీ కారణాలు.నాది అనుకుంటే బంధం, నాది కాదు అనుకుంటే మోక్షం.
'' అసంశయం మహా బాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ
వైరాగ్యేనచ గుహ్యతే '' మహా బాహువులు కలిగిన అర్జునా, మనస్సును 
నిగ్రహించుకొనడం ఎవరికైనా కష్టమే..కానీ..అభ్యాస వైరాగ్యములచేత
దానిని నిగ్రహించడం సాధ్యము ఔతుంది..'' అని శ్రీ కృష్ణుడు చెప్పినది అందుకే!
మనసుకు వశుడై, అహంకార మమకారములచేత వివశుడైన పార్థునకు
కనులు తెరిపించిన ఔషధం భగవద్గీత.

మహామహులకు మహానుభావులకు భగవద్గీతను సమగ్రంగా తెలిసికొనడం
సాధ్యం కాదు, తెలియజెప్పడం వేరే సంగతి! ఈ చిన్ని వ్యాసంలో కేవలం 
పరిచయ వాక్యాలు మాత్రమే వున్నాయి, నా అల్ప బుద్ధికి అందినంత మేరకు!
అర్జునుడు జీవుడు.శ్రీ కృష్ణుడు దేవుడు.అంటే వారిద్దరూ జీవాత్మ పరమాత్మలు.
జీవుడికి ప్రతి క్షణం యుద్ధమే ప్రపంచంలో.ఎంతో కష్టపడి ఒక లక్ష్యానికి
చేరువైనప్పుడు బలహీనతలు క్రమ్మి వేస్తాయి,అంతకు ముందుకన్నా ఎక్కువగా!
ఆ బలహీనతలు అంతవరకూ నిర్మించుకొని అధిగమిస్తూ వస్తున్న సోపానాల
మీదినుండి నిర్దాక్షిణ్యం గా క్రిందికి త్రోసి వేస్తాయి.అటువంటి క్లిష్ట పరిస్థితిలో
పడ్డ అర్జునుడికి శ్రీ కృష్ణుడు గురువై బోధ చేసి ఆ స్థితిని అధిగమించే జ్ఞానాన్ని
ప్రసాదించాడు.

'' ఆత్మానగుం రథినం విద్ధి శరీరం రథమేవతు 
బుద్ధింతు సారదిం విద్ధి మనః ప్రగ్రహమేవచ
ఇన్ద్రియాణి హయాన్యాహుహ్: తేషాం విషయ గోచరాన్
అత్మెంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః ''.. అని చెప్పిందొక ఉపనిషత్.
ఆత్మ, అంటే జీవాత్మ అంటే జీవుడు రథికుడు.శరీరమే రథము.పరమాత్మకు
ప్రతినిధి ఐన బుద్ధి సారధి.మనసు కళ్ళాలు.ఇంద్రియాలు గుర్రాలు.గుర్రాలు దారివెంట
వెళ్తూ వుంటే అవీ ఇవీ చూసి మొరాయిస్తాయి, కదలవు, మొండికేస్తాయి అని వాటి 
కళ్ళకు గంతలు కట్టి, వాటిని కళ్లాలతో అదుపు చేస్తూ బండిని సారథి నడిపించి బండిలో
ఎక్కిన ప్రయాణికుడిని గమ్యం చేరుస్తాడు. శరీరం అనే రథాన్ని ఎక్కిన జీవుడు అనే 
ప్రయాణీకుడు బుద్ధి అనే సారధి (పరమాత్మ)కు బాధ్యతను అప్ప జెపితే, అంటే బుద్ధిని
ఆశ్రయించి మనసు అనే కళ్లాల ద్వారా ఇంద్రియాలు అనే గుర్రాలను అదుపుజేసి,
వాటిని సక్రమం గా బతుకు బాటల వెంట నడిపిస్తే గమ్యాన్ని చేరుకొంటాడు.
ఆత్మ,అంటే జీవాత్మ,మనసు,ఇంద్రియాలను కలిపి భోక్త అంటారు పెద్దలు, ఇక్కడ,
చాలా జాగ్రత్తగా గమనించాలి తత్త్వాన్ని.నీవు కర్తవూ కావు, భోక్తవూ కావు, నీవొక
మాధ్యమానివి మాత్రమే అనుకుని 'బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతియః 
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భాసః ..చేసే పనితో సంపర్కాన్ని వదలుకొని,
అంటే ప్రతి ఫల ఆపేక్ష లేకుండా కర్తవ్యం నిర్వర్తించి ఫలితాన్ని బ్రహ్మమునకు
వదిలి వేసి నిస్సంగుడవై..అహంకార మమకారములు లేకుండా యుద్ధం అనే నీ 
క్షత్రియ వీరోచిత కర్తవ్యాన్ని నిర్వర్తించి..తామరాకు మీది నీటిబొట్టువలె దోషమును
అంటకుండా కర్తవ్య పాలన చెయ్యమని చెప్పిన సంగతి గుర్తుంచుకోవాలి.
మనసును కాకుండా బుద్ధిని ఆశ్రయించి,కొనసాగితే,జీవుడు,బుద్ధి,ఇంద్రియాలు
వేటి పని అవి చేసుకుంటూ పోతే, కర్తృత్వము,భోక్త్రుత్వము లేకుండా వుంటే దోషము
అంటదు.ధర్మ రక్షణం,దుష్ట శిక్షణం క్షత్రియుడికి కర్తవ్యాలు.తన హక్కుగా తన
ఇచ్చ మేరకు చేస్తున్నా అనుకుంటే తను కర్త ఔతాడు.అర్జునునకు ఒక క్షత్రియ వీరుడిగా,
ధర్మ రక్షణ దుష్ట శిక్షణ కోసం ఆ యుద్ధం కర్తవ్యం మాత్రమే అనుకుంటే ఏ దోషం లేదు,
పైగా ఆది బాధ్యత కూడా! ధర్మ ప్రతినిధిగా తను యుద్ధం చెయ్యాలి.ప్రభుత్వం వారు
వురి శిక్ష విధించిన ఖైదీ కి వురి శిక్షను అమలు జేసె తలారి ఒకడుంటాడు. ఆ తలారికి
హత్యా దోషం ఉన్నదా?లేదు కదా! యుద్ధ రంగంలో శత్రు సైనికుడిని సంహరించే సిపాయికి
దోషం ఉంటుందా? తన స్వార్ధం కోసం చేస్తే దోషం! అందులో ఏదైనా స్వార్ధ కారణంగా 
ఆనందం కలిగితే భోక్త్రుత్వం ఉంటుంది.వురి తీసిన తలారికీ, సైనికుడికీ వ్యక్తి గతమైన
ఆనందం వుండదు..కనుక వారు దోష రహితులు ఎలాగో, ఇక్కడ అర్జునుడు కూడా
దోష రహితుడే! కర్తృత్వ భోక్త్రుత్వాలంటే ఫలితం పై అనురక్తి, ఆసక్తి !అవి లేకుండానే
నిజాయితీగా కర్తవ్య పాలనం జేయడమే మానవుడికి విధి! 

విద్యార్ధికి చదవడం,సాధ్యమైనంతగా పరిశ్రమ జేసి నిజాయితీగా పరిక్షలు వ్రాయడం
కర్తవ్యం.శాంతి భద్రతలను కాపాడే వృత్తి లో వున్న వారికి సమాజ శత్రువులతో 
తలపడడం అవసరం అయితే వారిని వధించడం కర్తవ్యం. ఫలితం పై ఉద్విగ్నత వుంటే,
విద్యార్థి అయినా, రక్షక భటుడు ఐనా తడబడటానికో,తప్పులు జేయడానికో ఆస్కారం 
వుంటుంది,తద్వారా శ్రమ చివరికి వృధా అవుతుంది, తప్పులు ఏదో ఒకనాడు బయట 
పడక మానవు కనుక, తప్పుడు మార్గాలలో విజయాలు శాశ్వతాలు కావు కనుక!

మానవ జీవితంలో ఏదో ఒకచోట, ఆ మాటకొస్తే ప్రతిచోట..ఘర్షణ సంఘర్షణ తప్పవు.
బహిర్గతంగా, అంటే ఇతరులతో అయితే ఘర్షణ, తనలో తను..తనతో తను అయితే 
సంఘర్షణ.ఈ రెండు సందర్భాలలో మానవుడు అశక్తుడు ఔతాడు. బంధాలు,
బంధుత్వాలు,అహంకార,మమకారాలు ప్రభావం చూపడం చేత..నేను..నాది..
నాది మాత్రమే..నాకు మాత్రమే అనే బంధాల ఉచ్చులో చిక్కుకుని తనను
తను మర్చిపోతాడు.ఇతరులను వంచిస్తాడు, దోచుకుంటాడు..ఇలా ఒక ప్రమాదమైతే,
తనది అనుకున్నది కోల్పోతే నిర్వీర్యుడు ఔతాడు. ఇది ఇంకొక ప్రమాదం.అన్నీ తనవే
అందరూ తనవాళ్ళే అనే 'ప్రేమ' తో పాటు ఏవీ చివరికి తనవి కావు, చివరికి ఎవరూ 
తన వాళ్ళు కారు,తను చివరికి ఎవరి వాడూ కాదు అనే వైరాగ్యం కూడా అవసరం.అప్పుడు
కేవలం బాధ్యత, కర్తవ్యం వుంటాయి. విజయాలకు విర్రవీగడం వుండదు, అపజయాలకు
కుంగడం వుండదు, ఎందుకంటే ఈ రెండూ తాత్కాలికాలే అనే జ్ఞానం వుంటుంది కనుక!

తాత్కాలికంగా ఈ జ్ఞానాన్ని కోల్పోయిన జీవుడిని దేవుడు కర్తవ్యోన్ముఖుని జేయడం కోసం 
పారించిన అమృత ప్రవాహమే భగవద్గీత! సమస్త ధర్మాలకు, సమస్త శాస్త్రాలకు,సమస్త
జ్ఞానానికి, సమస్త శక్తికి ఏకైక స్థానం భగవద్గీత! హేతువాదులకు, నాస్తికులకు,ఆస్తికులకు,
శాస్త్రవేత్తలకు,తత్త్వవేత్తలకు,యోగులకు.భోగులకు,ప్రాపంచిక రోగులకు, బాలురకు,
వృద్ధులకు,క్రీడాకారులకు,కళాకారులకు,సైనికులకు...ఒకరేమిటి..సమస్త మానవులకు,
సమస్త సమస్యలకు పరిష్కారం భగవద్గీత చూపగలదు!

Saturday, December 3, 2011

















శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః


వేదములలో కర్మ కాండ యజ్ఞ యాగాది క్రతువుల, ప్రార్ధనా మంత్రాల

ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జ్ఞాన కాండ అంటే ఉపనిషత్తుల మార్గం

మనో నేత్రం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా పరమాత్మను చేరుకునే మార్గాన్ని

తెలుపుతుంది. జ్ఞాన మార్గాన్ని ఉత్తమంగా భావించిన వ్యాస మహర్షియే

అష్టాదశ మహా పురాణాలలో ఆరాధనా విధానాలనూ,వివిధ దేవీ దేవతలను

గురించీ తెలియజేసి అర్చనా విధానాన్ని అందించాడు!

మన ఆధ్యాత్మిక వాంగ్మయం లో విద్య అవిద్య అని రెండు పదాలు 

వినబడుతుంటాయి.భగవంతుని చేర్చేది విద్య అని, ప్రపంచానికి చెందిన 

సుఖాలను ఇచ్చేది అవిద్య అని క్లుప్తంగా చెప్పుకోవచ్చు. కానీ కేవలం 

కర్మకాండ ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చుఅని భావించడం కూడా 

అవిద్యయే అన్నారు మళ్ళీ. కనుక భక్తి,జ్ఞాన,వైరాగ్యమార్గాలనే మూడు 

మార్గాలున్నాయని చెప్పకనే చెప్పారు.ఎందుకంటే ఈ మూడూ

ఒకదానిలో మిగిలిన రెండూ అంతర్భాగాలుగానే వుంటాయి. భగవంతుడిని

గురించి మాత్రమే తెలుసుకోవాలి అనుకొనడం,తెలిసికొనడం జ్ఞానం అయితే,

ఆయనను నమ్మడం భక్తి ద్వారా సాధ్యం అయితే, ఆయన తప్ప మిగిలిన 

వాటి మీద,మిగిలిన వాళ్ళ మీద విరక్తి తప్పకుండా కలుగుతుంది, అదే 

వైరాగ్యం!జ్ఞాన మార్గం ద్వారా తెలిసికొన్న పరమాత్మ తత్వాన్ని భక్తితో 

సేవించి, ప్రపంచంమీద విరక్తిని పెంపొందించుకుని పరమాత్మను చేరుకోవాలి, 

చేరుకోవచ్చు.పరమాత్మ తత్త్వం అనంతమైన శక్తి.దానిని మామూలు 

కన్నులతో, చర్మ చక్షువులతోచూడడం సాధ్యం కాదు. పరిమితంగా ఆ శక్తిని 

తెలిసికొనడంతో మొదలు బెట్టి, ఇంకా ఇంకా అమితమైన శక్తివైపుకు 

వెళ్ళాలి.విద్యుత్ శక్తి వంటిదే ఈ శక్తి కూడా. విద్యుత్తుసృష్టిలో ఉన్నదే, కానీ 

కంటితో చూడడం సాధ్యం కాదు. విద్యుత్ దీపంలో కాంతిగా,

రక రకాల యంత్రాలలో యంత్ర శక్తిగా విద్యుత్తును తెలిసికొనడం సాధ్యమే. ఆ 

శక్తినిమనము సృష్టించలేము,నాశనం కూడా చేయలేము, వేరొక రూపం 

లోనికి మార్చవచ్చు.

Energy can never be created nor be destroyed, it can 
be transformed into other forms of Energy..అని పాశ్చాత్య 

శాస్త్రవేత్తలు చెప్పిన దాన్నే వేదంచెప్పింది.కనుకనే ఇన్ని దేవీ దేవతల 

రూపాలు.ఇన్నింటి మూల శక్తి ఒక్కటే,కానీ చూడడం,వినడం,స్పృశించడం, 

గ్రహించడం సాధ్యం కాదు, కానీ అది వున్నది అనేసత్యాన్ని ఒక రూపం 

లోనో,శబ్దం లోనో, మార్చి తెలిసికోవచ్చు..విద్యుచ్చక్తి లాగానే!

ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేక శక్తి వుంటుంది. వెలిగితే 

దీపం,కదిలితేమోటర్,గాలి విసిరితే పంఖా,చల్ల గాలి విసిరితే ఎయిర్ 

కూలర్,ఇలా పేర్లు ఎన్ని రకాలైనావాటన్నింటిని నడిపే విద్యుచ్చక్తి ఒక్కటే!ఆ 

శక్తిని తెలిసికోడానికి ఎన్ని యంత్రాలోఆ పరమాత్మ అనే శక్తిని తెలిసికోడానికి 

అన్ని మంత్రాలు,పూజలు,రూపాలు,జపాలు,తపాలు,సాధనలు,

యోగం,ఇవన్నీ!


ఒక గొప్ప యంత్రాన్ని తయారు జేయాలంటే మొదలు డిజైన్, విడి భాగాల 

డిజైన్, వాటితయారి, కూర్పు, వినియోగించే నేర్పు, వినియోగించడానికి 

కావలసిన పరికరాలు,ఎవరి కోసం, ఎందుకోసం, ఎలా వినియోగించడం, 

ఇవన్నీ పరిగణలోకి వస్తాయి.మోక్షం అనే డిజైన్ తో,దానికి కావలసిన 

శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అనే విడిభాగాల సేకరణతో, ఆ 

శక్తులను ఒక లక్ష్యం వైపుకు ఒకదగ్గిరికి సమీకరించడం,తనకోసం, సమస్త 

జీవుల ఆనందం కోసం స్వార్ధ రహితం గా వినియోగించడం..ఇది

నిజమైన ఆధ్యాత్మిక విద్య.ఇదే అసలైన విద్య. దీనికి పరికరాలుగా 

యమ,నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార,శ్రవణ,మనన,నిధి 

ధ్యాసనములనే ఎనిమిది అంగాలను భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలైన 

మహర్షులు తయారుజేశారు. ఈ ఎనిమిది విడిభాగాలను ఒకదగ్గిర నేర్పుతో 

బంధించి భక్తి అనే శక్తితో ఆ యంత్రాన్ని ఉపయోగించి పరిశోధించి

పరమాత్మ అనే సత్యాన్ని కనుగొనాలి! ఒక సత్యాన్ని కొత్తగా కనుగొనడమే 

సాధ్యం అవుతుంది,సత్యాన్ని కల్పించడం సృష్టించడం సాధ్యం కాదు! 

శాస్త్రవేత్త ఒక విషయాన్ని కనుగొనాలి అంటే ఇది యిలా ఎందుకున్నది అనే 

అనుమానం మొదలవుతుంది మొదలు.దీని వెనుక ఒక సత్యం వుంది అన్న 

నమ్మకం కలుగుతుంది ఆ తర్వాత. ఆ నమ్మకాన్ని నిజం చేయడం కోసమే

పరిశోధన చేస్తాడు,పరిశోధన ఫలిస్తే నమ్మకాన్ని సాకారం చేసుకొంటాడు! 

అంటే ఇంకా తను చూడని,వినని,అనుభవించని తను ఉంది అని నమ్మిన, 

ఉన్నదని నిరూపించాలి అనుకున్నసత్యం గురించి శాస్త్రవేత్త పరిశోధన 

చేస్తాడు! కనుగొంటాడు!నిరూపిస్తాడు! అతను నిరూపించక

ముందే ఆ సత్యం ఉంది..ఎప్పటినించి ఉన్నదో తెలియదు కూడా..ఇప్పుడు 

అతను నిరూపించాడు..పరమాత్మ తత్త్వం కూడా అంతే, నమ్మకంతో శోధన 

కొనసాగిస్తే, కావలసిన పైన చెప్పిన పరికరాలన్నీ సమకూర్చుకొని వోర్పుతో, 

నేర్పుతో,పట్టుదలతో,తదేక ధ్యానంతో,లక్ష్యంతోపరిశోధన కొనసాగిస్తే 

సత్యాన్ని కనుగొనవచ్చు!నమ్మక పోతే శోధన వుండదు,అది లేకుంటే

సాధనా వుండదు,శాస్త్రవేత్తకైనా,తత్త్వవేత్తకైనా!


రాముడు,కృష్ణుడు,శివుడు,దుర్గ,సరస్వతి,సూర్యుడు,లక్ష్మీ,గణపతి,

కుమారస్వామి..ఇలా ఎందరు దేవీ దేవతలున్నా వీరు శక్తియొక్క 

రూపాంతరాలే.మూల శక్తి ఒక్కటే.ఒక్కొక్క దేవీ దేవతలకు ఒక్కొక్క విశిష్టత 

ఉన్నది.వారిని కొలవడం వల్ల ఆ శక్తిని పొందవచ్చు.ఇది భారతీయుల 

శాస్త్రీయ దృక్పథం! దీనినే అర్చనా విధానం అన్నారు.అందులో 

శబ్దానికి,అంటే మంత్రానికి ప్రాముఖ్యత ఉన్నది.శబ్దం ద్వారా, అంటే నాదం

ద్వారా అంటే ఓంకారం ద్వారా సృష్టి ప్రారంభం ఐంది అని వేద నిర్ణయం.దేవీ 

భావగతంలోనూ, శ్రీకృష్ణ లీలామృత భాగవతం లోనూ ఆ విషయాన్నే 

చెప్పారు వ్యాసులవారు!కనుకనే మంత్రశాస్త్రంలో, వేదంలో శబ్ద 

ఉచ్చారణకు,ఉచ్చారణలో సూక్ష్మమైనమెలకువలకు అంతటి

ప్రాముఖ్యం. ఇవన్నే పాటిస్తేనే అది మంత్రమైనా,వేద మంత్రమైనా!

ఈ అర్చనా విధానాల ద్వారా సాధకుడు నమ్మకాన్ని పొంది 

పెంపొందించుకుంటాడు.


మనం బాగా ప్రేమించే వాళ్ళను ఏ కారణం చేతనైనా దూరం చేసుకుంటే ఎం 

చేస్తాం?వారిని గురించి ఉహల ద్వారా ఆనందమో,దుఖ్ఖమో పొందుతూ 

వారినే తలచుకొంటాం..అది ఎప్పుడు  సాధ్యం అంటే ఆ ప్రేమ కలిగి ఉంటేనే 

సాధ్యం.సరే ప్రేమించే వాళ్ళనంటే చూసి వున్నాం, కానీ, అంతకు ముందు 

చూడని భగవంతుడిని ఎలా ప్రేమించడం అంటే, చూడడానికి మార్గాలే జ్ఞాన 

మార్గం. ప్రత్యక్ష,అనుమాన,శాబ్దికములనే మూడు ప్రమాణముల ద్వారా, 

అంటే ప్రత్యక్షంగా చూడడం ద్వారా,లేక అనుమానంతో,లేదా శబ్దము అంటే 

వేద విజ్ఞానంతో పరమాత్మను తెలిసికోవాలి. సృష్టి ఉంది అంటే దాని

కర్త ఒకడుండాలి కదా,అని అనుమానంతోనో,వేద నాద విజ్ఞానంతోనో, 

ప్రత్యక్షంగా చూసిన వారి బోధనల ద్వారానో తెలిసికోవాలి.ఇది జ్ఞాన మార్గం. 

ఆ తెలిసికొన్నపరమాత్మ తత్వాన్ని ప్రేమతో అర్చించడమే భక్తి.అది పసివాడి 

భక్తిలాగా వుండాలి.ప్రియురాలిమీద పిచ్చి ప్రేమలాంటి భక్తి 

వుండాలి.ప్రహ్లాదుడిభక్తిలాగా వుండాలి.కనుకనే ప్రహ్లాదుడు '' ప్రణయ హర్ష 

జనిత బాష్ప సలిలమిళిత పులకుడై నిమీలిత నేత్రుడై..'' శ్రీహరిని 

ఆరాధించాడు అన్నాడు మహానుభావుడు పోతన! శబ్ద శాస్త్ర రూపమైన 

మంత్ర శాస్త్ర సహాయంతో,ఒక రూపాన్ని భక్తితో ప్రేమించడమే అర్చనా 

విధానం.ఇదే సాకార ఉపాసన.దీనివల్ల ఆ తత్త్వానికి దగ్గిర అవుతాడు. 

చివరికంటా కొనసాగితేచివరికి ఆ మూర్తి తన ఎదురుగ లేకున్నా భావనలో 

తనతోనే వుహించుకుంటాడు.ఇదినిరాకర ఉపాసన.ఏ ఆకారం లేని,ఏ శబ్దము 

లేని,ఏ రుచి లేని,ఏ స్పర్శలేని, ఏ వాసనా లేని నిరాకార పరబ్రహ్మ తత్త్వం ఏ 

ఆకారం,శబ్దం,రుచి,స్పర్శ,వాసనా లేని విద్యుత్తు వంటిదే!

ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని తెలిసికొనడం కోసమే ఒక ఆకారం,ఒక 

గుణం,కల్పించుకొని,రుచిని పెంచుకొని,స్పర్శను కూడా కల్పించుకొని,వాసన 

అంటే ఉనికిని గ్రహించడం.ఇది పైన చెప్పిన లక్షణాలు ఏవీ లేని, తెలియని 

విద్యుత్తు శక్తికి ఒక రూపం,శబ్దం,స్పర్శ,రుచి,వాసన ను కల్పించిడం ద్వారా 

వివిధ రూపాలలో విద్యుత్తును తెలిసికొనడం వంటిదే, ఏ తేడా లేదు!

నిరాకార పరమాత్మ ను ఉపాసించడం సృష్టిలో,తర్కంలో,వాదనలో 

నిలువదు, లేదు! పరమాత్మకు ఒక రూపం అంటూ నిబంధన లేదు, అన్ని 

రూపాలు ఆయనవే,సర్వ వ్యాపి,సర్వవేత్త,సర్వ శక్తి మయుడు!

ఈ సాకార అర్చనా విధానం మోటార్ సైకిల్ నడపడం నేర్చుకొనడం 

వంటిది,నిరాకార భావనా విధానం కళ్ళకు గంతలు కట్టుకొని మోటార్ సైకిల్ 

నడపడం వంటిది.మొదలు మోటార్ సైకిల్ నడపడం ఎలానో తెలిస్తే 

కళ్ళకు గంతలు కట్టుకొని నడపడమా..చూస్తూ నడపడమ అనేది తర్వాతి 

సంగతి!సర్వ శక్తిమయుడు, అపార అనంత కరుణా సముద్రుడు ఐన అల్లా 

బిడ్డలారా అంటారు ఇస్లాంలో.కానీ రూపం కల్పించడం పాపం అంటారు 

మళ్ళీ.అది గాలిలో మేడలు కట్టడం వంటిది.ఎందుకంటే ఇవేవీ లేని

పరమాత్ముడి గురించి నీకెలా తెలిసింది అసలు? ప్రవక్త చెప్పాడు! 

ఆయనకెవరు చెప్పారు?ఎలా చెప్పారు?ఏ ఆధారంతో చెప్పారు?అది 

వదిలేద్దాం.ఏ రూపం స్థలం గుణం శబ్దం వాసన లేనప్పుడు అక్షరాల 

రూపంలోఅంకెల రూపంలో ఎందుకు కొలవడం? గుణం లేని వాడికి 

అపార,అనంత కరుణా గుణం వుందని ఎలా చెప్తావ్?

స్థలమే లేనప్పుడు మక్కా లో,మసీద్ లో..లేదా ఇంకో స్థలాలలో ఎందుకు 

ప్రార్ధనలు? అసలు ప్రార్ధనలు ఎవరి గురించి?అల్లా గురించి?రూపమే లేకపోతే 

పేరెలా వుంటుంది?వూరు అనేదే లేకుంటే ఊరికి పేరెలా వుంటుంది?ఆలు 

లేదు,చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే కదా?

క్రిస్టియానిటీ లో తులసి ఒక చెట్టు, కేవలం, మరి క్రిస్మస్ ట్రీ చెట్టు కదా, 

పవిత్రం ఎందుకైంది? తులసికి ఔషధగుణాలున్నాయ్!ఒకటి కాదు.నూట 

ఎనిమిది దివ్య గుణాలు! విజయవాడ దగ్గిర ఒక పెద్ద పెట్రోలియం సంస్థకు 

వెళ్ళా ఒకసారి ఒక మిత్రుడి పని మీద. నా మిత్రుడు డీలర్షిప్ కోసం దరఖాస్తు 

చేశాడు.ఇతనికి తెలుగు మాత్రమే వచ్చు బాగా.అక్కడి అధికారికి హిందీ 

ఇంగ్లీష్ మాత్రమే తెలుసు.నన్ను దుబాసీ పనికోసం తీసుకెళ్ళాడు!అక్కడ ఆ 

అధికారి చాంబర్లో అతనికోసం ఎదురుజుస్తూ ఆ కంపెనీ వారి హౌస్ మాగజైన్ 

తిరగేస్తుంటే నాకొక వ్యాసం కనిపించింది అందులో. ఆ కంపెనీ భోపాల్ కి 

సమీపంలో ఒక చోట కొన్ని వందల ఎకరాలలో తులసి ప్లాంటేషన్ 

పెంచుతున్నది.భోపాల్ విష వాయువు వెలువడి చుట్టుపక్కల వేల జీవులు 

ప్రాణాలు కోల్పోతే ఈ తులసి ప్లాంటేషన్ వున్న దగ్గిర ఎవరికీ ఏ జంతువులకీ 

ఏమీ కాలేదు అని ఆ వ్యాస సారాంశం.ఇది నేను నా కళ్ళతో చదివినది.ఇది 

జరిగి దాదాపు 9 సంవత్సరాలైంది. చర్చ్ లలో పవిత్ర జలాలెందుకని?

పుట్టినప్పుడు గిట్టినప్పుడు పవిత్ర గ్రంధ పాఠాలెందుకని? పుణ్య పాప 

చర్చలెందుకని?ఇవన్నీ భారతీయ అర్చనలలో లోపాలైతే వారివద్ద కూడా 

లోపాలే కదా? ఏ విశ్వాసంలో నైనా మూలాలు ఒకే రకంగా వుంటాయి! 

కేవలం అసూయ కొద్దీ స్వార్ధం కొద్దీ భారతీయ అర్చనా,ఆలోచనా 

విధానాలను కించ పరచే ప్రయత్నాలు..అంతే!


అంటే మనకోసం, మనకు ఊహలో,రూపంలో,గుర్తుకోసం మనం ఒక 

రూపం,గుణం,స్థలం,రుచి,స్పర్శ ఇలాంటివన్నీకల్పించుకొనడం ముమ్మాటికీ 

అవసరం, ఇవన్నీ మనం కల్పించుకున్నది మన సౌలభ్యం కోసమే కానీ 

పరమాత్మ తత్త్వానికి ఈ పరిమితులు లేవు అని తెలిసికొనడం అత్యంత 

అవసరం,ఒకే ధర్మంలో రక రకాల విధానాలలో,అనేక ధర్మాల విధానాలలో 

లక్ష్యం ఒకటే అని తెలిసికొనడం ప్రాణావసరం!!!


హైందవ వైదిక ధర్మం శాస్త్ర బద్ధమైనది.ఇందులో ప్రతి ప్రశ్నకు సమాధానం 

ఉన్నది.ఇక్కడ మానవుడు పాపి కాడు!అమృత పుత్రుడు.పరమాత్మ 

స్వరూపుడు!తినేవాడి రుచులను బట్టి ఆహారం ఇక్కడ.ఏ రుచితో కూడిన 

ఆహారమైనా ఆకలి తీర్చడానికే, జీవికి శక్తినివ్వడానికే! కానీ ఒక ఆహారం 

ఒకడికి శక్తినిస్తే ఇంకొకడికి రోగ కారణం అవుతుంది!మధుమేహం(షుగర్) 

ఉన్నవాడికి తీపి విషంతో సమానం.ఆవేశ పరుడికి,రక్త పోటు ఉన్నవాడికి 

కారం ప్రమాదకరం!తీపిని ఇష్టపడే వాడికి కూడా తీపిలోనే అనేక రకాలు! 

మామిడిపండు,జామపండు,అరటిపండు,సీతాఫలం,బెల్లం,పంచదార అన్నీ 

తియ్యటివే. కాని ప్రతి తీపీ ప్రత్యేకమైనదే. కళ్ళు మూసుకొని తిన్నా తీపిని 

బట్టి అది ఏ పదార్ధమో చెప్పవచ్చు! కానీ ఒక్కొక్క పండు రుచి లాగానే దాని  

ఫలితాలు కూడా వేర్వేరు! వాటిలో వుండే విటమిన్లు వేరు!తేనే తియ్యగా 

వుంటుంది.చెరకు రసం కూడా తియ్యగా వుంటుంది.దాహం తీరడం కోసం 

ఎండాకాలం చెరకు రసంతాగుతాం కాని తేనే తాగము!అందానికీ,ఆరోగ్యానికీ 

తేనే మంచిది కాని చెరుకు రసం కాదు! దీన్ని దృష్టిలోవుంచుకొనే భారతీయ 

అర్చన విధానం ఇంతమంది దేవీ దేవతలను ఆరాధించే విధానాన్ని 

చెప్పింది. రోగం ఒకటే ఐనా ఒకే మందు ఒకడికి వికటిస్తుంది ఒకడికి మంచి 

ఫలితాన్ని ప్రకటిస్తుంది! అంటే రోగాన్ని బట్టే కాక రోగిని బట్టి కూడా వైద్యం 

మారాలన్నమాట!భారతీయ వైద్యవిధానం కఫ,వాత,పిత్తాలనే త్రిగుణాలను 

బట్టి చికిత్స చేయమంటుంది. భారతీయ ఆధ్యాత్మిక విధానం 

సత్త్వ,రజో,తమో గుణాలను బట్టి ఆరాధన మారాలంటుంది.కోపిష్టి వాడు 

శివుడిని,కాళిని ఆరాధించడం కంటే రాముడినో,లక్ష్మిదేవినో,విష్ణుమూర్తినో 

ఆరాధించడం వల్ల వాడికీ, వాడివల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది!

సాత్వికుడు ఎవరినైనా ఆరాధించవచ్చు, నష్టమేమీ రాదు, రజో గుణ 

ప్రభావితుడు కూడా సాత్విక ఆరాధన చేయడం మంచిది. అందుకనే తీవ్ర 

శక్తులైన కాళి,మహా భైరవ ఉపాసనలో కొంత మంది ప్రారంభంలోనే చిత్త 

చాంచల్యం తో దేశాలు పట్టి పోవడం,మతి భ్రమించడం, మరణించడం 

జరుగుతుంది.సత్త్వ గుణం సృష్టికి, సహాయానికి ప్రేమకు పనికి వస్తుంది, 

తీవ్రమైన నాశనానికి పనికి రాదు. అందుకే తీవ్ర తమోగుణ సంపన్నుడైన 

రావణుడిని చంపడం కోసం శుద్ధ సత్త్వ గుణ పూర్ణుడైన శ్రీ రాముడు 

శివుడిని, తన శుద్ధ తమోగుణం తో సృష్టిని లయం జేసే ప్రళయ కాల 

రుద్రుడు తనను తానునియంత్రిన్చుకొనడం కోసం రామ నామ తారకాన్ని 

ఆశ్రయించింది! శుద్ధ సత్త్వ గుణ స్వరూపి ఐన విష్ణువు ధరించిన నృసింహ 

అవతారం శివ,విష్ణు మూర్తుల సమిష్టి తత్త్వం. ఆ తత్త్వంలో ప్రహ్లాదుడిపై 

దయతో విష్ణుమూర్తి,హిరణ్య కశిపుడిపై కసితో శివుడు కలిసివున్నారు! ఇది 

ఉపనిషత్ రహస్యం, నేను కల్పించింది కాదు సుమా!


మహా విష్ణువు అవతారాలు అసంఖ్యాకాలు.వాటిలో ప్రధానమైనవి ఏక వింశతి 

అవతారాలు. అంటే ఇరవై ఒక్క అవతారాలు!ఇంకా ప్రధానమైనవి 

దశావతారాలు! శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో వ్యాసులవారు ఇది తెలియ 

జేశారు. స్త్రీ రూపిణి ఐన పర శక్తి లలితా అమ్మ వారి అవతారాలు 

అసంఖ్యాకములు.స్త్రీలందరూ ఆ అమ్మ స్వరూపిణులే. గ్రామ దేవతలు గా 

కొలిచే రక రకాల శక్తులు ఆ తల్లి తాంత్రిక, తామసిక మూర్తులే. ఆ తల్లి ప్రధాన 

మూర్తులు గాయత్రీ,సావిత్రి,సరస్వతి,రాధ,దుర్గలు.రందరూ కూడా శ్రీ కృష్ణ 

మూర్తి నుండే  ఉద్భవించారు. ఇక్కడ శ్రీ కృష్ణ మూర్తి అంటే 'గోలోక 

బృందావనం'లోని శ్రీ కృష్ణుడు.రాధాదేవి అంటే గోలోక బృందావనం లోని 

శ్రీకృష్ణ ప్రేమరసైక మూర్తి ఐన రాధాదేవి. భూలోక బృందావనం,గోకులం లోని


రాధాకృష్ణులు,గోలోక బృందావనం లోని రాధాకృష్ణులు,వీరు ఇరువురి రస 

లీలయే రాస లీల, కంటికి కనిపించే ఈ విశ్వమంతా వారి ఖేల, వారి దయ, 

మన ప్రాప్తం! ఈ వివరాలను వేద వ్యాసులవారు దేవి భాగవతం లో తెలియ 

జేశారు!


కనుక ఇందరిలో ఎవరినీ ఆరాధించిన ఫలితం ఒక్కటే! వీరంతా ఆ పరమాత్మ 

కాంతి పుంజంలోని వివిధ వర్ణములే.ఏ విధంగా తెల్లని కాంతి సప్త వర్ణముల 

పుట్టినిల్లో, ఆ సప్తవర్ణముల సమ్మేళనం, మిశ్రమం వల్ల మరెన్నో 

వర్ణములుద్భవిస్తాయో,స్వచ్చమైన శుద్ధ సత్త్వగుణస్ఫూర్తి ఐన శ్రీ విష్ణు  

మూర్తి నుండే సమస్త దేవీ దేవతలు.ప్రధాన దేవతలు ఉద్భవించారు అని 

జగద్గురువు వేద వ్యాసులవారు తెలియజేసి, ఆ సత్య దర్శనం కోసమే 

పురాణ ప్రపంచాన్ని మనకు అందించారు! ఎవరు ఎవరిని ఆరాధించడం 

అనేది రుచిని బట్టి, శక్తిని బట్టి,శరీర తత్వాన్ని బట్టి వుంటే సత్ఫల దాయకం 

అవుతుంది.ఈ అర్చనా,ఆరాధనా విధానమంతా కల్పించింది మానవ శరీరం 

కొన్ని పరిమితులకు లోబడినది కావడం వల్లనే. ఈ అర్చనా విధానం 

లోతుగాతెలిసికొని ఆచరించి చివరికి నిరాకర,నిర్గుణ,నిరంజన,నిర్మల 

పరమాత్మ తత్వాన్ని మానవుడు చేరుంటే ఇహలోకం,పరలోకం అనే 

బంధనాలను తెంచుకున్న వాడు అవుతాడు, శుక మహర్షి వంటి వాడు 

అవుతాడు. అందుకనే నాలుగు ఆశ్రమాలలో చివరిదైన సన్యాస ఆశ్రమంలో 

ఈ క్రియా కలాపానికి చెందిన అర్చన ఆరాధనా విధానం అక్కర్లేదు అని 

భారతీయ ధర్మం చెప్పింది.


ప్రపంచంలో ప్రథమ నాగరికత భారతీయ నాగరికత. మానవుడు తొలి సరిగా 

అన్నది,విన్నది,కన్నది, మన్నది ఇక్కడే!ఇక్కడి నుండే 

మానవులు,సంస్కృతులు,సంస్కారాలు,ధర్మాలు,విశ్వాసాలు,విజ్ఞానం రక 

రకాల పేర్లతో ప్రపంచానికి వెళ్ళాయి.ఒకటే భూభాగం కోట్ల సంవత్సరాల క్రితం 

ఏడు ఖండాలుగా విడిపోయిందని వ్యాసులవారు చెప్పారు.ఆ ఒకటే 

భూభాగమే ఈ పవిత్ర భూభాగం!ఈ సత్యాన్ని ప్రపంచం కాలక్రమంలో 

తప్పకుండ తెలిసికొంటుంది.బీర్బల్ సహానీ అనే మహానుభావుడైన భారతీయ 

శిలాజాల శాస్త్రవేత్త ఇప్పుడు ఆస్ట్రేలియా అనబడుతున్న భూభాగం మన 

భారత భూభాగం నుండి విడి వడినదే అని నిరూపించాడు! రాబోయే 

తరాలలో ఎవరో మిగిలిన విశ్వ భూభాగమంతా ఈ ముక్క నుండే


ముక్కలై వేరై పోయిందని నిరూపిస్తారు! ఆ రోజు వస్తుంది, ఈ రోజు వున్న 

వాళ్ళు ఆ రోజున ఉండ వచ్చు, లేక పోవచ్చు,తల్లి భారతి సగర్వంగా నిలిచి 

వుంటుంది! ఉపనిషత్తులలో ఈ రోజు ప్రపంచంలో వున్న అన్ని రకాల 

ఆలోచనల,ధర్మాల,నాస్తికుల,హేతువాదుల,ఇతర ధర్మాలకు చెందిన 

భావజాలాల సూచనలు వున్నాయి. అన్ని ధర్మాలకుఈ ధర్మమే 

పుట్టినిల్లు.అన్ని మర్మాలకు,మమతలకు,సమతలకు ఈ ధర్మమే పుట్టినిల్లు.


మానవులంతా సమానులేనని,మానవులే కాదు సమస్త జీవ రాశులు 

భగవంతుని దృష్టిలో ఒకటే నని,చీమనుండి బ్రహ్మ వరకు సమస్త 

ప్రాణులలో,దేశ,ప్రాంత,కుల,లింగ భేద లేకుండా పరమాత్ముడు 

వెలుగుతున్నాడని భారతీయ ధర్మం ఉపనిషత్తులలో చెప్పింది.దానినే ఆది 

శంకరుడు,అన్నమయ్య, త్యాగయ్య,పోతన యింక వేలాదిగా 

మహానుభావులు నాడు నేడు చెప్పారు, చెప్తున్నారు, చెప్తారు! ఈ నాటి ఈ 

ధర్మంలోని లోపాలు ధర్మనివి కావు, ఆ ధర్మాన్ని విశ్వసిస్తున్నామని చెప్పే  

వాళ్ళవి.ఆ లోపాలను సరిజేయ వలసినది నేటి యువకులు,యువతులు, 

రేపటి పౌరులైన బాల బాలికలు.వారికి మార్గ దర్శకత్వం చేయ వలసినది ఈ 

నాటి  పెద్దలు,విజ్ఞులు,ధార్మికులు,ధర్మ ప్రేమికులు!స్త్రీ,శిశు,జంతు,జీవ 

ప్రేమకు దయకు,కరుణకు,ప్రేమకు,పుట్టినిల్లు ,సభ్యతకు,సంస్కారానికి,

విజ్ఞానానికి,వివేచనకు, ధైర్యానికి,పరాక్రమానికి,శీలసంపదకు నిలయమైన 

దేశం ఆ సంపదను మన అనైక్యత కారణంగా కోల్పోయిన ఫలితమే ఈ నాటి 

పరిస్థితులు.భారత దేశం మేల్కొంటు న్నది.ఏ దేశంలో,ఏ రంగంలో నైనా 

భారతీయుల బుద్ధి బలమే ఈ నాడు నీరాజనాలందుకొంటున్నది 

...భవిష్యత్తులో భారత్, చైనా మహత్తర శక్తులు కానున్నాయి.ఆ తర్వాత 

భారత దేశం మరొక 50 సంవత్సరాలకల్లా ప్రపంచాన్ని మరలా శాసిస్తుంది!

హైందవ ధర్మం మరలా దివ్య ప్రభలతో తన జ్ఞాన జ్యోతులను ముందుకన్నా 

ఎక్కువగా ప్రకాశింపబోతున్నది! ఆ రోజుకోసం మనం అందరం 

పరమాత్ముడిని ప్రార్ధిద్దాం!.


భారత మాతకు వందనం!