జయహో శ్రీ కృష్ణ దేవ రాయ!
జయ నిత్య కీర్తి కాయా!
జయ కదన కవన రవి చంద్ర తేజ
జయ భువన విజయమున ఆంధ్ర భోజ ..
నీ తనువు కదన ఘన విజయలక్ష్మికి
నీ మనువు కవనమున విజయలక్ష్మికి
తను వృత్తి నీకు సామ్రాజ్య రక్షణం
నీ ప్రవృత్తి సాహిత్య వీక్షణం..
చిన రాణి తాను సామ్రాజ్య లక్ష్మీ
పెద్ద రాణి నీకు సాహిత్య లక్ష్మీ
చిన్నమ్మ తోడి చిరకాల చెలిమి
పెద రాణి తోడి కల కాల కలిమి..
నడి వీధిలోన రతనాలు రాశి
నడి రేయి దాక కవనాలు దూసి
పడి కరకు తురక తలచెండ్లు కోసి
కడలేని కీర్తిగనినావు వాసి...
గజపతుల కైన ఘన స్వప్న సింహమా!
మదవతులకైన శృంగార చిహ్నమా!
కవితా వధూటి సిగపువ్వు చంద్రమా!
తులలేని అలల సాహిత్య సంద్రమా!
ఘన తెలుగు కవన ధారా విపంచి
పలికించి తేనెలొలికించి మించి
పలికించి తేనెలొలికించి మించి
వలపించి చూడిక్కు డుత్త నాచ్చి
నేలించినావు రంగేశుకిచ్చి...
భువి రాజులెందు? శాసనములందు!
కవిరాజులెందు? ఉచ్చ్వాసమందు,
జన జీవ నాడి నిశ్వాసమందు!
నిలిచుండురందు, నువు.. గుండెలందు!
బ్రహ్మాండమందు శ్రీ వేంకటాద్రి,
దైవతములందు శ్రీ వేంకటేశుడు,
పలు దేశభాషలను తెలుగు లెస్సరా!
రాజులందు..రాయ!నువు లెస్సరా!
No comments:
Post a Comment