పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Friday, December 2, 2011



వయసుతో సంబంధం ఉందా???








ఆముక్త మాల్యదలో రాయల వారు ఒక శ్లోకాని ఉటంకించారు పద్య రూపంలో..

'' వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్
నిశార్ధమర్ధం దివసే యతేత
వార్ధక్య హేతోర్వయసా నవేన
పరత్ర హేతోరిహ జన్మనాచ '' అనే శ్లోకాన్ని..

'' వాన కాలమునకు వలసిన యవి ఎల్ల నార్జింపవలయు మాసాష్టకమున
రాత్రులకొనరు నర్ధములెన్ని యన్నియు ఘటియింప వలయు బగళ్ళ యంద
అపర వయో యోగ్య వస్తు జాలంబు సాధింప వలయు జవ్వనమున
పర లోకమునకు సంపాద్యమేయ్యది యది గడియింప వలయు నీ యొడలియంద ''..
అనే పద్య రూపం లో అందించారు!

వర్షాకాలం కోసం మిగిలిన ఎనిమిది నెలలలో ఆహారాన్ని సంపాదించుకోవాలి.
రాత్రి కి కావలసిన వాటిని పగటి సమయం లోనే సంపాదించాలి.
వృద్ధాప్యం కోసం వయసులోనే జాగ్రత్తగా అన్నింటినీ సమకూర్చుకోవాలి.
పరలోకం కోసం ఈ లోకం లోనే జాగ్రత్త పడి పుణ్య సముపార్జన చెయ్యాలి!

కనుక వయసుతో నిమిత్తం లేకుండా లేత వయసులోనే చక్కటి భక్తి,శీల
సుగుణ సంపదను పెంపొందించుకోవాలి..ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక శుక మహర్షి
ఇలాంటి వారి చరిత్రలు అవే చెప్తాయి!

భక్త్యా భాగవతం జ్ఞేయం భక్త్యా యుక్త్యాచ భారతం
భక్త్యా యుక్త్యాచ బుద్ధ్యాచ జ్ఞేయం రామాయణార్ణవం

భాగవతాన్ని భక్తి తో, భక్తి యుక్తి ఈ రెండింటితో భారతాన్ని, భక్తి,యుక్తి,బుద్ధి ఈ మూడింటితో
రామాయణాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు! అంటే వీటిని అర్థం చేసుకోవడానికి ఇవి కావాలి అన్నమాట!
అలా కాకుండా ప్రారంభమే రామాయణ భారతాలతో చేయిస్తే అందరూ జీర్ణించుకోలేరు! రాముడు సీతను ఎందుకొదిలాడు?ద్రౌపది ఐదుగురిని ఎందుకు పెళ్ళాడింది ఈ ప్రశ్నలు వస్తాయి! అందుకనే మహానుభావులైన మహర్షులు ఒక 'సిలబస్' తయారుజేశారు ఏకంగా!

దేవాలయాలు,చిన్న చిన్న పద్యాలు,శ్లోకాలు, కథలు వీటి ద్వారా పిల్లలను సంసిద్ధం చేయాలి! నెమ్మదిగా
పెంచుకుంటూ పోయి తనకు ఏది కావాలో తానే కోరుకుని,చేరుకొని,పొందే లాగా తయారు జేయాలి!
పురాణ కథలనూ, వాటిని చెప్పే హరికథలనూ, బుర్ర కథలనూ,మహానుభావుల జీవిత చరిత్రలను,
చక్కటి పాటలను, శ్రావ్యమైన సంగీతాన్ని ఇందుకు సాధనాలుగా వాడుకోవాలి.అందుకు ముందుగా తల్లి దండ్రులు వీటిని ప్రేమించడం నేర్చుకోవాలి! చిన్నప్పటినుంచీ గుడికి వెళ్ళడం అలవాటున్న వాళ్ళు గుడిలో 'రంగుల వేట'చేయడానికి అవకాశం తక్కువ! వ్యాసులవారు వేదాలను సరళం జేసి విభజించి, అంతటితో సంతృప్తి చెందకుండా పురాణ వాన్గ్మయాన్ని అందించాడు, ఇంకా తృప్తి చెందక మహా భారతాన్ని అందించాడు,అప్పటికీ తనివి తీరక మహా భాగవతాన్ని అందించాడు! ఇవన్నీ 'పెద్ద' పిల్లలనూ, చిన్న పిల్లలనూ మంచి మార్గం లో పెట్టడానికే! భాగవతం లో కూడా దశమ స్కంధాన్ని చివరిగా పెట్టింది అందుకే,
ఆయన పిచ్చి వాడై కాదు! ఎందుకంటే డైరెక్ట్ గా కృష్ణుడిని పరిచయం జేస్తే మనకు రాసలీలలే తగులుతాయి మరి మనసుకు! ఆయన అనుకుంటే నేరుగా కృష్ణుడి కథ తోనే మొదలు పెట్టేవాడు కదా! అలా చెయ్యలేదు.

శ్రీ కృష్ణుడు కూడా వయో పరిపూర్ణుడు ఐన తర్వాత తనే చెప్పినా వేదాంత సారాన్ని ఏకాదశ,ద్వాదశ స్కంధాలలో జొప్పించాడు! అంతటి వివేచనా దృష్టి మన మహర్షులది! అడుగడుగునా సునిశిత స్వీయ పరిశీలన, లక్ష్యాన్ని దృష్టి పథంలో నుండి తోలిగిపోనియ కుండా ఉంచుకోవడం..యిదీ వారి విధానం!

కనుక భక్తికీ, వయసుకూ సంబంధం లేదు! దేశ భక్తి,దైవ భక్తి ఈ రెండూ బాల్యం నుండే పిల్లలకు నెమ్మది నెమ్మదిగా, జాగ్రత్తగా, ప్రేమగా, తెలివిగా అందించాలి! చరిత్ర లో నిలిచి పోయిన వారందరికీ వారి తల్లి దండ్రులు అలాగే అందించారు..


No comments:

Post a Comment