పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Tuesday, November 29, 2011


జీవితం 

విజయం పొందిన ప్రతి వారూ విశిష్ట వ్యక్తులు ఔ తారా?
జనం మెచ్చితే ప్రతి చెత్తా పూల గుత్తి అయి పోతుందా?
అందరికెక్కడ చక్కిలి గిలి గిలి ఒక్క రీతిగా ఉంటుంది?
నాలుక  కొద్దీ రుచులు మనుషుల మనసుకొద్ది అవి అభిరుచులు!
తాను వలచితే అదియే రంభ తను మునిగేదది పవిత్ర గంగ!
నీకు  నచ్చినది ప్రతివాడూ మెచ్చాలని ఏ నియమమున్నది?
ప్రతివాడికి నువు నచ్చునట్లు నువ్వుండాలని ఏ నియమమున్నది?
నచ్చునట్లుగాకున్నా ఎవరూ నొచ్చునట్లు లేకుంటే చాలు
నవ్వులలో ముంచెత్తుట కన్నా ఏడిపించ కుంటే పది వేలు!
ఎవరికొరకు నువ్విక్కడికొచ్చావ్?ఎంతవరకు నువ్వెవ్వరి కుంటావ్? 
నీ రాక పోకలవి తెలిసే నెవరికి? నీకే తెలియవు తెలుసా చివరికి!
అమ్మా,నాన్నా,ఆలీ, మొగుడు,అన్నదమ్ములూ, కన్నపిల్లలూ
ఇరుగు,పొరుగు.. అందరికుండు,ఐనా నీకై నువు మిగిలుండు!
అందరిలో నీవొకడిగ వుండు,అంతర్ముఖునిగ ఒదిగుండు!
తప్పులు ఒప్పులు తడిమి చూసుకో తప్పులొప్పుకో విప్పి చెప్పుకో
లోపలి వాడికి ఆ పై వాడికి తప్పులు నిప్పులు ఒప్పులు జడులు
నీకన్నా ఎవరెరుగరు నిన్ను ఏకం కానీ మిన్ను మన్ను
వందల నిందల చలించి పోకు నిట్టూర్పులతో  జ్వలించి పోకు
పొగడ్త లోస్తే పొంగిపోకు విమర్శలోస్తే కుంగిపోకు
పొగడ్త లంటే అగడ్త లోయి  మొగ మెచ్చులనే మొసళ్ళు వేయి
జీవిత మొక కళ జీవిత మొక అల జీవితమొక వల జీవికెలా
సాగుట తప్పదు, ఆగుట వొప్పదు విశ్వరహస్యపు నిధి విధి విప్పదు
చావు పుట్టుకలు పడుగు పేకలు మనుగడ వస్త్రం మనవిధి మగ్గం
కలతలనే కలనేత రీతులు సుఖాలు, నవ్వులు, బుటా పువ్వులు 
నేత గాడు బహు పాతవాడు  పాత కాల దూదేకు వాడు 
బతుకు బట్టలను కట్టుటెట్లనో జీర్ణ వస్త్రమును విప్పుటట్లనే
కాల వాహినులు ఆగుటెరుగవోయ్! కళ కళగా కొనసాగు టెరుగవోయ్!    
కాల పరీక్షకు నిలిచేదేదో, కనుకొలకులలో కరిగేదేదో
మనసు పొరలలో మరుగు పడనిది విలువల వలువలు విడనాడనిది 
ఆలోచననూ ఆనందాన్నీ కలిగించేదే జీవ కళ!
ఒకే దాన్ని కలిగుంటే సత్యం..ఒక నాటికి అది  ప్రేతకళ! 





No comments:

Post a Comment