అడుగు జాడలు ...
శ్రీకర నీ వరచరణము
లాకరములు సౌఖ్యములకు, నా కరమందున్
నీ కర సరసిజమిడి, కరు
ణాకర! కడదాక గాతునంటివి గాదే!
తోడుగ నేనుండెద, నా నీడన నీ జీవన కుసుమోదయమౌ!
భారము నాదే, నీ సంసారము నీదే
ఆ స్థైర్యము,ఆ ధైర్యము, ఆ వీర్యము యొదవించెద, ఎదనిన్చెద!
చుక్కానై ప్రక్కన నేనుంటా,నా యక్కున నినుగొంటా,
గ్రక్కున నిజ కరుణారస దృక్కుల నినుగంటా!
నీవిక 'నా జీవిక కడు భారము, కడు దూరము సుఖ తీరము,
నే కనజాలను,మనజాలను, వినజాలను జీవన సుఖ శృతి సారము!
హితుడా,స్నేహితుడా,నా భర్తా! ఓ కర్తా! రమ్మంటే,
నీ భారము నే మోస్తా! జీవిక కడ దేరుస్తా!
మోహన సుఖ జీవన నవ వీణియ నై నే మ్రోస్తా!.. అనలేదా?
సంసార సాగర సరిత్తీర సైకత శ్రోణుల నిను వెన్నంటి నడుస్తా!
వస్తా! నే వస్తా! యన లేదా?వస్తా! నే వస్తా! యనలేదా?
ఆలోచనాలోచ నాలోల కల్లోల సంసార సంవేదనా రోదనాక్రందనా సాగరావర్తినై,
కష్టాల నే బడసి, దుఖ్ఖాలలో దడిసి, మోహాలతో డస్సి, పాపాలతో క్రుస్సి,
మనో గవాక్షంపు పక్ష్మముల నే దెరచి, నీకై నే జూస్తే..
ఒంటిగ నే నుంటినయా..నా యడుగులు కంటినయా..
ఏదీ నీ యడుగుల సడి?ఏదీ నీ అందెల ధ్వని?
ఏవీ నువు నడయాడిన చిరుజాడలు?
నా ఆశల సుమ పేశల మధురోహలు మను మేడలు?
విను వత్సా!ప్రవచిస్తా! తెలియరావు నా క్రీడలు!
నువు జూసిన ఆ జాడలు..నా పదములు, నా నీడలు!
జాలి,కరుణ మొలకెత్తి..
నిక్కము, నిను తలకెత్తి..
ఒంటిగ నేనే నడిచా!
కంటినీరు నే తుడిచా!
నీ బాధలు,నీ గాధలు,నీ బరువులు నిన్ను మోసితి!
నీ పయనము నేనే జేసితి!!
(అజ్ఞాత ఆంగ్లకవి "FOOT PRINTS" స్ఫూర్తి తో... )