పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, August 14, 2011







             ఆడపిల్ల..

అమ్మా నాన్నలవబోయే   వారంతా   వినండి 
కంటే  ఆడపిల్లనొక్క  దాన్నైనా  కనండి 
కసాయిలై కడుపులోనిదమ్మాయని చంపకండి
ఘోర  రుధిరధారలతో చరితపుటలు నింపకండి ....
ఆలుమగలు  అవగాహనతో కలసి పదండి
అమ్మా నాన్న  లౌటయే అదృష్టము కదండీ
ఆడపిల్ల లైనా, మగ పిల్లలైనా  
అమ్మా నాన్నల కన్నుల  కలల ఫలములండి.. ...
అమ్మలార! అనురాగపు సిరుల విరుల కొమ్మలార!
నాన్నలార పసి గుండెల కండ వెన్ను దన్ను లారా!
ఆడపిల్లలున్న గాని అమ్మ చలువ ఆలి విలువ
అనురాగములెరుకరావు అహపు పొరలు వీడి పోవు....
పువ్వులతో, మువ్వలతో,పులకరింత నవ్వులతో
పారాణీ,పరికీణీ,ఓణీ, యువరాణితో
జడ కుప్పెలు , చెమ్మ చెక్క చేరడేసి మొగ్గలతో 
సంతోషపు సామ్రాజ్యం,లేక, సిరులు పూజ్యం!....
అచ్చమైన ప్రేమల  అరవిచ్చిన సిరిమల్లెలు
తల్లిదండ్రులకు తరగని ఆస్తులాడపిల్లలు
కనికరమే లేక కాలికింద  వేసి నలపకండి
కసిదీరా పసికందుల గొంతులనే నులమకండి....
మీ అమ్మా  నాన్నలో..  వాళ్ళమ్మా  నాన్నలో  
మీలాగే అనుకుంటే మీరీనాడెక్కడ?
స్త్రీ  పురుషులు చక్రములై కదలక యిరు  ప్రక్కల 
సంసార రధానికి గతి,  ఈ జగతి ఎక్కడ?......
ఆడైనా, మగైనా ఒకటిగాదరిస్తై ... 
పశు పక్ష్యాదులు సైతం శిశులచేరదీస్తై!
ఆడపిల్ల నాకొద్దని తల పోసి ఉసురు దీసి,
విసిరేస్తే.. పశువా! యని పశువులు నిను నిలదీస్తై....
ఆకలి వేళల తల్లిర , అర్ధాంగిగా రతిరా,   
మగని కొరకు మంత్రిణిరా ,గృహ సీమ నియంత్రిణిరా,  
సేవలలో దాసిరా,  స్నేహభావ రాశిరా,  
సహనంలో ధరణిరా, 'త'త్సారం తరుణి రా.....
శిశు హత్యలు చేయకండి, సిగ్గునొదిలి వేయకండి, 
ఆడపిల్ల మల్లె మొగ్గలోనే చిదిమివేయకండి,
పస్తులతో పెంచినా, పుస్తెలతో పంపినా,
అమ్మా నాన్న లని తలచే  దాడపిల్లలేనండీ   !....

No comments:

Post a Comment