
మహిళా మణి దీపాలు
మానవతకు రూపాలు, మమతల తొలిరూపాలు
మనిషీ నీ ప్రతి విజయంలో మరువకుమా సగపాలు
మహిళా మణి దీపాలు!!మహిళా మణి దీపాలు!!
తల్లిగ తన రుధిరము పాలు, చెల్లిగ తను గొని మురిపాలు
ఆలిగ ఆ వలపుల జాలు కూతురుగా కులుకుల సోలు
నీ నీడై తోడు నడుస్తూ, నువు పడితే పడి ఏడుస్తూ
నీ దౌష్ట్యం తాను భరిస్తూ, నీ బతుకుకు వెలుతురునిస్తూ
వెలిగే ఘన దీపాలు! మహిళా మణి దీపాలు!!......
కసిదీరా కాటేస్తుంది, కరుణిస్తే సరి జేస్తుంది
వలచిందా మురిపిస్తుంది, వగలాడై మరిపిస్తుంది
ఆడదిరా ఆది శక్తి! ఆవిడ దయ నీ భుక్తి
ఆడ పిల్ల కాదు శాపం, ఆ నవ్వే ఇంటికి దీపం
గృహమను గుడి దీపాలు! మహిళా మణి దీపాలు!..........
దేశానికి ప్రథమ మహిళగా, ద్వేషానికి ప్రమథ మహిళగా
మంత్రిణిగ, నియంత్రిణిగా, కౌటిల్య కుతంత్రిణిగా
ఝంఝానిల ఝాన్సిస్ఫూర్తిగా, రుద్రమాంబ రౌద్ర దీప్తిగా
ద్రౌపదిగా ధైర్యమూర్తిగా, ధరణిజగా ధన్యకీర్తిగా
ధర వెలిగిన దీపాలు!మహిళా మణి దీపాలు!.........
సమవర్తికి సరి సావిత్రి, సహనంలో సాటి ధరిత్రి
కైకే ఇక ఈసు నసూయకు, కైజోతలివే అనసూయకు
ఆకసమున వెలిగేది రమణి అరుంధతిగ అనంత కాలం
హరిహరబ్రహ్మాదులకైనా ఆడదిరా ఆది మూలం
జగతికి జవ, జీవాలు! మహిళా మణి దీపాలు!!.....
No comments:
Post a Comment