మందార మకరందాలు
మాధవ సంబంధాలు,మధుర భక్తి గంధాలు
మధురస నిష్యందాలు, మధుసూదను చందాలు
మహనీయుడు పోతన పలుకులు మాగిన వని మాకందాలు
మందార మకరందాలు,మందార మకరందాలు....
కవికులములకందాలు,కవితారస గంధాలు,
కావ్య కన్యనూరేగించిన కవనవిరుల స్యందాలు,
ప్రకృతి పురుష బంధాలు, ప్రణవార్ధ ప్రబంధాలు
ప్రవిమలులకు స్వాంతాలు ప్రశాంతమౌ ప్రాంతాలు.....
కరివరదుని గడసరి నటనలు కమలాసతి చిటిపొటి అలకలు,
కరిపైకెగిరిన హరి శ్రీ హరి కనత్కనక కుండల కళలు,
గాంగేయునిపై గారంగా,గోపికలకు సింగారంగా,
ఆనందాంగన ఒడిలోగిలి ఆనందాంబుధి మునుగంగ.....
పార్ధుని రధమునకట సారధి,పాత్రులకట కరుణావారధి,
పాపనికట జోలలు నీరధి,పాత్ర యానమట భవనీరధి,
ఒక పామును పడగ దొక్కినా, ఒక పామును పడకగెక్కినా,
ఎవరెవ్వరి కృతము లెంతలో , వారికైన హితము లంతలై......
సంగరమున కురిసిన వేదం, సంగడీల విందు వినోదం,
సామగాన సరస సుధా రస వేణుధార ధరణికి మోదం,
ఏనుగొకటి రక్షణ గొనినా, ఒకటి మరణ శిక్షను గొనినా
ఎరిగిన వాడెవడిది ఎదలో హితులహితులు ఆతనికెవరో.....
ఇంతింతల వటు డింతలుగా, ఆకసమునకల్లంతలుగా,
ఆద్యంతము లెరుగ నంతగా, పద పీఠం పాలపుంత గా,
భిక్ష గొనుట మోక్ష మిడుటకని,శిక్షించుట రక్షించుట కని,
ఎదిగెను శ్రీహరియా? పొంగెను పోతనదౌ కవితాఝరియా?
కనక కశిపు వక్షద్విదళన ఖరనఖ ముఖరిత కరుణా ఝరి
ఘన కరుణను తరుణి కుబ్జను అబ్జముఖిని జేసిన శ్రీహరి
గోవుల, గోపాలుర, పాలుర,బాలుర,గుణ ధాముల, భామల
గావగ ఘను డాతడొక్కడే ,ఘన కవితకు పోతనొక్కడే......
No comments:
Post a Comment