పోలీసు..
ఓ పోలీసు సహోదరా!నువు పాడని వీర గాధరా!
నీ త్యాగం తీసి పోదురా బలిదానం మరపుకు రాదురా!
నువు సాగే జీవిత బాటలు కాదోయీ పూవుల తోటలు
నీ ధర్మం ఫలితము కోరకే కొనసాగుట నిత్యం పోరుకే ...
పదవుల చదరంగపు టాటలో పై పై అధికారుల పావువై
అరుకాషుడి బారిన పడితే వ్యధలై కధలవి తుది మొదలై
దూర భారమైన బదిలీపై జీవిక కొరకై కదిలీ
సాగిపోవు బాటసారీ..ఆగి పోవు ఒక్క సారీ....
ఆవేశపు మార్గపుటన్నలు, తమ దారులుతప్పిన తమ్ములు
ఎవరిని విడిపించాలో, ఎవరిని ఇరికించాలో,ఎవరు దేశ భక్తులో, తీవ్రవాద శక్తులో
మారుతాయి వ్యాఖ్యానాలు, మీరు మౌన కార్ఖానాలు
ప్రభువులు మారినప్పుడు మారాలట మీరెప్పుడు ...
కొండలలో, కోనలలో, కానలలో, వానలలో
ఎదురీతలు వరదలలో ఎదురెదురుగ కాల్పులలో
నీ సమాజ రక్షణలో, నాయకుల నిరీక్షణలో
నీవట నీవారికి గుబులై నిలిపేరట చూపులు వాకిట..
సందులలో, గొందులలో,బందుల ఇబ్బందులలో
నిరాహార దీక్షలో , నీ బతుకు పరీక్షలో,
గెలిచి నిలిచి నవ్వే నువ్వు రోషం తో మీసం దువ్వు
మంచి పెంచు వంచన తుంచు దీనులకై దేవుడవ్వు..
శెలవు లేదు, నెలవూ లేదు,ఇట్లాంటిది కొలువే లేదు
ఈ సమాజ రక్షకుడవు నీ బ్రతుకునకే రక్షణ లేదు!
బుల్లెటు జల్లుల జల్లెడైనా నీ దరహాసం వాడదు!
ముప్పులకూ మెప్పులకూ లొంగి పోవు, పొంగిపోవు!...
స్నేహితుడా పురోహితుడా ఈ సమాజ రక్షక భటుడా!
చివరిగ నీకొక మాటరా మన దందరిదీ ఒక బాటరా
మా అందరితో నువు కలసి పో నీవందరి వాడిగ నిలిచిపో
అందరి కొరకై ఒక్కరం ఒకరి కొరకై వుందామందరం....
యూనిఫారమే లేకున్నా యూనిఫారమందు వున్నా
ప్రతి పౌరుడు రక్షక భటుడై రక్షక భటుడూ తానొక పౌరుడై
నీ చేయీ నా చేయీ కలిసిన మనదే పై చేయీ
అసాంఘిక స్వార్ధ శక్తులపై,దుర్మార్గుల క్రూర కుయుక్తులపై...
No comments:
Post a Comment