పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, June 10, 2012

                                        1 వ రంగము

(అల్లసాని పెద్దన గృహము . తెరలో ప్రతీహారి..జయము జయము..అప్పాజీ మహామంత్రి వారు వేంచేయుచున్నారు..అరుగు మీద సిద్దముగా కూర్చున్న అల్లసాని వారు లేచి..)

పెద్దన:- అప్పాజీ మహామంత్రులకు అభివాదములు! రండు! ఆసీనులు     కండు!       

అప్పాజీ:- అల్లసానివారికి అభివాదములు! మనుచరిత్ర కావ్యమును             అంకితమొనర్చుటకై భువన విజయమునకు ఆహ్వానము!

పెద్దన:-మహామంత్రీ! రాయలవారి సమక్షమునకే బయలుదేరుచున్నాను!.. మీ రాక నాకు ఆనందదాయకమే గానీ మీకేల  ఈ శ్రమ? కబురంపినచో సరిపోయెడిది కదా! ఏమైనా ప్రత్యేకమైన ఆజ్ఞాపన కలదా?

 అప్పాజీ:-ప్రభువులవారు సగౌరవముగా సమస్త లాంఛ నములతో  పల్లకీయందు కూర్చుండబెట్టి  తమను తోడ్కొని వెళ్ళుటకు సామంత, మంత్రి, దండనాయక సమేతులై భువనవిజయ కవులను ముందిడుకుని వేంచేయుచున్నారు! మీరు బయలుదేరక మునుపే ఈ వార్తను స్వయముగా నేనే మీకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించినారు! ప్రభువులవారు ఏ క్షణములోనైనా ఇచ్చటికి రాగలరు!

పెద్దన:- హే పరమేశ్వరా! శ్రీకృష్ణరాయ చక్రవర్తులు ఈ సామాన్య బ్రాహ్మణ కుటీరమునకు స్వయముగా విచ్చేయుచున్నారా?  

(తెరలో..జయము..జయము..రాజాధిరాజ..రాజమార్తాండ..రాజపరమేశ.. మూరు రాయరగండ..విజయనగర సామ్రాజ్యాధీశ్వర...శ్రీ శ్రీ శ్రీ  శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు విజయము చేయుచున్నారు..)

(శ్రీకృష్ణదేవరాయల ప్రవేశము)

పెద్దన:- క. అవిరళ వితరణ విద్యా 
              నవ రాధేయునకు సజ్జన విధేయునకున్
              గవితా స్త్రీ లోలునకున్
              ఖవిటంక నటద్యశోబ్ధి  కల్లోలునకున్...

ప్రణామములు! గుణవంతునకు..కళా రేవంతునకు..అతి శాంతునకు.. ఆవిష్కృత కీర్తి ధవళితాశాంతునకు..శ్రీకృష్ణదేవరాయ భూకాంతునకు వందనములు! ఈ సామాన్య బ్రాహ్మణ గృహస్థుపై సామ్రాజ్యలక్ష్మీకాంతునకు   
ఎంతటి దయ?..దయచేయండి!

రాయలు:-ప్రణామములు!..

         క.   హితుడవు చతురవచో నిధి 
              వతుల పురాణాగమేతిహాస  కథార్ధ 
              స్మృతి యుతుడవాంధ్ర కవితా
              పితామహుడ వెవ్వరీడు పేర్కొన నీకున్?

శిరీష కుసుమ పేశల సుధామయోక్తుల నిధివి, బ్రాహ్మీమయ తేజో ప్రతినిధివి..సకల విద్వత్కవిజన మాన్యుడవు..నీవు సామాన్యుడవా? 
నేను తమరిపై దయజూపుట ఏమి? తమరే దయజేసి..తమ కృతికన్యకను మాకు దయజేసి..నాకు శాశ్వత కీర్తిని దయ జేయండి!

పెద్దన:- ఏలిన వారి ఆజ్ఞ! లోపలకు దయజేయండి! సుఖాసీనులు కండి! శీతల పానీయంతో  దాహం పుచ్చుకోండి!

రాయలు:-ముహూర్తమునకు వేళ యైనది! వియ్యాలవారింట విందులకు, సరసకవితా పలుకుల పసందులకు సమయము ముందున్నది! కతికితే అతకదు..త్వరగా తెమలండి!

పెద్దన:-చిత్తము! భట్టూ!..భట్టుమూర్తీ..!
(లోనకు చూస్తూ పిలుచును..లోపలినుండి శిష్యుడు భట్టుమూర్తి చేతికర్రతో..ఉత్తరీయముతో..చేతిలో మనుచరిత్ర  ప్రబంధముతో 
బయటకు వచ్చును)

భట్టు:-నేను సిద్ధం గురుదేవా! బయల్దేరదామా? శకునం చూచేదా?
(బయట వున్న అప్పాజీ, రాయలవారు, భువనవిజయ కవులు
ఇత్యాదులను జూచి ఠక్కున ఆగిపోవును) 
అప్పాజీ వారికి అభివాదములు! ప్రభువుల వారికి ప్రణామములు!

రాయలు:-(తల పంకించి) అష్టవసువులలో ఆఖరివానివలె వెలిగి పోవుచున్నాడు! ఎవ్వడీ వసువు?..ఏమీతని చరితము?

అప్పాజీ:-అల్లసానివారి అనుంగు శిష్యుడు! భట్టుమూర్తి..పిట్ట కొంచెమే కానీ..కూత ఘనము!

రాయలు:-ఏమోయీ!..నిజమే..??

పెద్దన:- సంగీత, సాహిత్య, సామ్రాజ్య చక్రవర్తులడుగుతున్నారు!
పరవాలేదు!..సందేహించకు!..సమాధానమివ్వు!

భట్టు:-చిత్తము మహారాజా! మామూలుగా కాదు! సరిగా అనుకూలింపవలయునే గానీ..వసంత భావోన్నతితో కూయగలను!

రాయలు:-శహభాష్! రాయల చెలికాని శిష్యుడవనిపించుకున్నావు!..
అప్పాజీ..ఈ వసంతగానము తర్వాత తీరికగా ఆలకింపవలయును! ప్రస్తుతకార్యము వేగిరముగా జరిపించండి!

(అప్పాజీ వారి కరతాళధ్వనితో పరిచారకులు బంగారు పళ్ళెరములో పుష్పములు, ఫలములు, స్వర్ణ గండపెండేరము,పాద పీఠిక తీసుకుని వచ్చి..పాద పీఠమును నేలపైనుంచి వేచియుందురు)

రాయలు:-( సాదరముగా పెద్దనను కూర్చుండబెట్టి, పన్నీరు చిలికించి, 
పూల మాలికతో అలంకరించి, గంధ, పుష్ప, ధూపములతో సత్కరించి,
పాద పీఠముపై అతని పదమునుంచుమని సూచించును)

పెద్దన:-(వారించుచూ..)మహారాజా! నాకిది ఔచిత్యమూ కాదు..తమరికిది గౌరవప్రదమూ కాదు!

అప్పాజీ:-(రాయలతో..) చిరంజీవీ!నీ సంగీత సాహిత్య కళాభిమానము హర్షింపదగినదే గానీ, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఒక కవి
పండితుని పాదమునకు స్వయముగా గండపెండేరము తొడుగుట సమంజసము కాదేమో!

రాయలు:- అప్పాజీ! శ్రీకృష్ణ దేవరాయల కీర్తి విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగాకన్ననూ సంగీత, సాహిత్య, కళారాధక చక్రవర్తిగా                 శాశ్వతముగా నిలువగలదు..నిలువవలయునని నా ఆకాంక్ష!..

శా. '' కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ పొందరే
       వారేరీ సిరి మూటగట్టుకుని పోవం జాలిరే భూమిపై
       పేరైనంగలదే శిబిప్రముఖులున్ ప్రీతిన్ యశః కాములై
       ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా..''

యని భాగవత జయ కేతనమైన పోతన మహానుభావుడు పలుకలేదా?

అప్పాజీ:-నిజమే నాయనా! కానీ సామ్రాజ్యమునకు, చక్రవర్తికీ శాశ్వతమైన విధి విధానములున్నవి కదా..

రాయలు:-సామ్రాజ్య వైభోగము క్షణికము..రసరాజ్య వైభవము శాశ్వతము..సామ్రాజ్య సీమలను రక్షించు సైనికుని కన్న సంగీత, 
సాహిత్య, కళా సాంస్కృతిక సీమలను పరిరక్షించు కళాకారుడు 
శాశ్వతముగా చరిత్రలో నిలిచిపోవును!..రాయలు కరవాలముతో కన్న కళాకారునిగా చరిత్రలో నిలిచిపోవును!

పెద్దన:- నిజము వచించితిరి మహారాజా!

శ్లో.      '' మాన్ధాతాచ మహీపతి: కృతయుగాలంకారభూతో గతాః
            సేతుర్యేన మహోదధౌ విరచితః క్వాసౌ దశాస్యాన్తకః
            అన్యేచాపి యుధిష్టిర ప్రభ్రుతయో యాతా దివం భూపతే
            నైకేనాపి సమంగతా వసుమతీ నూనం త్వయాయాస్యతి..''

..అన్నట్లు..మాంధాత..మంగళ గుణాభిరాముడు శ్రీ రాముడు..ధర్మరాజు..
 ఎందరు మహారాజులు వెళ్ళిపోలేదు!..రాజు వెడలిపోవును..కవిరాజు నిలిచిపోవును!

రాయలు:-(కరతాళ ధ్వని చేయుచూ..) అంగీకరించితిరి కదా!..రండి!

(మంగళ ధ్వనుల నడుమ..కరతాళ ధ్వనుల నడుమ పెద్దన కాలికి గండపెండేరము తొడిగి..ఆలింగనము జేసికొనును)

పెద్దన:-(భట్టుమూర్తి చేతిలోనుండి గ్రంథమునందుకొని పళ్ళెరములోనిడి ..తన చేతులతో మోయుచూ) మహారాజా!..ఇది..

క.       'కరుణాకర వేంకట విభు 
          చరణ స్మరణ ప్రసంగ సంగత మతికీ
          శ్వర నరసింహ మహీ భ్రు 
          ద్వర నందన కృష్ణరాయ ధరణీ పతికిన్'

 ...సమర్పించుకొనబోవు నా కృతికన్య..స్వారోచిష మనుసంభవము.. మనుచరిత్రము..!!! 

రాయలు:-(ఆనందముగా..)మామగారూ..పదండి!

(రాయల చేతి ఆసరాతో, తెనాలి రామకృష్ణుడు శ్వేత ఛత్రము పట్టగా, అప్పాజీ ముందు నడువగా, భువనవిజయకవులు వెంట రాగా..
పెద్దన పల్లకీ నధిరోహించుటకు  వెళ్ళుచుండగా...వేగులవాడు 
వేగముగా సమీపించి అప్పాజీ వారికి ప్రత్యేకముగా ఏదో విన్నవించును.
అప్పాజీ గంభీరముగా రాయలవారిని సమీపించి ఏదో చెప్పబోయి సందేహించుచుండగా..)

రాయలు:-అప్పాజీ! ఏమది? ఎందుకు సందేహించుచున్నారు?

అప్పాజీ:-మహారాజా! ఇప్పుడు సమయముగాదేమో! కావ్య అంకిత 
సభను పూర్తి జేసికొని..ఆ తర్వాత..

రాయలు:-పర్వాలేదు మహామంత్రీ! అదేమో శెలవీయండి!

అప్పాజీ:- ఉదయగిరి రాజులు..కళింగాధిపతి..యితర తీరాంధ్ర రాజుల సేనావాహిని విజయనగరముపై దండయాత్రకు బయలుదేరనున్నట్లు
వేగులవారి సమాచారము మహారాజా!

రాయలు:-(విజయ హాసము చేయుచూ)శుభవార్త!..

(వేగులవానికి తన మెడలోని రత్నహారమును బహూకరించును)

సాహిత్యలక్ష్మి సామ్రాజ్య విజయలక్ష్మిని వెంట దెచ్చుచున్నది  గాబోలు!..అప్పాజీ..మన శత్రువులు దండయాత్రకు 
బయలుదేరనున్నారేమో.. కానీ..మనము రేపే దాడికి బయలుదేరుచున్నాము! అందుకు సర్వమూ సిద్ధం చేయండి!

పెద్దన:- ప్రభూ..ఇంతదనుక సామ్రాజ్యము..సామ్రాజ్య విజయమూ అశాశ్వతములని, సాహిత్య విజయమే శాశ్వతమని అంటిరి కదా!!  

రాయలు:-మామగారూ! అది ప్రవృత్తి..ఇది వృత్తి..ప్రవృత్తిని ఆరాధింప వలయును..వృత్తిని ఆచరింప వలయును!..పదండి!      

(రాయలు ఒకవైపు మోయుచుండగా పెద్దన పల్లకీ నధిరోహించి కూర్చుండగా అందరూ వెడలి పోవుదురు. తెర వాలును) 

2 comments:

  1. చాలా బాగుంది. మీ కలం ఇలాంటి రసగుళికలు శతథా గుప్పించాలని ఆకాంక్షిస్తున్నాము.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సర్.. Ramana Balantrapu garu!

      Delete