పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Saturday, June 16, 2012


7 వ రంగము

(మత్స్య ధ్వజుని సభ. రాజు..పండితులు..పురప్రముఖులు..ఇతరులు కొలువుదీరి యుండగా  విష్ణుచిత్తుల ప్రవేశము) 

విష్ణుచిత్త:- జై శ్రీమన్నారాయణ! మత్స్యధ్వజ మహారాజా! శుభమస్తు!

మత్స్య :- మహానుభావా.. ప్రణామములు.. ఆశీనులు కండు.. తమరి పరిచయము?

విష్ణుచిత్త:- శ్రీమన్నారాయణ కటాక్ష ప్రాప్తిరస్తు! మహారాజా! విష్ణుచిత్త నామధేయుడైన  దాసుడు శ్రీవిల్లిపుత్తూరు మన్నారుని పాదదాసుడు.. శ్రీవిష్ణు మహిమమును  ప్రకటించుటకు నారాయణుని దూతగా మీ కొలువునకు వచ్చితిని!

మత్స్య :- విప్రోత్తమా! అనేక దినములుగా పండితులు వాదము జేయుచున్నారు..ఒకరు శివుడు మోక్షమునిచ్చునని..ఒకరు పార్వతి పాలించునని..ఒకరు విఘ్నేశ్వరుడు కాపాడునని చెప్పుచున్నారు.. అగ్నిహోత్రుడు దైవమని కొందరు..సూర్యనారాయణుడే ప్రత్యక్షదైవమని ఇంకొందరు వాదించుచున్నారు! నాకు సంతృప్తి కలుగలేదు..నా   యాత్మనుద్ధరింపగల దైవమును మీరైనా చూపగలరా? చూపగలరేని ఈ ధనరాశి మీది!

విష్ణుచిత్త:- జై శ్రీమన్నారాయణ! (ప్రార్ధన జేయును..)
 
        జయ జయ దానవ దారణ కారణ శార్ణ్జ్గ రధాంగ గదాసి ధరా   
        జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహః ప్రసరా
        జయ  జయ తామరసోదర సోదర చారు పదోజ్హ్జ్హిత గాంగఝరా
        జయ జయ కేశవ కేశి నిషూదన శౌరి శరజ్జలజాక్ష హరీ !

        ... జై శ్రీమన్నారాయణ! మహారాజా తమరు రెండు నిధుల గురించి    
         ప్రస్తావించుచున్నారు..ఒకటి తమరు పుచ్చుకొను  ఆధ్యాత్మిక నిధి..
         రెండవది తమరు ఇచ్చుకొను ఆర్ధికనిధి!

మత్స్య :- (చిరునవ్వుతో) ఔను!

విష్ణుచిత్త :- కానీ..మన్నించండి మహారాజా..మూడవ నిధి..మీ పూర్వీకులనాటి పెన్నిధిని కనుగొన లేకున్నారు!
   
మత్స్య  :- మా పూర్వీకుల పెన్నిధి..??..ఏమది??

విష్ణుచిత్త:- కావేరీ నదీ ద్వీపమున..మహాసర్పము చుట్టలుగా చుట్టుకొని...తన సహస్ర  ఫణములతో సంరక్షణ జేయుచుండగా 
దివ్య  శంఖ చక్రముల మధ్య అలరారే పెన్నిధి..శ్రీరంగని సన్నిధి!

మత్స్య:- విప్రోత్తమా!..విష్ణువిత్తమా??

విష్ణుచిత్త:- చిత్తము మహారాజా! వీరశైవుడైన తమరి ప్రపితామహులు తమరివలెనే..పండిత సభను జరిపింపగా...మహానుభావుడైన  'నాధముని'యొక్క  మనుమడు యామునాచార్యులవారు శ్రీవైష్ణవ తత్త్వమును ప్రతిపాదింపగా ఆకాశవాణి సత్యము..సత్యము..అని ఆమోదింపలేదా?

మత్స్య :- ఔనౌను..మా రాజవంశచరిత్ర పుటలయందు 
            లిఖింపబడియున్నది .. ఐన..

విష్ణుచిత్త :- మహారాజును వైష్ణవుని జేసి..ఫలముగా మహారాజు 
చెల్లెలినీ, అర్ధరాజ్యమునూ చేపట్టిన యామునాచార్యులవారు భోగలోలుడై..జూదరియై .. భ్రష్టుడు కాగా..మరలా శ్రీరామమిశ్రుని బోధలవలన కండ్లు తెరుచుకొని..సన్యసించి..విష్ణుపదమును 
పొందలేదా?

మత్స్య  :- ఔను.. సత్యమే!

విష్ణుచిత్త:- మహారాజా! విష్ణుభక్తివిత్తము మీకు  పిత్రార్జితము! 

మత్స్య:- మహానుభావా..మీ పలుకులవలన..మనసుపొరలలో 
ఏవో మధురమైన కదలికలు..

విష్ణుచిత్త:- మహారాజా! మీవలెనే విరక్తుడై..మోక్షాసక్తుడైన పరీక్షిత్తును పుట్టుక యందును..గిట్టుట యందును రక్షించినది  ఎవరు? వైష్ణవతత్త్వమే కదా! ఇంకనూ సాక్ష్యములు కావలెనా?

          శ్లో. వాత్సల్యాదభయ ప్రదాన సమయా దార్తార్తి నిర్వాపణాత్
              ఔ  దార్యా దఘశోషణా దగణిత శ్రేయః పదప్రాపణాత్   
              సేవ్యః శ్రీపతి రేక ఏవ జగతా మేతేచ షట్సాక్షిణో    
              ప్రహ్లాదశ్చ  విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యా ధ్రువః 

             అయ్య బారినుండి ప్రహ్లాదుని..అభయమునిచ్చి విభీషణుని.. ఆర్తిని బాపి కరిరాజును ఆదుకున్నది ఎవరు? పరాభవము నుండి పాంచాలిని..పాప పంకిలమునుండి అహల్యను..పతనమే లేని 
పదవినిచ్చి ధ్రువుని పరిరక్షించినది ఎవరు?..పన్నగశయనుడే! పాండురంగడే !
 
(ఆకాశవాణి సత్యము..సత్యము..సత్యము అని ముమ్మారు  ఘోషించును! సభాభవన మధ్యమున వ్రేలాడదీసిన బంగరు నాణెములమూట తనంత తానుగా తెగి పడిపోవును! సభికులు హర్షధ్వానములు చేయుదురు! జై శ్రీమన్నారాయణ అను నాదములు మారుమ్రోగును!)

మత్స్యధ్వజ:- (విష్ణుచిత్తులకు మ్రోకరిల్లి)..ధన్యుడను స్వామీ..ధన్యుడను!

విష్ణుచిత్త:- కం. నరనాధ పాంచభౌతిక 
                    శరీరమున దేహి మోహ సాంద్రతమ తమః 
                    పరివ్రుతుడై ఏ నిది నా   
                    పరికరమని యవధిలేని భ్రమపడి తిరుగున్ 

                    రాజా! పాంచభౌతికమైన ఈ శరీరమునందు మోహాంధకారములో మునిగిన  మానవుడు నేను..నాది యని 
అంతులేని భ్రమలో పడి పరిభ్రమించును!

మత్స్య:- సత్యము స్వామీ..సత్యము!

విష్ణుచిత్త:- ఆ. ప్రాణికోటికెల్ల  బంధంబు మోక్షంబు       
                   చేరుటకును మనసు కారణంబు 
                   విషయసంగి యైన విను బంధకారి
                   నిర్విషయమైన ముక్తి విభవకారి

                  మానవుని బందీని చేయునది...బంధ విముక్తుడిని చేయునదీ మనసే! విషయ వాంఛల వైపు మొగ్గిన మనసు బంధకారియగును ..విషయ వాంఛలను విషతుల్యములుగా 
ఎంచినచో..ఆ మనసే ముక్తికి కారణమగును!

మత్స్యధ్వజ:- ఔను స్వామీ..నిక్కము..

విష్ణుచిత్త:- మనసును మగువలనుండి.. మణి మాణిక్యములనుండి మాధవుని పదములకు మర లించి ముక్తిని పొందెదవు గాక!

మత్స్యధ్వజ:- మహాప్రసాదము స్వామీ..మీ ఉపదేశమును మనసా..వాచా..కర్మణా..పాటింతును!           
 
విష్ణుచిత్త:- మహారాజా! తమకు కావలసిన నిధి తమకు లభించినది! 
ఇక మీరు బహుమానముగా ప్రకటించిన నిధి విషయమందురా..మా విల్లిపుత్తూరు నీలమణి యుండగా ఈ మణి మాణిక్యములతో 
నాకేమి పని? నాకే బహుమానమూ వలదు!

మత్స్యధ్వజ:- బహుమానముగాదు స్వామీ! మా ప్రపితామహులకు యామునాచార్యుల   వలె..నాకు మీరు గురువైనారు..గురుదేవా! 
ఇది మీ శిష్యరేణువు సమర్పించుకొనుచున్న  గురుదక్షిణ!
 ( సభలో సాధు సాధు నాదములు చెలరేగును)

విష్ణుచిత్త:- (నవ్వి) నేను మరొక యామునాచార్యుడనైనచో...
శ్రీరామమిశ్రుడు  ఎక్కడనుండి వచ్చును? ఈ ధనమును నీవే 
పుణ్య కార్యములకు వినియోగింపుము!

మత్స్యధ్వజ:- వలదు స్వామీ..వలదు..అపరాధిని మన్నించండి..
గురుదక్షిణ చెల్లింపకపోయిన ..గురూపదేశమెలా ఫలించగలదు? 

(ధనపు సంచిని యాతని చేతులలో నుంచి సాష్టాంగము పడిపోవును. సభలో హర్ష ధ్వానములు చెలరేగును. సభికుల మధ్యనుండి మంజువాణి పరుగున వచ్చి విష్ణుచిత్తుల పాదములపై పడిపోవును )

మంజు:- పాపిని..నీచురాలను..మన్నించండి స్వామీ..మీ బోధనువిన్న నామోహము నశించిపోయినది! తమరి శిష్యురాలిగా దాసిని అనుగ్రహించండి! స్వామిసేవలో తరించి తనువు చాలింతును!! 

విష్ణుచిత్త:- శ్రీనాధా! ఈ దీనురాలిని కరుణించు తండ్రీ! అమ్మా! 
నీ పరివర్తన పరిపూర్ణమౌను గాక! 

( తన చేతిలోని ధనపు సంచిని  ఆమె చేతిలోనుంచి..) 

               ఈ ధనముతో..నారాయణసేవతో శ్రీరంగ యాత్రికులను సేవించుకొనుము తల్లీ! భాగవతుల సేవయే భగవంతుని సేవ! 
నిర్మలమైన మీ భాగవత సేవయే నాకు నిజమైన గురుదక్షిణ! 

( సభలో హర్ష ధ్వానములు! తన భక్తుని విజయమును గాంచి గగన మధ్యమునుండి ఆశీస్సులిడుచున్న శ్రీమహావిష్ణు దర్శనము జేసి..)

              జై   శ్రీమన్నారాయణ! హే కరుణాసింధో! నీ భక్తుని దీవించుటకు దివినుండి భువికి చనుదెంచిన నీ దివ్య మంగళ స్వరూపమునకు 
దిష్టి తగులకుండును గాక! దివ్య బృందారక బృంద సందోహ 
మందిరుండవైన నీమంగళమూర్తికి మంగళమౌనుగాక!

         తే. కొలుతు సర్వేశు సర్వాత్మకుని ననంతు 
             నప్రకాశు నభేద్యు సమస్త లోక 
             సముదయాధారు నణు సమూహములకును న 
             ణీయు నిన్ను ననాధారు నిత్యు సత్యు 

( మహావిష్ణువు అద్రుశ్యుడగును. జయజయ ధ్వానముల నడుమ విష్ణుచిత్తులు నిష్క్రమించును)    

(తెర)    

No comments:

Post a Comment