9 వ రంగము
( గోదాదేవి కాత్యాయనీ ప్రతిమను అలంకరించి..వ్రతమును చేయుటకొరకు తోడివారిని
చెలికత్తెలను పిలిచును)
సాకీ.. నీరాడ రండహో చెలులారా..
రంగేశు రహి మీర సేవింతము..
ప. నీరాడ రండో చెలులారా
రంగేశు సేవింతము ||నీరాడ||
మందగమనలారా లెండు
యమునకు జన రండు
మననోములు ఈ మహికిడులే
మంగళములు కడు మెండు ||నీరాడ||
నందగోకులంలో చెలువొందు చెలులు రండు
పరువాల సోకుజిలుగు నెగిడేటి చెలులు రండు
మార్గశిరంలో మంచులలో
మహికిక మది పులకించెనులే ||నీరాడ||
ఎల్లరి మనముల తానై
ముంగిట సింగపు కూనై
నంద యశోదల సందిటిలో అందములొలికే చందురుడై
బృందావనిలో చెలగెనులే తరుణుల నిజ మన్మందిరుడై ||నీరాడ||
(క్రమముగా ఒకరొకరుగా చెలికత్తెలు యువతులు రాగా వారందరితో నృత్యము జేయుచూ
కాత్యాయనీ పూజ చేయుట యారంభించును)
ప. కాత్యాయనీ మము కృప గనవే
కన్నెల మదిలో మొరలను వినవే
అ.ప. కమలాకాంతుని కాంతుగ నిడవే
కరుణను మముగని శుభముల నిడవే ||కాత్యాయనీ||
చంద్ర శేఖరుని చెలి కరుణించి
చంద్రహాసమును చేత ధరించి
శార్దూలాసన శోభల మించి
వంద నేత్రముల సుధ వర్షించి ||కాత్యాయనీ||
(నృత్య గీతములతో పూజ సలిపి ప్రసాదములు సీకరించి అందరూ నిష్క్రమింతురు.
గోదాదేవి భక్తి పారవశ్యంబున విరహాయత్త చిత్తయై పలవరించుచూ..)
శా. లీలా నాటక సూత్రధారి మురళీ లోలా హరీ శ్రీధరా
ఏలా జాలము ఏలువాడ సఖుడా యేతెంచి లాసంబుగా
నీ లాలిత్యము నీదు పాట నటనల్ నీటార శ్రీ వేణు గో
పాలా నా మనమున్ మదీయ తనువున్ పాలించి లాలించరా!
(ప్రణయ భావావేశమున స్వామిమూర్తి పాదముల చెంత మూర్చిల్లును.
పరుగున విష్ణుచిత్తుల ప్రవేశము.)
విష్ణుచిత్త:- శ్రీమన్నారాయణా! దీనజన రక్షకా! చూడు తండ్రీ..నాబిడ్డ దీనావస్థను..
వాసుదేవా! గోవిందా!
(శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమౌను)
విష్ణుచిత్త:- నిత్యమూ ఆ వ్రత నిష్ఠలతో చిక్కి శల్యమై ..ఆ పలవరింతలు..ఆ బాధ.. ఆది భక్తి
యోగమో..విరహయోగమో..దైవారాధనయో..ప్రణయారాధనయో తెలియకున్నది!
( అటునిటు జూచి) పరులకు తెలిసిన పలుచనైపోదునేమో యని అదియొక భయము!
నాకిదేమి పరీక్ష తండ్రీ?
స్వామి:- విష్ణుచిత్తా!..నీకు ప్రపత్తి మార్గమే గానీ..ప్రణయ మార్గము తెలియకున్నదోయీ..
ఈమె వలపులో పడినది..తన మనో నాయకుడిని భర్తగా పొందగోరి..ఈ కాత్యాయనీ
వ్రతమాచరించుచున్నదోయీ!
విష్ణుచిత్త:- (గుండెలు బాదుకొనుచూ..) గోవిందా! శ్రీమన్నారాయణా!..అబ్రాహ్మణ్యము ..నా కొంప
మునిగినది తండ్రీ..పసిపిల్ల! దానికి మరులు గొల్పి..మాయజేసి..పరమ భాగవతుని
పరువుదీయుటకు సంకల్పించిన ఆ దుర్మార్గుడెవరు? ఎవడా ముచ్చు?
స్వామి:- ఆతడు మహా మాయావి..ఒకరా..ఇద్దరా..ఇలా ఎన్నివేలమందిని మోహింపజేసెనని
చెప్పుదును! ఇప్పుడేమనుకొనిన ఏమి లాభము? విష్ణుచిత్తా...నీవేల నీ కుమార్తెను
గమనింపవైతివి?
విష్ణుచిత్త:- నిన్ను గమనించుటకే నాకు సమయము సరిపోవుటలేదు..యింక ఇదంతా ఏమి
గమనింపగలను? పసిపిల్ల! దానికి తెలియనిచో పగలూ రాత్రీ దానిని వదలక అంటిపెట్టుకుని
తిరిగే ఇష్ట సఖులు పెద్దవారితో చెప్పవద్దూ..తమ కిలకిలతో..గుసగుసలతో రాయబారములు
నడిపి నాబిడ్డను భ్రష్టు పట్టించినారు కాబోలు ..మరలా ఇంటివైపు రానిమ్ము చూచెదను..
ఇంతకూ ఆ మోసగాడెవడు స్వామీ..
స్వామి:- వోయి వెర్రి బాపడా! నీ కుమార్తె వలచినది నన్నేనోయీ..నన్ను భక్తి భావముతో నీవు
సేవించుచుండగా..ప్రణయభక్తి భావముతో నీ కుమార్తె సేవించుచున్నదోయీ..
నన్ను పొందుటకే ఈ వ్రతము..నాకొరకే ఈ విరహము..ఈ మదన తాపము!
విష్ణుచిత్త:- స్వామీ! ఇదేమి అన్యాయము? శ్రీదేవి..భూదేవి..నీళా దేవి..ఇందరుండగా
నా చిట్టి తల్లినేల మాయజేసితివయ్యా?
ఉ. నెట్టన యల్ల లచ్చియల నీళయు భూసతియుండ నీకు నీ
నెట్టిక సీలపై మనసు నిల్చుట కేమనవచ్చు వెర్రియౌ
నట్టుగ పేద నన్ను పరిహాసము సేతకు దక్క వింత చూ
పెట్టిది దిద్దునెవ్వడిల ఏరుల వంకలు వారి డొంకలున్
స్వామి:- (వినోదముగా) ఐనచో ఇపుడేమి చేయనున్నావయ్యా..నాపై లోకమున చాటింతువా ఏమి..??
విష్ణుచిత్త:- కాక..వూరకుందు ననుకుంటివా ఏమి? కంచెయే కనికరము లేక చేను మేయుచుండగా..
కాపాడువారు లేరనుకుంటివా ఏమి? శివునకు..బ్రహ్మకు..యితర దేవతలందరికీ నీకెదురు
చెప్పు సాహసము లేకున్ననూ..మాయమ్మ లేదా..భాగవత బంధువులు లేరా?
వారితోడనే విన్నవించుకుందును ..
చ. శివుడు విరించి వాసవుడు చెప్ప నశక్తులు కొల్చునట్టి వా
రవుట నిరంకుశుండ నని యక్కట పాడి దొరంగ జెల్లునే
భువనములెల్ల నీవైన బొంత దయానిధి యమ్మ లేదె భా
గవతులు లేరే నాకొరకు గాగ వహించుకొనంగ కేశవా!
స్వామి:- విష్ణుచిత్తా! ఎంతటి యమాయకుడవోయీ! ఈమె లోకకళ్యాణముకొరకు అవతరించిన
భూదేవి కాగా, ఈమె చెలికత్తెలు నా పనుపున భూమిపై జనించిన నాగకన్య లోయీ!
గోలోకమున నన్ను పొందిన దివ్య భక్తి, క్రిష్ణావతారమున నన్నుచేరిన గోపికల సఖ్యభక్తి,
భూలోకమున నన్ను పొందనున్న నీ కుమార్తె ప్రణయ భక్తి...అంతా
నా లీలగా తెలిసికొనవయ్యా!
విష్ణుచిత్త :- (సంభ్రమాశ్చర్యాలతో..)శ్రీమన్నా రాయణ! ఏమి నా భాగ్యము!..కానీ..ఇది ఎలా సాధ్యము
తండ్రీ? మానవకాంతకు, మాధవీ కాంతునకు మనువు ఎలా సాధ్యమయ్యా?
స్వామి:- విష్ణుచిత్తా! భక్తికి సాధ్యము గానిదేమున్నది?నీ కుమార్తెను శ్రీ రంగమునకు తోడ్కొని వచ్చి
సకల లాంఛనములతో నా ఇల్లాలిని జేయవయ్యా! నిష్కల్మషమైన భక్తితో నన్ను
ఆరాధించినవారికి సశరీరంగానే నా సన్నిధి లభిస్తుంది! నేను భక్త సులభుడను!
విష్ణుచిత్త:- పరమాత్మా! పరంధామా! ఇందులకేనా..నాకు ఈ తల్లిని ప్రసాదించినది!
స్వామి:- విష్ణుచిత్తా! నన్ను పొందుటకు కుల, మత, వర్ణ, వర్గ, లింగ, వయోభేదములేవీ అడ్డు కావు!
నీకొక దృష్టాంతమును జూపెదను గాక!
చ. కలడొకరుండు పేరుకొనగాని కులంబు మదీయ భక్తు డి
య్యిల మును వాడు వామనత నే వసియించిన పుణ్యభూమి యం
దులకొక యోజనత్రయపు దూరపుటూర వసించి, బ్రాహ్మ వే
ళల చనుదెంచి పాడు మము లాలస మంగళ నామ కైశికిన్
...భాగవతుల కులములో రత్నమువంటివాడు, నా ప్రియభక్తుడు ఒకడు కలడు..
విష్ణుచిత్త:- ఎవరా పరమభాగవతోత్తముడు స్వామీ!..వివరముగా దెలుపవా..
స్వామి:- నా పరమభక్తుడు..ఒక మాలదాసరి..కులమున పిన్న..గుణమున మిన్న!ప్రతి ఉదయమూ
బ్రాహ్మీముహూర్తములో మంగళ కైశికీ రాగముతో నాకు మేలుకొలుపులు పాడి నన్ను
సేవించును! ఆతని భక్తిని పరీక్షింతము..నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను!..
చూడుము.. కనబడుచున్నదా!
విష్ణుచిత్త:- దివ్య ద్రుష్టియా..??..ఆ..ఆ దివ్యముగా కనబడుచున్నది స్వామీ.. అడవిపిల్లిని జూచిన
భయముతో అర్ధరాత్రమునకే కోడి కూయుచున్నది..కోడి కూతకు కాబోలు..గుడిసెలోనుండి
బయటకు వచ్చినాడు..ఆహా! పరమ భాగవత శిఖామణి! మసిపాత కట్టి..చెవులకు ఇత్తడి
శంఖ చక్రముల దుద్దులు పెట్టి..చిటి తాళములు పట్టి..భుజమున కిన్నెర వీణ పెట్టి..
ఊర్ధ్వ పుండ్రములు బ్రహ్మరంధ్రమును ముట్టి..భాగవత ధర్మము ఉట్టి పడినట్లున్నాడు!
మహా భాగవతోత్తమా! వందనములు! వందనములు!..స్వామీ ఇప్పుడేమి చేయుదువు?
స్వామి:- 'మరులు తీగ' యని ఉండును..నీకు తెలియునా?
విష్ణుచిత్త:- నీ పూజకై విరులు తప్ప..నాకు మరులూ తెలియవు..తీగా తెలియదు..ఏమిటా తీగ స్వామీ?
స్వామి:- మరులు తీగయని ఒక లత యుండును..దట్టమగు యరణ్యములలోనూ ..పొదలలోనూ
వ్యాపించియుండును..ఆ తీగను త్రొక్కినచో .. దారిదప్పి..దారితెలియక తిరిగిన చోటనే
తిరుగుచుందురు..
విష్ణుచిత్త:- సంసారము వంటిదన్నమాట!
స్వామి:- ఇతనిచే ఆ మరులుతీగ తొక్కించి దారి తప్పించి వినోదము జూతము!
విష్ణుచిత్త:- (చిరు కోపముతో) ఇంతవరకూ మరులెక్కించి నా బిడ్డను దారి తప్పించితివి!..ఇప్పుడు
మరులుతీగ తొక్కించి ఆ మహానుభావుని దారి తప్పింతువా? నీ ఇచ్ఛ! స్వామివి నీవు..
సేవకులము మేము! నీ దయ..మా ప్రాప్తము!కానిమ్ము!
(కుతూహలముగా జూచుచుండును)
(తెర)
No comments:
Post a Comment