8 వ రంగము
(విష్ణుచిత్తుల గృహాంతర్భాగము. పూమాలలను, తులసీ మాలలను సిద్ధము జేసికొని
భగవన్నామ సంకీర్తన జేయుచూ ఇంటిలోపలినుండి విష్ణుచిత్తుల ప్రవేశము.)
విష్ణుచిత్త:- ప. వదలను పదములు వరదాయీ
ఘన మాయీ ఘన నీల కాయీ
అ.ప. కనుదోయీ నీ రూపే హాయీ
శుభ దాయీ సుఖ శేష శాయీ ||వదలను||
(పూలసెజ్జను అచటనుంచి లోనకు వెళ్ళును.)
(మరియొక ద్వారమునుండి గోదాదేవి ప్రవేశము గానము జేయుచూ స్వామికొరకు
సిద్ధము జేసిన పూమాలను తను ధరించి దర్పణము వద్దకు వెళ్లి తన అలంకరణము
జూసుకుని మురిసిపోవుచూ)
గోద:- ప. వలచితినోయీ వనమాలీ
వలదనకిక నను దయమాలీ
అ.ప. వ్రజవనితా స్మర తాప హారీ
మధుర మనోహర రూప ధారీ ||వలచితి||
( గానముజేయుచూ తండ్రి వచ్చెడి అలికిడిని విని తను ధరించిన పూమాలను
యథాస్థానమున నుంచి లోనకు వెడలిపోవును. విష్ణుచిత్తులు చేతికర్ర,
వుత్తరీయముతో ప్రవేశము లోననుండి)
విష్ణుచిత్త:- అవినయమణచి అహమును విడచి
అంతర్యామీ ఇహమును గడచి
హరి నీ సేవలో అఖిలము మరచి
తరియింతును నీ తత్త్వమునరసి || వదలను||
(పూలసెజ్జను యితర వస్తువులును చేతగైకొని దేవాలయమునకు వెళ్ళును.)
(లోననుండి గోదాదేవి ప్రవేశము. పరవశించి గానము నృత్యము జేయుచూ..)
గోద:- తరుణను కరుణను వలపుల వీణను
బిరముననేలర నీ సరి జాణను
సరి సరి కొసరితి సొగసరి నటనలు
మరి మరి మురిపించు మధుకేళి ఘటనలు ||వలచితి||
(ఆనంద పరవశ్యమున మైమరచి తనను తాను బృందావనమునందు గోపికగా
భావించుకొనుచూ)
గోద:- కృష్ణా! రాస విహారీ! నీ విరహమును తాళజాలను స్వామీ! రావేల? స్వామీ..
ఏమీ..ఇందరిని విడిచి ఆ రాధాకే నీ వలపును అంకితము జేతువా? ట క్కరీ ..మోసగాడా..రాధా..రాధా . .నీకిది న్యాయమా?
(అప్పుడే తనకొరకై లోపలకు వచ్చిన తన స్నేహితురాండ్రను జూసి)
గోపికలారా! చనుదెంచినారా? చూచితిరా ఈ ఘోరము? మీరైనా చెప్పరా ఆ రాధకు!
..రాధా! రాధా!
ఉ. అక్కట! రాధ తగవా మగవారల నత్త మామలం
దక్కి ముకుంద వేణు కలగానపు టీలకు లేటి మెత్తమై
తెక్కొను కాకచే నడికి రేలరుదెంచిన గోపికావళిన్
బొక్కగ జేసి తద్రుచిరభోగము గుత్తగ నీవ గైకొనన్
(దు:ఖించును)
1 చెలి:- చూడిక్కుడుత్తమ్మా!
2 చెలి:-గోదమ్మా! ఓ గోదమ్మా!
3 చెలి:- ఓ ఆండాళమ్మా!( బిగ్గరగా పిలిస్తూ కుదుపుటతో ఇహలోకమునకు వచ్చిన
గోదను జూసి)
అమ్మా! తమరి వలపు ముదిరి మతి భ్రమణ మౌతున్నది .. తల్లీ..ఇది విల్లిపుత్తూరు..
నందగోకులం గాదు! మేము నీ స్నేహితురాళ్ళ ము ..గోపికలము కాము!
1 చెలి:- నేను హారిణి ని
2 చెలి:- నేను స్రగ్విణి ని..
3 చెలి:- నేను మనోజ్ఞ ను ..ఇప్పటికైనా మమ్ములను గుర్తించితివా తల్లీ!
గోద:- (ఇహలోకమునకు వచ్చి..నిట్టూరుస్తూ..చిన్నబుచ్చుకుని..)
నా తనువూ మనసూ ఆ నల్లనయ్యకే అంకితము..ఇక నేనీ బాధను
భరింప జాలను..నాకేది దారి..మరణమే! మరణమే!
హారిణి:- గోదా! గోదా..ఏమిటిది? తననే నమ్మిన వారిని ఆ స్వామి తప్పక చేపడతాడు!
రుక్మిణిని రక్షింపలేదా?
మనోజ్ఞ:- తననే వలచిన కాళిందిని కరుణింపలేదా?
గోదా:- బాగుగానే భజన జేయుచున్నారు! అతడు కఠిన మనస్కుడు! మోసగాడు!
క. మీ పాడిన హరి చందము
లే పాడిగ తలప వచ్చు నితడే సతులం
కాపాడినవాడనుగై
త్రోపాడిన తన్ను వలచి తొయ్యలులారా!
స్రగ్విణి:- గోదా! కన్నయ్య కరుణామయుడు! వలచిన వారి వంతలను అంతము
జేయును..కురూపి కుబ్జను కూడా అందాల బొమ్మను జేసి ఏలుకొనలేదా?
మగువల మనసులను మన్నించుటలో మాధవునికి సాటి ఎవరు రాగలరు?
గోదా:- ఔనౌను!(వెటకారముగా)వలచినవారి వంతలను అంతముజేయు
కరుణామయుడు..
తే. తనకు నందరు గూర్ప బృందావనమున
నొకతె రతి దేల్చి కాకనొండొకతె బ్రేల్చి
యంత రాధకు మేలువాడై మురారి
ఎల్ల సతులకు నెద నుడుకే ఇడండే?
ఏమంటివీ?..(వెక్కిరించుచూ) మగువల మనసులను మన్నించుటలో
మాధవునకు సాటి ఎవరు రాగలరు..??అవును..వలచి వచ్చిన వనితను
ముక్కూ చెవులూ కోసి..శూర్పణఖను బాగుగానే మన్నింప లేదూ!..
తే. ఒల్ల పొమ్మన్న పోదె తానుల్లసముల
నేప? ఆది రక్కసియ యౌట ఎగ్గె? వలచి
స్త్రీలు తలవంప తానె వచ్చెనది చాల
కాడుదాని బజీతు సేయంగ నగునె ?
మనోజ్ఞ:- ఆహాహా.. ఏమీ నీ ప్రణయ కోపము! ఆ భుగ భుగలు..ఆ వగలు..ఆ సెగలు..
అలనాటి సత్యభామను తలపింప జేయుచున్నది!
హారిణి:- అవునుసుమా! ఆనాడు పారిజాత పుష్పము కొరకు అలిగి.. నిప్పులుచెరిగి..
కన్నయ్యనే కాలి తాపుతో మన్నించిన నీ దివ్యసుందర రూపం నేటికి మరలా
ఆవిష్క్రుతమైనది!
గోద:- ఆహాహా..బాగున్నది మీ వరస! ఆనాడు ప్రత్యక్షముగా సత్యను జూచినట్లు..
సర్వము దెలిసినట్లు..
మనోజ్ఞ:- (గంభీరముగా) గోద! ఈనాటికి సమయము ఆసన్నమైనది కనుక సత్యమును
తెలిసికొనుము..నీవన్నది నిజము! నాడు నంద గోకులమున గోపికలమై
జన్మించి..అంతయూ ప్రత్యక్షముగా జూసిన నాగకన్యలము మేము..
హారిణి:- నేడు మరలా ఈ విల్లిపుత్తూరులో నీ చెలికత్తెలమై జన్మించినాము!
మనోజ్ఞ:- అంతే కాదు..గత జన్మలో నీవు సత్యభామవై స్వామిని పొంది..భూదేవి అంశతో
ఈ జన్మమున లొక కళ్యాణము కొరకు ఇలా జన్మించితివి!
మ. దివిజద్రు ప్రసవంబు గాంచిన సపత్నిం జూచి చూపోప కిం
తవు జిల్గుం బనియంత సేసి మది నీర్ష్యా క్రోధముల్సందడిం
ప విరిం బోక ద్రుమంబు గైకొన బతిన్మందన్న మ్రానెల్ల దే
నవధిం బెట్టిన సత్య నీవహహ కావా భామినీ నావుడున్!
స్రగ్విణి:- మన బంధము..మాధవునితో నీ యనుబంధము ఈ జన్మవి కావు!
బాల్యమునుండి నీ ప్రణయమునకు నీ తపనకు..నీ విరహమునకు
పూర్వ వాసనలే కారణము!
గోద:- ఆ! ఏవో స్వాప్నిక జగత్తులో జూచిన దృశ్యములవలె కన్పించుచున్నవి..
నాటి మీ రూపము..నా కోపము..నాధునిపై ప్రణయ తాపము..ఔను..ఔను..
సత్యనై..స్వా మి ప్రణయ మందిరమున నిత్యనై.. ఇప్పుడీ వియోగ వేదనను
అనుభవింప వలెనా? నావలన గాదు!
ఉ. అట్టి మురారికప్పుడనుగై మరి ఈ కలి వేళల గ్రమ్మరం
బుట్టి వియోగవేదనల బొక్కెడు నీ తనువేల? తండ్రి తా
నిట్టగు నన్ను నింకొకనికియ్యక తొల్తన యోగశక్తి బో
బెట్టెద దీని వెండియు నుపేంద్ర పదాంబురుహంబు పట్టెదన్
(పద్మాసనమున యోగమార్గములో ప్రాణములు విడుచుటకు ఉద్యుక్తురాలగును)
మనోజ్ఞ:- ఆ..ఆ..ఆగాగు..త్వరపడకు చెలీ..ఈ జన్మలోనూ నీవు నీ నాధుని పొందెదవు
..నీ నాధుడు ఎక్కడనో లేడు నీరజముఖీ..
అతివ ఏటికా పల్కులా యదువతంస
మెందు జన్నాడు విను రంగ మందె నిల్చె
వేగపాటేల యతడ నీ విభుడగుటకు
నర్చనాదుల నివ్వీటి హరి భజింపు
హారిణి:- సఖీ..ఆనాడు బృందావనములోని గోపికలమందరమూ కాత్యాయనీ వ్రతము
నాచరించి స్వామిని పొందినాము! నేడు కూడా ఆ వ్రతమాచరించినచో నీవు
ఆ పరమాత్ముని భర్తగా పొందగలవు!
గోద:- సత్యమా? ఈ మానవ దేహముతో ఆది సాధ్యమా?
స్రగ్విణి:- ముమ్మాటికీ సత్యమే..అది సాధ్యమే! మేము జన్మించినది నీకా సత్యమును
బోధించుటకే! వ్రత విధానమును సావధానముగా వినుము చెలీ..
(వ్రత విధానమును బోధించును..గోదాదేవి శ్రద్ధగా ఆలకించుచుండును..)
(తెర)
No comments:
Post a Comment