శ్రీ గోదాదేవి కళ్యాణము
(విష్ణుచిత్త విజయము)
(పౌరాణిక పద్య నాటకము) 3 వ రంగము
3 వ రంగము
( విష్ణుచిత్తులవారి గృహము. శ్రీమహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీ బ్రాహ్మణ దంపతుల
వేషములో విల్లిపుత్తూరునందు విష్ణుచిత్తుల వారి యింటి ముందు ప్రత్యక్షమౌదురు. )
లక్ష్మీ:- స్వామీ ..మీ జగన్నాటకమున కొత్తయంకము ప్రారంభమైనట్లున్నది!
మహావిష్ణు:-అవును దేవీ! ఇదియే నా భక్తాగ్రేసరుడు విష్ణుచిత్తుని గృహము. అర్ధరాత్రమున
కూడా అతిధి అభ్యాగతులకు స్వాగత వచనములతో మారుమ్రోగుచుండును!
శా. ఆ నిష్ఠానిధి గేహ సీమ నడురేయాలించినన్ మ్రోయునెం
తే నాగేంద్ర శయాను పుణ్య కధలుం దివ్య ప్రబందాను సం
ధాన ధ్వానము నాస్తి శాక బహుతా నాస్త్యుష్ణతా నాస్త్యపూ
పో నాస్త్యోదన సౌష్టవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులున్
..నీవే చూతువుగాని పద!
(విష్ణుచిత్తుల వారిని పిలుతురు.)
మహావిష్ణు:- స్వామీ..స్వామీ..
విష్ణుచిత్త:- జై శ్రీమన్నారాయణ! అయ్యా..నమస్కారములు..దయచేయండి..
బ్రాహ్మణ:- అయ్యా..మేము శ్రీరంగపురి వాసులము..తీర్ధ యాత్రలు చేస్తూ ఇలా వచ్చాము..
విష్ణుచిత్త:- (ఆనందముతో..) శ్రీరంగపురి వాసులా! దాసునికెంత భాగ్యము కల్గినది!
ఈపూట నారాయణ సేవ జేసుకుందుకు అనుగ్రహించండి! అమ్మా..లోపలికి
దయచేయండి ప్రసాదం సిద్ధం చేసేలోపు కాళ్ళూ చేతులూ కడుక్కుందురుగాని
..రండి..
(బ్రాహ్మణ దంపతులకు వసారాలో కూర్చుండబెట్టి, విసనకర్రతో విసురుతూ భోజనము
తినిపించును..)
అయ్యా..కూరలు హెచ్చుగా సిద్ధము చేయలేక పోయినాము!..పప్పు లేదు..
అన్నముకూడా చల్లగానున్నది..మన్నించి సహించుకుని నిదానముగా
భోజనం చేయండి..
(భోజనం ఐనపిదప తాంబూలమందించి ..అరుగులపై చేరగిలబడి ముచ్చటించుకుందురు )
బ్రాహ్మణ:- రంగనాధ..స్వామీ..పిల్లలు నిదురించుచున్నారా ఏమి?..అర్ధరాత్రము
సమీపించుచున్నది కూడ!..
విష్ణుచిత్త:- మన్నించండి స్వామీ..రంగని అనుగ్రము కలుగలేదు..నేనూ..మా ఇంటిదీ
ఇద్దరమే.. ఇలా రంగదాసులకు నారాయణ సేవ జేసుకుంటూ..మా వనములోని
తులసీ దళములను, పుష్పములను మాలికలల్లి..మా విల్లిపుత్తూరు మన్ననారుని
సమాశ్రయణం చేసుకుంటున్నాము..ఆయన సన్నిధియే మా పెన్నిధి!
బ్రాహ్మణ:- ఆ రంగని అనుగ్రహము వలన యింక ఎన్ని నిధులు దొరుకునో
ఎవరు చూడ వచ్చిరి!
విష్ణుచిత్త:- ఎవరు చూసిననూ చూడకున్ననూ ఆ రంగనాధుడు చూసిన చాలును..
ఏ నిధులు దొరికినా..ఏమి కలిగినా..ఆయనకే సమర్పణం..ఆ..
నడిఝామవుతోంది..మీ రిక విశ్రమించండి!
బ్రాహ్మణ:- మీరూ విశ్రమించండి..మేము వేకువనే కోనేటిలో స్నానం చేసివెళ్తాము..
తిరుగు ప్రయాణంలో మీ కోవెలకు వచ్చి మీ పెరుమాళ్ళను సేవించుకుంటాము!
జై శ్రీమన్నారాయణ!
విష్ణుచిత్త:- జై శ్రీమన్నారాయణ!
(లోనకు వెళ్ళును. బ్రాహ్మణ దంపతులు విశ్రమింతురు. కోడి కూతతో మేల్కొందురు.
బ్రాహ్మణ దంపతుల వేషములోని లక్ష్మీ నారాయణులు చిరునవ్వుతో..)
బ్రాహ్మణ:- చూచితివా దేవీ ఈతని సాధు శీలము!
లక్ష్మీ:- మీ అనుగ్రహవిశేషము స్వామీ! భక్త సులభులు! అతనికి ఏ పెన్నిధిని
జూపనున్నారో..మీ లీలలను ఇంకనూ ఎన్నింటిని చూపనున్నారో!
బ్రాహ్మణ:- నీవే చూతువుగాక! దేవీ! విష్ణుచిత్తుని మూలముగా శ్రీవైష్ణవతత్త్వవిజయము
జరుగవలసి యున్నది..మధుర భక్తిరస గంగాఝరి ఉప్పొంగవలసి యున్నది!
(చిరునవ్వుతో ఆశీర్వదించి వెడలి పోవుదురు. విష్ణుచిత్తులు, ఆయన ఇల్లాలు బయటకు వచ్చి అతిథులను గానక తమ దైనందిన కార్యములలో మగ్నులగుదురు)
విష్ణుచిత్త:- స్వామికి తులసీమాల సిద్ధము చేయవలయును గదా..తోటలోనికి వెళ్లి వత్తును...(పెరడులోనికి వెళ్ళును..శిశువు రోదనలు..విష్ణుచిత్తులవారి కేకలు)
జై శ్రీమన్నారాయణ! స్వామీ నీ లీలలు అద్భుతములు..ఏమోయీ..శిశువు..
బా లిక..(బాలికను చేతులలో ఎత్తుకుని పరుగున వచ్చును)
ఇల్లాలు:- బాలికయా? ఎచట దొరికినది..రంగడు అనుగ్రహించి నిధులనిచ్చునని రాత్రి
శ్రీరంగవాసులు పలికిన పలుకులు సత్యములైనవా?
విష్ణుచిత్త:- నాకునూ అదే అనిపించుచున్నది! ఎంత విచిత్రముగా నున్నది! స్వామికి
మాలకొరకై ..తులసీదళములు తెచ్చుటకు తోటలోనికి వెళ్ళితినా?శిశురోదనము
వినిపించి అటు చూతును కదా..
ఉ. వింగడమైన మేటి వనవీధి కనుంగొనినాను సున్నపున్
రంగుటరంగు పచ్చల యరంగయిపో వెలిదమ్మి బావికిం
చెంగట నుల్లసిల్లు తులసీవన సీమ శుభాంగి నిట్టి బా
లం గురువింద కందళదళ ప్రతిమాంఘ్రి కరోదరాధరన్
ఇల్లాలు:- ఎంత అందముగా నున్నది!..ఎవరి శిశువో కదా..తోటలో సరిగా చూచినారా?
ఎవరునూ లేరా?
విష్ణుచిత్త:- ఎవ్వరునూ లేరు! కోటి సూర్య ప్రభలతో ఈ శిశువు తప్ప! పరమేశ్వరుడు
పరమదయాళువు! ఈ బిడ్డను మనకు శ్రీమన్నారాయణుడే అనుగ్రహించినాడు!
ఈయమ్మ ఆయన సొమ్మే!..జై శ్రీమన్నారాయణ!
ఇల్లాలు:- అవును..అది సరే..ఇప్పుడేమి చేయుదము?
విష్ణుచిత్త:- ఏమి చేయుదువు? ముత్తయిదువులను పిలిపించి, శిశువునకు మంగళ
స్నానము చేయించి..దిష్టి తీసి రక్ష గట్టి లాలింపుము! నేను కోవెలకు వెళ్లి..
స్వామివారి కొలుపు జేసి..యిట్టే వచ్చెదను!(వెడలబోవును)
ఇల్లాలు:- సరే స్వామీ..ఇంతకూ ఈ శిశువునకు నామధేయము?
విష్ణు:- శ్రీ మహాలక్ష్మి వలె నున్న శిశువునకు ఆ తల్లి పేరే..ఆండాళ్...ఆండాళ్!
( పరుగున నిష్క్రమించబోయి..వెనుకకు వచ్చి..శిశువును ముద్దాడి)
నీవు త్వరగా స్వామికి నివేదనమూ..తులసీమాలనూ సిద్ధముజేసి తీసుకుని
రమ్ము..అంతలో నేను శిశువును లాలింతును..
(తెర వాలును)
No comments:
Post a Comment