పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Monday, June 25, 2012


11 వ రంగము

( శ్రీరంగ మందు రంగ మండపము. సర్వాలంకార భూషితయైన గోదాదేవిని పార్వతీ
 సరస్వతులు తోడ్కొనిరాగా బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులచేత కొలువుదీరిన సభలో 
పెండ్లి పీటల మీద కూర్చునియున్న రంగనాధునికి గోదాదేవితో పరిణయము 
జరుగును. నారద తుంబురులు, యితర రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి గణములెల్ల 
ఆనంద పరవశులు అగుచుండగా స్వామి గోదాదేవిని స్వీకరించును. నాగావళి, 
ఏకావళి, హారిణి, స్రగ్విణి, మనోజ్ఞలు పరివేష్టించి యుండగా నూతన దంపతులకు 
మంగళహారతులిడుదురు. మాలదాసరి పరవశించి గానము జేయును )

ప.     శ్రీదేవి మధు మోవి మరిగేటి తేటి 
        కస్తూరి రంగని కమరు మంగళం  
ఆ.ప. లోకాల నేలేటి నీలాల నిధి మేటి 
        కావేటి రాయనికి కడు మంగళం      ||శ్రీదేవి||
చ.    మత్స్యావతారుడై మనువునేలిన విభుడు
        తాబేటి రాయడై కొండ మోసిన ఘనుడు
       సూకరాకారుడై వసుధనేలిన వరుడు
        సింగంబు మోముతో శిశులగాచే ఘనుడు||శ్రీదేవి||
చ.    పొట్టి వడుగై బలుని తలను ద్రొక్కిన తండ్రి
        తగవైన పగవారి తలలు జెండిన మొండి
        జగములేలిన జెట్టి జానకీ రాముడు
        మనసుదోచిన మరుడు మన్నారుకృష్ణుడు ||శ్రీదేవి||      
చ.    కరుణబోధలసుధల వసుధబ్రోచిన బుధుడు
       కల్కియై రానున్న మాయావిబుధుడు 
       పదిరూపముల తనను పాడేటివారి
       పరికించి పాపముల నడగించు శౌరి  ||శ్రీదేవి||

విష్ణుచిత్త:- తండ్రీ! రంగ నాధా! గోదానాధా! నా పురాకృత సుకృతంగా నా పట్టిని 
              చేపట్టి రంగనాధుని  మామగారనే ఘన కీర్తిని నాకు కట్టబెట్టావా 
              జగన్నాధా!
         తే. విదిగృహాక్షయ విత్తసేవధికి శరణు
             చిరుకృతేక్ష్వాకు పుణ్య రాశికిని ప్రణుతి   
             ధనపతి భ్రాతృ కులదేవతకు జోహారు
             నత మృడాదిక సుమనస్సునకు నమస్సు 

స్వామి:- విష్ణుచిత్తా! శ్రీవైష్ణవ తత్త్వమును ప్రకటించిన భక్తునిగా శ్రీదేవిని కూతురిగా 
            శ్రీరంగనాధుని అల్లునిగా పొందిన మాన్యునిగా నీ విజయము నిత్యమై 
            నిగుడు గాక! నీ చరితమును, నా ఈ పరిణయ గాధను పలికిన, వినిన 
            నరులు భవ బంధములకు లొంగక, శాశ్వతమైన నా దివ్య పదమును 
            పొందెదరు గాక! చతుర్భద్ర మస్తు! సర్వమంగళమస్తు!
(ఎల్లరు అంజలి ఘటియించుచుండగా..వీడలేక..వీడలేక..తండ్రిని వీడుచూ..గోదాదేవి 
రంగనాధుని కరమును బట్టి..యిరువురూ శ్రీరంగని మూలవిగ్రహమునందు 
అద్రుశ్యులైపోదురు!!!)   
   
(తెర)

No comments:

Post a Comment