12 వ రంగము
(శ్రీకృష్ణ దేవ రాయలు, తిరుమల దేవి, అప్పాజీ, భువనవిజయ కవులు, యితర
ముఖ్యులు.)
రాయలు:- యిది..
కం. అంభోధికన్యకా కుచ
కుంభోంభిత ఘుసృణ మసృణ గురువక్షునకున్
జంభారి ముఖాధ్యక్షున
కంభోజాక్షునకు సామి హర్యక్షునకున్
...అంకితముగా ఆయలమేలుమంగాపతి నాచే పలికించిన
ఆముక్తమాల్యదా గ్రంథములోని హృద్యంబైన పద్యంబుల యారవ
యాశ్వాసము..సకలమూ సంపూర్ణము! శ్రీ వేంకటేశార్పణమస్తు!
(ఎల్లరూ కరతాళ ధ్వనులతో హర్షమును వ్యక్తము జేయుదురు)
పెద్దన:- భళీ శ్రీకృష్ణ దేవరాయా! నేడు ఆంధ్ర సాహిత్య సరస్వతి యానంద
తాండవము జేసినది! ఇంతటి కవిరాజుచేత కాలికి గండపెండేరము,
కనకమణిమయ పల్యంకికారోహణమూ పొందిన నాయంతటి
అదృష్టవంతుడు ఆంధ్రసాహిత్య చరిత్రలోనే వుండబోడు!
రామకృష్ణ:- శ్రీరంగనియంతరంగము నేడు తృప్తినందినది! రంగనాధుని
భక్త పరాధీనతను కరుణను ఎంత అద్భుతముగా
చిత్రీకరించినావయ్యా! కవిరాజువైన నీవు మా రాజువు కావడం
విజయనగర సామ్రాజ్య ప్రజల సుకృతం!
సూరన:- మత్స్యధ్వజుని రక్తి, విరక్తి, చివరకు విష్ణుసేవయందు అనురక్తిని
గొప్పగా పోషించి..కొద్దిలోనే ఎంతటి పరిపూర్ణమైన పాత్రగా
తీర్చిదిద్దినావయ్యా! గోదాగోవిందుల ప్రణయబంధము సరసపద
బంధమై..ఆముక్తమాల్యదా ప్రబంధమైనది!
అప్పాజీ:- చిరంజీవీ! కృష్ణరాయా! ఆంధ్ర భోజా! ఏమని వర్ణింపగలనయ్యా!
మానవులలో అదృష్టవంతులంటే నీ ఏలుబడిలో మనగలిగిన వారే!
రాబోయే తరములలో కవిపండితులు..తాము నీ కాలమున
పుట్టివుంటే..ఎంత బావుండెడిదో..యని పలవరింతురేమో!
పెద్దన:- భువనవిజయ కవులు శ్రీకృష్ణదేవరాయ కవిచంద్రునకు ఆ చంద్రునికి
ఒక నూలుపోగువలె..ఒక చిన్ని సమర్పణము జేయవలయునని
కుతూహలపడుచున్నారు ! ఏలినవారు అనుమతింపవలె!
రాయలు:- ఏమది?
పెద్దన:- సువర్ణ ఘంటా కంకణ ప్రదానము
రామకృష్ణ:- సాహితీ సమరాంగణసార్వభౌమ బిరుదు ప్రదానము!
తిమ్మన:- కదనకవితాకంఠీరవ బిరుదు ప్రదానము!
రాయలు:-(చిరునవ్వుతో,పరిహాసము గా)మామగారూ!ఒకటే చిన్ని సమర్పణ
యంటిరే..ఇన్ని సమర్పణములా ?
పెద్దన:- సత్యభంగము కాలేదు ప్రభూ..ఒక్కొక్కరిదీ ఒక్కొక్క చిన్ని సమర్పణయే
కదా! అలా అన్వయించుకొందము!
(శిష్య సమేతుడై వ్యాస రాయల ప్రవేశము. అందరూ లేచి నిల్చుని నమస్కరింతురు!)
వ్యాస:- ఎల్లరికీ శుభమస్తు!..భువన విజయ కవుల కోరిక సమంజసమే చిరంజీవీ!
నేటి ఉదయమే అశుభగ్రహయోగము తొలిగిపోయినది! మరలా
విజయనగర సామ్రాజ్య లక్ష్మీకర గ్రహణమునకూ, కదనరంగములోనూ
కవనరంగములోనూ నీ ప్రతిభకు నీరాజనముగా ఈ బిరుదుల
గ్రహణమునకూ వేళయైనది! శ్రీకృష్ణదేవరాయల వైభవమును వేనోళ్ళ
పొగడవలసిన శుభసమయమేతెంచినది!
(ఎల్లరూ హర్షధ్వానములు జేతురు! వ్యాసరాయల చేతులమీదుగా
రాజలాంఛనములను స్వీకరించిన రాయలకు మహాకవులచేత ఘన
సత్కారము జరుగును.ఒక్కొక్కరు సత్కరించి తాము ప్రదానము జేసిన
బిరుదులను జయ జయ ధ్వానములచేత పలికింతురు.
రాజనర్తకీమణులు నృత్యగానము జేతురు)
ప. జయహో శ్రీ కృష్ణ దేవ రాయ!
జయ నిత్య కీర్తి కాయా!
ఆ.ప జయ కదన కవన రవి చంద్ర తేజ
జయ భువన విజయమున ఆంధ్ర భోజ ..
చ. నీ తనువు కదన ఘన విజయలక్ష్మికి
నీ మనువు కవనమున విజయలక్ష్మికి
తను వృత్తి నీకు సామ్రాజ్య రక్షణం
నీ ప్రవృత్తి సాహిత్య వీక్షణం..
చ. చిన రాణి తాను సామ్రాజ్య లక్ష్మీ
పెద్ద రాణి నీకు సాహిత్య లక్ష్మీ
చిన్నమ్మ తోడి చిరకాల చెలిమి
పెదరాణి తోడి కల కాల కలిమి..
చ. నడివీధిలోన రతనాలు రాశి
నడి రేయి దాక కవనాలు దూసి
పడి కరకు తురక తలచెండ్లు కోసి
కడలేని కీర్తిగనినావు వాసి...
చ. గజపతుల కైన ఘన స్వప్న సింహమా!
మదవతులకైన శృంగార చిహ్నమా!
కవితా వధూటి సిగపువ్వు చంద్రమా!
తులలేని అలల సాహిత్య సంద్రమా!
చ ఘన తెలుగు కవన ధారా విపంచి
పలికించి తేనెలొలికించి మించి
పలికించి తేనెలొలికించి మించి
వలపించి చూడిక్కుడుత్తనాచ్చి
నేలించినావు రంగేశుకిచ్చి...
చ. భువి రాజులెందు? శాసనములందు!
కవిరాజులెందు? ఉచ్చ్వాసమందు,
జన జీవ నాడి నిశ్వాసమందు!
నిలిచుండురందు, నువు.. గుండెలందు!
చ. బ్రహ్మాండమందు శ్రీ వేంకటాద్రి,
దైవతములందు శ్రీ వేంకటేశుడు,
పలు దేశభాషలను తెలుగు లెస్సరా!
రాజులందు..రాయ! నువు లెస్సరా!
(ఎల్లరూ జయజయ ధ్వానములు జేయుచుండగా తెర వాలును)
* స్వస్తి *
******
( శ్రీకృష్ణ దేవరాయల ఆముక్తమాల్యదా గ్రంధమును ఒక దృశ్య కావ్యముగా అందించ
వలెననే కోరికతో ఈ చిరుప్రయత్నము చేశాను. రాయలవారి పద్య భాషకు తగినట్లు
వచనం లేకుంటే చిరుగుల బొంతకు మాసికలు వేసినట్లు వుంటుంది. అలా అని
గద్యము సరళముగా లేకుంటే ప్రదర్శనా యోగ్యత లోపిస్తుంది. నా పరిధిలో ఒక
మధ్యే మార్గంలో పోవడానికి ప్రయత్నించాను. ప్రదర్శనా సౌలభ్యాన్ని సాధ్యమైనంత
వరకూ పాటిస్తూనే రాయల సాహిత్య విలువ నిలబెట్టడానికి, సంభాషణ లలోనూ,
సన్నివేశాల రూపకల్పనలోనూ మూలానికి వ్యాఖ్యాన పూర్వకంగా ఉంచడానికి,
ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వాన్ని దర్శిమ్పజేయడానికి, ఆయన
సంభాషణల ద్వారా, నా శాయశక్తులా ప్రయత్నం చేశాను. ఈ నాటకాన్ని యథాతథం
గానూ మాలదాసరి సన్నివేశం వరకే లఘు నాటికగానూ మా 'మధిర రంగస్థల
కళాకారుల సమాఖ్య ద్వారా అనేక ప్రదర్శనలు చేశాము. లఘు నాటికకు మాలదాసరి
పాత్రకు బహుమతులు లభించాయి. శ్రీకృష్ణ దేవరాయల పంచశతాబ్ది ఉత్సవాల
సందర్భంగా పూర్తి నాటకాన్ని ఖమ్మంలోనూ, జమలాపురంలోనూ రాష్ట్ర ప్రభుత్వ
ఆహ్వానం మేరకు ప్రదర్శించి రాయలసేవ మా శక్తి కొలదీ చేశాము! ఆకాశవాణి కొత్తగూడెం
వారు ఈ నాటకాన్ని మొత్తాన్ని ప్రసారం చేశారు. తెలుగులో పంచ మహా కావ్యాలు ఐన
వాటిలో మిగిలినవాటికి కూడా నాటక రూపాన్ని ఇవ్వాలని నా కోరిక! అమ్మదయ
వుంటే నెరవేరుతుంది! ఇందులో రాయల వారి పద్యాలను మణిపూసలు ఐనవాటిని
ఇచ్చాను..నేను రాసినవి మాత్రం రెండు పద్యాలు..గోదాదేవి, చెలికత్తెల సన్నివేశంలోని
'' లీలా నాటక సూత్రధారి '' అనేది, మాలదాసరి సన్నివేశం లోని '' భూషణమౌను సత్య
దయ పూత గుణంబులు..'' అనేవి ఆ రెండు పద్యాలు. పాటలు అన్నీ నేను రాసినవి,
మా ప్రదర్శనలలో పాటలవరకూ ట్యూన్స్ కూడా నేను చేసినవే, ప్రాథమికంగా!
రాయలవారి పద్యం ' నీలమేఘము డాలు డీలు చేయగ జాలు' అనే దానిలో మాత్రం
సందర్భాన్ని బట్టి ఒక చిన్న మార్పుతో వాడుకున్నాను. '' మదంధ్ర జలజాక్షుడిట్లని యానతిచ్చె..''అనేది రాయలవారి పద్య పాదం లోని భాగమైతే, '' మదంధ్ర జలజాక్షు
డిట్లిట కెట్టులొచ్చే'' అని సన్నివేశపు అవసరాల మేరకు మార్చాను, రాయలవారి
పవిత్ర ఆత్మ, సాహితీ ప్రియులు నన్ను మన్నింతురు గాక! మూలంలోని వివరాలను
ఏమాత్రం మార్చకపోవడమే కాదు, చారిత్రక పరంగా కూడా ఇందులో చూపించినవన్నీ
సత్యాలే! రాయలవారికి జాతక రీత్యా దుష్ట గ్రహయోగం సంప్రాప్తించి నట్లు ఉపశమనాలు
చేసుకున్నట్లు ఉన్నది , దాన్ని జ్యోతిష శాస్త్ర చిరు పరిచయంతో సాహిత్య వ్యాసంగానికి
ఆయన వాడుకున్నట్లు కల్పన చేయడం జరిగింది. ఆ సందర్భంలో చెప్పిన మంత్ర శ్లోకం
'' నమః శంభో త్రినేత్రాయ రుద్రాయ వరదాయచ..'' అనేది శుభ స్వప్న ప్రాప్తి కొరకు
జ్యోతిష శాస్త్ర ప్రామాణికమైన శ్లోకమే! దీనిని ఆదరించిన, అభినందించిన వారికీ,
భవిష్యత్తులో ఆదరించగల వారికీ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ప్రసాదంగా శుభములు
కలుగు గాక! నాకు ఆ సర్వేశ్వరుడు చిత్త శాంతిని, తన పద పద్మములయందు
అచంచలమైన భక్తీ విశ్వాసాలనూ కలిగించి తన కరుణ చేత నాకు లభించినవి సద్గుణాలు
ఏవైనా వుంటే వర్ధిల్ల జేయుగాక! పురాకృత దుష్కృత ఫలితములైన దుర్గుణ జాలము
నశించి అయన పరిపూర్ణ కృపకు నేను పాత్రుడ నవుదును గాక! యిందులో మొదటి
సన్నివేశంలో అల్లసానిపెద్దన పలికిన 'మాన్దాతాచ మహీపతి:..'అనే శ్లోకము భోజ
మహారాజు తనను చంపించాలని చూసిన తన పినతండ్రికి రాసిన లేఖలోనిది అని
ఐతిహ్యం! పోతన తెలుగులోనూ..ఆదిశంకరుడు సంస్కృతంలోనూ నాకు దైవ
సమానులు, వీరి పద్యమూ శ్లోకమూ లేకుండా రాయడం, మాట్లాడ్డం నాకు కఠిన
శిక్షతో సమానం..కనుక 'కారే రాజులు ..' అనే పోతన వారి పద్యాన్ని, 'జాగ్రుత్స్వప్న
సుషుప్తిషు..' అనే మనీషా పంచకంలోని ఆదిశంకరుల శ్లోకాన్ని ఉపయోగించుకున్నాను.
దీనిలో ఏదైనా విలువ వున్నా, లేకున్నా అది అమ్మ దయ, లేక, దాని కొరత, అంతే! నేను అల్పుడిని..ధన్యవాదాలు!)
No comments:
Post a Comment