6 వ రంగము
(విల్లిపుత్తూరు లోని మన్ననారు దేవాలయము. విష్ణుచిత్తులు
అర్చనలో నుందురు)
విష్ణు: - జై శ్రీమన్నారాయణ! తండ్రీ..ఇన్నాళ్ళకు నాపై దయ
గలిగినదా? ముద్దులపట్టిని అనుగ్రహించితివా స్వామీ!
కృష్ణ! వాసుదేవా! నారాయణ! పరంధామా!
(తులసీ మాలలనూ పూమాలలనూ స్వామికి అలంకరించును.
స్వామి ప్రత్యక్షముగా సాక్షాత్కారించును)
స్వామి:-విష్ణుచిత్తా! భక్తాగ్రేసరా! ఏల నేడీ ఆనంద పారవశ్యము?
విష్ణుచిత్త: - నీవెరుగనిదా స్వామీ? నా నోటితో పలికించవలయుననే
పంతము తప్ప! తండ్రీ..నీ కొరకై తులసీ దళములను
సేకరించుట కొరకు తోటలోనికి వెళ్ళిన నాకు శిశు
రోదనము వినిపించి అటు చూటును గదా..బావిగట్టున
చలువరాతితిన్నె పట్టున..ఒక ముద్దుల పట్టి..ఎంత
అందమైన శిశువు! ఏదో దివ్య తేజస్సు! ఇదేదో..ఆ..ఆ..
స్వామీ..ఇదేదో..నీ మాయయే అయివుండవలయును!
ఎంతటి కరుణా సముద్రుడవు తండ్రీ!
స్వామి:- విష్ణుచిత్తా! నీ యానందమును జూచిన నాకే ఆనందము
కలుగుచున్నది! విరక్తుడవు..నా భక్తుడవు..నీకు
సంతానముపై, భవబంధములపై ఇంతటి అనురక్తి గలదా?
విష్ణుచిత్త:- నా కొరకా స్వామీ..నీ కొరకే గదా!
స్వామి:- నా కొరకా? అదెట్లు?
విష్ణుచిత్త:- కాదా స్వామీ! నేను శాశ్వతమా? మా ముసలిది
శాశ్వతమా..ఈ పాంచభౌతిక శరీరము ఒకనాటికి శిధిలము
గాక పోవునా? మరి నీ సేవ జేయునదెవరు? నీ
తిరుమాళిగ పరిమార్జనము జేయునదెవరు? నీకు
పులిక్కాప్పు చేయించునది ఎవరు? తిరుమంజనముల
కెవరు? తీర్థాహరణమునకెవరు? అమ్మవారిని
అలంకరించునది ఎవరు? హారతులు ఇచ్చునదెవరు ?
స్వామి :- ఐనచో నీవు శిశువును గన్నది నాకొరకే నన్నమాట!
విష్ణుచిత్త:- అవును స్వామీ..కేవలము నీకొరకే!
స్వామి:- ఆడువారితో సేవలు ఇప్పటికే మిక్కుటమైనవే..
మరలా స్త్రీ సేవలా?
విష్ణుచిత్త :- అదేమి స్వామీ..నా చిట్టి తల్లి తన చిట్టి చిట్టి చేతులతో
కోనేటినుండి నీరు తెచ్చి..నీ తిరుమాళిగ శుభ్రముజేసి
..నీకై తులసీ మాలలల్లి..నీ సేవజేయుచున్న ఎంత
వైభోగముగ నుండునో!
స్వామి:- అవునవును! మేమునూ ఆ భోగముకోరకే ఎదురు
జూచుచున్నాము!
విష్ణుచిత్త:- మరచితిని స్వామీ..గతరాత్రి నీ దయవలన శ్రీ రంగము
నుండి వచ్చిన అతిథులకు నారాయణ సేవ జేసుకునే
భాగ్యము కలిగినది..ఆ సామి కూడా నీవలెనే మర్మముగా
మాటలాడి..నీ సేవయే నా పెన్నిధి..యని నేననగా..
ఇంకెన్నో నిధులు దొరుకునులెమ్మన్నాడు!తెల్లవారుసరికి
.. నిజముగానే..ని ధివలె..నిక్షేపమైన శిశువు లభించినది!
స్వామి:- మరొక నిధి నీకొరకై ఎదురు జూచుచున్నదోయీ..
విష్ణుచిత్త:- మరొక నిధి..ఏమది?
స్వామి:-నీవు తక్షణమే స్వామి కార్యము నొకదానిని చక్కబెట్ట
వలయును..బహుమానమును చేపట్ట వలయును!
విష్ణుచిత్త :- స్వామి కార్యమును చక్కబెట్టుట..బహుమానమును
చేపట్టుట..!!..వివరముగా శెలవీయండి స్వామీ!
స్వామి:- ఈ పాండ్యభూపతి మత్స్యధ్వజుడు నేటికి కామ విరక్తుడై..
మోక్షాసక్తుడై..తనను తరింపజేయగల దైవమును జూపిన
వారికి బహుమానమును ప్రకటించి..వేల బంగారునాణెముల
మూటను సభామధ్యమున వ్రేలాడదీసినాడోయీ!
ఉ: నేడు మహామతీ మధురనీవు రయంబున జొచ్చి యందు బాం
డీడు దివాణము న్నెరయనించిన బ్రేలెడు దుర్మదాంధులన్
బోడిమి మాన్చి మన్మహిమముం బ్రకటించి హరింపు శుల్కమున్
వాడును రోసినాడిహము వైష్ణవుగా నొనరింపు సత్కృపన్
...నీవు మధురవెళ్లి..రాజసభలో వాదించి.. వైష్ణవ తత్త్వమును
ప్రతిపాదించి..అచ్చటి అన్య మతస్థులందరినీ గెలిచి..రాజును
నా భక్తునిగా జేయవలయునోయీ!
విష్ణుచిత్త:- (గుండెలు బాదుకొనుచూ)..స్వామీ..ఏమీ..చదు వు
సంధ్యలు లేనివాడను..నీ ఆలయపు తోటలో త్రవ్వుగోలతో
త్రవ్వి..చేతులు కాయలు గాయించుకున్నవాడను..
అదియే నాకు చేతనైనది..నేను వాదించెడిదేమి?
పాదించెడిదేమి? గెలిచెడిదేమి? హవ్వ! నీకప్రదిష్ట..
అమ్మా..నీవైనా చెప్పవమ్మా!
శా. స్వామీ నన్ను నితః పురాపఠిత శాస్త్ర గ్రంధ జాత్యంధు నా
రామ క్ష్మాఖనన క్రియా ఖర ఖనిత్ర గ్రాహితోద్యత్కిణ
స్తోమా స్నిగ్ధకరున్భవద్భవన దాసున్వాదిగా బంపుచో
భూమీభ్రుత్సభ నోటమైన అయశంబుల్ మీకు రాకుండునే!
స్వామి:- విష్ణుచిత్తా! ఇటు వినుమయ్యా!..
విష్ణుచిత్త:- స్వామీ..నీ వాకిలి యూడ్చుటయో...నీకు నీళ్ళు
తెచ్చుటయో..నీ పల్లకీ మోయుటయో..నీకొరకు
మాలికలల్లుటయో..నీ ధ్వజమును మోయుటయో..
నీకు గొడుగుపట్టుటయో...నీ దీపపు వత్తిని
ఎగద్రోయుటయో...ఇవియే నాకు చేతనైనవి..
మ. గృహసమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికా
వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్య లభ్యద్ధ్వజ
గ్రహణంబో వ్యజనాతపత్రధృతియో ద్రాగ్దీపికారోపమో
నృహరీ వాదములేల లేరె ఇతరుల్నీలీలకుం బాత్రముల్
(రోదించును)
స్వామి:- (దేవేరితో) దేవీ..ఈతనిని ఆ వాదములో గెలిపించి నా
మహిమ ప్రకటింతును జూడుము! గంభీర స్వరముతో)
విష్ణుచిత్తా..నీవేనా స్వామియాజ్ఞను తిరస్కరించునది!
భాగవతులకు అపజయము కలుగునా? ఐనచో
నేనున్నదెందులకు?
క. నీ ఇచ్ఛయె మిన్నక పో
వోయి మునిప్రవర, నిన్నునొప్పింతును భూ
నాయక సభ నిందులకై
యేయడ్డము వలవ దవల నేనున్నాడన్
మారు పలుకక..వెడలి..నాయాజ్ఞ నిర్వర్తింపుము...
విష్ణుచిత్తా. .భారము నాపై వదిలి..రాజసభకేగుము..
మిగిలినది నేను జూసుకుందును!
(విష్ణుచిత్తులు చివరకు అంగీకరించి స్వామికి నమస్కరించి
వెడలిపోవును. స్వామి ఆశీస్సులనించి అదృశ్యుడగును)
(తెర)
No comments:
Post a Comment