పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Monday, June 11, 2012


2 వ రంగము 


(హంపీ  విరూపాక్ష దేవాలయము. రంగమంటపము. మహారాణి తిరుమల దేవి పరిచారికలతో గూడి రాయలవారి కొరకు నిరీక్షించుచుండును)

(తెరలో ప్రతీహారి..జయము! జయము! దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర పూర్తి జేసుకుని విరూపాక్షుని సేవకై  ప్రభువుల వారు రంగమంటపమునకు వేంచేయుచున్నారు!)

రాజాధిరాజ! రాజ మార్తాండ! మూరురాయర గండ! సాహితీ సమరాంగణ సార్వభౌమ! యవన రాజ్య స్థాపనాచార్య! హంపీ విరూపాక్ష రక్షిత  కర్నాటాంధ్ర రాజ్యరక్షా! మణిద్ధగద్ధగిత  దిగ్దిగంత యశో విరాజిత త్రిసముద్ర వేలా వలయుత విజయనగర సామ్రాజ్య లక్ష్మీనాధ! శ్రీ శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయా! విజయీభవ! దిగ్విజయీభవ!

(మంగళ వాయిద్యముల ఘోషల నడుమ శ్రీకృష్ణదేవరాయల ప్రవేశము. తిరుమల దేవి మంగళ ద్రవ్యములతో ఎదురేగి, దిష్టి తీసి, సుఖాసీనుని గావించి గంధ పుష్ప ధూప అర్ఘ్య పాద్యాదులతో  సేవించి సరసన కూర్చుండును. పరిచారికలు నిష్క్రమింతురు)

రాయలు:- దేవీ! సౌఖ్యమా? అంతఃపుర దాస దాసీ జనములు, నీ ఆంతరంగిక చెలికత్తెలు ఎల్లరూ క్షేమమే కదా!

తిరుమల:- సర్వ సమర్ధులైన సార్వభౌముల అండనున్న మా క్షేమమునకేమి కొరత? స్వామీ మీ దిగ్విజయ వార్తలను, మీ వీర గాధలను వేగుల వారి వలన విని, మీ దర్శనమునకై తహ తహలాడుచున్నాము!

రాయలు:- మేము కూడా తుంగభద్రాతీర శాంత సమీరములకై, విరూపాక్ష దర్శనమునకై, విజయనగర ధరిత్రీ స్పర్శనమునకై, దేవేరి దరహాసములకై..భువన విజయ సభలోని సంగీత సాహిత్య సరస్వతీ మందహాసములకై పరితపించి పోయినాము దేవీ!   

తిరుమల:-ఉదయగిరి వుక్కడగించి, కళింగను కాలరాచి, కొండపల్లిని కొల్లగొట్టి , కొండవీడు గజపతుల ఖజానానూ, కన్యారత్నమునూ కైవసం చేసుకున్నారు! విజయవాటికలో వీరవిహారం చేశారు! స్వామీ..స్వామీ..మీ విజయ గాధలను వివరంగా మీ నోటి వెంట  వినవలెనని ఉవ్విళ్ళూరుచున్నాను!

 రాయలు:-అంతా విరూపాక్షుని కరుణా విలాసము దేవీ! ఉదయగిరిని జయించి అచటి బాలకృష్ణుని సేవించుకున్నాను! సింహాచలేశుని ఆశీస్సులందుకున్నాను! కొండపల్లిని జయించి, విజయవాటికలో వీరలక్ష్మిని పొంది..జగజ్జనని కనకదుర్గను ప్రసన్నురాలిని చేసుకున్నాను! వారము రోజులు అమ్మ సన్నిధిన, కృష్ణమ్మ వొడ్డున సేద దీరినాము!  

తిరుమల:- అదృష్టవంతులు స్వామీ!

రాయలు:- ఆ  వారము రోజులలోనే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దర్శనము చేసుకొని జన్మ చరితార్ధము జేసుకున్నాము! ఆహా! ఏమిదివ్య సుందర విగ్రహము! మదన జనకుడి రూప వైభవం మనోజ్ఞం! ఆ నల్లని దొంగ నా మనసును హరించినాడు దేవీ! అచటినుండి తిరుమలకేగి..తిరుమలేశుని తిరువీధులలో సేవ జేసుకుని తరించిపోయినాను!

తిరుమల:- ధన్యులు స్వామీ! మీ విజయ విలాసము నిత్యమై శాశ్వతమై విశ్వ వ్యాప్తమౌతుంది! మహారాజుల కీర్తి అజరామరము! 

రాయలు:- దేవీ! అమాయకురాలవు! రాజుల కీర్తికన్న కవిరాజుల రసస్ఫూర్తి శాశ్వతము!

తిరుమల:- సాహితీ సమరాంగణ సార్వభౌములకు సాహిత్య పక్షపాతమెక్కువౌతున్నది!

రాయలు:- అవును దేవీ! నా తనువృత్తి విజయనగర సామ్రాజ్య సీమల రక్షణమే గానీ నా మనః ప్రవృత్తి సరస సంగీత సాహిత్య  రస సీమల వీక్షణమే కదా!

తిరుమల:- రాయలవారి కిచటకూడా ఇద్దరు రాణుల పోరు కలదన్నమాట..ఇచట కూడా చిన్నరాణీ వారి జోరు ప్రియమన్నమాట!(చిరుకోపము నటించును)

రాయలు:- సత్యము దేవీ! సమర విజయలక్ష్మికి నా శరీరమే..కానీ..సాహిత్య విద్యాలక్ష్మికి నా మనసు, ఆత్మ  కూడా స్వాధీనములు!  
(తెరలో- జయము! జయము!మహారాజా! గురుదేవులు వ్యాస రాయల వారు, అప్పాజీ వారు తమ దర్శనమునకై ఏతెంచినారు!)
రాయలు:- అవశ్యము ప్రవేశపెట్టుము!
(వ్యాసరాయలు, అప్పాజీ ప్రవేశము)
రాయలు:- గురుదేవులకు ప్రణామములు!
వ్యాస:- మనోవాంఛాఫల సిద్ధిరస్తు!..దీర్ఘ సుమంగళీ భవ!
రాయలు:- అప్పాజీ..అభివాదములు!
అప్పాజీ:- చిరంజీవ..కళ్యాణమస్తు!
రాయలు:- గురుదేవా! తమరి దర్శనమునకై నేనే త్వరపడుచుండగా విరూపాక్ష మందిరములో మిమ్ములను కలుసుకొనవలెనని మీ వర్తమానమందినది!
వ్యాస:- చిరంజీవీ! నీ వేగిరపాటుకు కారణము?
రాయలు:- గురుదేవా! దిగ్విజయ యాత్రలో మీ ఆశీస్సులవలన సర్వత్రా విజయము, పుణ్య క్షేత్ర సందర్శనము జరిగిననూ మనసుకేందుకో ఊరట కలుగలేదు! ఏదో అసంతృప్తి నన్ను వెన్నాడుచున్నది! పరిపరివిధముల శుభాశుభ సూచకములైన  శకునములతో మనసెందుకో డోలాయమానముగా నున్నది!(అప్పాజీ వ్యాసరాయలు పరస్పరము చూపులతో పరామర్శించుకుందురు)
వ్యాస:- సీ. తొలగెను ధూమకేతు క్షోభ జనులకు
               నతివృష్టి దోషభయంబు వాసె
               గంటకాగమభీతి గడచె, నుద్ధత భూమి
               భ్రుత్కటకంబెల్ల నెత్తువడియె
               మాసె నఘస్ఫూర్తి మరుభూములందును   
               నెల మూడువానలు నిండ గురిసె,
               నాబాల గోపాల మఖిల సద్వ్రజమును 
               నానందమున మన్కి నతిశయిల్లె  
         తే.  ప్రజలకెల్లను గడు రామరాజ్య మయ్యె 
              జారు సత్త్వాడ్య! ఈశ్వర నారసింహ    
              భూవిభుని కృష్ణరాయ! యభ్యుదయమొంది
              పెంపుతో నీవు ధాత్రి బాలింపగాను  

శ్రీ కృష్ణ రాయా!నీ పాలనలో ప్రజలు రామరాజ్యములో వలె సుఖించుచున్నారయ్యా! 

సకల దిగ్విజయముతో నీ ఖడ్గమునకు, మదాలస చరిత్రాది గ్రంధములచే నీ కలమునకు 
ఎదురులేదని నిరూపించినావు! మహావిద్వత్కవిజన  పండిత మండిత భువనవిజయము, 
నీ స్వీయ కవనవిజయము, మూడుసముద్రముల నడిమినున్న సకల కర్ణాటాంధ్ర, చోళ, 
పాండ్య, కొంకణ, వంగ, కళింగ భూభువన విజయము, ఆ శ్రీరాముని తర్వాత ఈ శ్రీకృష్ణుడే 
భారతీయ హైందవ సనాతన ధార్మిక చక్రవర్తియని సృష్టి నిలిచినంత కాలమూ ఘోషించును గాక! 


రాయలు:- ధన్యోస్మి గురుదేవా! నేను నిమిత్త మాత్రుడను! అప్పాజీ వారి మేధో బలము, 
అనన్య సామాన్యమైన తమ సాధనా బలము, ఆ అలమేలుమంగాపతి ఆశీర్వాద బలము అన్నీ కలగలిసి రాయల నింతవానిగా జేసినవి! 

వ్యాస:- చిరంజీవీ..ఇక ప్రస్తుతము విచారింతము! డోలాయమానముగా, ఆందోళనగా నున్న 
నీ మానసిక స్థితి భావి సూచకము! గ్రహ చలనముల రీత్యా సత్త్వర శుభ యోగమూ, సమీప భవిష్యత్తులో కించిత్తు అశుభ యోగమూ సూచితములు!

(తిరుమల దేవీ ఆందోళనగా రాయలను సమీపించును)

అప్పాజీ:- ఆందోళన వలదు మహారాజా! జాగరూకత వహించిన చాలును!
రాయలు:-(తిరుమలదేవిని ఊరడించుచూ..చిరునవ్వుతో..) అప్పాజీ వారూ, అపర వ్యాస 
రాయల వారు, ఆ అలమేలుమంగాపతి అన్నింటా మాకు తోడై వుండగా మాకెందులకాందోళన? 
సెలవీయండి గురుదేవా!

వ్యాస:- నాయనా! నీ జాతక రీత్యా ప్రస్తుతము సామ్రాజ్య విజయము, పిమ్మట సాహిత్య 
విజయము, ఆపై అత్యంత సమీప భావికాలములో సూర్య, కుజ, శని గ్రహ సంయోగము వలన 
'కుహ యోగమూ' సంప్రాప్తింపనున్నది..ఫలితముగా..  
తిరుమల:- ఆ..ఫలితముగా..ఆగెదరేల ? శలవీయండి గురుదేవా!
వ్యాస:- ఫలితముగా..రాజ్య భ్రష్టుత్వమూ..ప్రాణహానీ సూచితములు!
శ్రీకృష్ణ:- (తిరుమలాంబను ఊరడిస్తూ) తమరు త్రికాలజ్ఞులు! నివారణలేమీ సూచింపలేరా 
           గురుదేవా! 
వ్యాస:- నివారణోపాయము ఒక్కటి మాత్రమే కలదు నాయనా! తాత్కాలిక రాజ్య పరిత్యాగము 
ద్వారా రాజ్యభ్రష్టుత్వమూ, తద్వారా సామాన్యునిగా పునర్జన్మ వలన ప్రాణహాని అనుభవించి అనివార్యమైన గ్రహ యోగమును అనుకూలముగా జేసుకొని అనుభవింప  వచ్చును..
రాయలు:-(క్షణ కాలము యోచించి) ఐనచో ఆలస్యమెందులకు? అప్పాజీ! తక్షణమే 
విజయనగర సామ్రాజ్యమును వ్యాసరాయల పీఠమునకు ధార పోస్తాను! పీఠమునందలి 
శ్రీకృష్ణ భగవానుడే సర్వంసహా చక్రవర్తిగా విజయనగర సామ్రాజ్యమును ఏలునుగాక! ఆయన 
ప్రతినిధిగా ఈ  గ్రహ యోగ పరిసమాప్తి వరకూ గురుదేవులు వ్యాసరాయల వారు సామ్రాజ్య 
నిర్వహణా భారమును వహింతురు గాక! వారికి మీ మేధోబలమూ, విజయనగర సామ్రాజ్య 
సుశిక్షిత సైనిక బలమూ వెన్నంటి నిలుచును గాక! గురుదేవా!..మీ అంగీకారమే తరువాయి!
అప్పాజీ:- కుశాగ్రబుద్ధివి నాయనా! పండితుల సమక్షములో కూలంకషముగా జ్యోతిషశాస్త్ర పరిశీలనము జేసి మూడు రోజులలో కనుగొన్న నివారణోపాయమును మూడు నిముషములలో సూచింప గలిగినావు! నిన్ను వరించిన విజయనగర సామ్రాజ్యలక్ష్మి అదృష్టవంతురాలు!
వ్యాస:- తథాస్తు! చిరంజీవీ! నీ సూచనయే ఏకైక మార్గము! శుభమస్తు..రేపు పుష్యమీ నక్షత్రము..బృహస్పతి దేవతాకము..బృహస్పతి వారము..జయతిథి! సర్వథా శుభ ముహూర్తము..ఎల్లరి సమక్షములో కార్యము నిర్విఘ్నముగా జరుగును గాక! (అప్పాజీ నిష్క్రమించును)
రాయలు :- ధన్యోస్మి గురుదేవా! అశుభ నివారణ నిశ్చయమైనది..ఇక శుభములకు ప్రేరణ 
కావలసి యున్నది..ఈ విరామ సమయమును సాహిత్య వ్యాసంగములో సద్వినియోగము జేసికొందును గాక! దక్షిణ దేశ దిగ్విజయ యాత్రలో నిరంతరమూ ఖడ్గ ధారణ చేత  
విసుగుచెందిన  నా దక్షిణ హస్తము ఘంటమును ధరింపవలెనని ఉవ్విళ్ళూరుచున్నది!
వ్యాస  :- ( చిరునవ్వుతో ) యోగ్యుడవు నాయనా! కార్య సాధకుడవు! స్వాప్నిక 
శుభశకునముగా నీ అభీష్టము నెరవేరును గాక! శుభ స్వప్నమును గాంచుటకై 
మంత్రోపదేశము చేస్తాను!
(కమండలము లోని నీరు రాజ దంపతులపై చిలకరించి..)
       శ్లో: - నమః శంభో త్రినేత్రాయ రుద్రాయ వరదాయచ
               వామనాయ  విరూపాయ స్వప్నాధిపతయే నమః 
               భగవన్ దేవదేవేశ శూలభ్రుద్వ్రుష వాహన 
               ఇష్టానిష్టే  మమాచక్ష్వ స్వప్నే సుప్తస్య సాంత్వతః
      ...ఈ  పుష్పమును తలవైపు ఉంచుకుని, నేలపై వస్త్రమును పరచుకుని బ్రహ్మచారివై నిదురింపుము..శుభ స్వప్నమును చూతువు గాక!
(ఎల్లరూ నిష్క్రమింతురు. రాయలు నేలపై వస్త్రమును పరచుకుని గాఢ నిదురలోకి 
జారుకొనును. పారాహుషార్ హెచ్చరికలు వినబడుచుండును..మూడవ ఝాము సూచనగా 
హెచ్చరిక వినబడును..)
(రాయలు స్వప్నము గాంచును. శ్రీదేవీ సమేతుడై శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ప్రత్యక్షమై 
రాయలను పిలుచును)
శ్రీకాకు:- చిరంజీవీ..కృష్ణరాయా!
రాయలు:- శ్రీకాకుళాంధ్ర మహా విష్ణూ! శరణు..శరణు..జగన్నాధా..జగజ్జననీ సమేతుడవై 
నన్ను కరుణింప వచ్చితివా తండ్రీ!
            సీ. నీలమేఘము డాలు డీలుచేయగ జాలు
                 మెరుగు జామనచాయ మేని తోడ
                 అరవిందముల   కచ్చులడగించు జిగి హెచ్చు 
                 నాయతంబగు కన్నుదోయి తోడ
                 బులుగురాయని  చట్టుపల వన్నె నొరవెట్టు
                 హొంబట్టు  జిలుగు రెంటెంబు  తోడ 
                 నుదయార్క బింబంబు నొరపు విడంబంబు 
                 దొరలంగనాడు కౌస్తుభము తోడ 
            తే. తమ్మికేలుండ బెరకేల దండ ఇచ్చు
                 లేములుడిపెడు   లేజూపు లేమతోడ 
                 దొలకు  దయదెల్పు చిరునవ్వుతోడగల మ
                 దంధ్ర జలజాక్షుడిట్లిట కెట్టులొచ్చె  
శ్రీకాకు:- కన్నడ రాయా! నేను తెలుగు రాయడను! సాహితీ సమరాంగణ సార్వభౌముడవై, 
సంస్కృత కావ్యకర్తవైన నీవు  నాకు అంకితముగా ఒక కావ్యమును రచింపవలయును!
 రాయలు:- స్వామీ .ధన్యుడను!

శ్రీకాకు:- తను ధరించి విడిచిన పూమాలను నాకర్పించి, శ్రీరంగమునందు నన్ను 
పెండ్లియాడిన జగన్మాత గోదాదేవి గాధను తెలుగునందు రచించి వెలుగు నొందెదవు గాక!

        ఆ. తెలుగదేలయన్న దేశంబు దెలు, గేను 
             తెలుగు వల్లభుండ తెలుగొ కండ 
             ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
              దేశభాషలందు తెలుగు లెస్స 

       క.  అంకితమోయన నీకల
            వేంకటపతి ఇష్టమైన వేల్పగుట తదీ 
            యాంకితము సేయు మొక్కొక 
            సంకేతముగా కతడరస న్నేగానే 

           ... భాషలయందు ఉత్తమమైన తెలుగు భాషలో కావ్యమును రచించి, 
దైవతములందు ఉత్తముడైన, నీకు ఇష్టుడైన,  నా మరియొక రూపమైన.. వేంకటేశ్వరునకు 
అంకితము జేయుము!

రాయలు:- (ఆనంద పారవశ్యముతో..) ధన్యోస్మి దేవా! తమరియాజ్ఞ శిరోధార్యము! 
(రాయలు ఆనందముతో గానము జేయుచుండగా  ఆశీస్సులందించి స్వామి 
అంతర్ధానము చెందును..)
              
   ప.         శ్రీ రంగా! శ్రిత కలుష విభంగా
                కరుణాపాంగా కమలా సంగా
అ.ప.            పలికెద నీ కథ పరమ పదంగా
                పడతుల మనసుల పచ్చెపు దొంగా || శ్రీ ||
                నీకిడు మాలను సింగారంగా
                సిగ్గుల గోద సిగముడువంగా 
                మురిసిన రంగా మునివన భ్రుంగా 
                గరుడ తురంగా ఘన నీలాంగా      || శ్రీ ||
                ఆముక్త మాల్యద నీ చెలి గోద
                నీ భక్త కోటికి నిధి నీ గాధ
                నీళాసతీ నేత శ్రీ, భూ సమేత
                శ్రీ విల్లిపుత్తూరు శ్రిత పారిజాత    || శ్రీ ||

(రాయలు స్వప్నములో నడచుచున్న వానివలె తన స్థానములో తిరిగి నిదురించును..
కోడి కూతతో తెల్లవారును.)

(మేల్కాంచిన రాయలు భటులను రావించి  సామ్రాజ్య దానమునకు ఏర్పాట్లు గావించుమని పురమాయించి నిష్క్రమించును. వ్యాస రాయలు, అప్పాజీ ఇతరులు ఏతెంచగా  సర్వాభరణ 
భూషితయై తిరుమలదేవి ఏతెంచగా  రాయలు మంత్ర పురస్సరముగా  సామ్రాజ్యమును 
ధారవోసి రాజలాంఛ నములను స్వాధీనము జేసి ..వ్యాసరాయల చేతుల మీదుగా 
తాళ పత్రములనూ ఘంటమునూ అందుకుని, ఏకాంతమున, కావ్య నిర్మాణము జేయ 
సంకల్పించి..)

                 శ్రీ కమనీయ హారమణి చెన్నుగ దానును కౌస్తుభంబునం       
                 దా కమలావదూటియు నుదారత దోప పరస్పరాత్మలం 
                 దాకలితంబులైన తమ యాకృతు లచ్ఛత పైకి దోచియ 
                 స్తోకతనందు దోచెనన శోభిలు వేంకట భర్త గొల్చెదన్    ... 

                ... అది .. పరమ వైష్ణవాగ్రేసరుడైన విష్ణుచిత్తుల వారి కుటీరము..

(తెర వాలును) 

No comments:

Post a Comment