4 వ రంగము
(రాయలు యితర కవులు..)
పెద్దన:- భళిరా కృష్ణ రాయా!..ఖడ్గ ప్రహారములోనే కాదు..కవితాప్రసారములోనూ
అనన్యసామాన్యమైన దక్షత్వమును నీ దక్షిణహస్తము దర్శింప జేయుచున్నది.
ఎంత ఉన్నతుడైన భక్తునిగా, ఆదర్శగృహస్థుగా విష్ణుచిత్తుని తీర్చి దిద్దినావయ్యా!
క. న్యాయార్జిత విత్తంబున
నాయోగీశ్వరుడు పెట్టు నన్నంబా ప్రా
లేయ పటీరాచలప
ద్యాయాతా యాత వైష్ణవావళి కెల్లన్
.. న్యాయముగా ఆర్జించిన సొమ్ముతోనే అతిధులకు భోజనమిడునట..
'యజమాని కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతి ..యజమాని చేసిన పాపము
అతను పెట్టే అన్నమును ఆశ్రయించుకుని వుంటుంది..కనుక ఆతని అన్నమును
తినిన అతిథి కూడా ఆ పాపములో పాలు పంచుకుంటాడు, కనుక, న్యాయమైన
సంపాదన తోనే అతిథులకు అన్నము పెట్టునట! ధర్మశాస్త్ర రహస్యము ఎంత అందంగా
కందంగా వొదిగినదయ్యా! ఏమందురు రామకృష్ణ కవీ?
రామకృష్ణ:- అంతేగాదు!..
చ. గగనము నీరు బుగ్గకెనగా జడివట్టిన నాళ్ళు భార్య క
న్బొగ సొరకుండ నారికెడపుం బొరియల్దవులించి వండ న
య్యగపల ముంచిపెట్టు గలమాన్నము నొల్చినప్రప్పు నాలుగే
న్బొగిపిన కూరలున్వడియముల్వరుగు ల్పెరుగు న్ఘ్రుతప్లుతిన్
ఆకాశము నీటిబుగ్గవలె నిరంతరమూ నీటిని వూటగా వెలువరిస్తున్నదట !
పొమ్మనకుండా పొగబెట్టునది కాదు విష్ణుచిత్తుని ఇల్లాలు! కనుక అంతటి వర్షపు
నాళ్ళలోనూ పొగరాకుండా కొబ్బరి పీచునంటించి పొయ్యిలో మంట రాజేసి..నాలుగైదు
కూరలతో, వడియాలు, వరుగులు, నేయి, పెరుగులతో అతిథులకు అన్నము పెట్టునట!
వర్షఋతు వర్ణనలో ఒక నూతనఅధ్యాయం! కృష్ణరాయా! నీ పరిశీలనాదృష్టి అద్భుతం!
సూరన కవి సూర్యులేమందురో!
సూరన:- కృష్ణ రాయా! రసిక కవి రాయా! విల్లిపుత్తూరు పట్టణ వారకాంతల కొప్పులను
వీణలుగా ఆ కొప్పులకు చుట్టిన పూలను వీణలమెట్లుగా, ఆ పూలకై ముసురు
తుమ్మెదల మోతను వీణానాదముగా ఎంత అందముగా పోల్చినావయ్యా!
ఉ:- వేవిన మేడపై వలభి వేణిక జంట వహించి విప్పగా
బూవులు గోటమీటుతరి బోయెడు తేటుల మ్రోత గామిశం
కావహమౌ గ్రుతాభ్యసన లౌటను దంతపుమెట్ల వెంబడిం
జేవడి వీణ మీటుటలు జిక్కెడలించుటలు న్సరింబ డన్
దారిన బోవు కాముకులు ఆ కొప్పులను విప్పుటలు వీణలను వాయించుటకు
సిద్ధమౌటకా యని సందేహింతురట! సందేహాలంకారము..నిన్నుమించు కవులు
గలరాయని నా సందేహము! ధన్యోస్మి..కానిమ్ము..కానిమ్ము!
(తెర)
5 వ రంగము
( మధురా నగరము. పాండ్యరాజు ఉంపుడుగత్తె మంజువాణి భవనము. మంజువాణి, చెలికత్తె ముచ్చటించుకొనుచుందురు)
చెలి:- మధురా నగరమంతయూ కోలాహలముగా నున్నది! ఎచ్చట జూచిననూ సరసములు..
సంబరములు..అంబరమంటిన ఆనందోత్సాహములు! అమ్మా..ఈ రోజు
పాండ్య ప్రభువులింకా విజయము చేయలేదేలనో?
మంజు:- పాండ్య ప్రభువుల పరామర్శ నాకన్నా నీకే ఎక్కువైనదేమే! వచ్చునులే..మంజువాణి
మరులకు చిక్కినవాడు మరల మరలా రావలసినదే..ఇంకెక్కడికి పోగలడు?
చెలి:- నిజమేకానీ విటులనూ, నటులనూ నమ్మకూడదమ్మా! ఇట్టే రంగులు మార్చేస్తారు!
మంజు:- నీకింతటి అనుభవ మెక్కడినుండి వచ్చినదే! భంగును మరిగినవాడైనా మానునేమో
కానీ ఈ హంగులూ పొంగులూ మరిగినవాడు మానునా? మంజువాణి మాటలు..
పరవశింప జేసే పాటలు..సరసపు సయ్యాటలు దాటిపోవటమంటే మాటల గాదే!
చెలి:- కండలున్నన్నాళ్ళే మిండలూ ..కలుములున్నన్నాళ్ళే చుట్టాలూ నమ్మా! ప్రభువులు
నిత్యనూతన ప్రియులు! మీనీడలో మనవలసినదాన్ని కనుక మనవి
జేసుకుంటున్నానంతే!
మంజు:- సరెలేవే! ఇంతలోనే ఎందుకలా చిన్నబుచ్చుకుంటావు? నీ హితవు మరచిపోను..
సరేనా!
(తెరలో హెచ్చరిక..రాజాధిరాజ, రాజపరమేశ్వర, పాండ్య మహా చక్రవర్తి, మధురాధీశులు
మత్స్యధ్వజుల వారు విజయం చేయుచున్నారు!)
మంజు:- అదుగో! నేను చెప్పలేదూ..మహారాజు మరులెత్తి వచ్చినాడే! ఇక చూడు మన
ప్రతిభ! (చెలికత్తె లోనకు వెళ్లిపోవును..మత్స్యధ్వజుని ప్రవేశము)
మంజు:- సాకీ: రసికరాజులకు సాహో!
మసక మోజులకు ఓహో!
ప: కామభోగయాగంలో సాముల సంభావన
పాలవయసు పసిడిసొగసు భామల సంభావన
అప: కామికులకు కౌగిలింత ప్రేమికులకు పులకరింత
రసికులకిక రాతిరంత రతీ మన్మధుల సంత ||కామ||
చ: పదారేళ్ళ పరువమొచ్చి పడుచందం పదును హెచ్చి
వయసు వాలుచూపు మాటు మరుగుళ్ళకి
పడుచు పందిళ్ళకి వలపు వాకిళ్ళకి
ముద్దు ముంగిళ్ళకి తీపి తిరునాళ్ళకి ||కామ||
చ : నువు సై అంటే సందిట్లో ముద్దుల ముంగిట్లో
వయసుల వరదక్షిణ సరసపు సంరక్షణ
కాదని నువు కలహిస్తే కామిని కసి వీక్షణ
మదన కదన సదనంలో కసి కౌగిలి శిక్షణ ||కామ||
చ: వూసుకైన చోటులేదు ఊహూలకు
వయసు పొద్దు వాలనీకు మోహాలకు
సరసంగా సలుపు తీపి దాహాలకు
ఆదమరచి ఆలపించు ఆహాలకు ||కామ||
(కవ్వించి..వెంబడించిన రాజుకు అందకుండా ఊరించి అలుక నటించును)
మత్స్య:- మంజువాణి! ఏమిటీ అలుకే! ఈ వీధి, నీ భవన ప్రాంగణము అంతా కోలాహలమే!
ఏమిటి విశేషం? అరుగులమీద యాత్రికులు, సన్యాసులు, నీ సౌందర్యారాధన
కొరకు పాండ్యదేశమంతా మధురానగరికి తరలి వచ్చినదా ఏమి? బైరాగులు
బడుగు బాపలు కూడా నీ అరుగులకు మరిగినారా ఏమి?
మంజు:- (కోపం నటిస్తూ) చాల్లెండి బడాయి! వ్రుషగిరి ఉత్సవములకు వచ్చిన యాత్రికులు
వైగైనదిలో తెప్పోత్సవములను చూచుటకొరకు నగరములోని మేడల అరుగులను
మరుగుట నేటిదా? మీరెరుగనిదా?
మత్స్య:- నిజమే సుమా! రేపటినుండీ వైగై నదిలో తెప్పోత్సవములు కదూ!
మంజు:- అది సరే.. నా సాయంకాలపు అలంకరణ మంతయూ ఈ వేసవి తాపమునకు
నీరైనంతవరకూ దేవరవారి రాచకార్యములు చక్కబడలేదా? నిరీక్షణ మావంతు..
నిర్లక్ష్యం మీ తంతు!
మత్స్య:- ఈ గారం కొరకు నీ అలుకలోని సింగారం కొరకు నీ కోపం..వేసవి తాపం..రెండూ
ఆహ్వానించదగ్గవే!
మంజు:- వుడుకెక్కించి ఉసురు తియ్యడం..చల్లబరచి చల్లగా జారుకోవడం..ఏలినవారి
గడుసుదనం!
(గారంగా సరసకు జేరును. మత్స్య ధ్వజుడు మత్తుగా ఆమె పరిష్వంగములో
మైమరచిపోవును. ఎచటినుండో ఒకగానము వినిపించును)
సాకీ: మనవిని వినవే మనసా!
మధురిపుదగులుము వయసా!
ప: మనవిని వినవే మనసా
మధురిపు దగులుము వయసా వచసా
అప: శిరసు వంచి సిరులను నిరసించి
కర్మల మర్మము మదినెంచి ||మనవిని||
చ: అడరే అనలం అతివల మోహం
నేటిధారతో తీరదు దాహం
కనులు తెరచితే కథ దాసోహం
శ్రీపతి పదములకిక విడి మోహం ||మనవిని||
చ: నడమంత్రపు సిరి మిడిసిపడక
తప్పదు నడక నిప్పుల పడక
తిరిగిరాని తీరాలకు పయనం
వల్లకాటిలో వలపుల శయనం ||మనవిని||
చ: రేయికి పగలు రేపటికిపుడు
వర్ష ఋతువుకై దాచిన ధాన్యం
వయసునాళ్లలో చేసిన పున్నెం
మరుసటి మజిలీకది పరమాన్నం ||మనవిని||
(ప్రారంభము నుండీ గానమును వినుచూ..మంజువాణిని విడిపించుకొనుచూ...
దరిజేరనివ్వని మత్స్య ధ్వజుడు అంతకంతకూ పరివర్తనతో..పశ్చాత్తాపముతో..)
మత్స్య:- ఎక్కడిదా గానము? ఎంతటి సత్యములా పలుకులు! అక్కటా..
ఇంతదనుక ఎంత వ్యర్ధమై పోయినదీ జన్మ!
ఉ: ఎక్కడి రాజ్య వైభవము లెక్కడి భోగము లేటి సంభ్రమం
బక్కట బుద్బుద ప్రతిమమైన శరీరమునమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి యుగ సంధుల నిల్చియు గాలుచేతి బల్
త్రొక్కుల నమ్మను ప్రభ్రుతులున్ తుద రూపరకుండ నేర్చిరే
మంజు:- స్వామీ..ఏమైనది?
మత్స్య:- మంజువాణి! ఇన్నినాళ్ళు నీ మేడ చుట్టూ ప్రదక్షిణలు చేసినందుకు ఈరోజు
నాకు ఫలితము లభించినది! నీవలన నాకు మేలే జరిగినది! ఆ గాయకుడెవరో
గానీ నా కనులు తెరిపించినాడు! తనువు..మనువు శాశ్వతములు గావు!
కం. కాన దటిచ్చలమగు రా
జ్యానందము మరగి ఇంద్రియారాముడనై
పో నింతనుండి పరలో
కానందంబునకె యత్నమాపాదింతున్
మంజు :- (దరిజేరి వారింప యత్నము జేయుచూ..) మహారాజా! మహారాజా!
మత్స్య:- (ఆమెను గంభీరముగా వారించుచూ..)
ఎవరక్కడ? కులగురువుల దర్శనమునకై మేము వచ్చుచున్నట్లు వర్తమానం
పంపండి! ఆస్థాన పురోహితులను సాదరంగా అంతః పురానికి తోడ్కొని రండి!
మంజువాణి! సర్వేశ్వరుడు నిన్నుకూడా సన్మార్గములోనికి మరలించును గాక!
(నిష్క్రమించును. మంజువాణి కుప్పగూలిపోవును)
( తెర వాలును)
Superb !!
ReplyDeleteThank you sir..Ramana Balantrapu garoo!
ReplyDeleteThese two songs in this 5th scene are appreciated very much by people like Sri Garikipati Narasimharao ..
ReplyDelete