పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, November 6, 2011

తెలుగు వెలుగు!

దేవతలలో దేవుళ్లలో వేంకటేశ్వరుడు ఎంత గొప్ప వాడొ భాషలలో తెలుగు 


భాష అంత గొప్పదని చక్రవర్తులలో 'అంతటి'గొప్ప వాడూ ఐన శ్రీ కృష్ణ దేవ 


రాయ చక్రవర్తి తన ఆముక్త మాల్యద లో పేర్కొన్నాడు!స్పష్టమైన ఉచ్చారణ, 


సహజ సిద్ధమైన లయాత్మకమైన చెవులకు ఇంపైన సంగీత సంయోజనము 


కలిగినవి ప్రపంచము మొత్తం లో రెండే రెండు భాషలు, ఒకటి తెలుగు 


రెండవది 'తెలుగు ఆఫ్ ది వెస్ట్' గా మనము పిలువ వలసిన ఇటాలియన్!


(తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ కాదు..ఇటాలియనే తెలుగు ఆఫ్ ది వెస్ట్ 


అని గర్వించడం లో తప్పేమీ లేదు!)తెలుగు భాషలో వున్న పద్య ప్రక్రియ, 


పద్యనాటక ప్రక్రియ, అవధాన ప్రక్రియ..ఈ మూడూ ప్రపంచంలో ఏ భాష 


లోను లేవు.దురదృష్ట వశాత్తూ తెలుగు రాష్ట్రం లో..తెలుగు ప్రజలు..తెలుగు 


రాజధానిలో తప్పుల తడకల ఇంగ్లీష్,హిందీ,ఉర్దూ ల మీద చూపించే 


మమకారం తల్లి వంటి తెలుగు మీద చూపించక పోవడం బాధా కరమే కాదు, 


ఆత్మ హత్యా సదృశం!తల్లి దండ్రులు తమ పిల్లలు 'ఇంగ్లీష్' రైమ్స్ చెప్తుంటే 


పొందుతున్న ఆనందం  తెలుగు సామెతలు, కథలు,పొడుపు 


కథలు,పద్యాలు, చెప్తున్నపుడు పొంద గలిగితేనే తెలుగు వాళ్లము  అని 


చెప్పుకోవడానికి అర్హులు! 

చాలా బడులు, కళాశాలలు,వాటిలోని చాలా మంది 

పాధ్యాయులు,ఉపన్యాసకులు తెలుగు భాష పై ఉన్న మమకారాన్ని 

చంపడానికి యథా శక్తి కృషి జేస్తున్నారు!మార్కుల కోసం వచ్చీ రాని, 

అపభ్రంశపు 'సంస్కృతము'ను విద్యార్థినీ విద్యార్థులు అపోహల వల్లనో, 

బలవంతం గానో భాషా 'ఐచ్చికం'(optional ) గా తీసుకొని, అటు దేవ 

భాష ఐన సంస్క్రుతమును భ్రష్టు పట్టించి పాపం మూట గట్టుకుంటున్నారు, 

ఇటు మాతృభాష లోని మాధుర్యానికి దూరమై పోతున్నారు! చాలా 

కళాశాలలు ప్రైవేటు రంగంలో, తెలుగు బోధకులను నియమించు కోవడమే 

లేదు! ఇంటర్మీడియట్, డిగ్రీ లలో రెండు సంవత్సరాల విద్యా సంవత్సరాల 

చివరి వారం రోజులలో వెయ్యో, రెండు వేలో చెల్లించి తెలుగు చెప్పే ' రోజు 

'కూలీలను నియమించుకొని ' పరీక్షలకు సరిపోను ప్రశ్న జవాబులను 

విద్యార్థులకు నూరి పోస్తున్నారు! సిగ్గు పడ వలసిన నిజమేమిటంటే ప్రైవేటు 

రంగంలో ఏ ఇంటర్మీడియట్ కళాశాలలోను తెలుగు ఐచ్చికం లేదు, తెలుగు 

దేశంలో! 



ప్రభుత్వాల తీరు మొక్కుబడిగా, నిర్లిప్తంగా, యాంత్రికంగా ఉన్నదే కానీ 

కార్యాలయాలలో ప్రభుత్వ పాలనలో తెలుగు భాషకు సముచితమైన స్థానమే 

లేదు ఈ నాటికీ! కంటి తుడుపుగా భాషపనితీరుకు ఒక యంత్రాంగాన్ని 

ఏర్పాటు జేసి భాషకు, సాహిత్యానికి సంబంధం లేని వారిని  రాష్త్ర స్థాయిలో, 

చాలా జిల్లాల స్థాయిలో పర్యవేక్షణాధికారులుగా నియమించి తమ 

నిజాయితీని పాలకులు చాటుకుంటున్నారు! దీనికి తోడు ప్రసార సాధనాలు, 

వార్తా పత్రికలూ, సినిమాలు తప్పుల తడకల  తెలుగును వ్యాప్తి జేయడం 

లోను తెలుగనేదే లేకుండా చేయడం లోను యావచ్చక్తిని 

వినియోగిస్తున్నాయి! తెలుగు భాష లోనే లేని ' అశ్రుతాంజలి ',(అశ్రువులతో 

అంజలి అనే అపోహతో) 'మంత్రోచ్చాటన' (మంత్రములను పఠించడం అనే 

అర్ధము అనే అపోహతో..ఉచ్చాటనము అంటే లేపి పంపడం,పార ద్రోలటం, 

భూతోచ్చాటన ఉన్నది.. అంటే భూతాలను పార ద్రోలడం!) వంటి పదాలను 

చాలా వార్తా పత్రికలు వ్యాప్తి జేస్తున్నాయి! ఇక నటీ నటుల వార్తా ప్రసారకుల 

ఉచ్చారణ గురించి చెప్పాల్సిన పనే లేదు! మౌలిక స్వరూపాన్ని కోల్పోనియ్య 

కుండ వారసత్వ సంపదగా భాషను కాపాడుకోవడం ఆ భాష కు చెందిన 

వారందరి సమిష్టి బాధ్యత!అందమైన,ఆనంద దాయకమైన, ఆరోగ్య 

ప్రదాయకమైన తెలుగును ఆదరించడం మనందరి కనీస బాధ్యత!దీర్ఘ క్లిష్ట 

సమాసములతో కూడిన శ్రీ కృష్ణ దేవరాయల పద్యముల వంటి వాటిని 

బిగ్గరగా,క్రమంగా పఠించడం వలన శ్వాస నాళాలకు,ఊపిరి తిత్తులకు,స్వర 

పేటిక కు,ముఖము లోని ఎముకలుకండరాలకు మంచి వ్యాయామం జరిగి 

శరీరారోగ్యం మెరుగు పడుతుందని,ఆయుర్దాయం పెరుగుతుందని విశ్వ నాథ 

సత్యనారాయణ గారే చెప్పారు!ఎంతోమంది వేద పండితుల వయసును 

ఆరోగ్యాన్ని గమనిస్తే ఇది అర్ధమౌతుంది!భాష, సాహిత్యం, కళలు, ఆచార 

సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్లు ఇవన్నీ 'జాతి'ని ప్రభావితం 

జేసి, జీవం తో ఉంచే మహత్తర శక్తులైతే..వీటిలో భాష ప్రాణం వంటిది, 

మిగిలినవి అవయవాల వంటివి!ఒకటో రెండో కొన్నో అవయవాలు లేకున్నా 

ప్రాణం నిలిచే ఉంటుంది కాని,అన్ని అవయవాలూ ఉన్నా, ప్రాణ శక్తి ఒక్కటి 

లేకపోతే..ప్రయోజనం బండి సున్నా!తెలుగులో మాట్లాడుకోవడం,  తెలుగు 

వినడం ,తెలుగు చదువుకోవడం వల్ల, మాతృ భాష లో ప్రావిణ్యం సాధించడం 

వల్ల ఎన్ని వేరే భాషలలో ఐనా ప్రావీణ్యం సంపాదించవచ్చు అని భాషా 

శాస్త్రవేత్త లు కూడా చెబుతున్న మాట! కనుక మాతృభాషను ఆదరిద్దాం,

మనభాషను సజీవంగా ఉంచుకొందాం,తెలుగువారిమైపుట్టినందుకు,తెలుగు 

మాట్లాడడనికీ గర్విద్దాం, ఆనందిద్దాం! 



మారిషస్ వంటి చిన్న దీవిలో ఎన్నో దశాబ్దాల క్రితం..ఇంకా 

చెప్పాలంటే..శతాబ్దాల క్రితం వలస వెళ్ళిన ప్రవాస తెలుగు జాతీయుడైన 

'సంజీవప్పడు'అనే మహానుభావుని గురించి ఒకసారి తెలుసుకుంటే, తెలుగు 

రాష్ట్రం లోనే ఉంటూ, తెలుగు తిండి తింటూ, ఈ నేల మీది గాలిని 

పీల్చుకుంటూ ఈ భాషను మాత్రం మరిచి పోతున్న తెలుగు సోదరులు సిగ్గు 

పడతారేమో! తెలుగులో తప్ప మాట్లాడడు ఆయన! ఎన్ని గంటలు 

మాట్లాడినా ఒక్క వేరే భాష కు చెందిన పదాన్ని వాడినా, పదానికి 500 /- 

చొప్పున 'అపరాధ రుసుము' చెల్లిస్తాను అని సవాలు జేసి, రోజుల కొద్దీ 

అచ్చమైన తెలుగులో మాట్లాడే వ్యక్తి ఆయన! తెలుగు దేశం మీది ప్రేమతో 

సంవత్సరానికి ఒక సారి పెద్ద బృందాన్ని వెంటేసుకొని వచ్చి, రాష్ట్రమంతా 

పర్యటించి తెలుగు జానపదులతో ఎక్కువ సమయాన్ని గడిపి, వెళ్ళే దేశ, 

జాతి, భాషా ప్రేమికుడాయన! మారిషస్ దీవిలో వృత్తిగా మహాత్మా గాంధీ 

మెమోరియల్ కళాశాలలో తెలుగు విభాగ అధిపతిగా,ప్రవృత్తిగా ఆకాశ 

వాణిలో, దూరదర్శన్లో,తెలుగు సేవా సంస్థలలో, తెలుగు కోసం పరిశ్రమిస్తూ, 

తెలుగునే భాషిస్తూ, శ్వాసిస్తూ, తెలుగు వెలుగు విశ్వమంతా నిండాలని 

ఆశిస్తూ తెలుగుకోసం తపిస్తున్న ఒక ప్రవాస వెలుగు ఆయన రూపంలో 

మారిషస్ లో తెలుగు కాంతులను విరజిమ్ముతున్నది అని తెలిసి..కలిగిన 

ఆనందం, తెలుగు దేశంలో తెలుగుకు పడుతున్న దుస్థితి ని చూసి కలిగిన 

ఆవేదన ఈ వ్యాసానికి కారకం,ప్రేరకం! తెలుగు పండుగలను, 

సంప్రదాయాన్ని, చార వ్యవహారాలను తెలుగు దేశం లోకంటే 

ఎక్కువగా, స్వచ్చంగా, స్వచ్చందంగా అరవై వేలమంది షుమారు తెలుగు 

వారు మారిషస్లో అనుసరించడం లో ఆయన కృషి వెన్నెముక!

సులువుగా,ప్రేమగా తెలుగు ముగ్గుల కోసం స్వయంగా ఒక ముగ్గులు వేసే 

యంత్రాన్ని తయారు జేసి..ముగ్గులు వేసే మగాళ్ళను, మురిసి పోయె 

ఆడవాళ్ళను(!) మూడు లింగాల ముచ్చటైన తెలుగు దేశాన్నిఅక్కడ 

మారిషస్లో ఆవిష్కరించిన తెలుగు తల్లి అంతరంగం ఆయన! నిజమైన ప్రేమ 

వున్న చోటనే నిజాయితీగా  ప్రయత్నము ఉంటుంది! 



ఇంటికి, వంటికి,వంటింటికి, పడకటింటికి ఎంత జేసినా..చేసిన కొద్దీ 

'అక్కడికే' పరిమితమై పోతాం! జాతికోసం, భాషకోసం, సంస్కృతీ 

సంప్రదాయాలకోసం,సాటి మానవులకోసం ఏ కొంచెం జేసినా అవి ఉన్నంత 

కాలం చరిత్ర లో నిలిచి వుంటాం..చరిత్ర లో అలా నిలిచి పోయే 'తెలుగు భాషా 

సంజీవని' ఈ సంజీవప్పడు!ఆయనకు అభినందన పూర్వకంగా ఈ 

వ్యాసాన్ని, క్రింది గేయాన్ని 

సమర్పిస్తున్నాను..https://www.facebook.com/vanam.ven



మరీచి పుణ్య భూమిలోన తెలుగు వెలుగు మరీచులు

మారిషస్సునందు విందు జాను తెలుగు రోచిస్సులు 

తెలుగు తల్లి తనయునికా తల్లిడును శుభాశీస్సులు

తెలుగు 'పిల్లవోడి' నుతులు వంచి నీకు శిరస్సును! 

మనిషి మిన్న మనసు వెన్న మల్లె తోటలో వెన్నెల

కలివిడిగా కదలాడే ప్రేమ తడులు కన్నుల

నాటి వేణు గానమచట యమునా నది తిన్నెల 

మేటి తెలుగు నాద మిచట ఝరి నీ కను సన్నల! 

అన్నా! వినుమన్నా యిది ఓ సంజీవప్పడూ!

జిలుగు తెలుగు దీధితులను వెలుగుము నీవెప్పుడూ

దూరమున్నదీ తనువుకు మనసుకుండ దెప్పుడూ 

సారమున్న పలుకు సత్యమై పోయిన దిప్పుడు 

తెలుగు తల్లి మమ్మీగా మురియుచున్న దిక్కడ

డమ్మీలై డాడీలై డొక్కు నాన్న లిక్కడ 

నీవలె ప్రతి తెలుగు వాడు దీక్ష పూనుకోవలె 

సరసమైన తెలుగు సరసు రాయంచలు కావలె

మాటలలో తెలుగు మనసులోన ప్రేమ ఝరులు కులుకు

తేనెలొలుకు తెలుగు పలుకు ప్రేమ పంచదార పలుకు 

కావలెనీదౌ క్రాంతి నిలవాలీ సంక్రాంతి 

ముగ్గులు ముంగిళ్ళ నిండి నిగ్గుల గొబ్బిళ్ళు పండి



No comments:

Post a Comment