దితి-నియతి
వాదములిక వలదు నాధ! వడి తీర్చర నా బాధ!
మదన వీణ శృతి చేసి, కామ నియతి మతి జేసి
తమకములే గమకములై, రతి గరిమలు సరిగమలై
గుసుగుసలే పదనిసలై, మది మధువుల బుస బుసలై
మోహనమౌ మోహరాగవాహినులై నను ముంచేయ్!
... ... ...
అబలా! సమయం కాదిది, సరికాదే వాదిది!
యోగం, ప్రాణాయామం, సాయం సంధ్యాకాలం,
యోగీశ్వరుడౌ శివుడు విహారం చేసే కాలం!
ఈ సమయం రతి సమయం కాకూడదనే నియమం
పరమేశుడు చేసినదది కాదనుటలు పశు నియమం
... ... ...
కాలమీశ్వర తత్త్వం, దాంపత్యం పవిత్రం!
గార్హస్థ్యం పరమేశ్వర ప్రసాదమౌటచిత్రం!
సతీపతుల కలయిక కే కాలం కా దకాలం,
అరమరికలు లే కమరిన దా కాలం సకాలం!
నా కోరికనిపుడె తీర్చు, లేదా నను పరిమార్చు!
పూత సొగసు పూరకమై, నా తహ తహ తారకమై,
కుచద్వయము కుంభకమై, రేగిన సుడి రేచకమై
ప్రణయం ప్రాణాయామం, సఖి ఒడి నీ స్వర్గధామం!
నాది నిండు యవ్వనం, కాదంటే కాననం
ఉడుగరలే చేసినా, ఉసురు నువ్వు తీసినా,
నా కోరిక తీర్చినా, నన్నిట కడదేర్చినా,
తక్షణమే ఏదైనా చేసేయ్, పెన వేసేయ్!
... ... ...
కానున్నది తప్పించుట,కామినులను ఒప్పించుట,
కష్టము కంతునికైనా, ఆ భగవంతునికైనా!
రమ్మిక, నా నమ్మిక చేశావుకదే వమ్మిక!
పొమ్మిక ,ఏమైనను దోసము నీదే సుమ్మిక!
... ... ...
పగలు కర్మయోగానికి, రేయి కామభోగానికి
సతీ పతులకైనా ఒక సమయముంది, విధముంది!
ప్రజల ప్రజననం చేసే 'యాగము' రతి 'యోగము!',
దానికి ఒక సమయముంది, ప్రతి పనికీ నియమముంది
పగటిపూట, ఆరుబయట, ఆదివార,మమావాస్య,
పవిత్రమౌ పున్నములను ధరిత్రి రతి పశువులకే!
తానన్నదె అవునన్నది,కాదన్నది ఈ నియమం,
తా కన్నది దైత్యుల, దితి, ఏమున్నది ఇక? విలయం!
నేడున్నది ఆ దైత్యుల సంతతి, యింతే సంగతి!
వున్నారా ప్రహ్లాదుని కన్నయ్యలు, చిన్నయ్యలు,
వున్నారా కనే వాళ్ళు ప్రహ్లాదుని మేదిని?
నియమాలను పాటిస్తే ప్రహ్లాదుల తోరణం!
దాటేస్తే దైత్యుల తోరణం, క్షణ క్షణం రణం!
No comments:
Post a Comment