పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Thursday, November 3, 2011

వెన్నెల రెక్కలు!


ఏవా నా వెన్నెల రెక్కలు?ఎటు పోయెను నవ్వుల చుక్కలు?
మురిపింతల బాల్యపు ముక్కలు గిలిగింతల అమృతపు గుక్కలు!
దోచుకున్న బాల్యం కన్నుల దాచుకున్న నీటి చుక్కలు
జ్ఞాపకాల చిరుగాలులో తలలూపే తలపుల మొక్కలు!

ఔటైనానని తెలిసీ అన్యాయపు ఆ అంబాలు
అవుటో కాకుండు టోయనీ అన్నిట ఇపుడను మానాలు 
వెన్నెలలో దాగుడు మూతలు మిన్నులకిడి మారు మోతలు
కన్నుల నిదురెగుర వేతలు కలలోనూ పలవరింతలు...

దొంగ కడుపు నొప్పులూ దాచుకున్న దెబ్బలూ
నా తరగతి పుస్తకాలలో నలిగిన ఆ నెమలి కన్నులు
నా పలకిక ఆరి పోయెనా? కాకి పలక కాలిపోయెనా?
గింగిరాల బొంగరాలు ఆ పూసల ఉంగరాలు...


గోపాలుని గుడిలో గంటలు పులిహారకు కన్నుల పంటలు
చొప్పదంటు తో బాణాలు గడ్డి వాములో గానాలూ 
ఎగిరెగిరే ఆ పతంగులూ ఆ గోలీ టింగు టింగులూ 
ఎన్టీ ఆరును నేనంటూ కట్టె కత్తి ఫైటింగులూ..

గుడిలో జరిగే హరి కథలు, బుద్ధి బోధ బుర్ర కథలతో
ఆరు బయట అందరు కలిసే ఆనందపు వేదికలేవి
అమ్మ వెంట మగ పేరంటం ఆ శనగలకై ఆరాటం
ఇపుడన్నీఇరుకు గదులలో బందీలై ముందు గదులలో.. 

విసుగెరుగక వేశే పంటలు ఎటకైనా జంటలు జంటలు 
ఉత్తుత్తిగ కిలకిల నవ్వులు గుత్తులు విరబూయు పువ్వులు
చీటి మాటికీ 'కటీఫులూ' చాటు మాటుగా చాడీలు 
కాకెంగిలి చేగోడీలు ఇపుడెందు లకీ బేడీలు?... 

నాయనమ్మ మంచం చుట్టూ కథ లంటూ కోతి గంతులు 
కథ మొదలయ్యిందో లేదో మొదలయ్యే ఆవలింతలు
ఇప్పుడెందు కింత వంతలు బలవంతపు వింత సంతలు
అప్పుడింత లేదు దూరం ఒకరొకరికి ఇది విడ్డూరం...

ఎపుడైనా ఎదురౌతావా మూల్య మెరుగ రాని బాల్యమా
మరు జన్మలకైనా కలిశే రుణ ముందా కాల కావ్యమా 
రుచి తెలిసే లోపే నువు నా కను మరుగైనావు భావ్యమా?
అంటూ నే పిల్లల బాల్యం లాక్కోటం మనకు భావ్యమా?


No comments:

Post a Comment