రైలు ప్రపంచం!
ప్రపంచమే ఒక రైలు బోగీ ప్రయాణమెంతని నానా యాగీ?
టిక్కెటు కొన్నా నువు కొనకున్నా నీ స్టేజంటూ ఒకటుంటుంది
దిగిపోవుట నీ వంతంటుంది
నీ ముందెవరో,తర్వాతెవరో ఇప్పటికొకపరి ఆది నీ సీటు
శాశ్వత మను కొనడం పొరపాటు!!
ఈ కొంచెంలో ఈసడింపులూ, సర్డుబాటులకు చీదరింపులు
గుండుగుత్తగా బండబూతులు, కండబలుపుతో కడు బెదిరింపులు
వచ్చినవేవీ వదిలిపెట్టని మేతల నెమరుల మేకలు కొన్ని
పసి పిల్లలనూ నిరాశ పరిచే పిసినారుల కసి కేకలు కొన్ని
సందుజూసుకొని సరదా దురదల గోకుల బాలురు కొందరు
అందరిలో అధికుల మనుకుంటూ ఒంటి గద్దలింకొందరు
భుజాలు దొరికినదే పాపంగా వాలి గురకలింకొందరు
జరదా పానుల వరదల ముంచి తేల్చు మరకలింకొందరు
తట్టా,బుట్టా,బీడీ, చుట్టా కంపులు తంపులు తీరేదేట్టా??
కాలంలా కడు నిర్లిప్తంగా కదిలే రైలుకు కథలెన్నో!
పయనంలోనూ నయనంలోనూ కారే అశ్రుల కధలెన్నో!
రైలు బండికీ రాతి బండకీ మోదం లేదు ఖేదం రాదు!
కుములు గుండెకీ, గుండె మంటకీ జాలిగొని ఏ పయనమాగదు!

No comments:
Post a Comment