వేములవాడ
వల్లుబండ లింగా హర హర మహాదేవ జంగా
వదలబోము లింగా నిను విడి కదల బోము జంగా ||
చండికేశ లింగా గండర గండ మొండి లింగా
ధర్మకుండమందు మునిగి ధర్మరాజ లింగా
గండ దీపమందు నిండుగ నూనె బోసినాము
గండము గట్టెక్కించి మెండుగా ఉండర నువు మాకండ దండగా ||
చిందులాడు లింగా శిరసున గంగ పొరలి పొంగ
కోడె గట్టినాము వల్లు బండ బట్టినాము
కోరి చేరినాము సత్తువ కొద్ది కొలచినాము
కోడెనాగు పూమాలను వేసిన కోరి కోరి విషమును తాగేసిన ||
వేములాడ లింగా వేడెద మయ్య పరవశంగా
వేగారార లింగా వేదన బాప రార లింగా
నల్ల కలువ లింగా వుల్లము ఝల్లు ఝల్లనంగా
కల్ల కపటముల నెరుగని వారిని కావ రార కరుణాంతరంగ ఓ ||
రాజ రాజ లింగా రాజేశ్వరికి ప్రాణ లింగా
రామ భక్త లింగా రాముడు కొలిచినాడనంగా
మేము కొలుచుటెంత పూర్వపు పున్నెమెంతొ కొంత
ఇంత లింతలై చెంత జేరితిమి అబ్బురంగ మా ఉబ్బు లింగ ఓ||
No comments:
Post a Comment