పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Wednesday, October 12, 2011










శివ తాండవం 

డాండర డర డాండర డర డాండర డర డాండ
డాండర డర డాండర డర డాండర డర డాండ

డాండర డర డమరుక ధ్వని కైలాసము నిండ 
డాండర డర ప్రతిధ్వనుల జాండములకు నిండ      
డాపలి సగభాగపు చెలి దరహాసము పండ
లపలి సగభాగపు శివతాండవ మటులుండ...

చండికేశ మండితమౌ చిటి తాళము లండ
నందికేశ మోదితమౌ నాద స్వరముండ
డుండిరాజ గణపతి స్వరజతుల ఝరులు పొంగ     
గురుగుహ నఖ ముఖరితమౌ శృతి నియతినొసంగ..

వెన్నుని కనుసన్నల కరవేణువు రస వెన్నెల
తలపించగ మానసమున యమునా నది తిన్నెల
మాటలసతి పతి కృత మద్దెలసడి  సంధిల్ల
నాట్య వేద నాద ఝరుల మునిగెను జగమెల్ల...       

తత్తరికిట ధిత్తరికిట తత్తరికిట తత్తోం     
తాం తరికిట  తోం తరికిట ధీం తరికిట ధిత్తాం  
తాళ గతుల యతుల జతుల పరవశమున చిత్తం 
తాండవమది  ఆడెను సతి ఆడెను తను పశుపతి...     

హరి పాడగ సిరి యాడగ  సరస్వతియు పాడగ 
తానాడెను ధాత యతనితో గూడెను సుర నేత 
ప్రమథ గణములూగెను కైలాస శిఖర మూగెను 
జగమూగెను శివుడూగెను ఆతని సరి సగమూగెను... 

అంగ భంగిమములు పొంగ హావ భావ సంగతంగ  
అంగరంగ వైభవంగ హర నృత్యము సంఘటిల్లి
అడుగడుగున సురసంఘము ప్రణమిల్లగ సంతసిల్లి
శివుడూగెను  శిరమున జాబిలి, గంగా శిరమూగెను...                        

నాద దేహుడైన శివుని కమరె  నట్టువాంగం
నర్తన కనువర్తనులౌ అమర నట్టువాంగం 
రంగస్థల కాంతులైరి  రవి, రజనీ కాంతులు 
విశ్వ హృద్య వేదికపై భక్త హృదయ పీఠిక పై ...



No comments:

Post a Comment