పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, October 23, 2011

నవలోకం

























నా హృది మృదు  మధురోహల కలల కడలి  వీచికలను
అణువణువున శృతి జేసిన ఆనందపు రాగాలను
మోహనముగ వినిపించే మోహన రాగాల నడుమ
అలదుకోని అణువణువున సుమ సుగంధ వసంతాలు
ఎగసి ఎగసి పడుతోంది,ఎగసి ఎగసి పడుతోంది 
స్వప్న మధుర రమ్య హర్మ్య నిలయమైన నవలోకం!
అచటి గాలి అనురాగపు సుమ  సుగంధ రస భరితం
అచటి తరులు గిరులు నదులు అన్యోన్యపు జీవనమున కత్యద్భుత తార్కాణం!
ఆ దివిలో కార్పణ్యం కల్మషాలు లేని మధురమగు మనసుల సంయోగం
తలపించును వికసిత మధు మధురోహల  సుమ కుంజం!
ఆ పుష్పపు సౌరభాలనానే మధుపములమై
సమ భావపు అనురాగపు ఝంఝమ్మను నాదంతో
మమకారపు మధురోహల రెక్కలల్లనల్లనెగిరి
కనుగొందాం చిరుమమతల లతా జనిత అరవిందం
చవిగొందాం మానవ సమ భావన సుమ మకరందం!
మనసు నేల చదును జేసి, మమత తేట నీరు పోసి
పరీరములు పరిఢవిల్ల పర్యంతపు భూమినెల్ల
మొలకెత్తిన చిరు లతలే అలరారెను వృక్షములై
పులకెత్తిన చిరు మమతలె వీక్షించెను సాక్ష్యములై
రా నేస్తం! కుటిలలోక కార్పణ్యపు  బంధనాలు
చేయి చేయి కలిపి మనం నేటి తోటి తెంపేద్దాం!
ఇంతవరకు నిన్ను నన్ను విడదీశిన గిరి గీశిన
వికృత దుష్టశక్తుల సమవర్తి కడకు పంపేద్దాం!
చేయి చేయి కలిపి చేరి రుచి చూద్దాం ఆ ఫలాలు!
సమ భావన అమర గీతి శృతి చేద్దాం మన గళాలు!
అరుదెంచిన ఈ యుగాది వేయ వలయు పునాది
మన కలల జగాన వెలుగు రమ్య భావి హర్మ్యానికి!
చేయి చేయి కలిపి మనం సాగి పోవు గమ్యానికి!
ప్రభవా! భవ ఫాలనేత్ర జనిత జ్వాలకీలికవై
దహియింపుము మా లోపలి మత్సరమను కంటకములు!
కరిగింపుము  బండబారు మా గుండెలు కఠిన శిలలు!
మసిబారిన మా మనసుల కదలాడే ప్రేమ జ్యోతి
మమత తైలమందజేసి ప్రజ్జ్వలమొనరింపవోయ్
సమత ప్రమిద మాకొసగి ఉజ్జ్వలమొనరింపవోయ్!  


(ప్రభవ నామ సంవత్సర ఉగాది 1987 సందర్భంగా వ్రాసింది...)


No comments:

Post a Comment