పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, October 2, 2011

వేములవాడ


నాద దేహుడైన శివుని నిత్య నృత్య క్రీడా
వేదికైన వేద భూమి వేములవాడ
రాజేశ్వరుడిచట వెలసె శ్రీహరి వేడ,
భక్త జనుల కొరకై రాజేశ్వరితో కూడి యాడ  ||నాద||
ముక్తి పదవి శ్రీ శైలం శిఖరము జూడ
గంగను గని కాశి లోన ఈ తనువును వీడ
నోరారా వేములవాడ యని పలికిన కూడా
యని పొగిడెను దీని మహిమ దేవగురుడు కూడ  ||నాద||
వృత్రుని వధియించి బ్రహ్మ హత్య పాప పీడ
పొంది ఇంద్రుడార్తి తోడ బృహస్పతిని వేడ
సురగంగా సమమని పుష్కరిణిని కొనియాడ
స్నాన మిచట జేసె,బాసె ఆ పాపపు జాడ  ||నాద||
సురసంఘము యాగముకై గంధమాదనమున కూడె
సురవిజయముకై దక్షుని యాగము కొనసాగు నాడె
హవిస్సులపహరించె సోమకాసురుడనువాడే
వారింపగ సూర్యుడతని జేరి పెనగులాడె  ||నాద||
సూర్యుని చేతులపై హవిస్సు చింది చేతులూడె
తన చేతులకొరకై రవి శివునిచ్చట వేడె
పొందిన తన కరములు జోడించి శివుని గొనియాడె
సూర్య క్షేత్రమని దీనికి నామమునిడి భవుడు వీడె  ||నాద||
మహిషాసుర పీడనతో జగములు గజ గజ లాడె
సురలు తనను శరణు వేడ, ఆ శక్తి, యభవుని చేడె
శరణని, హరి వారిని గొని చేరెను ఈ పుణ్య పురిని
చూసిరిచట శివానంద సౌందర్య లహరిని  ||నాద||
శివుని ఫాలనేత్ర జ్వాల, శ్రీ హరిదౌ క్రోధలీల
అఖిల దేవతల ఆగ్రహ హేలానల కీలలిచట
ప్రభవించెను ప్రళయకాల, ప్రణవమూల శక్తిగా
నిఖిల దేవతల, హరి, హర శక్తులొకే శక్తిగా  ||నాద||
వెలసెనిచట మహిషనాశి,పరమేశ్వరు ప్రణయ రాశి
ధర్మకుండమాయె గంగ,ఈ క్షేత్రము అపర కాశి
ఉమా శివుల సేవకిచట శ్రీహరి నిలిచెను ఇదే
శివ, కేశవ నిలయము కైలాసము, వైకుంఠము  ||నాద||
మాండవ్యుని,అగస్త్యుని,సనక, సనందన మునుల,
శ్రీ రాముని సేవలంది, ధర్మరాజు పూజలంది,
రాజరాజ నరేంద్ర, సారంగధరుల కనికరించి

అనురక్తిగ భక్తులకు భుక్తి,శక్తి,ముక్తి నిడే  ||నాద||
క్షేత్ర పాలకుడు దయార్ద్రు డైన వీరభద్రుడు
శివభక్తుల శత్రువులకు ప్రళయ కాల రుద్రుడు
యుగ యుగాల వెలుగు చరిత గలది వేములవాడ
సగసగాల సదాశివ శివానీసరసపు జాడ||నాద||




No comments:

Post a Comment